మీడియా రంగంలో ఉఫాధి అవకాశాల వేదిక 'గ్రీన్ రూమ్'
మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లోని అవకాశాలనూ, ఉత్సాహవంతులనూ అనుసంధానం చేసే వేదిక కరువయింది. అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఓ వైపు యువత అష్టకష్టాలు పడుతుంటే...మరోవైపు తగిన సిబ్బంది దొరక్క మీడియా ఎంటర్ టైన్ మెంట్ రంగాలు ఇబ్బంది పడుతున్నాయి. ఉద్యోగాలు, శిక్షణ, చాటింగ్, స్నేహాలు, కొత్త అంశాల సమాచారం, షాపింగ్...ఇలా అన్ని విషయాలకూ ఆన్ లైన్ వేదికగా మారినా....మీడియా ఎంటర్ టైన్ మెంట్ రంగాలు మాత్రం ఉపాధి కల్పనలో ఎందుకనో ఆన్ లైన్ వినియోగంపై దృష్టిపెట్టలేదు. ఈ లోపాన్ని పూడ్చటానికి ఆవిర్భవించిందే గ్రీన్ రూమ్. లక్ష్మీ బాలసుబ్రహ్మణ్యం, ప్రవీణ్ కోకా కలిసి ఈ ఏడాది మార్చిలో ప్రారంభించిన గ్రీన్ రూమ్ అద్భుత ఫలితాలు సాధిస్తోంది.
ఆర్టిస్టులు, సాంకేతిక సిబ్బంది, కంటెంట్ ప్రోడ్యూసర్స్ ఒకచోట కలిసి పనిచేసేందుకు ఏర్పాటయిన పోర్టల్ గ్రీన్ హంట్. నైపుణ్యాన్ని మార్కెట్ చేసుకునేందుకు వీలు కల్పించే పోర్టల్. ప్రతిభకు, అవకాశాన్ని అందిపుచ్చుకోటానికి మధ్య ఉన్న అగాధాన్ని ఈ పోర్టల్ తొలగిస్తోంది. గ్రీన్ హౌస్ ఆవిర్భావం వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారే లక్ష్మీ బాలసుబ్రహ్మణ్యన్, ప్రవీణ్ కోకా. స్టార్ ప్లస్, ఎన్డీటీవీ వంటి టెలివిజన్ సంస్థలో లక్ష్మీ దాదాపు పదేళ్లు పనిచేశారు. ప్రవీణ్ కోకా టెక్నాలజీ ఆంట్రప్రెన్యూర్‌తో పాటు ప్రొడక్ట్ స్పెషలిస్టు కూడా.
మీడియా రంగంలో పదేళ్లు పనిచేసిన అనుభవంతో కార్పొరేట్ ఫిలింస్‌కు స్వతంత్ర ప్రొడ్యూసర్‌గా పనిచేసేందుకు గత ఏడాది లక్ష్మీ ముంబై నుంచి బెంగళూరు రావటంతో గ్రీన్ రూమ్ స్థాపనకు పునాదిరాయి పడింది. ఆమెకు ఎంతో అనుభవమున్నా కొత్త ప్రాంతానికి వచ్చేటప్పటికీ మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన కార్యక్రమాల కోసం నటీనటులను, సాంకేతిక సిబ్బందిని నియమించుకోటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. సరైన వ్యక్తులను నియమించుకునేందుకు తన స్నేహితులకు, పాత కొలీగ్‌లకు, తనకు పరిచయం ఉన్న వారందరికీ ఫోన్‌లు చేయాల్సి వచ్చిందని ఆనాటి ఇబ్బందులను వివరించారు లక్ష్మీ. ఈ అగాధాన్ని తొలగించేందుకు గ్రీన్ రూమ్ తో ముందుకు రావాలని లక్ష్మీ బాలసుబ్రహ్మణ్యన్, ప్రవీణ్ కోకాలు నిర్ణయించారు.
గ్రీన్ రూమ్ ఒక ఆన్ లైన్ వెబ్ సైట్. ఈ వెబ్ సైట్ ద్వారా లక్ష్మీ, ప్రవీణ్ ఇప్పటికే నటీనటులకు, సాంకేతిక సిబ్బందికి, కంటెంట్ మేకర్స్ కు మధ్య వారధిగా నిలిచారు. ఉత్సాహవంతులు గ్రీన్ రూం పోర్టల్ లో క్రియేట్ చేసుకోవాలి. ఈ ప్రొఫైళ్లను ప్రొడక్షన్ బృందాలు పరిశీలిస్తాయి. మరోవైపు కంటెంట్ ప్రొడ్యూసర్లు తమకు కావాల్సిన అర్హతలతో వివిధ రకాల ఉద్యోగాలను పోర్టల్ లో పోస్ట్ చేస్తారు. దీంతో ఏయే ఉద్యోగ అవకాశాలున్నాయో ఆశావహులు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది.
అప్లికేషన్లను పరిశీలించి, వాటిని షార్ట్ లిస్ట్ లో అభ్యర్థులను ఆడిషన్స్ కు ఎంపికచేయటం ఆన్ లైన్ లో చాలా సులభంగా జరిగిపోతోంది. చిత్రాలు, రెజ్యూమ్, వీడియో రీల్స్ లో ఉన్న ఒక్కో అభ్యర్థి ప్రొఫైల్ ను పరిశీలించటానికి ప్రొడ్యూసర్లకు 15 నుంచి 20 సెకన్ల సమయం సరిపోతోంది. ఈ పరిశీలన అనంతరం ఎంపిక చేసిన వారిని ముఖాముఖి ఆడిషన్లకు పిలుస్తారు.
అనేక రకాల స్టార్టప్ ల్లానే...గ్రీన్ రూమ్ కూడా వ్యవస్థాపకుల ఇళ్లలోనే ప్రారంభమయింది. పోర్టల్ ప్రారంభించిన తరువాత లక్ష్మీ, ప్రవీణ్ ఫేస్ బుక్ లో తమ వెంచర్ తెలియజేశారు. మార్కెటింగ్, కాస్టింగ్ కోసం పనిచేసే సాంకేతిక సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకున్నారు. కోడింగ్ టీమ్ తో పాటు ఇప్పుడు వారి దగ్గర మార్కెటింగ్, కాస్టింగ్ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ప్రారంభమయిన పోర్టల్ నెల నెలా 30 శాతం వృద్ధి సాధిస్తోంది. ప్రస్తుతం ఆ పోర్టల్ ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య 4వేలు కాగా, 150 ఉద్యోగ అవకాశాలు పోర్టల్ జాబితాలో ఉన్నాయి. స్టార్ టీవీ, బాలాజీ వంటి టెలివిజన్ సంస్థలతో పాటు గౌతమ్ మీనన్ వంటి ప్రఖ్యాత దర్శకులు, యాడ్ ఫిలిం మేకర్లు, ఆన్ లైన్ వీడియో ప్రొడ్యూసర్లు, అడ్వర్టయిజర్లు తమ దగ్గర ఉన్న ఉద్యోగ అవకాశాలను పోర్టల్ లో ఉంచుతున్నారు.
సిబ్బంది నియామకం, ప్రతిభావంతుల వేటకు ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ లో ఖర్చుచేస్తున్న మొత్తం ఎంతో తెలుసా...అక్షరాలా 591 మిలియన్ డాలర్లు. సాక్షాత్తూ అంతర్జాతీయ నివేదికలే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.
ప్రతిభావంతుల అన్వేషణ కోసం గ్రీన్ రూం సరైన వేదిక కావాలన్నది తమ లక్ష్యమని లక్ష్మీ చెప్పారు. అన్ని రకాల మీడియా కంపెనీలు, యాడ్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ లు, టీవీ, ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ లు సిబ్బంది, నటీనటులను ఎంపికచేసుకునేందుకు గ్రీన్ రూమ్ వేదికగా ఉండేలా పోర్టల్ ను తీర్చిదిద్దుతామని ఆమె తెలిపారు.