బాల్యవివాహాలకు వ్యతిరేకంగా బరిగీసి కొట్లాడిన రేఖ !
రేఖా కలింది వయసు ఇప్పుడు 18 ఏళ్లు. కానీ చదువుకోవడానికి ఆమె చేసిన పోరాటాన్నిరానున్నఎన్నోఏళ్లపాటు చెప్పుకుంటాం ! ఎందుకంటే ఆమె ధీర! 11 ఏళ్ల వయసులో పెళ్లిపీటలను తోసేసి.. బడికి వెళ్లిన తెగువ ఆమె సొంతం. పుస్తెల తాడును విసిరికొట్టి.. పుస్తకాల బ్యాగ్‌ని తగిలించుకున్నసాహసం ఆమె నైజం! పాకిస్తాన్‌లో బాలికా విద్య కోసం తాలిబన్ల తూటాలకు ఎదురొడ్డింది మలాలా యూసఫ్ జాయ్! అదే చదువు కోసం కుటుంబానికి, తరతరాల దురాచారానికి ఎదురు నిలిచిన ఇండియన్ మలాలా..మన రేఖా కలింది!
పశ్చిమ బెంగాల్‌లోని పురీలియాలో పుట్టి పెరిగింది రేఖ. పేద కుటుంబం. ఆడపిల్లకు ఎలాగోలా పెళ్లిచేసేసి వదిలించుకోవాలనుకునే సమాజ భావదారిద్ర్యం! ఇలాగే కేవలం 11 ఏళ్లేకే రేఖ పెళ్లికి అంతా సిద్ధం చేసేశారు తల్లిదండ్రులు. అయితే బాలికా వధువుగా మారడానికి రేఖ ఒప్పుకోలేదు. చదువుకోవడం నా హక్కు అని తెగేసి చెప్పంది. పెళ్లి ప్రయత్నాలను ప్రతిఘటించింది. అన్ని అడ్డంకులను అధిగమించి హాపీగా చదువుకుంటోంది. భారతీయ మలాలాగా అభినందనలు అందుకుంటూ.. ప్రముఖ విద్యా సంస్థల్లో ఉపన్యాసాలిస్తోంది. తన జ్ఞాపకాలను పెంగ్విన్ పబ్లిషర్స్‌తో పంచుకుని ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.
అది 2008. రేఖ వయసు 11 ఏళ్లు. బాగా చదువుకోవాలని రేఖ కలలుకంది. అయితే ఆమెకు పెళ్లి చేసేయాలని నిర్ణయించారు తల్లిదండ్రులు. ఆమె అక్కకి 12 ఏళ్లకే పెళ్లి చేసేశారు. నలుగురు పిల్లలతో ఆమె అనుభవిస్తున్ననరకాన్నిరేఖ కళ్లారా చూసింది. అందుకే పెళ్లి వద్దంది. చదువుకుంటానని తెగేసి చెప్పింది. ఆ మాటకు అమ్మానాన్న అంతెత్తున లేచారు. గదిలో పడేసి కొట్టారు. స్కూలుకి వెళ్లకుండా చేశారు. తిండి కూడా పెట్టకుండా చిత్రహింసలకు గురిచేశారు.
"అప్పుడు నేనెంతో ఏడ్చాను. అరిచాను. కానీ ఎవ్వరూ కలుగుజేసుకుని అడ్డుకోలేదు. చాలాసేపటి తర్వాత అమ్మకాస్త ఆగింది. నేను నేలమీద పడివున్నాను. మళ్లీ కొడుతుందేమోనన్నభయంతో నిలువునా వణికిపోయాను"- రేఖ
చదువు కోసం రేఖ చేసిన పోరాటానికి ఫ్రెంచ్ రచయిత మౌసైన్ ఎనైమీ అక్షర రూపమిచ్చారు. ఫ్రెంచ్ భాషలో ఈ బుక్ ఎంతో పాపులర్ అయింది. ఎనైమీ సహకారంతో రేఖ కథను "ద స్ట్రెంగ్త్ టు సే నో" పేరుతో ఇంగ్లీష్‌లో అనువదించారు సారా లాసన్!
"రేఖ కథ నన్నెంతో కదిలించింది. అంత చిన్న వయసులో ఆమె ప్రదర్శించిన పోరాటపటిమ అద్భుతం. శతాబ్దాలనాటి బాల్య వివాహాల దురాచారానికి ఎదురునిలిచిన ఆమె ధైర్యం నన్ను ఆకర్షించింది. అందుకే ఆమె కథను ప్రపంచానికి చెప్పాలనుకున్నాను- ఎనైమీ
ఇంతకీ రేఖ ఏం చేస్తోందనేగా మీ సందేహం..? తను ఇప్పుడు పదో తరగతి చదువుతోంది. నర్సింగ్ చేయాలనేది తన లక్ష్యం. రోగులకు సేవ చేయాలనుకుంటోంది. 11 ఏళ్ల వయసులో చదువు కోసం రేఖ చేసిన ప్రతిఘటన.. పురీలియాలో పది వేలమంది బాలికల నుదుట బాల్య వివాహ గీతను తుడిచేసింది. వారిలో స్ఫూర్తిని నింపి బడి బాట పట్టించింది.