యూఎస్‌లో ఎంఎస్ చేసి ఫోటోగ్రాఫరైన అమర్ రమేష్

హాబీయే వ్యాపారమైందితనపై తనకు ఉన్న నమ్మకమే పెద్ద ఉద్యోగాన్ని వదులుకునేలా చేసిందిపెళ్లి ఫోటోల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చిపెట్టిందిఒక్కో పెళ్లికి రూ.2 లక్షలు ఛార్జ్ చేసే స్థాయికి

19th Apr 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

ఫోటోగ్రఫీపై ఉన్న మక్కువే జీవితాశయంగా మారింది. అమెరికా నుంచి ఇండియా తీసుకొచ్చేసింది. ఆయనే అమర్ రమేష్. మిత్రులు DSLRతో ఫోటోలు తీయమన్నప్పుడు అదే తన జీవితం అవుతుందని అమర్ రమేష్ అనుకోలేదు. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్‌లో మాస్ట్రర్స్ డిగ్రీ చేసి అమెరికాలో పనిచేస్తున్న అమర్ ఎక్కడికెళ్లినా కెమెరా పట్టుకెళ్లేవారు. ఫోటోగ్రాఫర్‌గా స్థిరపడాలనుకునేవారు. అందుకే సియాటిల్‌లో ఉన్న ఒకరిద్దరూ ఫోటోగ్రాఫర్ల దగ్గర అప్రెంటిస్ కూడా చేశారు. వారంతా అవార్డులు పొందిన ఫోటోగ్రాఫర్లు కావడంతో పని బాగానే అబ్బింది.

అమర్ రమేష్

అమర్ రమేష్


ఉద్యోగం వదిలేసి ఇండియా పయనం

స్థిరమైన ఉద్యోగానికి రాజీనామా చేయడమంటే కష్టమైన నిర్ణయమే. వృత్తిపరంగా ఇంజనీరు, ప్రవృత్తి పరంగా ఫోటోగ్రాఫర్ అయిన అమర్… తన ప్రవృత్తినే నమ్ముకోవాలనుకున్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా వెన్నుదన్నుగా నిలిచింది. బాస్‌తో ఉన్న సత్సబంధాలు ధైర్యాన్నిచ్చాయి. ఏమైనా తేడా వస్తే మళ్లీ ఇదే ఉద్యోగానికి రావచ్చని బాస్ భరోసా ఇచ్చారు. అయితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదని అమర్ రమేష్ చెబుతారు.

అమర్ రమేష్ 2010లో చెన్నై వచ్చేశారు. అది ఆయన పెరిగిన నగరం. ఇష్టమైన ప్రదేశం. ఫోటోగ్రఫీ రంగంలో పాశ్చాత్య దేశాలకు ఇండియాకు తేడా ఉంది. అక్కడ ఉన్నంత మేటి ఫోటోగ్రాఫర్లు ఇక్కడ లేరని ఆయన అభిప్రాయం.అదే రమేష్‌లో ధైర్యం నింపింది. ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్లు తీసే జీవం లేని ఫోటోలతోనే జనం ఇంతకాలం సరిపెట్టుకుంటూ వచ్చారు. చూడంగానే ఆకర్షణీయంగా కనిపించే ఫోటోలు తీసే వ్యక్తులు, సంస్థల కొరతను అమర్ రమేష్ బాగానే ఉపయోగించుకున్నారు. రమేష్ అమెరికాలో చాలా పెళ్లిళ్లకు ఫోటోలు తీశారు. ఆ అనుభవంతోనే చెన్నై వచ్చిన తర్వాత వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌గా మారిపోయారు. అమర్ రమేష్ ఫోటోగ్రఫీ సంస్థ అవతరించింది - అదే ‘స్టూడియో-A’

image


సోషల్ మీడియా ప్రభావం

అమర్ కొన్ని పెళ్లిళ్లకు ఫోటోలు తీశారు. ఆన్‌లైన్లో పెట్టారు. ఆ మంత్రం బాగానే పనిచేసింది.ఫోటోలు చూసి మచ్చటపడిన వారంతా అమర్‌ను సంప్రదించడం మొదలెట్టారు. అలా కొత్త క్లయింట్స్ దొరికారు. సోషల్ మీడియా కారణంగా మార్కెటింగ్‌కు పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. పెళ్లిళ్ళను కళ్లకు కట్టినట్లు ఫోటోలు తీయడమే అమర్ ప్రత్యేకత. అమర్ బ్లాగ్‌తో పాటు ఫేస్ బుక్‌లో ఫోటోలు చూసిన వారంతా తమ పెళ్లిళ్లకు ఫోటోలు తీయాలని ఆహ్వానించారు.

image


ఇల్లాలి ప్రోత్సాహం

ఫోటోగ్రఫీ సంస్థ పెట్టిన తొలి రోజు నుంచీ అమర్ భార్య ఆయనకు చేదోడువాదోడుగా ఉన్నారు. అలసట తెలియకుండా..సులభంగా పనిచేసే పద్ధతులు అమర్, ఆమె దగ్గరే నేర్చుకున్నారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆమె సహకారం అందించారు.

మంచి టీమ్

2010లో స్టూడియో ప్రారంభించినప్పటి నుంచి అమర్ టీమ్ వృద్ధి చెందుతూ వస్తోంది. 2011లో ఒక ఎడిటరే ఉండేవారు. ఇప్పుడు నలుగురు ఎడిటర్లు, ఐదుగురు ఫోటోగ్రాఫర్లు, ఒక క్లయింట్ రిలేషన్ మేనేజర్,ఒక అకౌంటెంట్, డ్రైవర్ .. ఇంతమంది ఉన్నారు. అందరూ తనకు ప్రత్యేకమేనంటారు అమర్. వృత్తిలో తాను దూసుకుపోయేందుకు అందరి సహకారం సమానంగా ఉందంటారు. వారంతా చేతులు కలపడం తన అదృష్టంగా భావిస్తానంటారు.ఒకరు ఒక పని మాత్రమే చేసే పద్ధతి వద్దంటారు అమర్. ఎడిటర్లు కూడా ఫోటోలు తీయాల్సిందే.. ఫోటోగ్రాఫర్లు ఇమేజ్ ఎడిటింగ్ నేర్చుకోవాల్సిందే. తిండి గడిచేందుకు పెళ్లి ఫోటోలు తీసినా ఇతర ప్రాజెక్టులపై కూడా అమర్ దృష్టి సారిస్తున్నారు. ఒక ఫిట్‌నెస్ కంపెనీకి ఫోటోలు, వీడియోలు తీసినప్పుడు ఎంతో సంతృప్తినిచ్చిందని అమర్ చెబుతారు.

అమర్ టీం

అమర్ టీం


అమర్ రమేష్ ఫోటోగ్రఫీ ప్రత్యేక ఏమిటి ?

పెళ్లి ఫోటోలు,వీడియోలు తీయడంలో వృత్తిపరమైన నైపుణ్యం ఉన్న వ్యకులే అమర్ రమేష్ సంస్థకు బలం. వినియోగదారులతో మాట్లాడే తీరులోనూ, ఫోటోలను అందంగా తీర్చిదిద్దడంలోనూ సంస్థ అందరి నమ్మకం సంపాదించింది. వివాహ వేడుకలకు ఫోటోలు,వీడియోలు తీయడంతో పాటు జంటలకు,కాన్సెప్ట్ షూట్‌లకు ఔట్ డోర్ షూటింగ్ కూడా చేస్తున్నారు. కళ్లు చెదిరిపోయే ఫోటోలు తీయడం అమర్ రమేష్ ప్రత్యేకత. పెళ్లి అంటేనే అందమైన దృశ్యకావ్యం. వీలైనన్ని పెళ్లి ఫోటోలు తీయాలన్నది అమర్ రమేష్ స్వప్నం. ప్రపంచంలోని ఏ మూలకైనా వచ్చి ఫోటోలు తీస్తానంటున్నారు అమర్ రమేష్. అయితే విమానం, రైలు, బస్సు ఏదోక ప్రయాణ సాధనం ఉండాలన్నది ఆయన షరతు.

అందమైన ఫోటోలు తీయడమెలా ?

పెళ్లి ఫోటోలు తీసేందుకు పెళ్లికి చాలా రోజుల ముందు నుంచే ప్లాన్ చేయాలంటారు రమేష్. క్లయింట్‌తో తొలి సంభాషణలోనే వారికి ఎలాంటి ఫోటోలు కావాలో తెలుసుకుంటారు. ప్రతీ పెళ్లిలో ఒక ప్రతేకత ఉంటుంది. పెళ్లి పెళ్లికి జంటల ప్రాధమ్యాలు మారతాయి. వారి అవసరాలు అర్థం చేసుకుంటే మంచి ఫోటోలు వస్తాయని రమేష్ అంటారు. కొన్ని పెళ్లిళ్లకు చాలా దూరం ప్రయాణించాల్సి రావచ్చు. అందుకే పెళ్లి ఫోటోలు తీసే ముందు రమేష్ బృందం సమావేశమై కార్యాచరణను రూపొందిస్తుంది. ఒక సందర్భంలో సంగీత్ జరిగే చోటే ప్రత్యక్ష ప్రసారం కావాలన్నారు. రమేష్ అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. లైవ్ వీడియో చూసిన తర్వాత అందరూ మెచ్చుకున్నారు.

రమేష్ బృందం ఇంతవరకూ 200 పెళ్లిళ్లకు ఫోటోలు, వీడియోలు తీసింది. అందులో ఖర్చుకు వెనుకాడని హై ప్రొఫైల్ కుటుంబాలేఎక్కువ. సినిమా వాళ్లు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, సెలబ్రిటీల పిల్లల పెళ్లిళ్లకు ఇప్పుడు రమేష్‌నే పిలుస్తున్నారు. రమేష్ ఒక్కో పెళ్లికి కనీసం రెండు లక్షల రూపాయలు తీసుకుంటారు.

image


భవిష్యత్ ప్రణాళిక

రెండు వ్యాపారాలపై దృష్టి పెట్టాలని అమర్ భావిస్తున్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తన వెడ్డింగ్ ఫోటోగ్రఫీని విస్తరించాలనుకుంటున్నారు. పెళ్లిళ్ల ఫోటోగ్రఫీ పనులు నెలల ముందే బుక్ అయిపోతున్నందున ఆఖరి నిముషంలో అడిగే వారిని తిరస్కరించాల్సి వస్తోంది. అదే సమయంలో నాణ్యమైన ఫోటోలు తీసే ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లను అమర్ రమేష్ ప్రోత్సహిస్తున్నారు. ఈ రెండింటిని కలిపి పని చేస్తే.. వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగపరుచుకోవచ్చని రమేష్ నమ్ముతున్నారు. అప్పుడు తను వెళ్లకపోయిన తన సంస్థ వైపు నుంచి అందమైన ఫోటోలు తీసే అవకాశం ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు.

పెళ్లి ఫోటోలు , వీడియోలు తీయడం, ఎడిటింగ్, డిజైనింగ్, ఈవెంట్ ఫోటోగ్రఫీ లాంటి పనులు స్టూడియో -ఏ ప్రత్యేకత. విజన్ పబ్లిసిటీ ఒక్కటే చేయాల్సి ఉందని అమర్ అంటారు. ప్రీమియం కిడ్స్ ఫోటోగ్రఫీ ఆయన తదుపరి లక్ష్యం. పిల్లలు, కుటంబ ఫోటోగ్రఫీకి మంచి మార్కెట్ ఉందని ఆయన అంటారు. ఫోటోలు తీసే సమయంలో అందరినీ కలిసి వారితో మాట్లాడమే పనిలో తనకు ప్రేరణ ఇస్తుందంటారు.తను తీసిన ఫోటోలను వాళ్లు సంవత్సరాల తరబడి దాచుకోవడమే తన విజయ రహస్యమని అమర్ రమేష్ చెబుతున్నారు. పెళ్లి ఫోటో జీవితకాల జ్ఞాపకం కదా మరి !

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి

Our Partner Events

Hustle across India