మంచు ఎడారినే మార్కెటింగ్ చేసిన ఇషితా ఖన్నా

హిమాలయాల్లోని స్పిటీ వ్యాలీలో ఎప్పుడూ మంచేఅక్కడి ప్రజల దుర్భర జీవితంసదస్సులో పాల్గొనేందుకు వచ్చి చలించిన ఇషితాస్థానిక పళ్లలో ఔషధ గుణాల గుర్తింపుస్థానికులకు మార్కెట్ టెక్నిక్స్పర్యావరణ అనుకూల పర్యాటకానికి శ్రీకారం

15th Apr 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

స్పిటీ వ్యాలీ... హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న ఓ మంచు ఎడారి. ఎడారి అని ఎందుకంటున్నామంటే... సంవత్సరంలో చాలా కాలం ఈ ప్రాంతమంతా మంచుదుప్పటి కప్పుకునే ఉంటుంది. ఎటువైపు చూసినా మంచు తప్పించి ఏమీ కనబడదు.ఇక్కడి ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు దాదాపుగా ఉండవు. సరైన రవాణా సౌకర్యాలుండవు. మంచు కారణంగా వర్షాలు సరిగా పడవు. పంటలు పండవు. ఆర్థికంగా వెనుకబాటు. వీటన్నింటినీ చూసి చలించిపోయారు ఇషితా ఖన్నా. వారి జీవితాల్లో సామాజిక, ఆర్థిక వెనుకబాటును పారద్రోలడానికి నడుం బిగించారు. “మార్పు ఎక్కడో రాదు... మనతోనే మొదలు కావాలి” అని గాంధీజీ చెప్పిన మాటలే ఆమెకు స్ఫూర్తినిచ్చాయి. ఎవరో వచ్చి ఆ ప్రాంతాన్ని మార్చాలి అనుకోకుండా... తానే ఆ పని ఎందుకు చేయకూడదు అని ఆలోచించారు. ఆ ఆలోచనల ఫలితమే స్పిటీ వ్యాలీ ప్రజల జీవితాల్లో అద్భుతమార్పు, ప్రగతి.

ఇషితా ఖన్నా

ఇషితా ఖన్నా


స్పిటీ వ్యాలీ

స్పిటీ వ్యాలీ


మార్పు అనేది అంత సులభంగా ఏమీ రాదు. అలాగే విజయం కూడా. ఎన్నో అవరోధాలు, అడ్డంకులు అధిగమిస్తేనే తప్ప అంతిమంగా విజయం దక్కదు. ఇషిత కూడా దీనికి మినహాయింపు కాదు. స్పిటీ లోయతో ఇషిత అనుబంధం 2000 సంవత్సరంలో మొదలైంది. డెహ్రాడూన్ లో పెరిగి, ముంబయిలోని టాటా ఇన్ స్టిట్యూట్ ఫర్ సోషల్ సైన్సెస్ నుంచి సోషల్ వర్క్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఇషిత... “సంప్రదాయ ఔషధాలు – వాటి ఉపయోగాలు” అనే అంశంపై జరిగిన ఓ సదస్సులో పాల్గొనడానికి మొదటిసారి ఈ వ్యాలీకి వచ్చారు. ఆ ప్రదేశం ఆమెకు ఎంతగానో నచ్చింది. సదస్సు నుంచి తిరిగి వెళ్లినా ఆమె మనసు మాత్రం అక్కడే ఉంది. దీంతో బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చారు... తన తదుపరి మజిలీ స్పిటీ వ్యాలీయే అని.

మ్యూజ్, స్టాగ్ (స్పిటీ ట్రాన్స్ హిమాలయన్ యాక్షన్ గ్రూప్), సీబక్ థోర్న్ సొసైటీ... ఈ మూడు ఎన్జీఓల సమాహారంగా ఎకోస్పియర్ అనే ఓ సంస్థను స్థాపించారు ఇషితా. దీని ప్రధాన లక్ష్యం... స్పిటీ వ్యాలీ ప్రజల సంప్రదాయాలను, విలువలను పరిరక్షిస్తూనే వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి, అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయాన్ని పొందే మార్గాలను అన్వేషించి వివరించడం. సంప్రదాయ ఆదాయ మార్గాలను కాదని, ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాల్లో వారికి దీర్ఘకాలిక/శాశ్వత ప్రాతిపదికన ఇవన్నీ సమకూరేలా చేయడం అంటే మాటలు కాదు.

అక్కడ పండే పంట పండించింది !

సీబక్ థోర్న్... స్పిటీలోయలో విరివిగా లభించే బెర్రీ జాతికి చెందిన ఓ పండు. ఈ పండులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఎన్నో విటమిన్లు, మినరల్స్, పోషకాలు, ఫాటీ యాసిడ్లు... ఈ ఒక్క పండు ద్వారా లభిస్తాయంటే అతిశయోక్తి కాదు. తన లక్ష్యాన్ని సాధించడానికి ఇషిత ఈ వండర్ బెర్రీనే ఉపయోగించుకున్నారు.


సీబక్ థోర్న్ పండు

సీబక్ థోర్న్ పండు


ఏ దేశమైనా, ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ మహిళల భాగస్వామ్యం చాలా అవసరం. ఈ విషయాన్ని గుర్తించిన ఇషిత... మహిళలను చైతన్యవంతం చేయడం ద్వారానే తన లక్ష్యాన్ని సాధించింది. సీబక్ థోర్న్ పండును ఉపయోగించి ఎకోస్పియర్ ద్వారా టీ పౌడర్ వంటి వివిధ రకాల ఉత్పత్తులను తయారుచేశారు. స్థానిక చేతివృత్తులను గుర్తించి, వాటిని అభివృద్ధి చేశారు. వారు చేసిన ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారు. హిమాలయాల్లో మాత్రమే మనం చూడగలిగే థాంగ్ కాస్ (సిల్క్ కాన్వాస్ పై చిత్రాలను వేయడం), జామా(మడ్ క్రాఫ్ట్), లింగ్జే(సంప్రదాయ పద్ధతుల్లో శాలువాల తయారీ)... వీటి ద్వారా మహిళలకు శాశ్వత ఆదాయ మార్గాన్ని చూపించగలిగారు. వీరు తయారు చేసిన ఉత్పత్తులను సెరింగ్ అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇక్కడే వారికి పెద్ద సవాల్ ఎదురైంది.

వీరు తయారుచేసిన టీపొడి, ఇతర ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి, అమ్మడానికి స్థానికంగా ఉన్న హోటళ్లు, వ్యాపారస్తులు ఎవరూ ముందుకురాలేదు. ఇదీ తమకు లాభమే చేసింది అంటారు ఇషిత. వారు నిరాకరించడంతో... తప్పనిసరి పరిస్థితుల్లో ఎకోస్పియర్ మార్కెటింగ్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఇప్పుడు మా ఉత్పత్తులను మేమే మార్కెటింగ్ చేసుకుంటున్నామని ఎంతో గర్వంగా చెబుతారు అక్కడి ప్రజలు.

ఎకోస్పియర్ సంస్థ వెబ్ సైట్

ఎకోస్పియర్ సంస్థ వెబ్ సైట్


తర్వాత లక్ష్యం పర్యావరణం. ఈ లోయ అంతా మంచుతో ఉంటుంది కాబట్టి వేడి కోసం ఇక్కడి ప్రజలు అధిక మొత్తంలో విద్యుత్ ను వినియోగించేవారు. ఆహారపదార్ధాల తయారీకి వంట చెరకును చాలా ఎక్కువగా వినియోగించేవారు. దీన్ని పరిశీలించిన ఇషిత... “విద్యుత్, వంటచెరకు వినియోగాన్ని తగ్గించగలిగితే... ఇంధనాన్ని పొదుపుచేయవచ్చు, చెట్లను కాపాడవచ్చు. తద్వారా భూతాపాన్ని తగ్గించవచ్చు. మంచు కరగకుండా నివారించవచ్చు... ఫలితంగా వర్షాలు సకాలంలో కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి” అని భావించారు. బాగా ఆలోచించి, స్పిటీ వ్యాలీలోని ప్రజల ఇళ్ల నిర్మాణశైలిలో మార్పులు చేసి, కొత్తగా నిర్మించుకునేందుకు తోడ్పాటునందించారు ఇషిత. కొత్త ఇళ్లు అంత త్వరగా చలిని లోనికి రానీయవు. అలాగే సాధారణ విద్యుత్ బదులుగా సౌర విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించి ఆ దిశగా అందరిలో మార్పు తీసుకువచ్చారు ఇషితా ఖన్నా. ఈ చర్చల వల్ల ప్రజల్లో మంచు, చలి కారణంగా వచ్చే అలర్జీలు, వ్యాధులు కూడా తగ్గుముఖం పట్టాయి. ఆరోగ్య, జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి.

జంతువులను వేటాడటం కాదు... వాటిని సంరక్షించి, వచ్చే పర్యాటకుల ద్వారా ఆదాయం పొందవచ్చని ప్రజలకు వివరించారు. ఆ దిశగా వారిలో చైతన్యం తీసుకువచ్చారు. ఇవన్నీ ఒక్కరోజులో సాధ్యం కాలేదు. ఎన్నో సంవత్సరాల కృషి, పట్టుదల, ఓర్పు... అంతకుమించిన అంకితభావం కలగలిస్తేనే ఈ సామాజిక, ఆర్థిక మార్పు సాధ్యమైంది.

image


మీరు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు లేదా సమస్య ఏమిటి అని ప్రశ్నిస్తే... ''ఇది చాలా మారుమూల ప్రదేశం. ఇక్కడికి రావాలన్నా, ఇక్కడినుంచి పోవాలన్నా అంత సులభం కాదు. అలాంటిది ఇక్కడికి వచ్చి ఏదో చేయాలని అనుకున్నాం. బాగానే ఉంది. కానీ స్థానిక నాయకత్వం సహకారం లేకపోతే మేము ఏమీ చేయలేము అని మాకు తెలుసు. అందుకే ముందుగా నాయకుల గురించే తెలుసుకోవాలనుకున్నాం. మేం ఎవరిని కదిపినా “నోనోను కలవండి. ఆయన మీకు సాయం చేస్తారు” అనేవారు. నోనో అక్కడి రాజు పేరు. అదృష్టం ఏంటంటే నోనో చాలా గొప్ప వ్యక్తి. ఈ లోయను అభివృద్ధి చేయాలని, ప్రజల్లో మార్పు తీసుకురావాలని ఆయన కూడా తపించేవారు. మేం కూడా ఆయన ఆలోచనలతోనే అక్కడ అడుగుపెట్టడం వల్ల మా పని మరింత సులభమైంది'' అంటారు ఇషితా ఖన్నా.

“ఇక్కడి అననుకూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఎంతో కష్టపడి, ఓర్పుతో ఇషితా బృందం మా ప్రజల్లో తీసుకువచ్చిన మార్పు అనితర సాధ్యం, అసమానం” అంటారు నోనో.

అవార్డులు, రివార్డులు

1. మహిళలను ఆర్థికంగా పరిపుష్టులను చేసినందుకుగాను ఇషితా ఖన్నా 2010లో సీఎన్నెన్ ఐబీఎన్ ఛానల్ వారిచే రియల్ హీరోస్ అవార్డు అందుకున్నారు.

2. స్పిటీ లోయలోని మొత్తం 66 గ్రామాలకు గాను 55 గ్రామాల్లో ప్రజలు ఎకోస్పియర్ తోడ్పాటుతో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసి తమ రోజువారీ ఆదాయంలో సుమారుగా 50% పెరుగుదలను చూస్తున్నారు. ఈ మార్పును గుర్తించిన వర్జిన్ హాలిడేస్ సంస్థ నుంచి రెస్పాన్సిబుల్ టూరిజమ్ అవార్డును సొంతం చేసుకున్నారు.

3. 2009లో సియెర్రా క్లబ్ వారిచ్చే గ్రీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ లైవ్లీహుడ్ ఎచీవ్ మెంట్ అవార్డును ఇషిత అందుకున్నారు. ప్రకృతిని, సంస్కృతిని పరిరక్షించేందుకు తీసుకున్న చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.

4. ప్రిన్స్ ఛార్లెస్ చేతుల మీదుగా 2009లో యాష్ డెన్ అవార్డు

5. ఎకో టూరిజమ్ ను ప్రోత్సహించినందుకు 2008లో వైల్డ్ ఆసియా రెస్పాన్సిబుల్ టూరిజమ్ అవార్డు పొందారు.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి

Our Partner Events

Hustle across India