ఉద్యోగుల నిర్వాహణే కంపెనీ భవిష్యత్తుకు ఊతం !
ఉద్యోగుల పనితీరు, వాళ్ల నిర్వాహణ, హెచ్.ఆర్. విభాగ బాధ్యత వంటి విషయాలపై ఇన్‌మొబీ ఫౌండర్, సిఈఓ నవీన్ తివారీ.. కొన్ని ఆసక్తికర విషయాలను, అనుభవాలను టెక్‌స్పార్క్స్‌లో పంచుకున్నారు. తమ సంస్థ చిన్నగా ఉన్నప్పుడు చేసిన తప్పిదాలు, వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతో మంది యువపారిశ్రామికవేత్తలకు ఎన్నో విషయాలు నేర్పిస్తాయి.
''జనాలు ఎవరైనా ఫ్రీగా ఉండాలని కోరుకుంటారు. మనం స్కూల్లో లేము. ఇది పెద్దవాళ్లతో వ్యవహారం. ఉద్యోగులతో పనికి వచ్చే పని మనం చేయించుకోవాలి. అంతేకానీ వాళ్లను వనరుల మాదిరి చూస్తూ, వాళ్ల నిర్వాహణకే పరిమితం కాకూడదు.
ఉద్యోగల పనితీరును బేరీజు వేయడానికి తాము గతంలో పాటించిన విధానాలను వివరిస్తూనే.. దాని వల్ల ఎంత సమయాన్ని వృధా చేసుకుంది వివరించారు.
బోర్డులోకి తీసుకునే వ్యక్తులను నమ్మండి
ఉద్యోగస్థులపై నమ్మకం ఉంటుందని పైకి చెబుతాం. కానీ వాస్తవం అది కాదు. ఎప్పుడైతే మనం వాళ్లను నమ్మడం మొదలుపెడతామో.. అప్పటి నుంచి వాళ్ల పనితీరు మెరుగుపడ్తుంది. వివిధ రకాల ఫార్మ్స్, ఆథరైజేషన్స్, అప్రూవల్స్ వంటివన్నీ తమ ఆఫీసులో అసలు కనిపించవని ఈ సందర్భంగా నవీన్ వివరించారు.
తాము తీసుకున్న నిర్ణయం ఎంత ప్రభావశీలంగా ఉందో గణాంకాలే వివరిస్తున్నాయని నవీన్ కాన్ఫిడెంగ్‌గా చెబుతారు. 'కేవలం ఒక్క శాతం మంది ఉద్యోగులు మాత్రమే స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తారు. మేం తీసుకున్న ఇలాంటి నిర్ణయం వల్ల ఉద్యోగులు కట్టుదాటిపోతారేమోనని భయపడినప్పటికీ.. అలా ఏమీ జరగలేదు. అనుకున్నదానికంటే చాలా సాఫీగా సాగిపోయింది' అని చెబుతారు.
సమర్థులు మీ దగ్గరే ఉన్నప్పుడు.. బయట ఎందుకు వెతకడం
'' ఉద్యోగులు కంపెనీ మారడానికి కారణం.. వృద్ధి లేకపోవడమేనని మా పరిశీలనలో తేలిన ముఖ్య కారణం. మేం దాన్ని మార్చాలని అనుకున్నాం. ఇంటర్నల్ హైరింగ్‌ను ప్రోత్సహించాం. 'మన ఉద్యోగులే కొత్త వాటిని ఎందుకు ఆవిష్కరించకూడదు.. ? ' అనే ఆలోచనకు మేం వచ్చాం.
ఈ పాలసీని వీళ్లు అమలు చేసిన తర్వాత.. 35 శాతానికిపైగా పొజిషన్లు అప్పటికే ఉన్న టాలెంట్ పూల్ ద్వారానే భర్తీ అయ్యాయి.
'' ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కంపెనీలోని ఇతర విభాగాల నుంచి మనం ఉద్యోగులను తీసుకోవడం వల్ల వాళ్లు చాలా కొత్త విషయాలను నేర్చుకుంటారు. క్రాస్ లెర్నింగ్ చాలా ఉపయోగపడ్తుంది.
థింగ్ బిగ్.. స్టార్ట్ స్మాల్..
మీరు ఒక కంపెనీని నిర్మించేటప్పుడు.. దాన్ని ఓ చిన్న సమూహానికి పరిమితం చేయాలని అనుకుంటున్నారా.. లేక ప్రపంచవ్యాప్త గ్లోబల్ ఆడియన్స్ స్థాయికి తీసుకువెళ్లాలని అనుకుంటాన్నారా నిర్ణయించుకోవాలి. దీర్ఘకాల లక్ష్యాలు ఉన్నవాళ్లు.. కంపెనీ ప్రారంభ దశలోనే ఒక సంస్కృతిని తీసుకురావాలి. అదే మీతో పాటు మీ కంపెనీని విస్తరింపజేస్తుంది.
అన్నింటికంటే ముఖ్యంగా వ్యవస్థాపకుల పాత్ర ఇందులో చాలా కీలకం. అధిక సమయాన్ని వెచ్చించి అయినా సరే వాళ్లు ఒక పని సంస్కృతిని అలవాటు చేయాలి.
''సీరీస్ ఎ,బి,సి.. ఇలా కంపెనీని విస్తరించాలంటే ముందుగా.. వ్యవస్థాపకులు సొంత సమయాన్ని వెచ్చించాలి. అక్కడ ఓ కల్చర్ బిల్డ్ చేయాలి. అంతే కానీ ఆ బాధ్యతను హెచ్.ఆర్. టీం పై వదిలేస్తే.. వ్యవస్థ మీ చేయిదాటిపోతుంది'' అని ముగిస్తారు నవీన్.