ఫిట్‌నెస్ మార్కెట్లో ఫేవరెట్ యాప్- BYG టార్గెట్
మార్కెట్లో ఉన్న వాటితో పోలిస్తే ఏంటి వీళ్ల స్పెషాలిటీ.. ?
జనాలు ఇప్పుడు ఫిట్‌నెస్ ఫ్రీక్స్ అయిపోతున్నారు. ఈ మధ్య పార్కుల్లో చూసినా చెమటలు కక్కుకుంటూ పరిగెడుతున్న వాళ్లు కనిపిస్తున్నారు. కనీసం వాకింగో.. జాగింగో.. ఏదో ఒకటి మనం గమనించవచ్చు. హెల్త్ కాన్షియస్‌నెస్ పెరగడం స్వాగతించాల్సిన విషయం. ఇంకొంత మంది జిమ్స్‌లో చేరుతూ కండలు పెంచుతున్నారు. అందుకే ఈ మార్కెట్ జోరు నానాటికీ పెరుగుతోంది. ఈ స్పేస్‌లో ఎన్నో స్టార్టప్స్ కూడా పుట్టుకొస్తున్నాయి.
దేవిప్రసాద్ బిస్వాల్(28), అవిజీత్ అలగతి(28)కూడా ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలనే రంగంలోకి దిగారు. ఎండిఐ గుర్గావ్, ఐఐఎం కోజికోడ్‌లో చదివిన ఈ ఇద్దరూ 2011లో గోల్డ్‌మ్యాన్‌శాక్స్‌లో పనిచేశారు. అప్పటి నుంచే ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఒకరు ఆపరేషన్స్‌లో దిట్ట అయితే మరొకరు కాల్‌క్యులేటెడ్ రిస్క్ టేకర్.
దేవి (దేవిప్రసాద్ బిస్వాల్.. షార్ట్‌గా దేవి) 2014లో తన మిత్రుడు స్థాపించిన ఓ ఫ్యాషన్ స్టార్టప్ క్యాండిడ్లీ కౌచర్(సిసి)లో ఆపరేషన్స్ హెడ్‌గా చేరాడు. ఈ కంపెనీలో అవిజీత్(అవి అని పిలిపించుకోవడానికి సరదా పడతాడు) కూడా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశాడు. దీంతో ఈ ఇద్దరు ఫ్రెండ్స్‌లో టచ్‌లోనే ఉన్నారు.
బెంగళూరుకు మకాం మార్చిన దేవికి జరిగిన ఓ అనుభవం అతడిని ఆంట్రప్రెన్యూర్ అవతారమెత్తేలా చేసింది. తన రూమ్ మేట్ ఓసారి దగ్గర్లోని గోల్డ్ జిమ్‌లో మూడు నెలల మెంబర్షిప్ తీసుకుని చేరాడు. అయితే జిమ్ వాళ్లు ఈ మూడు నెలలకే ఏడాదికి సరిపడా మొత్తాన్ని ఛార్జ్ చేశారు. ఎప్పుడూ ఖాళీగా ఉండే ఆ జిమ్‌లో ఎందుకంత పెట్టి చేరాల్సి వచ్చిందో అర్థం కాకపోయినా.. ఓ అనుభవమైతే వచ్చింది.
ఫిట్‌నెస్ సెంటర్లన్నీ మిస్ మేనేజ్ చేస్తున్నారని, వాటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం లేదనే విషయం అర్థమైంది. దేవి తెలుసుకున్న విషయం ఏంటంటే జిమ్స్.. 20 గంటలకు పైగా తెరిచి ఉంచినప్పటికీ.. కేవలం నాలుగు గంటలు మాత్రమే పూర్తిస్థాయిలో వినియోగమవుతాయని. కస్టమర్లలో కూడా రెన్యూ చేసుకునే వాళ్ల సంఖ్య 15-20 శాతానికి పరిమితమవుతోంది. వీటన్నింటికి తోడు మన దేశంలో ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడ్తున్న వారి సంఖ్య 0.4 శాతం మాత్రమే. ఇది ఆసియాలోనే అత్యంత తక్కువ. ఈ రంగంపై పరిశోధన చేసిన దేవి.. అవిని కలిసి తన ఆలోచన పంచుకున్నాడు. ఇద్దరూ కలిసి జనవరి 32,2016న బుక్ యువర్ గేమ్ (BYG) పేరుతో స్టార్టప్ మొదలుపెట్టారు.
బిగ్ టార్గెట్స్
ప్రస్తుతం ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా కస్టమర్లు ఫిట్‌నెస్ సెషన్స్‌ను బుక్ చేసుకోవచ్చు. జిమ్ మెంబర్షిప్స్, పే పర్ సెషన్ (వర్కవుట్ నౌ) వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వర్కవుట్ నౌ ఆప్షన్‌కు డైనమిక్ ప్రైసింగ్ ఉంటుంది. డిమాండ్‌ను బట్టి ఒక్కో సెషన్‌కు రూ.20 నుంచి 300 వరకూ ఛార్జ్ చేస్తారు.
జిమ్స్‌తో పాటు ఈ యాప్ ద్వారా యోగా, జుంబా, క్రాస్‌ఫిట్, మార్షల్ ఆర్ట్స్ వంటి వాటిని బుక్ చేసుకోవచ్చు. స్విమ్మింగ్, స్కేటింగ్, కిడ్స్ జోన్, సమ్మర్ క్లాసెస్ వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. గ్రూప్ బుకింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఇప్పుడున్న సబ్‌స్క్రైబర్లలో 30 శాతం ఇలాంటి గ్రూప్ బుకింగ్ చేసుకుంటున్నట్టు బిగ్ టీం చెబ్తోంది. రాబోయే మూడు నెలల్లో స్పోర్ట్స్ కోచెస్, ఫ్రీలాన్స్ పర్సనల్ ట్రైనర్స్‌ను కూడా ఈ ప్లాట్‌ఫాం ద్వారా అందించాలని చూస్తున్నారు.
బి2సి మాత్రమే పరిమితం కాకుండా బి2బిలోకి బిగ్ టీం ఎంటర్ అయింది. 'పల్స్' పేరుతో కస్టమర్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్‌ను జిమ్ యాజమాన్యాలకు అందిస్తోంది. జిమ్‌లో ఉన్న సభ్యుల సంఖ్య, వాళ్లు ఎంచుకునే వర్కవుట్స్, రిపీటెడ్ కస్టమర్స్ వంటి వివరాలు ఇందులో ఉంటాయి. ప్రస్తుతం ఈ రంగంలో ఇలాంటి సొల్యూషన్ ఏదీ లేదని చెబ్తున్నారు అవి. దీని వల్ల యూజర్స్ నిర్వాహణ, షెడ్యూల్ మేనేజ్‌మెంట్, లీడ్ జనరేషన్, ఎంప్లాయీ మేనేజ్‌మెంట్ వంటివన్నీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఈ సౌకర్యాన్ని మొబైల్‌కు మాత్రమే పరిమితం చేశారు. ఎందుకంటే జిమ్స్‌లో డెస్క్‌టాప్స్ వాడే వాళ్లు తక్కువనేది బిగ్ టీం ఆలోచన.
ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ..
10-65 ఏళ్ల గ్రూపును టార్గెట్ చేస్తున్న ఈ స్టార్టప్- ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, పూణె, బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లో సేవలను అందిస్తోంది. ద్వితీయ శ్రేణి నగరాల్లోని జనాలకు డబ్బును వెచ్చించే వెసులుబాటు ఉన్నా అందుకు తగ్గ సౌకర్యాలు లేవనే విషయాన్ని గుర్తించినట్టు చెప్తున్నారు అవిజీత్.
డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో చిన్న నగరాలకు కూడా విస్తరించే యోచనలో ఉంది బిగ్ స్టార్టప్.
780 ఫిట్‌నెస్ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకున్న బిగ్, మొదటి 40 రోజుల్లోనే 3,030 ట్రాన్సాక్షన్స్ నిర్వహించింది. ప్రతీ రోజూ 10 కొత్త సెంటర్లను యాడ్ చేసుకుంటూ వెళ్తున్న ఈ స్టార్టప్ దాదాపు 150 ట్రాన్సాక్షన్స్ చేస్తోంది. బుక్ చేసుకున్న వాళ్లలో 99 శాతం మంది సేవలను వినియోగించుకుంటున్నారని, 80 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ సార్లు వచ్చారని బిగ్ టీం చెబ్తోంది. మార్కెటింగ్‌పై పెద్దగా ఖర్చు చేయకుండానే ఇంత ప్రగతి సాధించామని వీళ్లు చెప్పుకుంటున్నారు.
ఇప్పటి దాకా BYG యాప్‌కు 4500 డౌన్‌లోడ్స్ అయితే 1700 మంది యూజర్స్ యాక్టివ్‌గా ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్నారు.
రాబోయే ఆరు నెలల్లో ఈ వేదికపైకి 2000 ఫిట్‌నెస్ సెంటర్లను, 10 వేల మంది ఫ్రీలాన్స్ ట్రైనర్లను, 2 లక్షల మంది కస్టమర్లను తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
మరి ఆదాయం ?
ఒక్కో లావాదేవీపై సర్వీస్ ప్రొవైడర్ నుంచి 20 శాతం కమిషన్‌ను తీసుకుంటుంది బిగ్. ప్రస్తుతానికి యాప్ డౌన్‌లోడింగ్‌కు, ప్లాట్‌ఫాం వినియోగానికి కస్టమర్ నుంచి ఎలాంటి రుసుమునూ వీళ్లు వసూలు చేయడం లేదు. జిమ్‌లు సిఆర్ఎం సొల్యూషన్ అందించినందుకు ట్రయల్ ఫీజ్ కింద రూ.1000 తీసుకుంటున్నారు. ఒక వేళ సబ్‌స్క్రైబర్లు ఫుల్ అయితే రూ.3,000 వసూలు చేస్తారు.
మొదటి నెలలో జిమ్, కస్టమర్ల నుంచి వచ్చిన డబ్బు రూ. 1 లక్ష కంటే తక్కువే ఉన్నప్పటికీ, ఆగస్ట్ 2016 నాటికి 25 లక్షల క్యాష్ రెవెన్యూ సాధిస్తామనేది వీళ్ల ధీమా. త్వరలో రూ.2 కోట్ల ఏంజిల్ రౌండ్ ఫండింగ్‌ను సమీకరించబోతున్న కంపెనీ- సిరీస్ ఏను ఈ ఏడాది ఆఖరిలోగా ముగిస్తామనే కాన్ఫిడెన్స్‌లో ఉంది.
మరి భవిష్యత్
రాబోయే ఐదు నెలల్లో పల్స్ ప్లాట్‌ఫాంను మరింతగా వృద్ధి చేయాలని వీళ్లు చూస్తున్నారు. సిటీలో జరిగే ఫిట్‌నెస్ ఈవెంట్స్ క్యాలెండర్‌ను జత చేయాలని అనుకుంటున్నారు. కస్టమర్‌ను రిపీటెడ్‌గా జిమ్స్‌కు రప్పించాలంటే వాళ్లలో ఉత్సాహాన్ని నింపాలి. అప్పుడే వాళ్లూ హెల్దీగా ఉంటారు.. మాకూ నాలుగు డబ్బులు వస్తాయనేది దేవి మాట. అందుకే లీడర్ బోర్డ్స్, ఫిట్‌నెస్ బడ్డీస్ వంటి కాన్సెప్టులు పెట్టి వాళ్లను మోటివేట్ చేస్తామంటున్నారు. ఒక్కో యూజర్ ప్రొఫైల్ ట్రాక్ చేయడం, వాళ్ల హెల్త్ రిపోర్ట్, పెర్ఫార్మెన్స్‌ను ఎప్పటికప్పుడు వివరించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే మార్కెట్లో ఇలాంటివి లేవా ?
ఈ విభాగంలో మార్కెట్లో చాలా స్టార్టప్స్ ఉన్నాయి. వాటిల్లో కొన్ని సంస్థలు 26 మంది ఇన్వెస్టర్ల నుంచి ఐదు రౌండ్లలో 84 మిలియన్ డాలర్ల మొత్తాన్ని సమీకరించాయి కూడా. యూఎస్‌లో పాపులర్ అయిన క్లాస్‌పాస్ మోడల్‌ను ఇక్కడ చాలా మంది వాడటం వల్ల ఈ మార్కెట్ దాదాపుగా సాచురేషన్ పాయింట్‌కు వచ్చేసింది. ఇప్పుడు బిగ్ కూడా జిమ్‌పిక్ లాంటి సంస్థలతో పోటీపడాల్సి ఉంటుంది. ఒక వర్కవుట్ పాస్ తీసుకుంటే తమ లిస్ట్‌లో ఉన్న ఏ ఫిట్‌నెస్ సెంటర్లో అయినా వర్కవుట్ చేసుకోవడం జిమ్‌పిక్ కాన్సెప్ట్. తాజాగా ఈ సంస్థ ఫిట్‌నెస్ పాపా అనే సంస్థనూ కొనుగోలు చేసింది.
రెండేళ్లలోనే ఈ ఫిట్‌నెస్ స్టార్టప్స్ భారీగా పుట్టుకొచ్చాయి. ఇప్పటికే ఈ స్పేస్‌లో ఎక్కువ మంది ప్లేయర్స్ ఉన్నట్టు అనిపిస్తోంది. రాబోయే రోజుల్లో వీళ్లంతా ఎలా నిలదొక్కుకుంటారు, విలీనాలు, కొనుగోళ్లు.. ఎక్కడెక్కడ జరుగుతాయనేది ఆసక్తిగా మారింది.
రచయిత - తరుషా భల్లా
అనువాదం - చాణుక్య