ఫ్రీలాన్సింగ్ చేద్దామనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!
ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఓ గ్రామం చేస్తే.. స్మార్ట్ ఫోన్ కుగ్రామం చేసేసింది. ప్రపంచంలో ఇప్పుడు ఏ దేశంలో ఉన్నా.. ఎవరితోనైనా క్షణాల్లో లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఈ పరిస్థితి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఓ విప్లవం తీసుకొచ్చింది. ఇంట్లోనే కూర్చుని చేసే ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇష్టం వచ్చినప్పుడు, ఇల్లు కదలకుండా, సౌకర్యంగా పనిచేసుకోవచ్చు. సంపాదించుకన్నంత సొమ్ము. ఈ ఫ్రీలాన్స్ ఉద్యోగాలు ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల మధ్యనున్న యువకులు వీటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఫ్రీలాన్సింగ్ ద్వారా ఎమ్మెన్సీ కంపెనీల్లో పనిచేసే వారి కన్నా ఎక్కువ సంపాదించేవారు ఎంతో మంది ఉన్నారు.
బాసుల బాధ లేకుండా, ఎనిమిది గంటల టైమ్ ఫ్రేమ్ ను పట్టించుకోకుండా, ట్రాఫిక్ జాంజాటం బారిన పడకుండా సంపాదించుకోవడం కన్నా ఆనందమేముంటుందనేది ఈ తరహా యువతరం నిశ్చితాభిప్రాయం. ఇందులో మరో అభిప్రాయానికి కూడా తావు లేదు మరి.
ఫ్రీలాన్సింగ్ లో చాలా ప్లస్ పాయింట్లున్నప్పటికీ.. కొంచెం కష్టమైన వ్యవహారమే. చాలా సందర్భాల్లో ఫ్రీలాన్సింగ్ అంత సులువు కాదు బాబూ అని అనుకోకుండా ఉండలేరు. కచ్చితంగా ఇది సులువు కాదు. కానీ ముందస్తుగా కొంత సన్నద్ధమైతే ఫ్రీలాన్సింగ్ జర్నీ సాఫీగా సాగిపోతుంది. ఆ సంసిద్ధత ఎలా ఉండాలి..? ఫ్రీలాన్సింగ్ లో కెరీర్ ప్రారంభించాలనుకునేవారి కోసం కొన్ని సూచనలు, సలహాలు...
మీ నైపుణ్యాన్ని మీరు గుర్తించండి..!
ఫ్రీలాన్సింగ్ అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించే ముందు మీ నైపుణ్యాలేమిటో ముందుగా గుర్తించండి. ఒకే ఒక్క అంశంలో ఫ్రీలాన్సింగ్ చేయాలనుకోకూడదు. ప్రధానమైన నైపుణ్యం కాక.. మిగతా ఏమేమి చేయలగరో గుర్తించండి. ఆ దిశలో కొత్త ప్రయత్నాలు చేయండి. అయితే ప్రతి పనిని చేయాలని చూడకండి. ముందుగా నీ నైపుణ్యాలను చార్టులో రాసుకోండి. ఏదో ఒక్క పనే చేస్తానంటే మీ సేవలు పొందాలనుకునే కంపెనీ కానీ క్లైంట్ కానీ సీరియస్ గా తీసుకోకపోవచ్చు. అందుకే సెకండరీ స్కిల్స్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ ఉండండి.
మీ ఫోర్ట్ ఫోలియో తయారు చేసుకోండి..!
మీ గురించి, మీ నైపుణ్యాల గురించి అందరికీ తెలియాలంటే దానికి సొంతంగా ఓ ఫోర్ట్ ఫోలియోను రూపొందించుకోవడమే దగ్గరి దారి. దీని కోసం పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. దీని కోసం ఓ ఫేస్ బుక్ పేజీ లేదా బ్లాగ్, అదీ కాకపోతే వర్కింగ్ సోషల్ నెట్ వర్క్స్ లాంటి బిహాన్స్ లో ప్రోఫైల్ ను ఆకర్షణీయంగా సిద్ధం చేసుకోవాలి. ఈ ఇందులో స్కిల్స్ మొత్తాన్ని ప్రజెంట్ చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మీక పనితనాన్ని ప్రొజెక్్ట చేసేలా ఉండాలి. దీన్ని అందరి దృష్టికి తీసుకెళ్లాలా చేయగలిగితే అవకాశాలు పొందగలగడం పెద్ద కష్టమేం కాదు.
మీ మార్గాన్ని ఎంచుకోండి..!
మొట్టమొదట ఈ ఫ్రీలాన్సింగ్ కెరీర్ ద్వారా మీరేమి ఆశిస్తున్నారో స్పష్టత తెచ్చుకోండి. అనుభవం, డబ్బు, పరిచయాలు వీటిలో మీ టార్గెట్ ఏమిటి..?. ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత పని కోసం ప్రయత్నాలు చేయండి. అయితే పని ప్రారంభించే ముందు మీరు క్లారిటీ తెచ్చుకోవాల్సిన విషయం ఒకటుంది. మీరు ఎలా ఆ పనికి న్యాయం చేయగలరనుకుంటున్నారు..? అనేదానిపై మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. దాని కోసం కొన్ని అంశాలపై మీరు అవగాహనకు రావాలి.
1. మీరు వారంలో ఎన్ని రోజులు, ఎన్ని గంటలు ఫ్రీలాన్సింగ్ జాబ్ కోసం సమయాన్ని కేటాయించగలరు..?
2. ఎలాంటి క్లైంట్లతో కలసి పని చేయాలనుకుంటున్నారు..?
3. ఒకే సమయంలో ఎంత మంది క్లైంట్లను మీరు హ్యాండిల్ చేయగలరు..?
4. క్లైంట్స్ తో మీరు ఎలాంటి కమ్యూనికేషన్ మెయింటెయిన్ చేయాలనుకుంటున్నారు..?
మీరు చేస్తున్న ఫ్రీలాన్సింగ్ కోసం ఆశిస్తున్న పారితోషికం విషయంలో ప్రాక్టికల్ గా ఉండాలి. మీరు చేస్తున్న పని విభాగంలో ప్రస్తుతం ఎంత డిమాండ్ ఉంది. ఎంత పనిని ఎంత చెల్లిస్తున్నారు అనే అంశాలపై పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలి. ఆ తర్వాత క్లైంట్లతో పారితోషికంగా విషయం మీద చర్చలు జరపాలి.
క్లైంట్లను వెతికి పట్టుకోండి..!
ఇప్పటి వరకు మీరు ఏం చేయాలో.. ?.. ఎలా చేయాలో..? క్లారిటీకి వచ్చి ఉంటారు. ఇప్పుడిక ఫ్రీలాన్సింగ్ పని ఇచ్చే క్లైంట్లను పట్టుకోవాలి. పొటెన్షియన్ క్లైంట్లు ప్రతీ చోటా ఉంటారు. గూగుల్ లో లేదా సోషల్ మీడియాలో క్లైంట్లను మనం గుర్తించవచ్చు. మీరు హైలెట్ చేసుకున్న నైపుణ్యాన్ని, పనిని ప్రస్తావిస్తూ వీలైనంత మంది నమ్మకమైన క్లైంట్స్ కు సమాచారం వెళ్లేలా ప్రయత్నాలు చేయండి. వారిలో ఫ్రీలాన్సింగ్ వర్క్ అవసరమైనవారు మిమ్మల్ని కచ్చితంగా కాంటాక్ట్ చేస్తారు. మీకు చాన్సులు వేగంగా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇందులో గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. క్లైంట్లకు ఎప్పుడూ కూడా స్పామ్ మెసెజ్ లు పంపకూడదు.
ప్రీ వర్క్ కమ్యూనికేషన్
కొంచెం ముందైనా, లేటయినా మీ ప్రొఫైల్స్ తగ్గట్లుగా ఫ్రీలాన్సింగ్ జాబ్ ఆఫర్లు వస్తాయి. వారిలో నుంచి మీరు క్లైంట్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. క్లైంట్ రిక్వైర్ మెంట్ కు తగ్గట్లుగా మొదటగా మీకు పని ఎసైన్ చేసేటప్పుడు కచ్చితంగా కొన్ని విషయాలు అడగాలని గుర్తు పెట్టుకోండి. మొదటి వర్క్ తో పాటు సర్వీస్ నిబంధనలు పంపాలని అడగండి. వాటిలోకచ్చితంగా కింది అంశాలు ఉండేలా జాగ్రత్త పడండి.
1. పారితోషికం చెల్లింపు విధివిధానాలు. డిపాజిట్స్ అండ్ పేమెంట్ టైమ్ లైన్స్
2. పూర్తయిన పనికి కాపీరైట్ నిబంధలు
3. పరస్పర హక్కులు, బాధ్యతలు
అదే సమయంలో ఏ పని అయినా సరే ఉచితంగా మాత్రం చేయవద్దని సలహా. మీరు ప్రతిఫలం లేకుండా పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ.. ఆ భావన మాత్రం క్లైంట్లకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే పేమెంట్ విషయంలో క్రాంప్రమైజ్ అవుతారనే సంకేతాలు క్లైంట్లకు వెళతాయి. దాంతో దీర్ఘ కాలంలో మీ శ్రమకు తగ్గిన ఫలితం రాదు.
నేను ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను.. నాకెవరూ బాసులు లేరు అని అనుకోవడాన్ని మించిన తప్పు మరొకటి ఉండదు. ఎందుకంటే మీ క్లైంట్లే మీకు బాసులు. అందుకే వారిని తెలివిగా ఎంపిక చేసుకోండి.
శ్రద్ధ, ఉత్సాహం, నమ్మకంతో పని చేయండి..!
ఫ్రీలాన్సింగ్ అనేది దాదాపుగా ఒకే వ్యక్తి నడుపుతున్న వ్యాపారం లాంటిది. ఇది ఒక రకంగా సొంత అంట్రప్రెన్యూర్ షిప్. దీన్ని మీరు అల్లాటప్పగా తీసుకుంటే మొత్తానికే మోసం వచ్చే అవకాశం ఉంది. ప్రతీ క్లైంట్ ని సీరియస్ గా అప్రోచ్ అవండి. వైఫల్యాలకు, విమర్శలకు సిద్దంగా ఉండండి. మీ పనిని మీరు చేస్తున్న రంగంలోని వ్యక్తులు నమ్మే వరకూ ఓపికతో ఉండండి.
ఈ విషయంలో మీరు ఒక్కసారి నమ్మకాన్ని చూరగొంటే .. ఫ్రీలాన్సింగ్ ను మించిన కెరీర్ మరొకటి ఉండదు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. ఫ్రీలాన్సింగ్ కోసం ప్రయత్నాలు చేయండి..! బెస్ట్ ఆఫ్ లక్