మ్యాథ్యూ డెస్మారిస్ క్యూబెక్ నివాసి. మార్కెటింగ్ అండ్ పాలిటిక్స్ లో డిగ్రీ చేస్తున్న సమయంలో పంజాబ్ కు చెందిన ఓ ఇంజనీర్ దగ్గర నెల రోజుల ఇంటర్న్ షిప్ అవకాశం వచ్చింది. అలా ఇండియాలో అడుగుపెట్టాడు. జలంధర్, హోషాయ్ పూర్ మధ్య ఓ గ్రామానికి వచ్చాడు. భారతదేశం గొప్పదనం ఏంటో తెలుసుకున్నాడు. తిరిగి క్యూబిక్ వెళ్లినా సొంతూరిలా అనిపించలేదు. మళ్లీ తన ప్రాంతానికి అలవాటు పడటానికి కొన్ని వారాలు పట్టింది. భారతదేశంపై ప్రేమలో పడిపోయానని తనకు అర్థమైంది అప్పుడే. మళ్లీ ఇండియాకు ఎప్పటికైనా తిరిగెళ్తానని అప్పుడే అనుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత అదే నిజమైంది. తిరిగి ఇండియాలో అడుగుపెట్టాడు. ఈసారి స్టూడెంట్ లా కాదు. ఓ ఆంట్రప్రెన్యూర్ లా ల్యాండయ్యాడు.
బిజినెస్... మ్యాథ్యూస్ డీఎన్ఏ
మ్యాథ్యూస్ బిజినెస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాడు. ఇండియా వచ్చింది కూడా వ్యాపారం కోసమే. ఆంట్రప్రెన్యూర్ షిప్ అన్న పదం తన డిక్షనరీలో కొత్తేమీ కాదు. 18 ఏళ్ల వయస్సులోనే సొంతగా ఐస్ హాకీ టీమ్ తో సక్సెస్ సాధించిన ట్రాక్ రికార్డుంది. కుటుంబంలో అందరూ ఆంట్రప్రెన్యూర్లే. ఆ అనుభవంతో ఓ స్టార్టప్ కోసం కెనెడాలో హోమ్ వర్క్ చేశాడు. ఇండియాలో ఔట్ సోర్స్ ప్రాజెక్టులు అవసరమైన జనాల నాడీ తెలుసుకున్నాడు. ఇండియాకు తిరిగివచ్చి జైపూర్, న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరులో చక్కర్లు కొట్టాడు. తర్వాత ఐటీ క్యాపిటల్ బెంగళూరులో ఎన్పీఎం టెక్నాలజీస్ లో పేరుతో మొబైల్, వెబ్ అప్లికేషన్ల సంస్థను ప్రారంభించాడు.
ప్రపంచంలోని ప్రజలంతా అద్భుతాలు సాధించేందుకు ఆసియా వైపు అడుగులు వేస్తున్నారన్నది వాస్తవం. అలాంటి వారికి ప్రేరణగా నిలవడమే కాదు శక్తిని ప్రసాదిస్తోంది భారతదేశం. సాఫ్ట్ వేర్ రంగంలో అన్ని దేశాల్లో డిమాండ్ ఉన్నా... నా బిజినెస్ కోసం ఇప్పటికీ మరే నగరాన్ని, దేశాన్ని ఎంచుకోలేకపోతున్నా అంటాడు మ్యాథ్యూ.
చాలా తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టడమే కాదు... మొదటి ఏడాదిలోనే లాభనష్ట రహిత స్థితికి చేరుకున్నానని గర్వంగా చెబుతాడు. ఫ్రాన్స్, యూకే, హాంగ్ కాంగ్, ఆస్ట్రేలియాలోని అరవై మంది క్లైంట్లకు వంద ప్రాజెక్టులు పూర్తిచేసిన ట్రాక్ రికార్డ్ ఎన్పీఎం టెక్నాలజీస్ ది. ప్రస్తుతం హాస్పిటాలిటీ, ఇండస్ట్రియల్, రీటైల్ రంగాల్లో సేవలందిస్తోంది. ఇండియాలో స్టార్టప్ రంగంలో స్థిరపడ్డ కెనడియన్... తన సోదరుడు అలెక్స్ ని కూడా తెరపైకి తీసుకొచ్చాడు.
రెండో అడుగు
2013లో మరో వ్యాపారావకాశాన్ని వెతుక్కున్నాడు మ్యాథ్యూ. మియామీకి చెందిన క్లైంట్ ఒకరు తన సంస్థకు ఇ-కామర్స్ సెగ్మెంట్ లో ఏదైనా సబ్ స్క్రిప్షన్ దొరుకుతుందా అని ఆరాతీశాడు. అదే మ్యాథ్యూకి మంచి అవకాశాన్నిచ్చింది. అలా రికరెక్స్ పుట్టింది. ఇద్దరు సోదరులు మరో ఎంటర్ ప్రైజ్ ప్రారంభించి సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నారు. కస్టమర్లు ఇ-కామర్స్ సంస్థతో సబ్ స్క్రిప్షన్ చేసుకొని ఉత్పత్తులకు, సేవలకు పేమెంట్లు చేసేందుకు ఉపయోగపడే స్టార్టప్ అది.
ఉదాహరణకు మీరు ఓ హైపర్ లోకల్ స్టార్టప్ నుంచి సరుకులు కొన్నారనుకోండి. మీరు ప్రతీ నెలా అవే సరుకులు ఆర్డర్ చేయాల్సి వస్తే మళ్లీ మొదట్నుంచీ అదే ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా బిల్లింగ్ చేసెయ్యొచ్చు. ఇందుకోసం చేయాల్సింది ఆ వ్యాపారి దగ్గర సబ్ స్క్రిప్షన్ తీసుకోవడమే. అంటే మేగజైన్లకు సబ్ స్క్రిప్షన్ చేసినట్టు. కస్టమర్లకు సమయం ఆదా అవుతుంది. బిజినెస్ టు బిజినెస్ విధానంలో రికరెక్స్ సేవల్ని అందిస్తోంది. వ్యాపారుల వెబ్ సైట్ లోనే సబ్ స్క్రిప్షన్స్ అప్ గ్రేడ్ చేయడం లేదా రద్దు చేయడం, బిల్లులు పంపడం, లావాదేవీలకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపడం, సబ్ స్క్రిప్షన్ రెన్యూవల్ సమయానికి మెయిల్, ఎస్ఎంఎస్ పంపి గుర్తుచేయడం లాంటి సేవల్ని అందిస్తోంది రికరెక్స్. దీని ద్వారా ఇ-కామర్స్ కంపెనీలకు చాలా లాభాలున్నాయి. అప్పుడో ఇప్పుడో వచ్చే కస్టమర్లు ఇక సబ్ స్క్రైబర్లుగా మారిపోతారు. దీని ద్వారా ఎన్ని ఆర్డర్లు వస్తున్నాయి? సబ్ స్క్రిప్షన్ ద్వారా వస్తున్న ఆదాయం ఎంత? యాక్టీవ్ సబ్ స్క్రిప్షన్స్ ఎన్ని ఉన్నాయి? లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు.
ఫిబ్రవరి 2016లో ప్రారంభమైన రికరెక్స్ కు ఇప్పటి వరకు ఐదుగురు క్లైంట్లున్నారు. బెంగళూరులోని కేఫ్ నాయిర్, షాప్ జీకోకు సేవలందిస్తోంది. సబ్ స్క్రిప్షన్స్, సబ్ స్క్రైబర్స్ పెరుగుతున్నకొద్దీ స్టార్టప్ కు లాభాలు పెరుగుతాయి. ప్రతీ నెలా ఒక యాక్టీవ్ సబ్ స్క్రైబర్ ద్వారా రూపాయి నుంచి యాభై రూపాయల వరకు లాభం ఉంటుంది. ప్రస్తుతం వెయ్యి మంది సబ్ స్క్రైబర్లు, ఐదువేల సబ్ స్క్రిప్షన్స్ తో ముందుకెళ్తోందీ స్టార్టప్. ఈ ఏడాది చివరినాటికి 50 వేల సబ్ స్క్రైబర్లే టార్గెట్. ఏడుగురు సభ్యుల బృందంతో నడుస్తోందీ స్టార్టప్. వీరిలో కెనెడా, ఫ్రెంచ్ దేశస్తులున్నారు. ఇండియన్ ఏంజిల్ ఇన్వెస్టర్లు, కెనెడియన్ల నుంచి పెట్టుబడులు వచ్చాయి. భవిష్యత్తు గురించి చాలా గొప్పగా ఆలోచిస్తున్నాడు మ్యాథ్యూ. ఇండియాలో మరింత సత్తాచాటుతామన్న విశ్వాసం కనిపిస్తోంది. సోదరుడు అలెక్స్ తో కలిసి భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. ఇ-కామర్స్ సబ్ స్క్రిప్షన్ లో ఆర్డర్లు, పేమెంట్లను సులభతరం చేసేందుకు ఇద్దరు సోదరులు డాటా సైన్స్ ను అధ్యయనం చేస్తున్నారు.
అనేక మంది ప్లేయర్స్
ప్రస్తుతం సబ్ స్క్రిప్షన్ ఇ-కామర్స్ మార్కెట్ లో అనేక మంది ప్లేయర్స్ ఉన్నారు. కామిక్స్, పాప్ కల్చర్, గేమింగ్ లాంటివి ఇష్టపడేవారికి సేవలందిస్తున్న గీక్ కార్టె, ముంబైకి చెందిన బ్యూటీ, గ్రూమింగ్ డిస్కవరీ సర్వీస్ ఫ్యాబ్ బ్యాగ్, వీటితో పాటు myenvybox.com, Bakebox లాంటివి ఉన్నాయి. సెప్టెంబర్ 2015లో ది మ్యాన్ కంపెనీ, వూనిక్ ల నుంచి సబ్ స్క్రిప్షన్స్ వచ్చాయి. ఇప్పటికీ సబ్ స్క్రిప్షన్ ఇ-కామర్స్ ఇండియాలో సురక్షితమైన రంగమే. సాఫ్ట్ వేర్ యాజ్ ఏ సొల్యూషన్(SaaS) కంపెనీలన్నీ 2025 నాటికి పది బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని గూగుల్ రిపోర్ట్ ప్రకారం అంచనా. ఇప్పుడు రికరెక్స్ కూడా సరైన రంగంలో అడుగుపెట్టి సత్తాచాటుతోంది.