రూ. 2500తో మొదలుపెట్టి 100 మి.డాలర్ల కంపెనీ స్థాయికి చేర్చిన భార్యాభర్తలు
ఆర్కిటెక్చర్, డిజైన్ రంగంలో తమ భవిష్యత్తును ఊహించుకుంటూ, పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంటూ...ఎన్నో కలలతో వారిద్దరూ సింగపూర్ లో అడుగుపెట్టారు. వారి వైవాహిక జీవితంలో అనుబంధం అంతకంతకూ పెరిగినట్టుగానే....వారి లక్ష్యాలు ఒక్కొక్కటిగా దరికి చేరాయి. అనుకున్నవీ, అనుకోనివి కూడా వారి సాధించారు. కోట్ల టర్నోవర్ కంపెనీలకు అధిపతులయ్యారు. దేశవిదేశాల్లో వ్యాపారాన్ని విస్తరించారు. మరిన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నారు. వారే అనురాగ్ శ్రీవాత్సవ, షగుఫ్తా. ఈ ఏడాది వంద మిలియన్ డాలర్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న సింగపూర్ ఆధారిత స్పేస్ మాట్రిక్స్ వ్యవస్థాపకులు, సహ వ్యవస్థాపకులు.
మనసు నిండా కోటి ఆశలు, చేతిలో ఉద్యోగం, జేబులో 2,500 రూపాయల డబ్బుతో 27 ఏళ్ల వయసులో సింగపూర్ లో భారత్ విమానం దిగారు అనురాగ్ శ్రీవాత్సవ. అప్పుడు ఆయన మనసులో ఉన్నది ఒకటే ధ్యేయం. 40 ఏళ్ల వయసుకల్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావాలని. అప్పటినుంచి ఆయన అదే లక్ష్యంతో ముందుకు సాగారు. ఆరేళ్ల తరువాత పెళ్లయిన వెంటనే ఆయన భార్య షగుప్తా భర్తతో కలిసి సింగపూర్ లో అడుగుపెట్టారు. దేశీయ డిజైన్ రంగంలో తనకో స్థానం ఏర్పరచుకోవాలన్నది ఆ కొత్త పెళ్లికూతురి లక్ష్యం. అప్పటినుంచీ వారిద్దరూ కలిసికట్టుగా తమ లక్ష్యసాధనకు కృషిచేశారు. అనుకున్నదానికన్నా ఎక్కువే సాధించారు.
బెంగళూరులోని విండ్సర్ మానర్ హోటల్లో రెండు దశాబ్దాల క్రితం కలుసుకున్ననాటి నుంచీ...ఇప్పటిదాకా వారు పెంచుకుంది వారిద్దరి మధ్యా అనుబంధాన్నే కాదు....కంపెనీల నిర్మాణాన్ని కూడా. కిందిస్థాయి నుంచీ కంపెనీలను ప్రారంభించి...వాటిని కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి చేర్చారు. షగుప్తా, అనురాగ్ శ్రీవాత్సవ స్పేస్ మాట్రిక్స్ ను మాత్రమే కాదు....ఇతర కంపెనీలనూ స్థాపించి నిర్వహిస్తున్నారు. 2012లో అనురాగ్ మరొకరితో కలిసి వెంచర్ క్యాపిటల్ సంస్థ జంగిల్ వెంచర్స్‌ను నెలకొల్పారు. ఈ సంస్థ బోర్డులో ఇటీవలే ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ప్రత్యేక సలహాదారునిగా చేరారు. అటు షగుప్తా కూడా స్పేస్ మాట్రిక్స్ తో పాటు మరికొన్ని సంస్థలను నిర్వహిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైన్, ఫర్నీచర్ సంస్థ లివ్ స్పేస్ సహ వ్యవస్థాపకురాలు షగుప్తానే. 2014లో ఈ సంస్థ వెంచర్ ఫండింగ్ ద్వారా 29 కోట్ల రూపాయలు సమకూర్చుకుంది. తొమ్మిది నెలల క్రితం షగుప్తా మరో వెంచర్ ను ప్రారంభించారు. లండన్ లో హావో చి పేరుతో ఫుడ్ టెక్ కంపెనీని మొదలుపెట్టారు.
స్పేస్ మాట్రిక్స్ ద్వారా ఈ ఏడాది వందమిలియన్ డాలర్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అనురాగ్, షగుప్తా.. చైనాలో ఆర్కిటెక్చర్ సంస్థ ను సొంతం చేసుకోవటంపై దృష్టిపెట్టారు. 2006 నుంచి స్పేస్ మాట్రిక్స్ కు సీఈవోగా ఉన్న అనురాగ్ ఈ ఏడాది ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకుంటున్నారు. స్పేస్ మాట్రిక్స్ తో పాటు ఆతిథ్య సంస్థ బ్లింక్ డిజైన్ కు కొత్త సీఈవోలను వెతికే పనిలో పడ్డారు. ఆయనకు చెందిన జంగిల్ వెంచర్స్ రెండోసారి నిధులు సమీకరిస్తోంది. మొదటి దశలో సమీకరించిన నిధులు ద్వారా జంగిల్ వెంచర్స్ 30 కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది.
నైపుణ్యంతోనే విజయం
ప్రత్యేక నైపుణ్యాలతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయంటారు అనురాగ్, షగుప్తా. గొప్ప లక్ష్యాలతో ఉన్న పారిశ్రామిక వేత్తలను గుర్తించటంలోనూ, వారికి మార్గదర్శనం చేసి, విజయాల వైపు నడిపించడంలోనూ అనురాగ్.. కింగ్ మేకర్ లా వ్యవహరిస్తారని షగుప్తా ప్రశంసిస్తారు. ఏదైనా ప్రారంభించే సమయంలో తాను చాలా చురుగ్గా ఉంటానని, గందరగోళంలాంటిది ఏదీ ఉండదని, కానీ తన ఆలోచన ఓ దశకు వచ్చేసరికి తన భర్త సహాయం తీసుకుంటానని, షగుప్తా చెప్పారు.
షగుప్తాను స్టీవ్ జాబ్స్ తో పోలుస్తారు అనురాగ్. “ఆమె తన ఆలోచనలతో నన్నెప్పుడూ ఆశ్చర్యపరచదు. ఎందుకంటే ఆమెకు వచ్చేవన్నీ గొప్ప ఆలోచనలే. నేను నా సొంతంగా స్టార్టప్ ఆలోచనలు చేయలేనని మొదట్లోనే గ్రహించాను. నేను సహ వ్యవస్థాపకునిగా ఉండగలను కానీ...వ్యవస్థాపకుణ్ని కాదు” అని చెప్పారు అనురాగ్
వారి జీవన భాగస్వామ్యం స్పేస్ మాట్రిక్స్ లో ప్రతిబింబిస్తుంది. షగుఫ్తా సింగపూర్ వెళ్లేనాటికి దుబాయ్ కు చెందిన డిజైన్ సంస్థను భారత్ లో నిర్వహిస్తున్నారు. చాలా కిందిస్థాయి నుంచి దానిని ప్రారంభించి వృద్ధిలోకి తెచ్చారామె. సింగపూర్ వెళ్లిన ఏడాదికే ఆమె స్పేస్ మాట్రిక్స్ ఆలోచనతో ముందుకొచ్చారు. 5వేల డాలర్ల పెట్టుబడితో ఆమె కంపెనీ ప్రారంభించారు. అప్పుడు అనురాగ్ టెక్నాలజీ సంస్థ పీటీసీకి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
2006నాటికి ఆ సంస్థ 4 మిలియన్ డాలర్ల ఆదాయం సాధించటమే కాకుండా బ్యాంకాక్, బెంగళూరు, హైదరాబాద్ కు విస్తరించింది. ఎండెకా అనే సాఫ్ట్ వేర్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించటానికి అనురాగ్ లండన్ వెళ్లారు. అనంతరం ఇండెకాను ప్రముఖ సంస్థ ఒరాకిల్ సొంతం చేసుకుంది. రెండు ఖండాల్లో విస్తరించటంతో అనురాగ్, షగుఫ్తా సంతృప్తి పడలేదు. తర్వాత ఏం చేయాలనేదాని గురించి అనురాగ్ ఆలోచించటం మొదలుపెట్టారు. ఆర్థిక వ్యవహారాలు, మానవ వనరులపై కాకుండా షగుఫ్తా కోరుకున్నట్టుగా ...డిజైన్, నూతనత్వంపై ఆమె దృష్టిపెట్టేలా వీలుకల్పించాలని అనురాగ్ భావించారు. ఇందుకోసం స్పేస్ మాట్రిక్స్ కు కొత్త సీఈవోను నియమించాలని అనురాగ్ నిర్ణయించారు. కానీ చివరికి అనురాగే సీఈవోగా బాధ్యతలు నిర్వహించాల్సి వచ్చింది. అయితే అనురాగ్ సీఈవో గా ఉండటం కంపెనీకి లాభించింది. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, హోటల్ డిజైన్ వంటి ఎన్నో అంశాల్లో కంపెనీ అనేక ఘనతలను సాధించింది.
ఇతర పారిశ్రామిక వేత్తలతో కలిసి...
స్పేస్ మాట్రిక్స్ లో సాధించిన అనుభవంతో అనురాగ్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రారంభదశలో ఇతరుల మద్దతు కోసం ఎదురుచూస్తున్న పారిశ్రామికవేత్తలకు తాను సహాయపడగలనని అనురాగ్ గ్రహించారు. మొదటి వ్యాపారం సొంతంగానే ప్రారంభించినప్పటికీ...2012లో తన స్నేహితుడు అమిత్ ఆనంద్ తో కలిసి సహ వ్యవస్థాపకుడిగా జంగిల్ వెంచర్స్ అనే వెంచర్ సంస్థను స్థాపించారు.
ఈ ఏడాది స్పేస్ మాట్రిక్స్ కు కొత్త సీఈవో ను నియమించటానికి అంతా సిద్ధమవటంతో వ్యవస్థాపకత వృద్ధిపై దృష్టిపెట్టాలని అనురాగ్ ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ ఏడాది తనకు ఉద్యోగం లేదని నవ్వుతూ చెప్పారు అనురాగ్. స్పేస్ మాట్రిక్స్, బ్లింక్ కంపెనీల సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆయన భావిస్తున్నారు. పెద్ద సమస్యలు పరిష్కరించేందుకు మనకు అవకాశం కల్పించే పారిశ్రామిక వేత్తలతో కలిసి పనిచేయాలన్నది ఆయన ప్రణాళిక. జంగిల్ వెంచర్ ను మల్టీ ప్లాట్ ఫాం సంస్థగా విస్తరించాలన్నది ఈ ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి లక్ష్యం.
పారిశ్రామిక వేత్తగా అనురాగ్ సాధించిన అనుభవం మిగిలిన పెట్టుబడుదారుల మధ్య ఆయన్ను విభిన్నంగా ఉంచుతుందని హెలైన్ అడ్వైజర్స్ వెంచర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆషిష్ గుప్తా అభిప్రాయపడ్డారు. అనురాగ్ అసలు సిసలైన పారిశ్రామిక వేత్త అని, ఆయన ఆలోచనలన్నీ ఆ దిశగానే ఉంటాయని, ఐఐటీ కాన్పూర్ లో ఆయన స్నేహితుడైన ఆసిష్ చెప్పారు. ఇప్పుడు ఆసిష్ జంగిల్ కు ఫండ్ ఎడ్వైజర్ గా ఉన్నారు.
అటు షగుఫ్తాకూ అనేక ప్రత్యేకతలున్నాయి. బెంగళూరులోని బీఎంస్ కాలేజీలో ఇంజినీరింగ్ చదివారు షగుఫ్తా. స్పేస్ మాట్రిక్స్ ప్రారంభంలోనే కాదు ఇప్పటికీ కంపెనీలో ఆమెది కీలకపాత్రే. కంపెనీ డిజైన్ విధానంలో భాగస్వాములవుతారు. స్పేస్ మాట్రిక్స్ తో పాటు మరో రెండు వెంచర్లను షగుఫ్తా ప్రారంభించారు. బెంగళూరులో ఆన్ లైన్ ఇంటీరియర్ డిజైన్, పర్నీచర్ కంపెనీ అయిన లివ్ స్పేస్ ను నిర్వహిస్తున్నారు. హెలైన్, జంగిల్ లివ్ స్పేస్ కు పెట్టుబడి సమకూర్చాయి. జంగిల్ లో నిర్వర్తించాల్సిన బాధ్యతల కారణంగా అనురాగ్ లివ్ స్పేస్ రోజువారీ వ్యవహారాల్లో భాగస్వామి కాలేకపోతున్నారు. అయినప్పటికీ షగుఫ్తా మాత్రం డిజైన్, నూతనత్వం వంటి అంశాలపై దృష్టిపెడుతున్నారు. నిత్యం కలలు కంటూ, వాటిని సాకారం చేసుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తారు షగుఫ్తా.
మనసున మనసై
అనురాగ్, షగుఫ్తాల జీవన విధానం ఎందరికో మార్గదర్శకం. అటు వ్యక్తిగత జీవితాన్ని, ఇటు వృత్తిగత జీవితాన్ని వారిద్దరూ ఎంతో చక్కగా సమన్వయం చేసుకుంటున్నారు. అనురాగ్, షగుప్తాలకు ఇద్దరు పిల్లలు. వారిప్పుడు స్కూల్లో చదువుకుంటున్నారు. ఇంటి వ్యవహారాలను, బయటి వ్యవహారాలను ఎలా చక్కబెడుతున్నారు అని షగుప్తాను అడిగితే నవ్వుతూ బదులిస్తారామె. తన దృష్టి ఎప్పుడూ ఇల్లు, పని మీదే ఉంటుందని అందువల్ల విసుగ్గా అనిపించదని షగుప్తా చెప్పారు. అనురాగ్ అసలు నిద్రే పోరంటారు షగుప్తా. అంటే రోజులో ఎక్కువ సమయం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అనురాగ్. విశ్రాంతి ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలన్నది 49 ఏళ్ల అనురాగ్ తాజా లక్ష్యం అయిఉంటే, ప్రయాణానికి ఒక ఆటో రిక్షా సొంతం చేసుకోవాలన్నది 44 ఏళ్ల షగుఫ్తా కల అయితే ....అందులో ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సింగపూర్ లో సామాన్య ఉద్యోగులుగా అడుగుపెట్టి బడా పారిశ్రామిక వేత్తల స్థాయికి ఎదిగిన అనురాగ్, షగుప్తా మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.