ఆలిబాబా.. దొంగలా వస్తాడా ?

భారత్ లో కాలుమోపేందుకు ఆలిబాబా ఉత్సాహంబ్యాక్ డోర్ ఎంట్రీ కోసం రంగం సిద్ధంపేటిఎం ద్వారా వచ్చి పెరిగిపోవాలని తాపత్రయంభారత చట్టాలు అందుకు ఒప్పుకుంటాయా ?

ఆలిబాబా.. దొంగలా వస్తాడా ?

Sunday April 12, 2015,

3 min Read

అలీబాబా... ఈ పేరు తెలియని యువత ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో! అంతగా మార్కెట్లోకి చొచ్చుకుపోయింది అలీబాబా.కామ్. ఈ-కామర్స్ రంగంలో ఇదొక జెయింట్, బిగ్ బ్రదర్. ఈ-కామర్స్ రంగంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈబే, అమెజాన్ వంటి సంస్థల నుంచి ఉన్న బలమైన పోటీని తట్టుకుని, ప్రారంభమైన కొద్ది కాలంలోనే ఈ స్థాయికి రావడం వెనక ఉన్న రహస్యం ఏమిటి? అలీబాబా తదుపరి లక్ష్యాలు, ప్రణాళికలు ఏమిటి? ఇవన్నీ చాలా ఆసక్తిని, ఆలోచనలను రేకెత్తించడంతోపాటు స్ఫూర్తినిచ్చే అంశాలు. మరింకెందుకు ఆలస్యం... చదవండి.

image


ఈ-కామర్స్ రంగం తీరుతెన్నులను, పనితీరును పూర్తిగా మార్చేసిన అలీబాబా... చైనా దేశానికి చెందిన అతి పెద్ద ఈ-కామర్స్ కంపెనీ. ఇది బీటూబీ, బీటూసీ, సీటూసీ... ఇలా అన్ని రకాలుగా ఆన్ లైన్ సేవలను ప్రారంభించి మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 1999లో అలీబాబా.కామ్ వెబ్ సైట్ ను జాక్ మా ప్రారంభించారు. అప్పట్లో ఆయన ఉద్దేశం కేవలం చైనా ఉత్పత్తులను విదేశీ కొనుగోలుదార్లకు అందుబాటులోకి తీసుకురావడం. కానీ తర్వాత కాలంలో లక్ష్యాలు మారాయి. ఫలితమే ఓ జెయింట్ గా ఎదిగిన అలీబాబా నెట్ వర్క్.

సాధించిన దానితో తృప్తిపడలేదు జాక్ మా. అంతర్జాతీయ స్థాయిలో అలీబాబాను శిఖరంపై నిలపాలనుకున్నారు. దానికి అనుగుణంగానే తన ప్రణాళికలను రూపొందించుకున్నారు. మరో బిలియన్ కస్టమర్లను తమ ఖాతాలో వేసుకుంటే... అత్యధికసంఖ్యలో వినియోగదారులు చేరడమే కాకుండా, దరిదాపుల్లోకి వేరెవరూ చేరలేని స్థితికి చేరవచ్చు. మరి దానికి కావలసిన మార్కెట్ ఏది? నిస్సందేహంగా మన దేశమే.

చైనా తర్వాత అత్యధిక జనాభా కలిగిన దేశం, మొత్తం జనాభాలో దాదాపు 60శాతం పైగా యువత ఉన్న దేశం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏది వచ్చినా అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న సమాజం కేవలం భారత్ మాత్రమే. భారతీయ రిటైల్ రంగంలో వస్తున్న మార్పులు, అభివృద్ధి అవకాశాలు... ఈ-కామర్స్ రంగం విస్తరించడానికి బాటలు పరిచాయి. ఇంటర్నెట్ విప్లవం, సామాన్యుడి నిత్యజీవితంతో విడదీయరాని బంధంతో పెనవేసుకున్న స్మార్ట్ ఫోన్... ఇవే ఈ-కామర్స్ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారిని ఊరించే అంశాలు. వచ్చే సంవత్సరం నాటికి స్మార్ట్ ఫోన్ వినియోగదారులు 50 మిలియన్లకు చేరతారు అని సర్వేలు చెబుతున్నాయి. 2020 నాటికి ఇది 550 మిలియన్లు అవుతుందని అంచనా. ఇది నిజంగా మార్కెట్ కి, వ్యాపారవేత్తలకి ఉత్తేజాన్నిచ్చే విషయమే.

భారీ పెట్టుబడితో అలీబాబా భారతీయ ఆన్ లైన్ వ్యాపార రంగంలో కాలుమోపడానికి సిద్ధంగా ఉంది. దాదాపు 575 మిలియన్ డాలర్లను(దాదాపు రూ.3400 కోట్లు) పేటీఎమ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. పేటీఎమ్ సేవలు కూడా అలీపే సేవల మాదిరిగానే ఉంటాయి. అందువల్లే జాక్ మా చాలా వ్యూహాత్మకంగా పేటీఎమ్ ను ఎంచుకున్నారు. దీనిద్వారా చైనా ఉత్పత్తులను పేటీఎమ్ వ్యాలెట్ ద్వారా భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టాలనేది వారి వ్యూహం. అయితే ఇది అంత సులభంగా జరిగేది కాదు... దీనికి ప్రభుత్వం నుంచి ఎన్నో రకాల అనుమతులు కావాల్సి ఉంది. సెక్యూరిటీ ఇష్యూస్ కారణంగా గతంలో గ్జియామీ స్మార్ట్ ఫోన్ల విక్రయాన్ని భారత్ నిషేధించిన అంశం ఇక్కడ గుర్తుంచుకోవాలి.

మరో అంశం... చైనీయుల ఆలోచనాతీరు, భారతీయుల ఆలోచనా సరళిలో పూర్తి వైరుధ్యం ఉంటుంది. పేటీఎమ్ బోర్డు లోకి అలీబాబా టీమ్ కాలుపెడితే... తప్పకుండా పేటీఎమ్ వ్యూహాలను, ప్రణాళికలను అలీబాబా ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి పేటీఎమ్ ను తనకు నచ్చిన విధంగా నిర్వహించడానికి వారికి స్వేచ్ఛ ఉంటుందో లేదో భవిష్యత్తులో చూడాల్సిందే.

మరో ముఖ్యమైన అంశం... చైనా ఉత్పత్తులు ఇప్పటికే భారతీయ మార్కెట్లలో విరివిగా దొరుకుతున్నాయి. వాటిలో చాలావరకు నాణ్యతాపరమైన లోపాలతో ఉంటున్నాయి. వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలు. ధర పరంగా తక్కువకు లభిస్తుండవచ్చు... కానీ నాణ్యత లోపిస్తే!! అందుకే కస్టమర్లకు చైనా ఉత్పత్తులంటే చిన్నచూపు. ఇది సగటు భారతీయుడి అభిప్రాయం.

మరి ఈ సవాల్ ను జాక్ మా ఎలా అధిగమిస్తారో వేచి చూడాల్సిందే. భారత కస్టమర్ల మైండ్ సెట్ ను మార్చి, తన బీటూసీ మోడల్ వ్యాపారసూత్రాన్ని అలీబాబా ఎంతవరకూ విజయవంతంగా అమలుచేయగలుగుతుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

గెస్ట్ ఆథర్స్ - సురజిత్, ఆశిష్