ఒక్కరోజులో ఆరు కోట్లు సంపాదించడం ఎలా?

ఒక్కరోజులో ఆరు కోట్లు సంపాదించడం ఎలా?

Thursday February 25, 2016,

2 min Read

పెద్దగా కష్టపడకుండా కోట్లు సంపాదించాలనుకుంటున్నారా? మిగతా స్టార్టప్స్ లాగా లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి లాభాల కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూసేంత ఓపిక మీకు లేదా? ఎలాంటి పెట్టుబడి లేకుండా ఉన్నట్టుండి ఓ ఆరు నెలల్లో కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ సెటైరికల్ స్టోరీ. ఓ ఉత్పత్తిని అత్యంత తక్కువ ధరకు అమ్ముతామంటూ ఓ కంపెనీ చేసిన హంగామా వెనుక కోట్లు వెనకేసే ప్లాన్ ఉందంటే షాకవ్వాల్సిందే.


ఎలా చేయాలంటే..?

మేక్ ఇన్ ఇండియా క్యాంపైన్ లో భాగంగా మీ ఉత్పత్తిని ప్రారంభిస్తున్నామని చెప్పండి. ఇందుకు నయాపైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మేక్ ఇన్ ఇండియా క్యాంపైన్ అనేసరికి ప్రతీఒక్కరూ పిచ్చిపిచ్చిగా నమ్మేస్తారు. త్రీజీ, హెచ్డీ స్క్రీన్, డ్యూయల్ కెమెరా, 2జీబీ ర్యామ్... ఇలా అద్భుతమైన ఫీచర్స్ తో నోరెళ్లబెట్టే ధరకే ఓ స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ చేయండి. అందరికీ వినసొంపుగా ఉండే పేరుతో మార్కెట్లోకి తీసుకురండి. 'ఫ్రీడమ్ 251' లాగా 251 రూపాయలకే అన్నమాట.

మార్కెటింగ్ ఖర్చు... ఒక్కరూపాయి కూడా అవసరం లేదు

మీ ఉత్పత్తితో ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించండి. ప్రముఖ న్యూస్ పేపర్లు, వెబ్ సైట్స్, బీబీసీ లాంటి న్యూస్ ఛానళ్లలో హడావుడి మొదలవుతుంది. ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో ఇదే టాపిక్ హాట్ టాపిక్ అవుతుంది. ఈ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇక ఇండియన్ మీడియా విషయానికొస్తే నిజానిజాలు తెలుసుకోకుండా కథనాలు వండి వడ్డిస్తుంది. కారణం... ఈ ఫోన్ ఎంత అద్భుతంగా ఉంటుందో వినడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారు కాబట్టి.

ప్రొడక్ట్ ని లాంఛ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేయండి(ఖర్చు ఐదు లక్షలు)

ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే... ప్రొడక్ట్ లాంఛ్ చేయడానికి ఓ మంచి ముహూర్తం ఫిక్స్ చేయడమే. ఈ డేట్ ఎలా ఉండాలంటే ప్రభుత్వం చేస్తున్న మేకిన్ ఇండియా క్యాంపైన్ ఈవెంట్లకు దగ్గరగా ఉండాలి. అంతే... మీరు మీడియాకు ఇన్విటేషన్లు పంపాల్సిన అవసరం కూడా లేదు. వాళ్లే పరిగెత్తుకొస్తారు. ఓ ఐదు చైనా మేడ్ ఫోన్లు తీసుకొచ్చి... మీ బ్రాండ్ స్టిక్కర్ అతికించి రిలీజ్ చేసెయ్యండి. అందంగా కనిపించే నాలుగు మోడల్స్ ని రిలీజ్ చేస్తే చాలు... మళ్లీ అదే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది.

వెబ్ సైట్ (ఖర్చు రూ.7,500)

ఫోన్ బుక్ చేసుకోవడానికి అసరమయ్యే ఓ వెబ్ సైట్ ని తక్కువ ఖర్చుతో సింపుల్ గా ప్రారంభించండి. అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ లాంటి వివరాలన్నీ నిజాయితీగా ఇవ్వండి (ఎలాంటి కాంటాక్ట్ డీటైల్స్ లేని ఫ్రీడమ్ 251 వెబ్ సైట్ లా కాదు). టర్మ్ అండ్ కండీషన్స్ పేజీలో ఓ నిబంధన పెట్టండి: 'అనివార్య కారణాల వల్ల మేము రాబోయే ఆరు నెలల్లో ఫోన్ ని డెలివర్ చేయలేకపోతే మీ డబ్బుల్ని తిరిగిచ్చేస్తాము' అని.

బుకింగ్స్ (ఖర్చు-0)

ఇలా ఓ 50 లక్షల మంది కస్టమర్లు రూ.251+రూ.40 డెలివరీ ఛార్జీల చొప్పున చెల్లిస్తారు. ఇలా రూ.145 కోట్లు మీ ఖాతాలో పడతాయి. ఆరు నెలల్లో డెలివరీ లేదా రీఫండ్ చేస్తామని చెప్పండి. ఈ రూ.145 కోట్లు తీసుకెళ్లి ఏదో ఓ బ్యాంకులో 9 శాతం వడ్డీకి డిపాజిట్ చేయండి. ఆరు నెలల్లో మీకు ఆరున్నర కోట్ల వడ్డీ వస్తుంది. ఆరు నెలల తర్వాత రూ.145 కోట్లు తిరిగి కస్టమర్లకు పంచెయ్యండి. అప్పుడు మీ జేబులో ఆరున్నర కోట్లు ఉంటాయి.

రచయిత: రోహిత్ లోహడె, www.businesssetup.in కో-ఫౌండర్.

గమనిక: ఈ వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు రచయితవి మాత్రమే. వాటితో యువర్‌ స్టోరీకి ఎలాంటి సంబంధంలేదు. యువర్‌ స్టోరీ ఏ విధమైన బాధ్యత వహించదు.

image