ఎకో ఫ్రెండ్లీ..విమెన్ ఫ్రెండ్లీ.. ఇక గుసగుసలు అక్కర్లేదు

సాధారణ న్యాప్కిన్ కంటే వందరెట్లు బెటర్రక్షణకు రక్షణ.. కంఫర్ట్ కు కంఫర్ట్

ఎకో ఫ్రెండ్లీ..విమెన్ ఫ్రెండ్లీ.. ఇక గుసగుసలు అక్కర్లేదు

Wednesday November 25, 2015,

3 min Read

రుతుస్రావం. నెలలో ఐదు రోజులు ఆడ‌వారికి అంతులేని వ్య‌ధ‌. బాధ పంచుకోలేరు. బాహాటంగా చెప్ప‌లేరు. ముఖ్యంగా వ‌ర్కింగ్ విమెన్. ఆఫీసులో స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. శానిట‌రీ న్యాప్‌కిన్స్ ద్వారా ఎదురయ్యే సాధ‌క‌బాధ‌కాలు వారికి త‌ప్ప మ‌రెవ‌రికీ తెలియ‌దు. ఒకవేళ అబ్‌నార్మ‌ల్ బ్లీడింగ్ అయితే.. ఇక అప్పుడు ప‌రిస్థితి వ‌ర్ణ‌నాతీతం. క‌డుపును మెలిపెట్టే నొప్పి కంటే- మాటిమాటికీ మార్చే ప్యాడ్స్ తోనే న‌ర‌కం ఎక్కువ‌. మ‌రి దీనికి ప్ర‌త్యామ్నాయం లేదా? మాటిమాటికీ న్యాప్‌కిన్స్ మార్చ‌కుండా ఆల్ట‌ర్నేట్ లేదా?

image


చాలా కంఫ‌ర్ట్

ప్రియాంకా జైన్‌. చ‌దువు కోసం కోసం ప్రియాంక ఐదేళ్లు లండ‌న్‌లో ఉంది. ఇటు చ‌దువు అటు ఉద్యోగం. రెగ్యుల‌ర్‌గా స్విమ్మింగ్ కి వెళ్లేది. కానీ ఆ ఐదు రోజులు మాత్రం వీలుకాదు. మెన్స‌న్స్ మొద‌లైతే టెన్ష‌న్ మొద‌ల‌వుతుంది. అక్క‌డ తెలిసింది రుతుస్రావ కప్పుల గురించి. ఇదేదో బావుందే అనుకుంది. మాటిమాటికీ ప్యాడ్స్ మార్చాల్సిన అవ‌స‌రం లేదు. ఎంత బ్లీడింగ్ అయినా భ‌యం లేదు. చాలా కంఫ‌ర్ట్ గా వుండేది.

సాటి మ‌హిళ‌గా వారికోసం ఏదో ఒక‌టి చేయాలి!

చ‌దువు అయిపోయింది. ప్రియాంక ఇండియా వ‌చ్చేసింది. ఫ్యూచ‌ర్ ఏంటి? క్లారిటీ లేదు. ఏదైనా చేస్తే ప‌ర్స‌స్ ఫుల్‌గా ఉండాలి. న‌లుగురికీ ఉప‌యోగ‌ప‌డాలి. నాలుగు కాలాలు గుర్తుంచుకోవాలి. అలాంటి ఆవిష్క‌ర‌ణ చేయాలి? అదికూడా ఆడ‌వారికోసం ప్ర‌త్యేకంగా ఉండాలి! సాటి మ‌హిళ‌గా వారికోసం ఏదో ఒక‌టి చేయాలి! ఈ సంఘ‌ర్ష‌ణ‌లోంచి పుట్టుకొచ్చిందే రుతుస్రావ క‌ప్పులు ఐడియా. కానీ ఎలా? ఇది ఇండియా! రుతుస్రావం గురించి బహిరంగంగా చర్చించుకునేంతగా భారతీయ మహిళలు ఎద‌గ‌లేదు. కాదు.. ఎదగనీయలేదు. గుస‌గుస‌గా అనాలే త‌ప్ప‌- న‌లుగురు వినేట్టు మాట్లాడొద్దు! గ‌ట్టిగా అంటే అనాగ‌రికం అనే స్టాంపేస్తారు. డీసెన్సీ కాదంటారు. దాచుకొని మాట్లాడాలి. బిడియంతో వ్య‌వ‌హ‌రించాలి! స‌మాజంలో ఇవ‌న్నీ ఇన్నిర‌కాలుగా డామినేట్ చేస్తుంటే- శానిట‌రీ నాప్‌కిన్స్ వాడ‌కండి.. రుతుస్రావ క‌ప్పుల‌నే వాడండి అనే నినాదం జ‌నంలోకి తీసుకెళ్ల‌డం- అయ్యే ప‌నేనా? ముఖ్యంగా పెళ్లికాని అమ్మాయిలు కొంటారా? ఒక‌వేళ వాళ్లు ఒప్పుకున్నా ఇంట్లో వాళ్లు అనుమ‌తిస్తారా? సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా వెళ్లడానికి ధైర్యం చేస్తారా?

image


అపనమ్మకాలు

ఇలా అయితే లాభం లేద‌నుకుని- విష‌యం ముందు భ‌ర్త‌తో చెప్పింది. అత‌ను కాసేపు షాక‌య్యాడు. త‌ర్వాత తేరుకుని అర్ధం చేసుకున్నాడు. ప్ర‌యాణం మొద‌లూంది. హైజీన్ అండ్ యూ! మ‌రి మంత్లీ పీరియ‌డ్స్ కోసం తమ దగ్గర ప్ర‌త్యేక క‌ప్స్ ఉన్నాయంటే ఎంత‌మంది వాటిని కొంటారు. ఒకామెని అడిగింది ప్రియాంక జైన్‌. ఆమెనుంచి వ‌చ్చిన స‌మాధానం నో . మ‌రి జ‌నంలోకి తీసుకెళ్ల‌డం ఎలా? ఇదొక పెద్ద టాస్క్‌.

అస‌లు ఏంటీ పీరియ‌డ్స్ క‌ప్? ఎలావాడాలి?

కప్పు గంట ఆకారంలో ఉంటుంది. బాడీ అంతా సిలికాన్ తో చేయ‌బ‌డింది. శ‌రీరానికి ఎలాంటి హానీ చేయ‌దు. ఒక్క‌సారి కొంటే ఏడెనిమిది ఏళ్ల‌వ‌ర‌కు మార్చాల్సిన అవ‌స‌రం రాదు. బ్లీడింగ్‌ని బ‌ట్టి నాలుగు గంట‌ల నుంచి ఆరు గంట‌ల వ‌ర‌కు కప్పులో బ్ల‌డ్‌ పడిపోతుంది. త‌ర్వాత పీరియ‌డ్స్ టైంలో దాన్నొక‌సారి వేడినీళ్ల‌లో మ‌రిగిస్తే చాలు. దీంతో మ‌రో ప్ర‌యోజ‌నం ఏంటేంటే ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ. ప‌ర్యావ‌ర‌ణానికి ఎలాంటి హాని చేయ‌దు. అదే సాధార‌ణ న్యాప్కిన్స్ అయితే వాడి ప‌డేసిన త‌ర్వాత అవి మ‌ట్టిలో క‌లిసిపోవ‌డానికి 500 నుంచి 800 ఏళ్లు ప‌డుతుంది. చెప్తే న‌మ్మ‌రుగానీ.. ఒక మ‌హిళ త‌న జీవిత కాలం మొత్తంలొ 150 కిలోల రుతుస్రావ వ్య‌ర్ధాల‌ను విడుద‌ల చేస్తుంది. ప్ర‌తీసారీ ప్యాడ్స్ వాడ‌టం వ‌ల్ల వాటిలో వుండే రసాయనాలు లేనిపోని రోగాల‌ను తెచ్చిపెడుతున్నాయి. అలర్జీ, చర్మ సంబంధ వ్యాధులు తెలియ‌కుండానే ఇబ్బందులకు గురిచేస్తుంటాయి.

image


ఇప్పుడిప్పుడే వాడ‌కం పెరిగింది

ఇంత విడ‌మ‌రిచి చెప్ప‌డంతో ఇప్పుడిప్పుడే మ‌హిళ‌లు నాప్కిన్స్ వాడ‌కం త‌గ్గిస్తున్నారు. వాడిన ప్ర‌తీవారు కంఫ‌ర్ట్ గురించే చెప్తున్నారు. ప్ర‌స్తుతానికి హైజీన్ అండ్ యూ లో ప్రియాంక ఐదు రకాల రుతస్రావ కప్పుల్ని అమ్ముతున్నారు. అందులో దేశీ, విదేశీ బ్రాండ్లు కూడా ఉన్నాయి. కొంద‌ర‌న్నారు.. ఆ.. మ‌హా అంటే 15 అమ్ముతావు.. అంత‌కంటేనా అన్నారు. ఇండియ‌న్ విమెన్ నుంచి అంత‌కంటే ఆశించ‌డం వేస్ట్ అన్నారు. కానీ అది త‌ప్ప‌ని రుజువు చేసింది ప్రియాంక‌. మూడేళ్లు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ అనుకున్న టైంకంటే ముందే రీచ్ అయ్యారు. ఆరేడు నెలల క్రితం వ్యాపారం మొదలుపెట్టిన ప్రియాంక - త‌న వెబ్ సైట్ ద్వారా ఇప్పటి వరకు 125 రుతుస్రావ కప్పులను అమ్మగలిగారు. గూగుల్, ఫేస్ బుక్స్ ద్వారా ప్రచారం చేయడ ద్వారా వ్యాపార పరిధిని విసృతం చేయాలని ప్రియాంక ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ రుతుస్రావ కప్పులకు సంబంధించి వీడియో ను కూడా ఆమె యూట్యూబ్ లో పెట్టారు.