వీళ్ల రీల్ లైఫే కాదు.. ఒకసారి రియల్ లైఫ్ కూడా చదవండి!!
వాళ్లకు సినిమా ఓ ఆప్షన్ మాత్రమే... అంతకంటే చాలా మేటరుంది మరి..
డాక్టర్ కాబోయి యాక్టరయ్యాను...సినీ నటులు ఇంటర్వ్యూల్లో తరచుగా ఈ మాట చెప్తూ ఉంటారని వ్యంగ్యంగా అనుకుంటాం. నిజమే మరి...!! వెండితెరపై వెలిగిపోతూ, రంగుల ప్రపంచంలో తారలుగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నటీమణులు ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే ఇంత పేరు వచ్చేదా? ప్రపంచానికి తెలిసి ఉండేవారా?
అందరి విషయం ఏమో కానీ, కొందరు మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే, చాలామంది నటులు ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే గల్లీ చివరకు కూడా వాళ్ల పేరు వినిపించదేమో..!! అంటే నటన తప్ప మరే ప్రతిభ వారిలో లేకపోయి ఉండొచ్చు. కానీ, చాలా కొద్దిమంది మాత్రం అందుకు అతీతులు. వాళ్ల ప్రతిభా పాటవాలు చూస్తే అబ్బురపడతాం. అభినయాన్ని అలవోకగా పలికించటమే కాదు... ఆ మోము వెనుక మేధస్సు, మెరుపు తీగలా నర్తించే దేహమే కాదు...... అంతకంటే ఆకట్టుకునే మరెన్నోకళలు కూడా ఉంటాయి.
అందుకే, ఇండస్ట్రీకి రాకపోయినా వాళ్ల గొప్పతనానికేం తక్కువ కాలేదని ఒప్పుకుంటాం.. ఇంకా చెప్పాలంటే అంతటి ప్రతిభా పాటవాలున్నవారు నటులుగా ఉండటం బాలీవుడ్ అదృష్టమని చెప్పాలి. ఆ లిస్ట్ లోని కొందరి గురించి చదివేయండి మరి..
1.దీపికా పదుకోణ్
మన నటుల్లో చాలామంది బిగ్ గేమ్ అంటూ కబుర్లు చెప్తారు. కానీ, నిజంగా గేమ్ అంటే తెలిసిన నటి దీపికా పదుకోణ్. తండ్రి ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ ప్రకాశ్ పదుకోణ్. ఆయన చేతుల్లో బాడ్మింటన్ ప్లేయర్ గా, స్టేట్ లెవెల్ ప్లేయర్ గా ఎదిగింది. తండ్రి శిక్షణలో ఇంకా ఎదుగుతూ మరిన్ని విజయాలు సాధించే సత్తా ఉన్నా, తనలోని మరో టాలెంట్ వైపు మొగ్గింది. ఫలితమే ఇప్పుడు మనం వెండితెరపై చూస్తున్న అందాల తార దీపికా పదుకోణ్
2.జూహీచావ్లా
అలనాటి అందాల నటి జూహీచావ్లా. ఆమె తెరపై ఇతర సింగర్స్ పాడిన పాటలకు లిప్ సింక్ ఇవ్వటం చూసే ఉంటారు. అలాంటి జూహీ స్వయంగా మైకందుకుని మెలొడీస్ పాడేస్తే ఎంత బావుంటుంది కదా..!! కానీ ఇది ఒట్టి ఊహకు మాత్రమే పరిమితం కాదు. సక్సెస్ ఫుల్ నటజీవితం తర్వాత జూహీ పాడటం కూడా మొదలు పెట్టింది. సరదాగా కాదు.. సీరియస్ గా పాటలకే అంకితమవుతూ శ్రద్ధగా నేర్చుకుంది కూడా. అంతే కాదు.. సింగర్ గా ఆ మధ్య ఓ పంజాబీ సినిమాకు కూడా పాడేసింది. జూహీ పాటలు వింటుంటే... ఓ మంచి సింగర్ ని ఇన్నేళ్లూ ఇండస్ట్రీ మిస్ అయిందని అనిపించటం లో ఆశ్చర్యం లేదు..
3.ఇషా శర్వాణి
ఇషా శర్వాణి గురించి చెప్పటానికి పెద్దగా ఆలోచించనక్కర్లేదు. ఆమె నటించిన మొదటి సినిమా కిస్నా చూసిన వాళ్లెవరైనా ఇట్టే గెస్ చేయగలరు. అంతెందుకు ఇషాకు నడవటం కంటే గాల్లో ఎగరటమే తేలికంటే ఆశ్చర్యపడనక్కర్లేదు. ఆమె ప్రతి బాడీ మూవ్ మెంట్ లోనూ ఆ ప్రత్యేకత కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటో తెలుసా..?? ఇషా ఏళ్ల తరబడి చాలా రకాల నృత్య రీతులు నేర్చుకుంది. వాటిల్లో అపారమైన కృషి చేసింది. మరీ ముఖ్యంగా భారతీయ సమకాలీన నృత్యాలతో పాటు , ఏరియల్ డాన్స్ లో అద్భుతమైన పట్టు సాధించింది. మరి నటి కాకపోతే మాత్రమేం? ఆమె డాన్స్ చూసి దేశమంతా ఫిదా అయ్యుండేది కాదా...?
4.సోనమ్ కపూర్
సోనమ్ కపూర్ నటిగా చిత్రోత్సవాల్లో రెడ్ కార్పెట్ పై చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తుండొచ్చు. కానీ, ఆమెలో బయటి ప్రపంచానికి తెలియని మరో కోణం ఉంది. ఈ అనిల్ కపూర్ గారాల తయన ప్రఖ్యాత యునైటెడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో చదివిన తర్వాత, ముంబయి యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్ , ఎకనామిక్స్ లో డిగ్రీ చేసింది. అంతే కాదు కథక్, క్లాసికల్, లాటిన్ నృత్యాలలో కూడా ప్రావీణ్యం సాధించింది.
5.జెనీలియా డిసౌజా
దక్షిణాదికి బాగా పరిచితమైన నటి జెనీలియా. ఈమె ప్రతిభాపాటవాలను చూస్తే అబ్బురపడాల్సిందే. గ్లామర్ తో కూడిన అమాయక హీరోయిన్ పాత్రల్లా కాదు. ఆమెలో చాలా విషయం ఉంది. యాక్టింగ్ ఆమెకు కేవలం ఒక ఆప్షన్ మాత్రమే. యూనివర్సిటీ ఆఫ్ ముంబయి నుండి మేనేజ్ మెంట్ లో బాచిలర్స్ డిగ్రీ చదివిన ఆమె అథ్లెట్ గా చాలా ప్రతిభ చూపింది. అథ్లెట్ , స్ప్రింటర్ గా స్టేట్ లెవల్ లో రాణించింది. అంతే కాదు ఫుట్ బాల్ లో నేషనల్ ప్లేయర్. చూస్తే అలా అనిపించలేదు కదా..
6.నర్గీస్ ఫక్రి
ర్యాపింగ్ కి పాపులర్ ప్లేస్ న్యూయార్క్ లోని క్వీన్స్. అక్కడే పుట్టింది నర్గీస్ ఫక్రి. ఆమె టాలెంట్ మామూలు రేంజ్ లో లేదు. ఫ్రీస్టైల్ ర్యాపింగ్ లో ఎంతో పట్టు సాధించిన ఆమె, హృతిక్ బ్యాంగ్ బ్యాంగ్ ఛాలెంజ్ లో ర్యాపింగ్ పెర్ఫామెన్స్ చూపింది. ఇంకేముంది.. ర్యాపర్ గా వరల్డ్ పాపులర్ అయిన కర్టిస్ జాక్సన్ కళ్లలో కూడా పడింది. బాలీవుడ్ లోనే కాదు.. హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది.
7.ప్రీతి జింటా
బుగ్గమీద సొట్టలతో ఆకట్టుకునే ఈ స్టార్- జీవితంలో నటన చాలా చిన్న విషయమని చెప్పాలి. హ్యూమన్ సైకాలజీపై గట్టి పట్టు సాధించటమే లక్ష్యంగా తన చదువుని సాగించింది. ఈ క్రమంలో బ్యాచిలర్, ఇంటెన్సివ్ మాస్టర్ డిగ్రీని క్రిమినల్ సైకాలజీలో పూర్తి చేసింది. అంతే కాదు.. ఇంగ్లీషులో బీఏ ఆనర్స్ కూడా పూర్తి చేసింది.
8.పరిణితి చోప్రా
ఫైనాన్స్ రంగంలో దూసుకుపోవాల్సిన పరిణితి బాలీవుడ్ ఎంట్రీ పక్కా యాక్సిడెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే, బిజినెస్, ఫైనాన్స్, ఎకనామిక్స్ మూడింటిలో ఇంగ్లండ్ మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ నుండి ఆనర్స్ డిగ్రీలు పూర్తి చేసిన పరిణితి- నిజానికి ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా సెటిలవ్వాల్సింది. మరి ఇంత చదివి.. కెరీర్ పై వేరే కలలు కంటున్న ఈ అందాల తార బాలీవుడ్ ఎంట్రీ యాక్సిడెంట్ కాకపోతే మరేంటి? ఇంత ప్రతిభ ఉన్న వ్యక్తి నటి కాకపోయినా, మరో రంగంలో కచ్చితంగా సక్సెస్ అయి ఉండేది కదా...!!
9.మినిషా లాంబా
జర్నలిస్ట్ కాబోయి యాక్టరయిన నటి ఈమె. ప్రఖ్యాత మిరండా హౌస్ నుండి ఇంగ్లీషులో డిగ్రీ పూర్తి చేసిన మినిషా ఇంట్రస్టంతా జర్నలిజం వైపే ఉంది. నటి కాకపోయి ఉంటే ఈపాటికి ఓ మాంచి జర్నలిస్టుగా పేరు ప్రఖ్యాతులు వచ్చిఉండేవేమో కదా..!!
10.అమీషా పటేల్
అమీషా పటేల్ అనగానే కహోనా ప్యార్ హై, బద్రి, నాని లాంటి సినిమాలు గుర్తొస్తాయి. నటిగా సక్సెస్ ఫుల్ గా నిలిచిన ఆమె డిగ్రీలు చూస్తే మతిపోవలసిందే. సినిమాల్లో ఎంట్రీ ఇవ్వకముందే, మసాచుసెట్స్ లోని టఫ్ట్స్ యూనివర్సిటీలోఎకనామిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. ఎకనమిక్ ఎనలిస్ట్ గా ముంబయి బేస్డ్ బ్యాంకింగ్ కంపెనీ ఖండ్వాలా సెక్యూరిటీస్ లో కూడా ఉద్యోగం చేసింది.
సినిమాల్లో రాకముందు వీరు చూపిన ప్రతిభ, వెండితెరపై సాధించిన దానితో పోల్చితే తక్కువదేమీ కాదు. ఇంకా చెప్పాలంటే ఇండియన్ సెల్యులాయిడ్ పై హీరోయిన్లు గ్లామరస్ కేరెక్టర్లకు మాత్రమే పరిమితమవుతున్న సమయం ఇది. నిత్యజీవితంలో ప్రతిభావంతులుగా ఎలా నిబడ్డారో, అదే తరహా పాత్రలు సినిమాల్లో కూడా వస్తే ఇంకా బావుంటుంది కదా..