లోన్ ఇవ్వాలంటే సవాలక్ష కండీషన్స్ ఉంటాయి. మీ ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డ్ పై ఓ లుక్కేస్తాయి బ్యాంకులు. గతంలో తీసుకున్న అప్పులు, వాటిని చెల్లించిన తీరును విశ్లేషిస్తాయి. సిబిల్ రిపోర్ట్ ఆధారంగా ఓ నిర్ణయానికి వస్తాయి. ఏ లోన్ తీసుకోవాలన్నా ఈ ప్రాసెస్ అంతా కామన్. మరి కంపెనీలకు అప్పు ఇవ్వాలంటే ఏంటి పరిస్థితి? ఆ కంపెనీలకు సంబంధించిన వివరాలను ఎవరిస్తారు? కంపెనీ పెట్టుబడి ఎంత... లాభమెంత... ఆస్తులెన్ని... అప్పులెన్ని... టర్నోవర్ ఎంత... ఈ వివరాలన్నీ ఎలా తెలుసుకోవాలి? దీనికి సమాధానంగా- ఆ డీటైల్స్ మేమిస్తామంటోంది ఓ స్టార్టప్. అదే క్రెడివాచ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే కంపెనీల సమగ్ర డాటా అందించే గూగుల్ లాంటి స్టార్టప్.
క్రెడివాచ్... భార్యాభర్తలిద్దరి ఆధ్వర్యంలో నడుస్తున్న స్టార్టప్. ఆమె లాయర్... ఆయన టెక్నాలజిస్ట్. ఆమె వ్యాపారానికి దిశానిర్దేశం చేస్తారని ఆయన అంటారు. ఆయన బిజినెస్ కు మంచి టెక్నాలజీ దారి చూపిస్తారని ఆమె అంటారు. వాళ్లే మేఘనా సూర్య కుమార్, సందీప్ ఆనందంపిళ్లై. వీరిద్దరూ ఒకరికొకరు 15 ఏళ్లుగా తెలుసు. తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. నిజమైన ప్రేమ ఒక్కటే వారిద్దర్నీ కలపలేదు. టెక్నాలజీ అంటే వారికున్న ప్రేమ కూడా ఇద్దరి మనసులు కలవడానికి కారణం. వీరికి టెక్నాలజీ అంటే ఎంత ఇష్టమంటే వారి పెళ్లి కోసం ఏకంగా ఓ వెబ్ సైట్ నే రూపొందించారు. అలా ఇండియాలో పెళ్లికి వెబ్ సైట్ రూపొందించిన తొలి జంట వీళ్లే. ఇలా కొత్తగా ఆలోచించడం వీరికి అలవాటు. యూఎస్ లో క్రాస్ బార్డర్ లీగల్ సంస్థ ఏర్పాటు చేసి సక్సెస్ ఫుల్ గా నడిపిన అనుభవం వీరిద్దరిది. ఆ తర్వాత 2009లో ఇద్దరూ ఇండియాకు తిరిగొచ్చారు. ఓసారి తన ఇన్వెస్టర్ ఫ్రెండ్ దగ్గరకు మామూలుగా వెళ్లినప్పుడు ఓ ప్రశ్న ఎదురైంది. కంపెనీలకు సంబంధించి రిస్క్ మేనేజ్ మెంట్ ఎలా ఉంటుంది? కంపెనీలన్నీ ఏకతాటిపైకి తెచ్చిన సంస్థలేవైనా ఉన్నాయా? అని అప్పుడే మరో స్టార్టప్ ఆలోచనకు బీజం పడింది. 2013లో ఇందుకు సంబంధించిన పని మొదలు పెట్టారు. అలా లీగల్ స్టార్టప్ ప్రారంభమైంది. అప్పుడు వీళ్లు తయారు చేసిన రెవెన్యూ మోడల్ నే ఇప్పటికీ చాలా స్టార్టప్స్ ఫాలో అవుతున్నాయి. అయితే అక్టోబర్ 2014 లో కొన్ని ఇబ్బందులు రావడంతో అంతకు ముందున్న వెంచర్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అదే క్రెడివాచ్.
ఫైనాన్షియల్ వాచ్
కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన అతిపెద్ద డాటా రిస్క్ అనాలిసిస్ అందించే ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్ క్రెడివాచ్. వీళ్లు అందించే ఇన్ఫర్మేషన్ చాలా సంస్థలకు తప్పనిసరిగా మారిపోయింది. ఓ కంపెనీ, లేదా రిజిస్టర్డ్ సంస్థకు సంబంధిన సమగ్ర సమాచారాన్ని విశ్లేషిస్తుందీ స్టార్టప్. ఇప్పటికే ఉన్న సమాచారం కాకుండా, 25 వేల వేర్వేరు మార్గాల నుంచి డాటా సేకరిస్తారు. లోన్ ఇచ్చే విషయంలో ఓ బ్యాంక్ ఇందులో కేవలం రెండు వందల పాయింట్స్ మాత్రమే చూస్తుంది అంటారు సందీప్. కానీ వీళ్ల దగ్గర 25 వేల వేర్వేరు మార్గాల నుంచి సేకరించిన డాటా ఉంది. దీని ద్వారా భవిష్యత్తులో రిస్క్ మేనేజ్ మెంట్, అనాలిసిస్, క్రెడిట్ రేటింగ్స్ చూసుకోవచ్చు. ఒక్కముక్కలో చెప్పాలంటే కంపెనీలు, ఇన్ స్టిట్యూషన్లు, కస్టమర్లు, కాంపిటీటర్లు, వ్యాపారుల బిజినెస్, లీగల్ ఇన్ఫర్మేషన్ అందించే గూగుల్ లాంటిది అన్నమాట. గూగుల్ లో ఉన్నట్టు సెర్చ్ బార్ ఉంటుంది. ఒకవేళ కంపెనీ పేరు తప్పుగా ఎంటర్ చేసినా సరైన పేరును సజెస్ట్ చేసే పాప్ అప్ ఉంటుంది.
బడా బడా క్లైంట్లు
క్యాపిటల్ ఫ్లోట్, క్రెడిట్ మంత్రి లాంటి క్రెడిట్, లెండింగ్ ప్లాట్ ఫామ్స్ తో కలిసి పనిచేస్తోందీ స్టార్టప్. భారతదేశంలో ఐదు చట్ట సంస్థల్లోని టాప్ రెండు వీరి క్లైంట్లే. ట్రైలీగల్, భరూచా అండ్ పార్ట్నర్స్ వీరి ప్లాట్ ఫామ్ ని ఉపయోగించుకుంటున్నాయి. ముఖ్యంగా కంపెనీల విలీనాలు, స్వాధీనాల సమయంలో క్రెడివాచ్ అందించే సమాచారం ఎంతగానో ఉపయోగపడుతోంది. దాంతోపాటు ఈ కంపెనీ పలు బ్యాంకులకు, బీహైచ్ఐవీఈ వర్క్ స్పేస్ కు సమాచారాన్ని అందిస్తుంది. ఓ కంపెనీకి సంబంధించిన సంక్లిష్టమైన సమాచారంతో పాటు ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కూడా తెలుసుకోవచ్చు.
కంపెనీ ఛైర్మన్ ఎవరు, డైరెక్టర్లు ఎవరు, లోన్స్ ఎన్ని ఉన్నాయి, జవాబుదారీ ఎవరు, ఆస్తులు ఎన్ని... ఇలా ప్రతీ డీటైల్ ని డీటైల్ గా తెలుసుకోవచ్చు. అందుకే క్రెడివాచ్ కు సంబంధించిన అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ ఫేస్ ను అప్పులిచ్చే సంస్థలన్నీ ఉపయోగించుకుంటున్నాయి. కొన్ని సంస్థలైతే కంపెనీలకు సంబంధించిన నివేదికల కోసం నేరుగా సంప్రదిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సంస్థ క్యాపిటల్ ఫ్లోట్ కోసం ఐదు లక్షలకు పైగా ఏపీఐ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేసింది. మిగతా క్లైంట్లకు ఏడున్నర లక్షల ట్రాన్సాక్షన్స్ చేసింది. ప్రతీ నెల సగటున లక్ష ట్రాన్సాక్షన్స్ పూర్తిచేయడంతో పాటు క్లైంట్ల సందేహాలు తీరుస్తోంది. చట్ట సంస్థలు, అప్పులిచ్చే బ్యాంకులకు ఐదువేలకు పైగా సమగ్ర నివేదికలు ఇచ్చిందీ స్టార్టప్.
లాభాలెలా?
వీరికి రెవెన్యూ రెండు రకాలుగా వస్తుంది. ఒకటేమో నెలవారీ సబ్ స్క్రిప్షన్ ఫీజులు. బేసిక్ సెర్చ్ కు మాత్రమే అవకాశం ఉంటుంది. రెండోదేమో ట్రాన్సాక్షన్ ను బట్టి వేర్వేరు ఛార్జీలు ఉంటాయి. అడిగిన సమాచారాన్ని బట్టి ఛార్జీలు ఉంటాయి. ఒక కంపెనీకి సంబంధించిన పూర్తి నివేదికను ఐదు నిమిషాల్లో ఇవ్వగలదీ సంస్థ. మెషీన్ లెర్నింగ్, ఎన్ఎల్పీలను ఉపయోగించుకొని ప్రెడిక్షన్ టూల్ సిద్ధం చేశారు. తద్వారా కంపెనీ భవిష్యత్తును ముందే అంచనా వేయగలదు. వచ్చే ఐదేళ్లలో 20 నుంచి 50 లక్షల లోన్ అప్లికేషన్లకు సమాచారం అందించడం, వంద మిలియన్ డాలర్ల మదింపు క్రెడివాచ్ లక్ష్యం. మరిన్ని నెలల్లో సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ ను కూడా విశ్లేషించి క్రెడిట్ అప్లికేషన్ కు సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని ఇవ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎస్ఎంఈ) కోసం రాయిటర్స్, బ్లూంబర్గ్ లాంటి కంపెనీలు ఏం చేస్తాయో క్రెడివాచ్ కూడా అలాంటి సేవల్నే అందిస్తోంది. కాకపోతే ప్రైవేట్ పద్ధతిలో ఉంటుంది.
మార్కెట్ ఎంత?
గతేడాది భారతేశంలోని 98 శాతం ఎస్ఎంఈలకు వ్యాపార రుణాలు లభించాయి. బ్యాంకు రుణాలు లేనందున 56 శాతం ఎస్ఎంఈలు నిధుల సమస్య ఎదుర్కొంటున్నాయి. ఇవన్నీ వెంచర్లను ప్రభావితం చేస్తున్నాయి.
"ఇలాంటి సంస్థలు అందించే డాటా ఆర్థిక వ్యవస్థను మార్చేస్తాయి. సివిల్ డాటా, బ్యాంక్ స్టేట్ మెంట్, వెరిఫికేషన్ లాంటి ట్రెడిషనల్ సోర్సుల నుంచి తెలుసుకునే డాటాకన్నా ఇంకా ఎక్కువగా వివరాలు తెలుసుకోవచ్చు. అంటే షాపింగ్ ప్యాటర్న్, అకడమిక్ రికార్డ్, ఆన్ లైన్ ఫుట్ ప్రింట్స్ లాంటి డాటా సేకరించొచ్చు. దీని ద్వారా అప్పు ఇవ్వడానికి ఓ అంచనాకు వచ్చి నిర్ణయాలు తీసుకోవచ్చు" -వినయ్ మ్యాథ్యూస్.
క్రెడివాచ్ లాగా పనిచేసే కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అమెరికాలో ఫస్ట్ యాక్సెస్, ఈస్ట్ ఆఫ్రికాలో కోపో కోపో, చీలీలో డెస్టాకేమ్, యూకేలో ఎయిరీ లాంటివి.