తండ్రి ఆఖరి కోరిక తీర్చేందుకు 'క్రౌడ్ ఫండింగ్' బాటపట్టిన ఓ విద్యార్థి కథ
అదో చిన్న ఫ్యామిలీ-తల్లిదండ్రులు..ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఓ కొడుకు..
కొద్ది రోజుల్లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లబోతున్న సమయంలో..
ఆ కుటుంబంలో పెద్ద కుదుపు..కుటుంబ పెద్ద చనిపోతే..
ఇదే జరిగింది కాన్పూర్‌లో ఉండే మాధుర్ కపూర్ కుటుంబంలో..!
2015 ఏప్రిల్ 28
మాధుర్ చాలా అసౌకర్యంగా ఉన్నారు. ఎందుకంటే అప్పటికే బాగా రాత్రైపోయింది..తండ్రి ఓ పెళ్లికి హాజరవడానికి వెళ్లి..ఇంకా ఇంటికి రాలేదు. అప్పటికే మాధుర్ ఓసారి తండ్రికి ఫోన్ చేసి ఇంటికి జాగ్రత్తగా రమ్మని చెప్పాడు. అప్పటి ఆ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చే సుకుంటూ " పది నిమిషాల పాటు నాన్నతో మాట్లాడాను.. అప్పటికే నాకెందుకో లోలోపల ఆందోళనగా ఉంది. ప్రతీ పది నిమిషాలకు ఓసారి ఆయనకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఐతే నాన్న ఫోన్ ఎత్తలేదు. డ్రైవింగ్‌లో ఉన్నారు కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయడంలేదని సర్ది చెప్పుకున్నాను. ఐతే నలభైనిమిషాల తర్వాత కూడా ఫోన్ ఎత్తకపోవడం అపశకునంగా అన్పించింది. ఏదో జరిగిందేమో అని అన్పించింది.."
అదే కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మాధుర్ మరింత భయపడ్డాడు. ఎందుకంటే మాధుర్ తండ్రితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు, ఇద్దరు చిన్నపిల్లలు కూడా ప్రయాణిస్తున్నారు. కాన్పూర్‌కు 80 కిలోమీటర్లుకు దూరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అలా మాధుర్ తండ్రి తీవ్రంగా గాయపడి చనిపోయాడు. ప్రమాదం జరిగిన మూడు గంటలకు మాధుర్ అక్కడకు చేరుకున్నాడు. అదో చిన్న ఏక్సిడెంట్ అని ఇంట్లో వాళ్లకు చెప్పి బయలుదేరాడు. తాత,బామ్మలకు హార్ట్ ప్రాబ్లెమ్స్ ఉండటంతో నిజం చెప్పే ధైర్యం చేయలేకపోయాడు మాధుర్. చివరకు నిజం తెలిసిపోయింది అందరికీ. ఐతే ఇది జరిగిన 15 గంటల తర్వాత ఇంటికి చేరుకున్న మాధుర్‌తో అతని తల్లి చెప్పిన మాటలు మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకుంటాడతను.." ఈ సంఘటనతో నువ్వు నీ లక్ష్యాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. అది నీ ఒక్కడిదే కాదు..నీ తండ్రి కల కూడా" అని తల్లి చెప్పిన మాటలతోనే కుటుంబం బాధ్యతలు మోయడంతో పాటు..ఎంఎస్ చేసేందుకు అమెరికాకు పయనమవుతున్నాడు..
నాన్న కలే నా లక్ష్యం
మాధుర్ కపూర్ ఇంజనీరింగ్ చదువుల రికార్డు చూస్తే..ఓ తెలివైన విద్యార్ధి అనే కాకుండా..ఓ మంచి బాధ్యత కలిగిన కుర్రాడని కూడా తెలుస్తుంది. ఒక బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ చదువుతూ వేరే బ్రాంచ్‌కు వెళ్లడమనేది దాదాపుగా మనదేశంలో కుదరదు. ఓ వేళ కాలేజీలో ఫ్యాకల్టీ అందుకు ఒప్పుకుందంటే అది ఎంతో ప్రత్యేకమైన సందర్భాల్లోనే కుదురుతుంది. ఆ వ్యక్తి ఎంతో ప్రతిభావంతుడైతే తప్ప అందుకు ఒప్పుకోరు. మాధుర్ టెలికామ్ ఇంజనీరింగ్ నుంచి ఐటీకి..ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్‌కు మారాడు.
మాధుర్ తన మాస్టర్స్ డిగ్రీని విదేశాల్లో చదవాలని తండ్రికి చెప్పేవాడు. ఐతే కుటుంబ ఆర్ధిక స్థితిగతులు అందుకు అనుకూలిస్తాయా లేదా అనే అంశమే అతనిని అప్పుడు వెంటాడేది. " ఐతే నాన్న మాత్రం నీ కల ఏంటో ఆ దిశగా పయనించమని చెప్పేవారు. అదే నాన్నలో గొప్పతనం.." తర్వాతి రోజుల్లో తన తండ్రి ఎంత ఆర్ధిక సమస్యలో ఉన్నాడో తెలుసుకున్నాడు. ఇల్లు కూడా తాకట్టులో ఉందని తెలిసింది.
విదేశీ చదువు కోసం మాధుర్ జీఆర్ఈ రాశాడు. ఎంతో తపనతో అకుంఠిత దీక్షతో అన్ని ప్రయత్నాలు చేశాడు. చివరికి ఫిబ్రవరి 9,2015న శాండియాగో లోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ ప్రోగ్రాం చేసేందుకు లెటర్ వచ్చింది.
" అంతా సిధ్దమైంది... అప్పు కూడా మంజూరైంది. ఇంకా కొన్ని సంతకాలేవో మిగిలి ఉన్నాయ్" అప్పటి సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఆగాడు మాధుర్. కాన్పూర్ కు 80కిలోమీటర్ల దూరంలో కారు ప్రమాదానికి గురైంది. దగ్గర్లో ఎలాంటి వైద్యసాయం అందే వీలూ లేదు. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి చివరి ఘడియల్లో ఉన్నారు మాధుర్ తండ్రి. ఆస్పత్రికి తీసుకెళ్తున్నవారితో ఆయన "నన్నెలాగైనా కాపాడండి..ఏదైనా చేయండి.."అంటూ వేడుకున్నాడని తెలిసింది మాధుర్‌కు.
రాత్రికి రాత్రే మీదపడ్డ బాధ్యతలు
2011లో మాధుర్ తండ్రి.. ఇల్లు కొనడానికి 25 లక్షల పర్సనల్ లోనే తీసుకున్నారు.." కజిన్ బ్రదర్, బాబాయ్ సాయంతో ఆ లోన్ తీర్చేసినట్లు మాధుర్ చెప్పాడు.
కాన్పూర్‌లో మాధుర్ కపూర్ కుటుంబం చాలా ఏళ్ల నుంచి యూనిఫామ్స్ తయారు చేసే వ్యాపారం చేస్తూ వస్తున్నారు. ఆ షాపుపై వచ్చే ఆదాయంలోనే కాస్త అసలు..ఇంకాస్త వడ్డీ కట్టుకుంటూ వచ్చేవారు. ఇదో వర్కింగ్ కేపిటల్‌లా పనికి వచ్చేది.." అదే మాకు ఆదాయ వనరుగా ఉంది. దాన్ని ఇప్పటికిప్పుడు మూసేసే ఉద్దేశం లేదు" చెప్పాడు మాధుర్. ప్రస్తుతం షాపు నిర్వహణను మాధుర్ తల్లి, తాతలు విడతల వారీగా చూస్తుంటారు.
" మా కజిన్ బ్రదర్, బాబాయ్ అప్పులు తీర్చడంలో, ఆర్ధిక ఇబ్బందులను అధిగమించడంలో సాయపడ్డారు. వారి సర్దుబాటు చేసిన డబ్బును కూడా నేను తిరిగి ఇచ్చేస్తాను. వారిచ్చిన డబ్బును కూడా అప్పుగానే చూస్తున్నా..కాకపోతే వడ్డీలేని అప్పుగా.." అని చెప్తాడు మాధుర్.
అబ్రాడ్‌లో ఎంఎస్ చేయాలనేది ఇప్పుడు మాధుర్ కలగానే కాకుండా..అదో ఆదాయానికి ఉపాధికి మార్గంగా కూడా చూస్తున్నాడు మాధుర్.." అంత డబ్బు సంపాదించాలంటే బెంగళూరులోనే అయితే సాధ్యం కాదనుకుంటున్నా..! ఓ వేళ కుదిరినా.. పది పన్నెండు సంవత్సరాలు పైసా కూడా మిగల్చకోకుండా పని చేస్తే కానీ కుదరదేమో..కానీ..నేను కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కదా " అంటాడాయన
ఎంఎస్ చేయడానికి ప్లానింగ్ ఎలా ?
కాలిఫోర్నియాలో ఎంఎస్ చేయడానికి ఆరు క్వార్టర్లు అంటే 18 నెలల సమయం పడుతుంది. ఒక్కో ట్రైమిస్టర్ కు(అంటే మూడునెలలకు) పది వేల యూఎస్ డాలర్లు ఖర్చవుతుంది. అక్కడ ఉండటానికి వసతి,మెస్ ఖర్చులకు మాధుర్ బెంగళూర్ (సిట్రిక్స్) లో జాబ్ చేసినప్పుడు పొదుపు చేసిన డబ్బు సరిపోతుందని అంచనా వేసుకున్నాడు. ఉద్యోగం చేస్తునప్పుడు బాగానే దాచి ఉంచినా అందులో ఎక్కువ శాతం అప్పులు తీర్చడానికే ఖర్చైపోయింది." నా దగ్గర ఇప్పుడు 6 లక్షల రూపాయలు ఉన్నాయి. అమెరికాలో ..నా కోర్సు పూర్తయ్యేంతవరకూ అవి సరిపోతాయి. ఇప్పుడు నా ఆలోచన అంతా నాకు కావాల్సిన ట్యూషన్ ఫీజు గురించే. దాదాపు 50 లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు కదా..!
మాధుర్ మాటల్లో... అతను అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ పరిశీలించినట్లు.. ప్రతిదానికీ ఓ ప్లానింగ్ తో ఉన్నట్లు అర్ధమైంది. అతనికి ఓ రెండు ట్రైమిస్టర్లకు సాయం కావాలి. అతని కజిన్ బ్రదర్ మాధుర్ ఫస్ట్ ట్రైమిస్టర్‌కు సాయం చేస్తున్నాడు. చివరి రెండు ట్రైమిస్టర్లకు సిలికాన్ వేలీలో ఏదైనా ఇంటర్న్‌షిప్ సంపాదించడం ద్వారా డబ్బు సర్దుబాటు చేసుకోగలనని భావిస్తున్నాడు. కాలిఫోర్నియా కాలేజీల్లో టీచర్ అసిస్టెంట్‌షిప్ కోసం కూడా తాను ప్రయత్నించే ఆలోచనలో ఉన్నాడు.
మామూలుగా అయితే మాధుర్ తన ఎంఎస్ కోసం మనదేశంలోకానీ..అమెరికాలో కానీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే కుటుంబం తరపున తీర్చాల్సిన అప్పులు ఉన్న నేపధ్యంలో లోన్ ఎంతవరకూ లభిస్తుందనేది ప్రశ్నార్ధకం..
క్రౌడ్ ఫండింగ్
" నాకు ఇప్పటికిప్పుడు కావాల్సిందల్లా 20వేల అమెరికన్ డాలర్లు. బఫర్‌లో స్టాండ్ బై గా పదివేల డాలర్లు పక్కన పెట్టేసుకున్నాను.. " దీనికోసం మాధుర్ కొత్తరకంగా క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయించాడు. ఎడ్యుకేషన్‌కు అయ్యే ఖర్చుకోసం జనంలోకి వెళ్లాడు. జూన్ 22న గో ఫండ్ మి అనే సైట్లో క్రౌడ్ ఫండింగ్ కోసం ఓ పేజ్ ఓపెన్ చేశాడు. ప్రస్తుతం అతనికి ధనసాయం అందించేవారు కావాలి..మీకు మాధుర్ కు సాయపడాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి..(https://www.gofundme.com/help-madhur ) ఇప్పటికి ఫండింగ్ ద్వారా మూడు నెలల్లో 13వేల డాలర్లు పోగయ్యాయి. దీనికి 184మంది తమ విరాళమనుకోండి,సాయమనుకోండి.. వారంతా తమ ధనంతో పాటు బోలెడంత ఆత్మవిశ్వాసాన్ని, భరోసాను మాధుర్‌కు పంచారు..
" నాకెవరీ డబ్బు దానంగా అవసరం లేదు.. నాకు అలా ఇస్తామంటున్నవారికి నా కృతజ్ఞతలు. నేనో మంచి స్థితికి చేరిన మరుక్షణం మీ డబ్బంతా తిరిగి ఇచ్చేస్తానని నేను వినయంగా వారితో చెప్తున్నాను. ఇప్పటిదాకా నాకు సాయం చేస్తామనే వారే కానీ..ఎవరూ తిరిగి ఇవ్వమని అడగలేదు.."
సాయం కోరడం తప్పేం కాదు
సమస్య ఏంటంటే...ఎవరూ మన సమస్యల గురించి అవతలివారికి చెప్పడానికి ఇష్టపడం.. నేను కూడా ఈ క్రౌడ్ ఫండింగ్ పై అనేక సందేహాలతో ముందూ వెనుకా ఆడాను. కానీ నా కజిన్ నాకున్న అపోహలన్నింటినీ తొలగించాడు. వేరేవారి సాయం అర్ధించడం అనేది తప్పేం కాదని వివరించాడు. ఇప్పటిదాకా చాలామందిలో ఈ మైండ్ సెట్ ఉంది. నేనెందుకు నా సమస్యల గురించి ఇతరులకు చెప్పాలి..? చెప్తే వారేం అనుకుంటారు, ఎలా స్పందిస్తారు ? ఇలా అనేక రకాలుగా ఆలోచిస్తారు.." నేను దీన్నే మార్చాలనుకుంటున్నా.. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరుల సాయం తీసుకోవడం తప్పేం కాదు..ఇదే నేను అందరికీ చెప్పాలనుకుంటున్నా..!
మాధుర్ మాట్లాడుతున్నంత సేపూ చాలాసార్లు గొంతు జీరబోయింది. ఎంతో ప్రేమించిన తండ్రి మరణం గురించి ఏ ఫీలింగ్ లేకుండా మామూలుగా మాట్లాడటం అంత సులభమైన విషయం కాదు. ఐతే తండ్రి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ తన కల నెరవేర్చడమే ఆయనకు సరైన నివాళి అని చెప్పారు మాధుర్.
ఇప్పుడు మాధుర్ ఓ మంచి విద్యార్ధి, మంచి కొడుకే కాకుండా..తనలాంటి వారికి ఓ స్ఫూర్తి నిచ్చే వ్యక్తిగా మారాడు.. కష్టాలెన్ని ఉన్నా..లక్ష్యం కోసం డోన్డ్ గివ్ అప్ యాటిట్యూడ్ ప్రదర్శించిన మాధుర్ కథ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం.
సాయం కోరడం తప్పేం కాదు.. మన బాధలను ఇతరులతో పంచుకుంటే వచ్చే నష్టమేం లేదు.. గుండె కాస్త తేలికపడడం తప్ప.. ! ఏమంటారు... ???