నేను ఒకవేళ బ్యాట్ పట్టకుంటే.. కాలికి గజ్జె కట్టేదాన్ని..!!

టీమిండియా విమెన్ టెండూల్కర్ మిథాలీ రాజ్ మనసలో మాట

8th May 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close


ఆ అమ్మాయి తండ్రి ఎయిర్‌ ఫోర్స్ ఉద్యోగి. క్రమశిక్షణకు పెట్టింది పేరు. తల్లి, తమ్ముడు కూడా క్రమశిక్షణతో మెలిగేవారు. కానీ ఆ అమ్మాయి రూటే సెపరేటు. బద్దకం, సోమరితనం వెరసి అచ్చం ఆ అమ్మాయిలా ఉంటుంది. ఉదయం ఎనిమిదన్నరకు స్కూల్ లో మొదటిగంట మోగేది. కానీ తను మాత్రం ప్రపంచం తలకిందులైనా ఎనిమిది దాటితేగానీ బెడ్ దిగేది కాదు. అప్పటికే తమ్ముడు స్కూల్ కి రెడీ అయిపోయేవాడు. కూతురి తీరుతో విసిగిపోయిన తండ్రి.. ఆమె సోమరితనాన్ని దూరం చేసేందుకు ఓ నిర్ణయం తీసుకున్నాడు. కూతుర్ని క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. రోజూ ఉదయం కొడుకు, కూతుర్ని అకాడమీకి తీసుకెళ్లడం.. తీసుకురావడం డ్యూటీ అయిపోయింది. ఆ అమ్మాయి తమ్ముడు అప్పటికే స్కూల్ లెవర్ టోర్నమెంట్లలో ఆడేవాడు. అకాడమీలో జాయిన్ అయన కొత్తలో ప్రాక్టీస్ పక్కనబెట్టి హోం వర్క్ చేసుకునేది. తండ్రికి విషయం తెలిసి మందలించడంతో ఇక తప్పదనుకుని బ్యాట్ అందుకుంది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ మహిళా క్రికెట్ ప్రపంచంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఆ అమ్మాయే మిథాలీ రాజ్.

బ్యాట్ పట్టుకున్నాక మిథాలీకి క్రికెటే సర్వస్వమైపోయింది. క్రికెటే జీవితం, జీవితమే క్రికెట్ అనుకునే స్థాయికి చేరింది. ఓర్పు, నేర్పుతో ఆడుతూ గ్రౌండ్ ను దున్నేయడం మొదలుపెట్టింది. ఆమె ఆట తీరు చూసి కొద్దికాలంలోనే చాలామంది అభిమానులైపోయారు. విమెన్ క్రికెట్లో ఎన్నో రికార్డులు, మరెన్నో చారిత్రక విజయాలకు కారణమైంది మిథాలీ. ఇంటర్నేషనల్ లెవల్లో ఇండియన్ విమెన్ క్రికెట్ టీంకు ఇంత గొప్ప పేరొచ్చిందంటే.. దాని వెనుక మిథాలీ అకుంఠిత దీక్ష, శ్రమ దాగి ఉంది. ఆమె ఆట తీరు, విజయాలు.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అనతి కాలంలోనే స్టార్ క్రికెటర్ గా ఎదిగింది. ఇండియన్ విమెన్ క్రికెట్ టీం టెండూల్కర్ గా పేరు తెచ్చుకుంది. భారత మహిళా క్రికెట్ లో సంచలనం సృష్టించి ప్రపంచ దిగ్గజ క్రికెటర్ల సరసన నిలిచింది.

క్రికెట్ బ్యాట్ పట్టుకోవడానికి ముందు మిథాలీ భరత నాట్యం నేర్చుకునేది. గొప్ప నృత్యకారిణి కావాలన్నది ఆమె కోరిక. దేశ, విదేశాల్లో నాట్య ప్రదర్శనలిచ్చి వేల మంది అభిమానాన్ని చూరగొనాలనుకునేది. అందుకే చాలా చిన్నతనం నుంచే స్టేజ్ పర్ఫార్మెన్సులు ఇవ్వడం మొదలుపెట్టింది. వేదికపై ఆమె నాట్యం చేస్తుంటే చూస్తున్న వారు కళ్లు తిప్పుకోలేకపోయేవారు. మిథాలీ ఎప్పుడైతే బ్యాట్ పట్టుకుందో అప్పటి నుంచి నృత్యానికి దూరమవుతూ వచ్చింది. తీరిక దొరికినప్పుడల్లా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేది. టోర్నమెంట్లలో ఆడటం మొదలెట్టాక టూర్ల కారణంగా నాట్యానికి దాదాపు గుడ్ బై చెప్పేసింది. మిథాలీ డ్యాన్స్ ప్రాక్టీస్ ను నిర్లక్ష్యం చేస్తోందని గ్రహించిన ఆమె గురువు.. క్రికెట్, నాట్యం ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోమన్నారు. బాగా ఆలోచించిన మిథాలీ క్రికెట్ నే ఫ్యూచర్ గా ఎంచుకుంది. తన జీవితం మైదానానికి అంకితం అని నిర్ణయించుకుంది.

క్రికెటర్ కాకపోయుంటే ఏమయ్యేవారన్న ప్రశ్నకు మిథాలీ ఠక్కున చెప్పే సమాధానం డ్యాన్సర్. నిజానికి క్రికెట్, నాట్యంలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వచ్చిన సమయంలో ఆమె అరంగేట్రానికి కేవలం రెండు అడుగుల దూరంలో ఉంది. అందుకే ఆ సమయంలో చెప్పలేనంత మానసిక సంఘర్షణ అనుభవించింది. నృత్యకారిణిని కాలేకపోయినా బ్యాటింగ్ తో క్రికెట్ గ్రౌండ్లో బౌలర్లు, ఫీల్డర్లతో బాగానే డ్యాన్స్ చేయిస్తానంటూ నవ్వుతూ చెబుతుంది మిథాలీ.

image


క్రికెట్‌ మైదానంలో రికార్డుల మోత మోగించిన మిథాలీని అందుకోడం బహుశా మరో క్రికెటర్ కు సాధ్యం కాదేమో. ఇంతటి విజయానికి కారణం తండ్రి దొరై రాజు అని గర్వంగా చెప్పుకుంటుందామె. కూతురు అతి చిన్న వయసులోనే భారత మహిళా క్రికెట్ టీంలో స్థానం సంపాదించుకోవాలని కోరుకునే వారు ఆమె తండ్రి. మిథాలీని గొప్ప క్రికెటర్ ను చేసేందుకు ఆయన ఎంతో శ్రమించారు. తండ్రీ కూతుళ్ల కృషి ఫలితంగా 14ఏళ్ల వయసులో ఇండియన్ టీం స్టాండ్ బై ప్లేయర్ గా అవకాశం దక్కించుకున్నారు మిథాలీ. 16 ఏళ్ల వయసులో తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ కు ఎంపికైంది. 1999 జూన్ 26న మిల్టన్ కీనెస్ లోని క్యాంప్ బెల్ పార్క్ లో జరిగిన ఈ మ్యాచ్ లో మిథాలీ, రేష్మా గాంధీతో కలిసి ఓపెనర్ గా బరిలో దిగారు. ఈ మ్యాచ్ లో 114 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచింది మిథాలీ. ఆ మ్యాచ్ లో 161 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇండియన్ విమెన్ క్రికెట్ టీంకు మరో స్టార్ దొరికిందని బోర్డు ఆనందం వ్యక్తం చేసింది. ఆ తర్వాత మిథాలీ వెనుదిరిగి చూసుకోలేదు. వన్డే ఫార్మాట్ లో 5వేల పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది మిథాలీ రాజ్. ఇప్పటి వరకు వన్‌ డే క్రికెట్‌లో 5000 కన్నా ఎక్కువ పరుగులు చేసిన మహిళా క్రికెటర్లు ఇద్దరు మాత్రమే.

2002లో మిథాలీ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడింది. జనవరి 14 నుంచి 17 తేదీల మధ్య లక్నోలో జరిగిన ఈ మ్యాచ్‌లో మిథాలీ రాణించలేకపోయింది. జీరో స్కోర్ కే పెవిలియన్ బాట పట్టింది. ఈ వైఫల్యంతో కుంగిపోకుండా మరింత కష్టపడి ఆడటం మొదలుపెట్టింది. మహిళా టెస్ట్ క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

మిథాలీ క్రికెట్‌ కెరియర్ నల్లేరు మీద నడకలా సాగలేదు. ఆమె ఆడటం మొదలు పెట్టిన రోజుల్లో విమెన్ క్రికెట్‌ టోర్నమెంట్లు కూడా జరుగుతాయన్న విషయం చాలా మందికి తెలియదు. నిజానికి మిథాలీ టీంలో చోటు సంపాదించుకునే వరకు కూడా ఇండియన్ విమెన్ క్రికెట్ టీంలో స్టార్ ప్లేయర్ ఎవరు? ఆమె ఎలా ఉంటుంది? సాధించిన రికార్డులేంటి? ఈ విషయాలేవీ ఆమెకు తెలియదు. సీనియర్ టీంలో ప్లేస్ దొరికిన తర్వాతే మిథాలీకి శాంతా రంగస్వామి, డయానా ఎడుల్జీ గురించి తెలుసుకునే అవకాశం దొరికింది. అప్పటికి దేశంలోని ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి ఇండియన్ మెన్స్ క్రికెట్ టీంలో పాత, కొత్త క్రికెటర్ల పేర్లు తెలుసు.

మహిళా క్రికెట్‌కు ఇప్పుడు ఉన్నంత ప్రోత్సాహం గతంలో ఉండేది కాదంటారు మిథాలీ. అప్పట్లో మహిళా క్రికెటర్లు ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ల వెంట ఉన్న పెద్ద కిట్ బ్యాగ్ చూసి హాకీ ఆడేందుకు వెళ్తున్నారా అని అడిగేవారట. కాదు మేం క్రికెట్ ప్లేయర్లమని చెబితే ఆశ్చర్యపోయేవారట. మహిళలు కూడా క్రికెట్‌ ఆడుతారా? విమెన్స్‌ క్రికెట్‌లో టెన్నిస్‌ బాల్‌ ఉపయోగిస్తారా? మహిళల కోసం ప్రత్యేక నియమాలున్నాయా అని వింత వింత ప్రశ్నలు అడిగేవారట. నిజానికి మెన్స్, విమెన్స్ క్రికెట్ ఫార్మాట్ లలో ఎలాంటి మార్పు ఉండదు. ఒకే గ్రౌండ్, ఒకే రకమైన నిబంధనలు. వాళ్లతో సమానంగా టఫ్ ఫైట్ అయినా మహిళా క్రికెట్ అంటే ఇప్పటికీ చిన్నచూపే అంటారు మిథాలీ.

అబ్బాయిలతో కలిసి ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు ఎన్నో సూటిపోటి మాటలను భరించానంటారు మిథాలీ. తను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బౌలర్ ను బాల్ నెమ్మదిగా వెయ్యమని, అమ్మాయికి దెబ్బ తగులుతుందని ఆటపట్టించేవారట. ఇలాంటి ఎన్నో పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంది మిథాలీ. ప్రతి సవాల్ ని స్వీకరించి ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంది. తన ఆటతీరు, జట్టు విజయాలతో దేశంలో మహిళా క్రికెట్ కు గౌరవప్రదమైన స్థానం దక్కేలా చేసిన ఘనత మిథాలీదే.

మిథాలీ క్రికెట్‌ ఆడటం మొదలు పెట్టినప్పుడు తనకంటూ పెద్ద లక్ష్యాలేం లేవు. అప్పటికి ఇండియన్‌ టీంలో స్థానం సంపాదించడమే ఆమె టార్గెట్. అయితే టీంలో ప్లేస్ దొరికాక దాన్ని సుస్థిరంచేసుకోవాలన్నదే ఆమె లక్ష్యంగా మారింది. జట్టులో స్థానం కన్ఫమ్ అయ్యాక కెప్టెన్‌ కావాలన్న లక్ష్యం ఏర్పరుచుకుంది. మిథాలీకి సారథ్య పగ్గాలు అంత ఆషామాషీగా దక్కలేదు. అందుకోసం అహర్నిశలు శ్రమించింది. కెప్టెన్సీ కావాలంటే అద్భుతమైన ఆటతీరు కనబరచాలి. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలి. ఈ విషయం మిథాలీకి బాగా తెలుసు. అందుకే ప్రతి మ్యాచ్ లోనూ కీ ప్లేయర్ గా మారింది. అలా కెప్టెన్సీ బాద్యతలు దక్కించుకుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ లక్ష్యం వైపు అడుగులేసింది. హోదాతో పాటు బాధ్యతలు పెరిగాయి. అయినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న మాటను ఎప్పుడు మర్చిపోకుండా ఇప్పటికీ తన ఆటతీరును మెరుగుపరుచుకుంటూనే ఉంది.

క్రికెట్ శ్వాసగా బతుకుతున్న మిథాలీ తన జీవితంలో అద్భుతమైన విషయాలను, ఇంత వరకు ఎవరికీ తెలియని సంగతులను తొలిసారి ఇతరులతో పంచుకుంది. 2016 మే 3వ తేదీన తాను తొలిసారి క్రికెట్ బ్యాట్ పట్టుకున్న అకాడమీలో జరిగిన కార్యక్రమంలో మిథాలీ పలు అంశాలపై తన అభిప్రాయాలను మనతో పంచుకుంది.

image


ఇన్‌స్పిరేషన్‌

డాడీ ప్రోత్సాహంతోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టా. నేను చిన్న వయసులోనే నేను భారత్‌ తరఫున ఆడాలన్నది ఆయన కోరిక. భారీ స్కోర్ చేసినప్పుడల్లా డాడీకి ఫోన్‌ చేసి చెప్తాను. ఆయన చాలా సంతోషిస్తారు. ఆ సంతోషమే నా ఇన్‌స్పిరేషన్. డాడీని సంతోష పెడుతున్నానన్న ఆలోచనే చెప్పలేనంత ఉత్సాహాన్నిస్తుంది.

అమ్మ గురించి

అమ్మకు క్రికెట్ గురించి అంతగా తెలియదు. అయినా నా కెరియర్‌ లో అమ్మది కీ రోల్. నా కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసింది. అమ్మను సలహా అడిగే ఏ నిర్ణయమైనా తీసుకుంటాను. ఎలాంటి సమస్య ఎదురైనా మమ్మీ దానికి పరిష్కారం చూపుతుంది. అందుకే ఎక్కడ ఉన్నా సమస్య ఎదురైనప్పుడు మా మదర్ కు ఫోన్‌ చేస్తాను.

విమర్శలు

2013లో మిథాలీ కెప్టెన్సీలో ఇండియన్ విమెన్స్‌ క్రికెట్‌ టీం సూపర్‌ సిక్స్‌ కు క్వాలిఫై కాలేకపోయింది. అప్పుడు డాడీ కోపంతో ఊగిపోయారు. నా ఆటతీరును తీవ్రంగా విమర్శించారు. చేతకానప్పుడు కెప్టెన్సీ వదిలేయడమే బెటర్ అన్నారు. కొందరైతే రిటైర్మెంట్ తీసుకోమని సలహా కూడా ఇచ్చారు. నిజానికి మా డాడీ గొప్ప విమర్శకుడు. ఆయన విమర్శల్లోంచి పాజిటివ్ అంశాలను తీసుకుంటాను. క్రికెట్లో ఓ స్థాయి గుర్తింపు వచ్చాక విమర్శ అనేది చాలా అవసరం. లేకపోతే నిర్లక్ష్యం పెరుగుతుంది. అయితే ప్రతి విషయాన్నీ క్రిటిసైజ్ చేసే వాళ్లుంటారు. అలాంటి వారిని పట్టించుకోకూడదు. ప్రతి ఒక్కరినీ మెప్పించడం సాధ్యం కాదు కదా.

మహిళా క్రికెట్‌లో రాజకీయాలు

భారత మహిళా క్రికెట్‌ టీం లోనూ చాలా విషయాలపై రాజకీయం చేస్తుంటారు. మిగతా రంగాల్లాగే మహిళా క్రికెట్‌ లోనూ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. విమెన్ క్రికెట్‌ గురించి మీడియా పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి విషయాలు బయటకు రావు. నీచ రాజకీయాల కారణంగా ప్రతిభ ఉన్న మహిళా క్రికెటర్లు టీంలో స్థానం సంపాదించుకోలేకపోతున్నారు. మానసిక స్థైర్యం ఉన్నవాళ్లే ఇలాంటి రాజకీయాల నుంచి తమను తాము రక్షించుకోగలుగుతారు. బలహీనులు బలైపోతారు.

విజయానికి అర్థం

ప్రతికూల పరిస్థితుల్లోనూ స్థిరంగా, ప్రశాంతగా ఉండి లక్ష్యాన్ని సాధించడమే విజయం. క్లిష్ట పరిస్థితుల్లోనూ టీం కోసం పోరాడటమే అసలైన విజయం. వ్యక్తిగత ప్రదర్శన ఎంత చెత్తగా ఉన్నా, టీం కెప్టెన్‌గా మిగతా ఆటగాళ్లను ప్రోత్సహించి వాళ్లతో బాగా ఆడించగలగాలి. కెప్టెన్ గా అదే నా విజయం అని భావిస్తాను.

ఇప్పటి వరకు సాధించిన అతిపెద్ద విజయం

నిలకడ. నేను సాధించిన అతిపెద్ద విజయం ఇదే. వన్డే ఫార్మాట్‌లో 49 శాతం సగటుతో 5వేల కన్న ఎక్కువ పరుగులు సాధించడానికి కారణం నిలకడగా ఆడటమే.

సచిన్‌ టెండుల్కర్‌తో పోల్చడం

జనం నన్ను మహిళా టెండూల్కర్ అంటున్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. క్రికెట్‌ చరిత్రలో టెండూల్కర్ గురించి, ఆయన సాధించిన రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. సచిన్ ఓ మహోన్నతమైన ఆటగాడు. అంత గొప్ప ప్లేయర్ తో పోల్చినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. కానీ జనం నన్ను నా ఆటతీరు, రికార్డులతోనే పేరుతోనే గుర్తించాలని కోరుకుంటా.

గెలుపు మంత్రం

కష్టపడనిదే విజయం సాధించలేం. అమ్మాయిలు మహిళా క్రికెట్ టీంలో స్థానం సంపాదించుకోవాలంటే ఏళ్ల తరబడి కష్టపడాలి. ప్రాధాన్యతలను గుర్తిస్తే సగం విజయం సాధించినట్లే. చాలా మందికి తమ ప్రియారిటీలేంటో తెలియదు. ముందు వాటిని గుర్తించాకే లక్ష్యంపై దృష్టి పెట్టాలి.

ఫేవరెట్ మేల్ క్రికెటర్‌

మేల్ క్రికెటర్లలో ఎవరూ నన్ను అంతగా ప్రభావితం చేయలేదు. అయితే రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ టెండూల్కర్‌లను చూస్తే ఆత్మస్థైర్యం, మ్యాచ్‌ కు సన్నద్దమయ్యేందు అవసరమైన ప్రేరణ లభిస్తుంది.

ఫేవరెట్ విమెన్ క్రికెటర్

నీతూ డేవిడ్‌ నా ఆల్‌ టైం ఫేవరెట్‌ ప్లేయర్‌. ఆమె నన్నెంతగానో ప్రభావితం చేసింది. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నరైన నీతూ చాలాకాలం పాటు భారత్‌ తరఫున ఆడారు. టీం కష్టాల్లో ఉన్నప్పుడల్లా కెప్టెన్‌గా నా దృష్టి నీతూ డేవిడ్‌ పైనే పడేది. తన అద్భుతమైన బౌలింగ్‌ తో ఆమె ఎన్నోసార్లు టీం ఓటమి పాలవ్వకుండా కాపాడారు.

భయపెట్టే ప్లేయర్

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ లో అడుగుపెట్టిన తొలినాళ్లతో ఇంగ్లాండ్‌ ఫాస్ట్ బౌలర్‌ లూసీ పియర్సన్ తన బౌలింగ్‌ తో ఇన్నింగ్స్ మొదలుపెట్టేది. దాదాపు ఆరడుగుల పొడవుండే ఆమె వేసే బాల్‌ ను ఎదుర్కోవడం చాలా కష్టంగా అనిపించేది. అందుకే ఆమెను చూడగానే కొంచెం భయమేసేది. నేను క్రికెట్‌ టీంలో అడుగుపెట్టాక లూసీ ఎక్కువ కాలం క్రికెట్‌ ఆడలేదు. ఆమె రిటైర్మెంట్ తీసుకోవడం నా అదృష్టం అనుకుంటా.

చిరకాల స్వప్నం

ప్లేయర్‌గానైనా, కెప్టెన్‌గానైనా సరే వరల్డ్ కప్ సాధించే టీంలో భాగం కావాలన్నదే చిరకాల స్వప్నం.

ఆనందకరమైన క్షణం

ఇంగ్లాడ్‌లో ఇంగ్లండ్‌ టీంను ఓడించిన క్షణం. ఆ మ్యాచ్ కు నేనే కెప్టెన్. టీంలోని 11మంది ప్లేయర్స్ లో 8మందికి అదే తొలి టెస్ట్ మ్యాచ్. ఇంగ్లాండ్ టీం చాలా బలంగా ఉంది. ఆస్ట్రేలియాను ఓడించి యాషెస్ సీరీస్ సొంతంచేసుకున్న ఉత్సాహంతో బరిలో దిగింది. ఆ మ్యాచ్ లో ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించాం. కెప్టెన్ గా మరువలేని విజయం అది.

బాధ కలిగించిన క్షణం

బెస్ట్‌ ప్లేయర్స్ ఉన్నప్పటికీ వన్‌డే, టీ-20 వరల్డ్ కప్‌ నుంచి వైదొలగాల్సి రావడం చెప్పలేనంత బాధ కలిగించింది. నా జీవితంలో అదే దురదృష్టకమైన రోజు.

అత్యంత చెత్త ఇన్నింగ్స్

2007లో వరుసగా 7 మ్యాచ్‌లలో సరిగ్గా ఆడలేకపోయాను. కనీసం 30 రన్స్‌ కూడా చేయలేదు. ఎంతో కుంగిపోయాను 2012లో ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచుల్లో ఘోర ఓటమికి కూడా నా ఆటతీరే కారణమనుకుంటా.

బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తారు.

ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా, ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం. అందుకే అలా ఉండేందుకు ప్రయత్నిస్తా. అలా చేస్తే బాధ దానంతట అదే దూరమవుతుంది.

జీవితంలో భయపెట్టేవి

నిర్లక్ష్యం, నిర్లిప్తత ఆవహిస్తుందేమోనన్నదే పెద్ద భయం. అదే జరిగితే ఆటతీరులో నిలకడ లోపిస్తుంది. క్రికెట్‌పై ఉన్న అభిమానం, ప్యాషన్ తగ్గిపోతుందేమోనన్నది మరో భయం. అందుకే మ్యాచ్‌లు లేనప్పుడు క్రికెట్‌ బ్యాట్‌ ను ముట్టుకోను. క్రికెట్ బ్యాట్ పట్టుకోకుండా ఎంతకాలం ఉండగలుగుతానోనని నన్ను నేను పరీక్షించుకుంటాను. కానీ క్రికెట్ పై ఉన్న ప్రేమ కారణంగా ఎక్కువ కాలం గ్రౌండ్ నుంచి దూరంగా ఉండలేను.

image


మిథాలీ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ 

1982 డిసెంబర్‌ 3న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో పుట్టింది మిథాలీ రాజ్‌. చిన్నతనంలోనే ఆమె కుటుంబం హైదరాబాద్‌లో సెటిల్ అయింది. అందుకే ఆమెను హైదరాబాదీ అంటారు. ఆమె తండ్రి ఎయిర్‌ఫోర్స్ నుంచి రిటైర్‌ అయ్యాక బ్యాంక్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. కూతురి కెరియర్‌ కోసం ఆమె తల్లి ఉద్యోగం వదిలేసి కుటుంబానికి అంకితమైపోయారు.

2010, 2011, 2012 ఐసీసీ వరల్డ్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడేళ్ల పాటు ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది మిథాలీ రాజ్. ఇలాంటి రికార్డు సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ మిథాలీనే.

టెస్ట్, వన్‌ డే, టీ-20 ఈ మూడు ఫార్మాట్‌లకు కెప్టెన్సీ చేసిన ఘనత ఆమె సొంతం. మిథాలీ సాధించిన విజయాలకు గానూ భారత ప్రభుత్వం ఆమెను అర్జున, పద్మ శ్రీ అవార్డులతో సత్కరించింది.

ఆడిన మ్యాచ్ లు, సాధించిన స్కోర్లు (2016 మే 3 వరకు)

మిథాలీ ఇప్పటి వరకు 164 వన్‌ డే మ్యాచ్ లు ఆడింది.

149 మ్యాచుల్లోనే 49 సగటుతో 5301 పరుగులు సాధించింది.

42 మ్యాచుల్లో నాటౌట్‌గా నిలిచి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

వన్డే ఫార్మాట్‌లో 5 సెంచరీలు చేసిన ఘనత మిథాలీ సొంతం

టీ-20 మ్యాచ్‌లు 59 ఆడిన మిథాలీ 34.6 సగటుతో 1488 పరుగులు చేసింది.

10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 51 సగటుతో 16 ఇన్నింగ్స్ లో 663 రన్స్ చేసింది.

మిథాలీ అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 214 రన్స్. 


రచయిత: డా. అరవింద్ యాదవ్. ప్రస్తుతం యువర్ స్టోరీ ఇండియన్ లాంగ్వేజెస్ మేనేజింగ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. గతంలో ఆజ్ తక్, హెడ్ లైన్స్ టుడే, ఐబీఎన్ 7, టీవీ9, సాక్షి టీవీ(తెలుగు) లాంటి ప్రముఖ ఛానళ్లలో ఎడిటర్ గా, సక్సెస్ ఫుల్ జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్నారు. డబుల్ మాస్టర్ డిగ్రీ చేసిన అరవింద్ యాదవ్- ఆధునిక హిందీ విమర్శ అనే అంశంపై డాక్టరేట్ పొందారు. మీడియా చట్టాలు, సైకలాజికల్ కౌన్సెలింగ్ అనే అంశాల్లో పీజీ డిప్లొమా చేశారు. పత్రికా స్వేచ్ఛ కోసం ఒక యోధుడిలా పనిచేయడాన్ని ఇష్టపడే అరవింద్ యాదవ్.. నిత్య యాత్రికుడు కూడా. జర్నలిస్టుగా 19 ఏళ్లు దాదాపు దేశం నలువైపులా ప్రయాణించి అనేక రాజకీయ, ఆర్ధిక, సామాజిక స్థితిగతుల్ని ఆకళింపు చేసుకున్నారు.  

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి

Our Partner Events

Hustle across India