ట్రక్కుల వ్యాపారంలో కోటి రూపాయల ఆదాయాన్ని సంపాదించి చూపిన చెన్నై కుర్రాళ్లు
వసంత్ ఇమాన్యూల్, జే పన్నీర్ సెల్వం, ఇద్దరూ తమ కాలేజ్ రోజులని గుర్తు చేసుకుంటున్నారు. వీళ్లలో వసంత్.. సీనియర్. ముంబైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చదివేటప్పుడే ఇద్దరూ స్నేహితులయ్యారు. కాకపోతే కోర్స్ పూర్తయ్యాక ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. వసంత్ చెన్నైలోని ఏషియన్ పెయింట్స్‌లో సప్లై చైన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగ అధిపతిగా నియమితులైతే, సెల్వం.. సింగపూర్‌లోని ఒక అంతర్జాతీయ కంపెనీలో ఐటి అండ్ మార్కెటింగ్ విభాగంలో బాధ్యతలు చూసుకునేవారు.
సాధారణంగా కాలేజీ స్నేహాలన్నీ ఇలా ముగిసేవే ! కాకపోతే, వారి గమ్యస్థానాలు మళ్లీ ఒకటవుతాయని ఏదో మూల ఇద్దరికీ అనిపించింది. సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం సరిపోదని భావించేవారు వసంత్. అతను టెక్నాలజీ శక్తిని పూర్తిగా నమ్ముతాడు. అందుకే ఈ రంగంలో అవాంతరాలు ఏర్పడవచ్చని భావించేవాడు.
సప్లై చైన్‌లో సుమారుగా ఏడేళ్లు పనిచేసిన వసంత్ 2012 లో 'స్టోర్ ఎన్ మూవ్'ని ప్రారంభించారు. దీనిద్వారా వేర్ హౌసింగ్, లాజిస్టిక్ సేవలు అందించేవారు. కానీ 2014వ సంవత్సరంలో, చాలామంది వినియోగదారులకు ఆన్‌లైన్‌లో లాజిస్టిక్స్ అందుబాటులో లేవని వసంత్ గుర్తించాడు. 2014 డిసెంబరులో సెల్వం.. వసంత్‌తో చేతులు కలిపి ఈ వ్యాపారంలో అడుగుపెట్టారు, ఫలితంగా 'ఓలాగ్' ప్రస్థానం మొదలైంది.
ఆన్‌లైన్ లాజిస్టిక్స్‌ను సింప్లిఫై చేసి సింపుల్‌గా 'ఓలాగ్' అని పిలిచేవారు. లాజిస్టిక్స్ ప్రొవైడర్లు అందర్నీ నేరుగా క్లైంట్ల (బిటూబి)తో అనుసంధానం చేసి తద్వారా వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడం వీళ్ల లక్ష్యం. ఇంటర్ సిటీ ట్రక్కుల కోసం రూపొందించిన ఈ-మార్కెట్ ప్లేస్ ఇది. అభివృద్ధిలో భాగంగా, ఇప్పుడు చెన్నై బయటకూడా ఈ వెంచర్ పనిచేస్తోంది.
ఇది ఎలా పనిచేస్తుంది?
2015 జూన్‌లో ఆపరేషన్స్ మొదలైన ఓలాగ్... క్యాబ్ బుకింగ్స్ కాన్సెప్ట్ మీద పనిచేస్తోంది. ఇక్కడ వినియోగదారులు ఒక అభ్యర్ధన చేస్తే, ట్రాన్స్‌పోర్టర్ దానికి ప్రతిస్పందిస్తాడు. కాకపోతే, ఈ రంగంలో చాలా పోటీ నెలకొందని మనతో చెప్తారు దీని కోఫౌండర్స్ . క్యాబ్ అగ్రిగేటర్‌కి భిన్నంగా ట్రక్ ఏగ్రిగేటర్ మార్కెట్ పనిచేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా షిప్‌మెంట్ కొలతలు, అవసరాల మీద ఆధారపడి 30 రకాల కేటగిరీ వాహనాలు ఉంటాయి.
అంతేకాకుండా, పికప్‌కి ముందు కనీసం నాలుగు గంటల లీడ్ టైమ్ అయినా కావాలి. ట్రాన్స్‌పోర్టర్ల సమూహం అంటే కేవలం ట్రక్కులను సొంతం చేసుకున్న వ్యాపారులు మాత్రమే కాదు వ్యక్తిగత ట్రక్కు ఓనర్లు కూడా ఈ వేదికని పంచుకోవచ్చు.
ఓలాగ్ చెయ్యాలనుకుంటోన్న ఇంకో పెద్ద మార్పు ఏంటంటే... ట్రక్ ట్రాన్స్‌పోర్టేషన్ మార్కెట్‌ని నగదు నుంచి ఆన్‌లైన్‌లోకి మార్చడం. మొదట ట్రక్ ఓనర్లు ఇందుకు నిరాకరించారు. శాప్‌తో నిర్మించిన సీమ్‌లెస్ పేమెంట్ సిస్టమ్‌ని ఓలాగ్ పరిచయం చేసింది. ఈ బ్యాక్-ఎండ్ టెక్నాలజీ కొన్ని బ్యాంకులతో అనుసంధానం కావడం వల్ల భాగస్వాముల్లో నమ్మకం కలిగింది. ఇప్పుడు ఆన్‌లైన్ చెల్లింపులు పూర్తిగా నగదుని భర్తీ చేశాయి. ట్రక్ యజమానులు కూడా ఆన్‌లైన్ చెల్లింపులతో చాలా సౌకర్యవంతంగా ఉన్నారు.
టీమ్ సైజ్
25 మంది సభ్యులతో ఒక యాక్టివ్ స్క్వాడ్ కలిగిఉన్న ఓలాగ్ బృందంలో సప్లై మేనేజర్లు, కస్టమర్ కేర్ ఆపరేటర్లు, ఐటి ఆపరేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం 15 మంది సభ్యుల బ్యాక్ ఎండ్ టీమ్‌తో ఉన్న ఈ వెంచర్ సుమారు 100 మంది ఉద్యోగుల స్థాయికి ఎదిగే క్రమంలో ఉంది.
అభివృద్ధికి కొలమానాలు
కార్యకలాపాలు మొదలైన మూడు నెలల్లోనే శాంసంగ్, ఫిలిప్స్, పెర్ఫెట్టి, బ్రిటానియాలతో కలసి 20 మంది క్లైంట్లని సాధించింది. సగటున ఒక్కొక్కరు 10 ట్రక్కులు కలిగిన 100 మంది వ్యాపారులతో దాదాపు 1000 రవాణా వాహనాలతో అలరారుతోంది. ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, కోల్‌కతా.. నగరాల్లోనే సేవలు అందిస్తోంది.
ముందున్న మార్గం
రాబోయే నెలల్లో సుమారు 20 నగరాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుని మార్కెట్‌ని ఒడిసి పట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో ముంబై, కొచిన్, హైదరాబాద్, విజయవాడ, రాంచి, కోయింబత్తూర్, మధురై ఉన్నాయి.
ఆర్ధికంగా చూసుకుంటే, ఈ సంస్థ గత నెలలో కోటి రూపాయాల ఆదాయాన్ని ఆర్జించింది. 2016 జూన్ కల్లా 10 కోట్ల ఆదాయం పొందాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ-కామర్స్ స్టార్టప్స్ అయిన అర్బన్ ల్యాడర్, మింత్ర వంటి వాటికి కూడా ఇంట్రాసిటీ ట్రాన్స్‌పోర్టేషన్ కోసం ఈ సంస్థ వాహనాల్ని సమకూరుస్తోంది. కొంతమంది పెట్టుబడిదారులతో చర్చల్లో ఉన్న ఈ స్టార్టప్.. త్వరలో మొదటి రౌండ్ ఫండింగ్‌ని సమకూర్చుకునే పనిలో ఉంది.