మానసిక చికిత్సాలయానికి మరో పేరు మైండ్స్ ఫౌండేషన్

మానసిక రోగులను అక్కున చేర్చుకుంటున్న మైండ్స్మూడు దశల్లో చికిత్ససంపూర్ణ ఆరోగ్యం, ఉపాధి కల్పన

మానసిక చికిత్సాలయానికి మరో పేరు మైండ్స్ ఫౌండేషన్

Wednesday July 15, 2015,

4 min Read

మానసిక అనారోగ్యం. మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్య. ఆ మాటకొస్తే మన దేశంలోనే కాదు...ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మానసిక అనారోగ్యం అందరికీ సవాలుగా మారుతోంది. నిరాదరణ, నిర్లక్ష్యం మానసిక రోగుల పాలిట శాపం. దురదృష్టవశాత్తూ శరీరానికి రోగం అంటితే.. వెంటనే డాక్టరు దగ్గరికి పరుగులు తీసే మనం, మనసు అనారోగ్యానికి గురయితే మాత్రం పట్టించుకోకుండా వదిలేస్తాం. ఈ నిర్లక్ష్యంలోనుంచే అనేక రోగాలు పుట్టుకొస్తున్నాయి. సమాజంలో అంతకంతకూ ఇలాంటి రోగులు పెరిగిపోతున్నారు. అందుకే ప్రపంచం ఎదుర్కొంటున్న అతిముఖ్యమైన సవాలు మానసిక అనారోగ్యంగా పరిణమించిన దుస్థితి ఏర్పడింది. 

ఈ ప్రమాదాన్ని గుర్తించిన రఘు కిరణ్ అప్పసాని సమాజంలోని ఈ రుగ్మతను తొలగించటానికి తనువంతు ప్రయత్నం ప్రారంభించారు. అలా పుట్టుకొచ్చిందే 'ద మైండ్స్ ఫౌండేషన్'.

మానసిక అశాంతీ ఓ వ్యాధి అని గుర్తించరు

మానసిక అనారోగ్యం అంతకంతకూ పెరిగిపోటానికి ముఖ్య కారణం దీనిపై ప్రజల్లో అవగాహన లేకపోవటమే. అందుకే ఈ జాడ్యాలను ముందుగా గుర్తించటం చాలా కష్టంగా మారింది. తీరా తెలుసుకునేలోపే పరిస్థితి చేయిదాటిపోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరీ అధికంగా ఉంది. సుశిక్షితులైన నిపుణులు లేకపోవటంతో చాలా కేసుల గుర్తింపు, చికిత్స సాధ్యం కావటం లేదు. వారు పనిచేయలేరు. మానసిక అనారోగ్యులుగా ముద్రపడ్డవారికి పెళ్లిళ్లు కావు. దీంతో చివరికి ఇలాంటి సమస్యలతో ఇబ్బందిపడే వారి పరిస్థితి అత్యంత నీచస్థితికి దిగజారిపోతోంది. చివరకు వారి జీవితం వ్యధాభరితమవుతోంది.

ఈ సమస్యను గుర్తించిన రఘు కిరణ్ అప్పసాని 2010లో మైండ్స్ ఫౌండేషన్ స్థాపించారు. మానసిక అనారోగ్యం చాలా కష్టమైన సమస్య అని అది పక్కనున్న వారినికి కూడా అసౌకర్యానికి గురిచేస్తుందని రఘుకిరణ్ భావన. మనదేశంలోనే కాదు...అన్ని విధాలా అభివృద్ధి చెందిన అమెరికాలోనూ మానసిక రోగుల పరిస్థితి ఇలానే ఉందంటారు రఘుకిరణ్. ఇతరుల సాయం కోసం వారు ఎదురుచూస్తూ ఉంటారని, ఇది చాలా కష్టమైన సమస్య అని వివరిస్తారు.

చిన్నారుల‌తో ర‌ఘు కిరణ్ అప్ప‌సాని

చిన్నారుల‌తో ర‌ఘు కిరణ్ అప్ప‌సాని


"ఈ సమస్య అన్ని చోట్లా ప్రబలంగా ఉంది. ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో మానసిక అనారోగ్యం గురించి అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే గ్రామాల్లో దీనిపై అవగాహన కల్పించి, మానసిక వైద్యులతో చికిత్స అందించాల్సిన అవసరం చాలా ఉంది అంటారు'' రఘు.

మానసిక అనారోగ్య సమస్యపై దృష్టిపెట్టిన మైండ్స్ ఫౌండేషన్ మూడు దశల కార్యక్రమం చేపట్టింది. 

  • గ్రామాల్లో మానసిక దీనిపై అవగాహన పెంచటం కోసం వర్క్ షాపులు నిర్వహించటం, తొలిదశ కార్యక్రమం. ఇందులో భాగంగా గత ఏడాది 19 గ్రామాల్లో వర్క్ షాపులు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మానసిక అనారోగ్యానికి గురయిన 2,500 మందిని ఇప్పటికే గుర్తించారు. వారిలో 70 మంది రోగులకు ఉచితంగా చికిత్స కూడా అందిస్తున్నారు. మహిళలకు, పిల్లలకు, గ్రామీణ ప్రాంతాల్లోని క్లినిక్స్‌లో సాధారణ వైద్యం చేసే వైద్యులకు మానసిక రోగులను గుర్తించే ప్రాథమిక లక్షణాలపై మైండ్స్ ఫౌండేషన్ శిక్షణ ఇస్తోంది.

స్వచ్ఛంద కార్యకర్తలు, సోషల్ వర్కర్లు, మెడికల్ విద్యార్థులు, మానసిక వైద్యులతో కలిసి పనిచేస్తున్న మైండ్స్ ఫౌండేషన్ తొలిదశలో ఈ రుగ్మతను గుర్తించేందుకు తొమ్మిది పాయింట్ల కార్యక్రమం చేపట్టింది. ప్రత్యేక తరహా అనారోగ్య లక్షణాలు కనిపించినవారికి తరువాతి దశలో చికిత్స ప్రారంభిస్తారు.

  • రెండో దశలో మైండ్స్ ఫౌండేషన్ అతి ముఖ్యమైన మరో విషయంపై దృష్టిపెడుతుంది. మానసిక రోగులకు సరైన వైద్యం అందించటం ఇక్కడ ప్రధానం. గ్రామీణ ప్రాంతాల్లో మానసిక జాడ్యాలతో బాధపడే రోగులకు సరిపడా వైద్యం అందించే సౌకర్యాలు లేకపోవటంతో వారి చుట్టూ అపోహలు నెలకొంటున్నాయి.వాళ్లను ఎవరూ అర్ధంచేసుకోవటం లేదు. దాన్నో కళంకంగా భావిస్తున్నారు. దాన్ని ఓ చికిత్స అందించగల రోగంలా కాక అదొకస్వభావంగా, బలహీనతగా గ్రామీణులు భావిస్తున్నారు. భారతదేశంలో సరిపడా మానసిక వైద్యులు లేకపోవటం దీనికి కారణం కాదంటారు రఘు కిరణ్. మనదేశంలో మానసిక వైద్యులు 3,500 మంది ఉన్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొనటానికి కారణం ఉన్న మానసిక వైద్యులందరిలో ఎక్కువమంది పట్టణ ప్రాంతాలకే పరిమితం కావటం. తాను అనేకమంది వైద్యులతో మాట్లాడానని, వారంతా పట్టణాల్లోనే పనిచేస్తున్నారని రఘు కిరణ్ తెలిపారు. దీనికి తోడు మానసిక చికిత్స చేయించుకోటానికి సరిపడా ఆర్థిక స్థోమత గ్రామీణ ప్రాంతాల ప్రజల వద్ద ఉండదు. ఒకే వేళ ఉన్నా పట్టణ వైద్య కేంద్రాలకు వెళ్లి మానసిక రోగానికి ఖర్చుపెట్టేందుకు వారు సుముఖంగా ఉండరు.

ఫేజ్ 2 కార్యక్రమంలో భాగంగా మైండ్స్ ఫౌండేషన్ మానసిక రోగులకు చికిత్స అందిస్తోంది. మానసిక రోగులను వారి గ్రామాల నుంచి ఆస్పత్రులకు ఉచితంగా తరలిస్తోంది. ఇక్కడ నిపుణులైన వైద్యులు రోగుల మానసిక అనారోగ్యాన్ని పరీక్షిస్తారు. అనంతరం సైకాలజిస్టు, సైక్రియార్టిస్ట్ సూచించిన మందులను రోగులకు ఉచితంగా అందిస్తారు.

  • అవగాహన కల్పించటం, వ్యాధి గుర్తింపు, చికిత్స తరువాత... మూడోదశ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలుపరిచి స్థిరత్వం సాధించేదిశగా కృషిచేయటం. కార్యక్రమంలో మూడోదశ పునరేకీకరణ . తాజాగా చికిత్స పొంది సంపూర్ణ మానసిక ఆరోగ్యం పొందిన రోగులకు కొత్త రోగులను కనిపెట్టటంలో శిక్షణ ఇవ్వటం ద్వారా వారికి పునరావాసం కల్పించటం. మానసిక ఆస్పత్రుల వద్ద వారికి ముందుగా తాత్కాలిక పునరావాసం కల్పించిన తరువాత చిన్న చిన్న వస్తువులు తయారుచేయటంలో వారికి శిక్షణ ఇచ్చేందుకు మైండ్స్ ఫౌండేషన్ సాయపడుతుంది. చేనేత, రకరకాల ఫాబ్రిక్‌లు, దుస్తులు, వస్తువుల తయారీ వంటి తేలిక పనుల్లో రోగులకు శిక్షణ ఇస్తుంది. ఈ శిక్షణ వల్ల రోగులు తమ ఇంటిలోనే ఉత్పత్తులు తయారుచేసి ఉపాధి పొందవచ్చు అని రఘు కిరణ్ చెప్తారు. ఉద్యోగ సంఘాలు, స్థానిక వ్యాపారవేత్తలతో మాట్లాడి చిన్న వయసులో మానసిక ఆరోగ్యం సాధించిన యువతీ యువకులకు వారి సంస్థల్లో ఉద్యోగ అవకాశం కల్పించటం...మూడో దశలో మైండ్స్ ఫౌండేషన్ చేపడుతున్న మరో కార్యక్రమం.

కొత్త వైద్యుడికంటే పాత రోగి మేలు !

కొత్తగా చికిత్స పొందిన రోగులు తొలిదశలో నిర్వహించినట్టు తమ ప్రాంతాల్లో ప్రజలకు మానసిక రోగాల గుర్తింపుపై అవగాహన కలిగించేందుకు కృషిచేస్తారు. మైండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాగే ఈ కార్యక్రమంలో ప్రచార కార్యక్రమాలు, వర్క్ షాపులు నిర్వహిస్తారు. కార్యక్రమం మూడోదశను స్థిరంగా కొనసాగించేందుకు మైండ్స్ ఫౌండేషన్ కు సరిపడా నిధులు లభిస్తున్నాయి. అమెరికాకు చెందిన గ్రే మాటర్స్ కాపిటల్ ...మైండ్స్ ఫౌండేషన్ కు నిధులు సమకూరుస్తోంది. ఈ నిధుల సాయంతో తాము చేపట్టదలచిన అన్ని పనులు విజయవంతంగా చేయగలమని రఘు, ఆయన బృందం భావిస్తోంది. భారతీయ గ్రామాల్లో మానసిక అనారోగ్యంపై అవగాహన పెంచటం, మానసిక రోగులను సమాజం అంగీకరించేలా చేయటం, వారికి చికిత్స అందిచటం వంటి పనులను నిరంతరాయంగా కొనసాగిస్తామని రఘు కిరణ్ తెలిపారు.

విదేశీ ప్ర‌తినిధుల‌తో ర‌ఘు కిరణ్

విదేశీ ప్ర‌తినిధుల‌తో ర‌ఘు కిరణ్


జీఎంసీ నిధులు సమకూర్చేందుకు ముందుకు రావటం...మైండ్స్ ఫౌండేషన్ నెలకొల్పటం దగ్గరి నుంచి ఇప్పటిదాకా నిర్వాహకులు చేసిన కృషికి ఇచ్చిన బహుమతి లాంటిదే అయినా...తాము చేసిన కార్యక్రమాల వల్ల వచ్చిన ప్రభావాన్ని వాళ్లు గమనించటం అన్నిటికన్నా విలువైనదని రఘకిరణ్ అభిప్రాయపడ్డారు. ఒక్కోసారి ఇవన్నీ ఎందుకు చేయాలని, వెనక్కి తగ్గాలనిపించటం సహజం. అయితే అలా ఎప్పుడూ జరగలేదన్నారు రఘు. తొలి దశలో భాగంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న వర్క్ షాపుల్లో ప్రజల భాగస్వామ్యం చూసిన తరువాత తనకు నిజంగా విషయం తీవ్రత అర్ధమయిందని ఆయన చెప్పారు. అనుకున్నదాని కన్నా ఎక్కువ సమయం ఉండాల్సిన సందర్భం వచ్చినప్పుడు వ్యాపార ప్రణాళికలు, వ్యాపార ప్రతిపాదనల కోసం ఆలస్యమయిన సందర్భాలను గుర్తుతెచ్చుకోవాల్సిన అవసరం కచ్చితంగా ఉందన్నారు. మనం చేస్తున్న మంచి పనిలో ముందుకు సాగటానికి ప్రజల ప్రోత్సాహం, మద్దతు ఎప్పుడూ ఉంటాయన్నదానికి మైండ్స్ ఫౌండేషన్ ముందుకు సాగుతున్న తీరే ఉదాహరణంటారు రఘుకిరణ్.

మానసిక రోగులను చూసి చీదరించుకోకుండా, వారికి దూరం జరగకుండా వారు సాధారణ స్థితికి చేరుకునేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ సహకరించాలి.