బిపిఓను భూమార్గం పట్టించిన సలోని

గ్రామీణాభివృద్ధికి తన వంతు కృషిగ్రామాల్లోని మహిళలకు సాధికారత తెచ్చే ప్రయత్నంశిక్షణ ఇచ్చి మరీ వారి గ్రామాల్లోనే ఉద్యోగాలుపదేళ్ల క్రితమే రూరల్ బిపిఓ అవకాశాల గుర్తింపుఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతున్న దేసీ క్రూలైంఘిక వేధింపుల అడ్డుకట్టకు సేఫ్ సిటీ ప్రాజెక్ట్ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న సలోని మల్హోత్రా

16th Apr 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం... పట్టణ జనాభా రోజురోజుకీ పెరుగుతోంది అని. ఎంతోమంది యువత, మహిళలు ఉద్యోగాన్వేషణలో భాగంగా నగరాలు, పట్టణాలకు వలసలు వెళ్తూనే ఉన్నారు. ప్రస్తుతం గ్రామాల పరిస్థితి ఎలా ఉందంటే... సరైన చదువు దొరకడమే గగనం. ఇక అక్కడే ఉంటే ఉద్యోగం అనే ఆలోచన కూడా మదిలోకి రానక్కర్లేదు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లేకపోవడం, పరిశ్రమలు, ఐటీ కంపెనీలన్నీ నగరాలు, పట్టణాల్లోనే ఏర్పాటు కావడం... ఈ దుస్థితికి ప్రధాన కారణం.

ఎవరి సొంత ఊళ్లో వారే ఉద్యోగం/ఉపాధి సంపాదించుకోగలిగితే ఈ బలవంతపు వలసలు ఉండవు. అంతేకాదు... వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలోనూ ఉండొచ్చు. భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసుకోవచ్చు. జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవచ్చు. గ్రామాల వికాసానికి బాటలు వేయవచ్చు.

సలోని మల్హోత్రా, దేసి క్రూ వ్యవస్థాపకురాలు

సలోని మల్హోత్రా, దేసి క్రూ వ్యవస్థాపకురాలు


ఈ లక్ష్యసాధనే ధ్యేయంగా మొదలైంది “దేసీ క్రూ” అనే ఓ రూరల్ బీపీఓ. “ఎంపిక చేసిన కొందరు గ్రామీణ యువతకి శిక్షణనిచ్చి, ఉపాధి చూపించడమే దేసీ క్రూ పని. వీరు ఎంపిక చేసుకునే వారిలో దాదాపు 70 శాతం మంది మహిళలే. వీరు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి నాణ్యమైన సేవలందించారు, అందిస్తున్నారు. అది కూడా చాలా తక్కువ ఖర్చులోనే. ఎందుకంటే వీరు చేసే పని పట్టణాల్లోని కంపెనీలతో చేయించాలంటే భారీ మొత్తం వెచ్చించాల్సిందే. మహిళలు కూడా సంపాదనలో భాగస్వాములు కావడంతో కుటుంబ ఆదాయం పెరిగింది. జీవన స్థాయి పెరిగింది”... అంటారు దేసీ క్రూ వ్యవస్థాపకురాలు సలోని మల్హోత్రా.

సలోని మల్హోత్రా... ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ యువ ఇంజనీర్ తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఈ రూరల్ బీపీఓ వైపు ఆసక్తితో, చెన్నై చేరారు. పూణె విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన సలోని... ఢిల్లీలోని “వెబ్ చట్నీ” అనే ఓ కంపెనీతో తన కెరీర్ ప్రారంభించారు. ఓసారి రూరల్ బీపీఓ అంశంపై ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ అశోక్ ఝన్ ఝన్ వాలా చేసిన ఉపన్యాసంతో ఆ రంగంపై అనురక్తి కలిగింది.

2005లో ఈ రూరల్ బీపీఓపై పరిశోధన ప్రారంభించిన సలోని... సరైన శిక్షణనిస్తే గ్రామీణ యువత పట్టణ యువతకు ఏమాత్రం తీసిపోరు అని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. పైగా భారతదేశంలోని 70% జనాభా గ్రామాల్లోనే నివసిస్తోంది. వీటన్నింటినీ పరిశీలించి ఓ స్థిర నిర్ణయానికి వచ్చిన సలోని... 2007లో తమిళనాడులోని భావని అనే ఓ చిన్న పట్టణంలో సాధికారికంగా దేశీక్రూ తొలి కార్యాలయాన్ని ప్రారంభించారు. అలా మొదలైన ఈ సంస్థ తర్వాత కర్ణాటకకు విస్తరించింది. ఇప్పటివరకూ 400 మందికి పై గ్రామీణ యువతకు ఉపాధి కల్పించింది.

ఈరోడ్‌లోని దేసి క్రూ కార్యాలయం

ఈరోడ్‌లోని దేసి క్రూ కార్యాలయం


“దేసీ క్రూ... ఇదేం కొత్త అంశం కాదు. మిగిలిన అన్ని బీపీఓల మాదిరే మేమూ పనిచేస్తాం... కాకపోతే గ్రామీణ యువత ద్వారా, గ్రామాల నుంచే అన్ని రకాల ఐటీ/ఐటీఈఎస్ కంపెనీలు, బీమా, మీడియా, మొబైల్ ఆధారిత కంపెనీలకు సేవలందిస్తాం. పట్టణాల్లో బీపీఓలకు దేశీక్రూకి తేడా ఏమిటంటే... గ్రామాలనుంచి ఉద్యోగాల కోసం యువత వస్తారు... కానీ ఇక్కడ మేమే ఉద్యోగాలను గ్రామాల్లోకి తీసుకెళ్తున్నాం”... అంటూ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతారు సలోనీ మల్హోత్రా.

“ఏ పనైనా విజయం సాధించాలంటే... అర్థం చేసుకునే వ్యక్తుల లేదా సంస్థల భాగస్వామ్యం, సహాయం ఎంతో అవసరం. తగినంత సమయం కావాలి. ఆర్థికంగా తోడ్పాటు కావాలి. మేం ఈరోజు ఇంత సాధించామంటే దానికి కారణం విల్ గ్రో. వారు అందించిన ఆర్థిక తోడ్పాటుతోనే ఇంతమందికి శిక్షణనిచ్చి, ఉపాధి కల్పించగలుగుతున్నాం. విల్ గ్రో తాను ఆర్థికంగా తోడ్పాటునందించడంతోపాటు మరిన్ని నిధులు మాకు చేకూరేందుకు బాటలు పరిచింది. అంతేకాదు... మేం చేస్తున్న పనులు నలుగురికీ తెలిశాయి అంటే అదంతా విల్ గ్రో కృషి ఫలితమే”... అంటారు సలోని.

శిక్షణ, నైపుణ్యాలు, ఆర్థిక వనరులు, సామాజిక సంబంధాలు... వీటన్నింటినీ సరైన రీతిలో వినియోగించుకోగలిగితే ఏ సంస్థకైనా, ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు... ఇదే దేశీక్రూ విజయరహస్యం. ఈ సూత్రం ఆధారంగానే దేశీక్రూ బృందం పనిచేస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 40కి పైగా ప్రముఖ కంపెనీల ప్రాజెక్టులను ఈ రూరల్ బీపీఓ విజయవంతంగా పూర్తి చేసింది.

విజయం అంత సులభమా ?

ఇదంతా ఇక్కడ చెప్పినంత సులభంగా ఏమీ ఆచరణలోకి రాలేదు. ఏ విజయం వెనకైనా ఎన్నో వ్యయప్రయాసలు, ఒత్తిళ్లు ఉంటాయి. కానీ సక్సెస్ ఇచ్చే కిక్ ముందు ఇవన్నీ దిగదుడుపే. గ్రామాలు... అందులోనూ భారతీయ గ్రామాలు అంటే ఎన్నో కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలకు నెలవు. దేశీక్రూలో సింహభాగం ఉద్యోగులు మహిళలే.

మొదట్లో... గ్రామాల్లో మహిళలను చైతన్యపరచి, వారికి శిక్షణనిచ్చేందుకు వారి కుటుంబాలను ఒప్పించడం సలోని బృందానికి పెద్ద సవాలుగానే మారింది. మహిళల పట్ల ఉన్న మూఢనమ్మకాలు, అపనమ్మకాలను తొలగిస్తేనే ఇది సాధ్యమవుతుందని ఆమెకు తెలుసు. దేశీక్రూ బృందంపై వారికి విశ్వాసాన్ని నెలకొల్పడం మరో పెద్ద సమస్య. ఈ రెండిటింనీ అధిగమించి, గ్రామీణప్రాంతాల్లో ఓ ఐటీ కార్యాలయం ఏర్పాటు చేయడం. ఈ సమస్యలు, సవాళ్లను ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు సలోని.

సలోని కష్టం ఊరికే పోలేదు... దేశీక్రూ, అది అందిస్తున్న సేవలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఎందరో ప్రశంసలు ఈ బృందానికి దక్కాయి. ఇంత చేశాక అవార్డులు రాకుండా ఉంటాయా!! అవి కూడా వారి కీర్తి కిరీటంలో చేరాయి.


దేసీ క్రూ టీం

దేసీ క్రూ టీం


సలోనీ, దేసీక్రూ అందుకున్న అవార్డులు

1) 2011లో స్త్రీ శక్తి అవార్డు

2) బిజినెస్ వీక్ మ్యాగజైన్ ఎంపికచేసిన ఆసియాలోని యంగ్ ఎంట్రప్రెన్యూర్స్ జాబితాలో పేరు

3) ఎంటీవీ యూత్ ఐకాన్-2008 కి నామినేషన్

4) 2008 సంవత్సరానికి గాను ఈ అండ్ వై ఎంట్రప్రెన్యూర్ అవార్డు... దీన్ని రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నారు సలోని మల్హోత్రా.

సంగీతం అంటే అమితంగా ఇష్టపడే సలోని... “తన దగ్గరివారు, స్నేహితులు, చుట్టుపక్కలవారు ఎదుర్కొంటున్న సమస్యలు... తనకో సవాల్ విసురుతున్నట్లుగా ఉంటుంది. వాటిని ఛేదించాలని నాలో పట్టుదల పెరుగుతుంది. అలాంటప్పుడే ఏదైనా ఓ కొత్త ఆలోచన మొగ్గతొడుగుతుంది. అలా పుట్టిందే దేశీక్రూ కూడా“ అంటారు. ఓ చిన్న పట్టణంలో ప్రారంభమైన ఈ సంస్థ నేడు దక్షిణ భారతదేశంలో 5 శాఖల ద్వారా తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు వీరికి నిధుల సమస్య కూడా లేదు. ఎంతోమంది ఇన్వెస్టర్లు, స్టేట్ బ్యాంకు వంటి బ్యాంకులు వీరికి రుణాలనివ్వడానికి ముందుకొస్తున్నాయి.

దేశీక్రూని నిర్వహించడం ఆనందం నిండిన ఓ పెద్ద బాధ్యత అంటారు సలోని.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close
Report an issue
Authors

Related Tags

Our Partner Events

Hustle across India