అంతరించిపోతున్న కళకు అంతర్జాతీయ మార్కెట్ కల్పిస్తున్న 'కాశ్మీర్ బాక్స్'
మనోహరమైన కాశ్మీర్ అందాలను... అద్భుతమైన చిత్రపటంలా కన్పించే ఆ సంస్కృతీ, సంప్రదాయాలను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాశ్మీర్ లోయలోని అపురూప జాతుల పుష్పాలు, జీవం ఉట్టిపడే హ్యండ్లూమ్స్ ప్రపంచంలోనే కాశ్మీర్‌కు ఓ ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. కాశ్మీర్‌లోని మరో ప్రత్యేకత అక్కడ చేతివృత్తుల కళాకారులు. కానీ దురదృష్టవశాత్తూ వారి జీవితాలు గులాబీ పాన్పులా కాకుండా..వాటి కింద ఉండే ముళ్ల బాటగా మారిపోయాయ్.
కాశ్మీర్‌లోని కళాకారులు, రైతులు తమ వృత్తులకు స్వస్థి చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కుటుంబాలకు సరైన పోషణ కూడా ఇవ్వలేని తమ సంప్రదాయ వృత్తులను వదిలేసేందుకే వారీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారు పండించిన ఉత్పత్తులకు.. మార్కెట్లో మంచి ధర పలికినా.. దళారుల వ్యవస్థలోని మధ్యవర్తులకే ఆ లాభాలు వెళ్తున్నాయే తప్ప.. వారికేం గిట్టుబాటు కాని పరిస్థితి. అప్పులు దొరుకుతాయ్..కానీ..విపరీతమైన వడ్డీలు కట్టాల్సి ఉంటుంది. సహకార పరపతి సంఘాలు లేకపోవడంతో స్వశక్తిపై నిలబడే అవకాశమే లేకుండా పోయింది. సొంత భూమి లేకపోవడం... ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం గురించి అవగాహనలేమి, రవాణా సౌకర్యాలతో పాటు..ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడం వంటి అనేక కారణాలు కళాకారుల దీనస్థితికి కారణాలు. అతి ప్రధానమైన మరో కారణం వీరిలో ఎక్కువ మందికి చదువు లేకపోవడం. దానికితోడు వారు తయారు చేసే కళారూపాలు..మోడ్రన్ ట్రెండ్‌కు తగ్గట్లుగా లేకపోవడంతో వాటికి డిమాండ్ తగ్గిపోయింది. కాలానుగుణంగా వచ్చే మార్పులకు తగ్గట్లుగా కళాకృతులు తయారు చేస్తేనే ఈ రోజుల్లో గిరాకీ ఉంటుంది.
ప్రేరణనిచ్చిన పరిస్థితులు
ఇలాంటి పరిస్థితులు గమనించిన ముహీత్ మెహ్రాజ్ , కాషీఫ్ ఖాన్ స్థానిక కళాకారులకు ఓ బూస్ట్ ఇవ్వదలిచారు. తీరూ తెన్నూ లేకుండా ఎగురుతున్న గాలిపటంలాంటి వారి జీవితంలో ఓ మార్పు తీసుకురావాలనుకున్నారు. అదే కాశ్మీర్ బాక్స్ (కషీఫ్ ప్రస్త్తుతం ఈ వెంచర్ లో లేరు..)
కాశ్మీర్ బాక్స్ డాట్ కామ్ అనేది ఇక్కడ తయారయ్యే విశిష్ట ఉత్పత్తులను విక్రయించే ఓ ఆన్ లైన్ స్టోర్. మొదట ఇది ఎక్స్‌క్లూజివ్‌గా ఆన్ లైన్‌లోనే అమ్మకాలు సాగించేది. తర్వాత మెల్లగా రిటైల్ షాపుల ద్వారా.. కూడా వ్యాపారం చేస్తున్నారు. కాశ్మీర్ బాక్స్‌లో కళాకారులు, చేతివృత్తుల పనివారు, నిర్మాణ.. ఇలా అనేక సృజనాత్మకత ఉన్న అనేక రంగాలవారు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఓ గ్లోబల్ ప్లాట్‌ఫాంలా ఉపయోగపడుతోంది.
విభిన్నకోణాల్లో విజయం కోసం పయనం
2013లో యువర్ స్టోరీ ప్రతినిధులు.. కాశ్మీర్ బాక్స్ పేరుతో ఈ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలని సూచించారు. గత రెండేళ్లుగా ముహీత్ అతని బృందం ఆ దిశగానే ప్రతీ అవకాశాన్నీ ప్రయత్నించారు. ఎక్కడా తమ కృషిని వదులుకోలేదు..
కళాకారులను ఆర్ధికంగా బలోపేతం చేసిన ఈ కొత్త బిజినెస్ మోడల్ వారి జీవితాల్లో కొత్త వెలుగును ప్రసరింపజేసిందంటాడు.." కాశ్మీర్ బాక్స్ కలంకారీ పనివారికి, చేతివృత్తులవారికి, కళాకారులకు ..డిజైనర్లకు,నిర్మాణరంగంలోని వారికి ఓ రాజమార్గంలా ఉపయోగపడుతోంది. ప్రొడక్ట్ అమ్మకం ద్వారా వచ్చే ప్రతీ పైసా వారి వారి బ్యాంక్ అక్కౌంట్లలో నేరుగా జమ అవుతుంది. కళాకృతులకు ప్రజెంట్ టచ్ ఇచ్చేందుకుగానూ..కాశ్మీర్ బాక్స్ క్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ ఇన్స్‌టిట్యూట్, స్కూల్ ఆఫ్ డిజైన్ అండ్ ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ కార్పెట్ టెక్నాలజీతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆమేరకు ఈ సంస్థలు కళాకారులకు అవసరమైన శిక్షణ ఇస్తాయ్.. " ఈ రకమైన శిక్షణ వారికి క్రాఫ్ట్స్ రూపకల్పనలో సాయపడటమే కాకుండా.. కళాకారుల పని తనానికి ఓ బెంచ్ మార్క్ లా ఉపయోగపడతాయ్" అని ముహీత్ చెప్పారు
కాశ్మీర్ బాక్స్ ద్వారా ఉత్పత్తులు విక్రయిస్తున్న కళాకారులు కాశ్మీర్ ఛాంబర్ ఆఫ్ కాంబర్స్ అండ్ ఇండస్ట్రీస్ నిర్వహించిన ఇంటర్నేషనల్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మీట్‌లో పాల్గొన్నారు. ఇందులో వారు ఆశించినదానికన్నా ఎక్కువే ఆర్ధిక ప్రయోజనం పొందగలిగారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న చాలామంది కాశ్మీర్ బాక్స్‌కు ఆకర్షితులై తమ తమ ఉత్పత్తులనూ ఈ వేదికను వాడుకోవడం మొదలుపెట్టారు.
కాశ్మీర్ బాక్స్ లో పదిశాతం ఈక్విటీ కాశ్మీర్ బాక్స్ ఫండేషన్ కోసం రిజర్వ్ చేశారు. దీనికి వచ్చే నిధులను స్థానిక చేతివృత్తుల వారికి, కళాకారులకు వృత్తిపరమైన మెళకువలు మెరుగుపరిచేందుకు వాడబోతున్నారు. అనుకున్న ధనం సమకూరగానే..ఈ ఫౌండేషన్ తన పని మొదలుపెట్టబోతోంది. ప్రస్తుతానికి కాశ్మీర్ బాక్స్ తనకు వచ్చే ఆదాయాన్నే తిరిగి పెట్టుబడిగా పెట్టి..వ్యాపారం అభివృధ్ది కి ,విస్తరణకు ఖర్చు పెడుతోంది.. 2019నాటికి వచ్చిన లాభాలను పంచి పెట్టే యోచనలో యాజమాన్యం ఉంది.
శ్రీనగర్ - షార్-ఏ-ఖాస్ లో కాశ్మీర్ బాక్స్ మొదటి స్టోర్ ను ఏర్పాటు చేసింది. ఇలా రిటైల్ స్టోర్ పెట్టడానికి కారణం ఉంది. ఎక్కువ మంది కస్టమర్లు ఆన్ లైన్‌లో చూసిన తర్వాత లుక్ అండ్ ఫీల్ ఫ్యాక్టర్‌ను అడగడం ప్రారంభించారు. అంటే తాము చూసిన ప్రొడక్ట్స్‌ను ప్రత్యక్షంగా చూసి..తాకి కొంటేనే బావుంటుందనే అభిప్రాయం వెల్లిబుచ్చారు. అలానే తయారైన ఉత్పత్తులకు మార్పులు సూచించడంతో పాటు..కళాకారులకు వారి వంతు సాయం (ఏరూపంలో అయినా) చేయాలని భావిస్తున్నారు. ఈ కారణాలతో కాశ్మీర్ బాక్స్ రిటైల్ స్టోర్స్‌ను కూడా ప్రారంభించాలనుకుంది. డిజిటల్ స్ట్రాటజీతో కాశ్మీర్ బాక్స్ ఇంటర్నేషనల్ మార్కెట్‌కి మరింత చేరువైంది. అలానే వ్యక్తిగతంగా గిఫ్ట్ ప్యాక్‌లు పంపే సదుపాయాన్ని కూడా కలిగిస్తోంది. కస్టమర్లకు మరింత చేరువ అయ్యేందుకు ఇదో మంచి మార్గం కూడా. ప్రపంచం మొత్తం మీద ఇలా పర్సనల్ గిఫ్ట్స్ ద్వారా అయ్యే లావాదేవీల విలువ 300 బిలియన్లు. మరి ఇంత పెద్ద మార్కెట్ లో ఎంత చిన్నశాతం సంపాదించినా ఎక్కువే కదా..! కాశ్మీర్ బాక్స్ ద్వారా పోయిన చలికాలంలో అమ్మకానికి పెట్టిన 'ఫెరాన్స్ ' రష్యా మార్కెట్లో భారీగా అమ్మకాలు సాగాయని ముహీత్ చెప్పారు.(ఫెరాన్స్ అంటే కాశ్మీర్ లో స్థానికులు ధరించే సంప్రదాయక వస్త్రాలు)
సవాళ్లు..భవిష్యత్ ఆలోచనలు
ప్రస్తుతానికి సవాళ్లంటే..ప్రతిభ కలిగిన క్రాఫ్ట్స్ మెన్, కళాకారుల కొరత. కాశ్మీర్ లో తమ వృత్తులు మానేయగా మిగిలిన వారి కోసం వెతుకుతున్నారు. ఈ సమస్య ను అధిగమించేందుకు కాశ్మీర్ బాక్స్ స్వయంగా ఓ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నెలకొల్పాలనే ఆలోచనలో ఉంది. కాశ్మీర్ బాక్స్‌కు సీడ్ ఫండింగ్ వరకూ ఇషాఖ్ మీర్ అందించారు. వీళ్లకు అవసరమైన ధనంతో పాటు..వ్యాపారం ఎలా చేయాలి..ఏ పద్దతిలో మార్కెట్ కు వెళ్లాలి వంటి అనేక అంశాలపై ఆయనే ఈ బృందానికి మెంటార్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కాశ్మీర్ బాక్స్ కు సిరీస్ ఏ ఫండింగ్ కోసం వివిధరకాల సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్ తో మాట్లాడుతున్నారు.
ముహీత్ తామెదుర్కొంటున్న మరో సమస్యగా టాప్ లైన్ రెవెన్యూను చెప్తున్నారు. అది మేం ఆశించినంతగా లేదు. ప్రస్తుతానికి ప్రతీ ఏటా 400శాతం కనీస వార్షిక వృద్ధిరేటు సాధిస్తున్నాం. మేం అనుసరించిన మోడల్ మాకు 7 రెట్లు ఆదాయం తెచ్చిపెట్టింది. అది కూడా 98శాతం పాజిటివ్ ఫీడ్ బ్యాక్‌తో..! మా దృక్పథం వ్యాపారపరంగా కూడా మంచి రిటర్న్స్ తెస్తుందని అర్థమైంది. వ్యాపారానికి మానవతా కోణం అద్దడం ద్వారా కూడా సక్సెస్ అవ్వచ్చని నిరూపించగలిగాం అంటారు.