ఇంటర్నెట్... ఇంటర్నెట్... ఇంటర్నెట్... లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు ఇంటర్నెట్ చుట్టే చక్కర్లు కొట్టేస్తున్నారంతా. అందరికీ ఓ జీకే క్వశ్చన్. గూగుల్ సెర్చింగ్ లో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నది ఎవరు? యువకులా... విద్యార్థులా... కానే కాదు. మహిళలు. అవును గూగుల్ సెర్చ్ లో మహిళలే ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఇదేదో ఊరికే చెబుతున్నమాట కాదు. గూగుల్ పరిశోధన సారాంశం. గూగుల్ సెర్చ్ లో మగాళ్ల కంటే మహిళలే ముందున్నారట.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గూగుల్ ఓ పరిశోధన చేసి నివేదికను బయటపెట్టింది. భారతీయ మహిళల్ని ఆన్ లైన్ లోకి తీసుకురావడానికి చేస్తున్న కార్యక్రమాల విజయాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి ఆ ఫలితాలు. భారతదేశంలో ఎక్కువ సమయాన్ని ఇంటర్నెట్ కోసం కేటాయిస్తున్న మహిళల సంఖ్య పురుషుల కంటే పెరుగుతోంది. ఏటేటా ఈ శాతం ఎక్కువవుతోంది తప్ప తగ్గట్లేదు. ముఖ్యంగా మధ్యవయస్కుల్లో ఈ పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోంది. 35-44 ఏళ్ల పురుషులతో పోలిస్తే మహిళల్లో 123 శాతం ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. 55 ఏళ్ల పైబడ్డ మహిళల్లోనూ ఈ సంఖ్య పెరిగింది. 2015 నాటి లెక్కల ప్రకారం 15-24 ఏళ్ల యువతులు, 24-35 ఏళ్ల వర్కింగ్ విమెన్ తో పోల్చి చూస్తే మధ్యవయస్కులైన మహిళల్లో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది.
సెర్చింగ్ మాత్రమే కాదు... ఇంటర్నెట్ కోసం కేటాయిస్తున్న సమయమూ పెరిగింది. సెర్చ్ మినిట్స్ ని ఓసారి పరిశీలిస్తే... 15-24 వయస్సులో పురుషుల వినియోగం 104 శాతం పెరిగితే మహిళల వినియోగం 110 శాతం పెరిగింది. ఇక 25-34 వయస్సువారిలో మహిళలది 108 శాతం, పురుషులది 98 శాతం ఉందని ఆ రిపోర్ట్ తెలిపింది. ఇక తండ్రుల కంటే తల్లులే ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేస్తున్నారని గూగుల్ వివరించింది. తల్లుల్లో 33 శాతం... అంటే ముగ్గురిలో ఒక్కరు ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇక తండ్రుల్లో నలుగురిలో ఒక్కరు మాత్రమే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు.
కేటగరీలూ ఎక్కువే
కేటగరీలు చూస్తే... పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ కేటగరీల్లో సెర్చ్ చేస్తున్నారు. కేవలం ఫ్యాషన్ కు మాత్రమే పరిమితం కావట్లేదు మహిళలు.
ఇక మొత్తంగా ఇంటర్నెట్ వాడుతున్న వారి లెక్కలు చూస్తే పురుషాధిక్యతే కనిపిస్తోందని తాజాగా విడుదలైన IAMAI, IMRB నివేదిక సారాంశం. కేవలం 29 శాతం మహిళలు మాత్రమే ఇంటర్నెట్ వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ప్రాతినిథ్యం 12 శాతానికే పరిమితమైంది. చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలోనే ఇంటర్నెట్ వాడుతున్న అతిపెద్ద మూడో దేశం ఇండియా. 32 కోట్లకు పైగా యాక్టీవ్ యూజర్స్ ఉన్నారు. వీరిలో పన్నెండు కోట్ల మంది బ్రాడ్ బ్యాండ్ యూజర్స్ అయితే మిగతా వాళ్లు న్యారో బ్యాండ్ ఇంటర్నెట్ యూజర్స్. తక్కువ ధర ఉన్న స్మార్ట్ ఫోన్లల్లో ఇంటర్నెట్ సదుపాయం, పబ్లిక్ వైఫై కనెక్షన్లు ఉండటం వల్ల రాబోయే సంవత్సరాలలో మహిళల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
2016 నాటికే వంద రైల్వే స్టేషన్లలో వై-ఫై ఏర్పాటు చేయాలన్నది గూగుల్ లక్ష్యం.
భారతదేశంలో మహిళల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఇంటర్నెట్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని అంటున్నారు గూగుల్ ప్రతినిధి. పురుషులతో పోలిస్తే మహిళలు ఇంటర్నెట్ లో వెచ్చించే సమయం పెరగడం గొప్ప విషయమంటున్నారు. భారతదేశంలోని 80 కోట్ల గ్రామీణ జనాభా ఆన్ లైన్ లోకి వస్తుండటం, ఇంటర్నెట్ ను ఉపయోగిస్తుండటం వల్ల ఈ ట్రెండ్ ఇకపై ఇలాగే కొనసాగనుంది.