సంకలనాలు
Telugu

అమ్మా... నాన్న... ఓ దత్తపుత్రిక!

Sri
28th Feb 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

నా దత్తత విషయంలో మా అమ్మ నా చిన్నతనం నుంచి చాలా ఓపెన్ గా ఉండేది. కానీ తమ పిల్లల్ని దత్తత తీసుకున్నాం అని చెప్పుకోవడానికి భారతదేశంలో చాలామంది తల్లిదండ్రులు తటపటాయిస్తుంటారు. సమాజం ఎలా స్పందిస్తుందోనని భయపడుతుంటారు. దీనివల్ల దత్తత అంటే ఏదైనా అవమానం ఏమోనని పిల్లల మనస్సుపై చిన్ననాటి నుంచే ముద్ర పడుతుంది. నన్ను దత్తత తీసుకున్న విషయం నాకు చాలా చిన్నవయస్సప్పుడే తెలిసింది. ఆ భావన నా మనస్సులో గాఢంగా స్థిరపడిపోయింది. కానీ నేనెప్పుడూ ఆ విషయాన్ని పెద్ద పట్టించుకోలేదు. ఐదేళ్ల వయస్సులో ఓ గర్భిణిని చూసినప్పుడు ఆమెకు కడుపు ఎందుకలా ఉంది అని మా అమ్మను అడిగా. ఆమె త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతోందని చెప్పింది. అయితే నేను కూడా నీ కడుపులోంచి అలాగే వచ్చానా అని చాలా ఆసక్తికరంగా అడిగా. "లేదు... నువ్వు నా కడుపులోంచి రాలేదు. నా హృదయంలోంచి వచ్చావు" అని బదులిచ్చింది మా అమ్మ.


undefined

undefinedమా అమ్మ సామాజిక కార్యకర్త కావడంతో పలు ఎన్జీఓలను, చిల్డ్రన్స్ హోమ్ లను సందర్శించేది. నేనూ తనతో వెళ్లేదాన్ని. మేము కోల్ కతాలో ఉన్నప్పుడు సొసైటీ ఫర్ ఇండియన్ చిల్డ్రన్స్ వెల్ ఫేర్ లో నేను చాలా సమయం గడిపాను. నాకు నాలుగేళ్ల వయస్సున్నప్పుడు అక్కడ పిల్లలతో ఎంతో ఇష్టంగా ఆడుకునేదాన్ని. గుండెకు రంధ్రం ఉన్న ఓ బాబు అక్కడ ఉండేవాడు. అందంగా ఉండే అతడిని నేను ఇష్టంగా చూసుకునేదాన్ని. అతడిని మా తల్లిదండ్రులు దత్తత తీసుకోవాలని నిర్ణయించినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అతడికి అదీప్ అని పేరు పెట్టారు. కొద్దిరోజుల తర్వాత కోలుకొని ఆరోగ్యంగా ఉన్నాడు. అతనే నా ప్రియమైన సోదరుడు. మా ఇద్దరి బంధం ప్రత్యేకమైనది. ఎన్నోసార్లు కొట్టుకునేవాళ్లం. తిట్టుకునేవాళ్లం. శారీరక, మానసిక వైకల్యాలు ఉన్నవారిని దత్తత తీసుకోవడానికి పెంపుడు తల్లిదండ్రులు ఇష్టపడరు. ఎందుకంటే ఎక్కువకాలం జీవించరని తెలిసిన వాళ్లతో ఎమోషనల్ అటాచ్ మెంట్ పెంచుకోవడానికి భయపడతారు. నిర్ణయాలు తీసుకోకుండా మనకు అడ్డుపడేది భయం ఒక్కటే. కానీ మేం తీసుకున్న నిర్ణయం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. మా చిన్ని కుటుంబంలో మరొకరు చేరడం నా అదృష్టం. మా నాన్న చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ అద్భుతమైన సెన్సాఫ్ హ్యూమర్ ఉందాయనకు. ఇప్పటికీ నేను, నా సోదరుడు ఇంటికి వెళ్తే... మాకు ఇష్టమైన స్నాక్స్ ఇంట్లో ఉండేలా చూసుకుంటాడు. ఎంతో ఉల్లాసంగా గడుపుతాం. మేము మా కుటుంబ సభ్యులు, అమ్మమ్మ, తాతయ్యలు, మామయ్య, అత్తమ్మలు, వాళ్ల పిల్లలతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం. నేను దత్తతపుత్రిక అని నా స్నేహితులు, సహోద్యోగులతో కూడా నిస్సంకోచంగా చెబుతాను. మా బంధువుల దగ్గర, స్కూల్ లో నాకు ఎలాంటి ప్రతికూల అనుభవాలు ఎదురుకాలేదు. చైల్డ్ వెల్ ఫేర్ ఆర్గనైజేషన్స్ తో కలిసిపనిచేసిన మా అమ్మ... పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లిదండ్రులతో, పిల్లలతో మాట్లాడేది. ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్న పిల్లల్ని నా దగ్గరకు తీసుకొచ్చేది. అలా ఓ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. తనను దత్తత తీసుకున్న విషయం తనకు టీనేజీలో తెలిసిందట. అప్పట్నుంచీ చాలా ఇబ్బందిగా ఫీలైంది. తనతో నేను కొన్నిసార్లు మాట్లాడాను. ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి నేను చెప్పిన మాటలు ఉపయోగపడ్డాయని అనుకుంటున్నాను.


నేను పెళ్లిచేసుకున్నాను. ఇద్దరు పిల్లల్ని కన్నాను. నన్ను దత్తత తీసుకున్నట్టు మా అమ్మ మా పిల్లలతో చెప్పింది. అయినంత మాత్రానా అమ్మమ్మ, తాతయ్యల నుంచి నా పిల్లలకు ప్రేమాభిమానాల విషయంలో ఎలాంటి లోటూ లేదు. నిజానికి, నేను మొదటిసారి గర్భవతి అయినప్పుడు మా అమ్మ- తానే బిడ్డను కంటున్నట్టుగా భావోద్రేకానికి, ఒత్తిడికి గురైంది. మా అత్తింటివాళ్లు ఎంతో మంచివాళ్లు. ఇంతలా ప్రేమించే కుటుంబం దొరకడం మా అదృష్టం. నా సోదరుడు, అతని భార్య ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. దూరం మా అనుబంధాన్ని ఏ మాత్రం తగ్గించలేదు. నేను పెరిగిపెద్దైన తర్వాత ఓసారి మాఅమ్మ నన్ను దత్తత తెచ్చుకున్న మైసూర్ లోని ఓ చిల్డ్రన్స్ హోమ్ కు తీసుకెళ్లింది. నా కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలని అనుకుంటే వెతికిపెట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిందామె. కానీ నాకు ఇష్టంలేదు. నా సోదరుడి విషయంలో కూడా అలా చేయలేదు. మా విషయంలో అద్భుతమైన తల్లిదండ్రులు మాకు దొరికారనే మేం భావిస్తాం. నేను మా అమ్మతో మాట్లాడని రోజంటూ ఉండదు. ఆ రోజును కనీసం ఊహించలేను.

పిల్లల్ని దత్తత తీసుకోవాలని అనుకునేవారికి నేను ఇచ్చే సలహాలు ఏంటంటే...

* దత్తత గురించి పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడండి. వారి యుక్తవయస్సులో దత్తత విషయం చెప్పండి. పిల్లలు అడిగే ప్రశ్నలన్నింటికీ నిజాయితీగా, స్పష్టంగా సమాధానాలు చెప్పండి.


* దత్తత గురించి మీ కుటుంబసభ్యులతో, స్నేహితులతో ఏమీ దాచకండి. ఎవరైనా పిల్లల మూలాలకు సంబంధించి తప్పుగా ఏమైనా మాట్లాడితే ఇలాంటి ప్రవర్తన సహించేదిలేదని మొహమ్మీదే చెప్పెయ్యండి.

* దత్తత తీసుకునే ప్రక్రియ భారతదేశంలో చాలాపారదర్శకంగా ఉంది కాబట్టి ఇబ్బందులేమీ ఉండవు.

* నాకు నచ్చిన ఓ కవిత ఉంది. అది అందరు తల్లిదండ్రులకు వర్తిస్తుందని నేను అనుకుంటున్నా.

ఇప్పట్నుంచి ఓ వందేళ్ల తర్వాత,

నేను ఏ కారు నడిపానని,

ఎలాంటి ఇంట్లో ఉన్నానని,


నా బ్యాంకు అకౌంట్లో ఎన్ని డబ్బులున్నాయని,

లేదా నా దుస్తులు ఎలా ఉన్నాయన్నది ముఖ్యం కాదు.

ప్రపంచం ఇప్పటికంటే ఇంకా మెరుగ్గా ఉంటుంది.

ఎందుకంటే ఓ చిన్నారి జీవితంలో నేను ముఖ్యం కాబట్టి.

రచయిత గురించి: ఆర్తీ వినీల్. ప్రకాశ్, నీనా నాయక్ దంపతులు ఏడు నెలల వయస్సులో ఆర్తీ వినీల్ ను దత్తత తీసుకున్నారు. ఆమె తండ్రి సీనియర్ బ్యూరోక్రాట్ గా రిటైర్ అయ్యారు. తల్లి ప్రముఖ సామాజిక, బాలల హక్కుల కార్యకర్త. ఆమె బెంగళూరులోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్ లో కళలను బోధిస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు.

image


 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags