ఒకప్పుడు ఈఎంఐ కూడా కట్టలేకపోయాడు..! నేడు రూ. 20 కోట్ల టర్నోవర్ సాధించగలిగాడు !!
ఓటమి దొంగదెబ్బకొడితే- గెలుపుతో ప్రతీకారం తీర్చుకోవాలి. దెరీజ్ నోసక్సెస్ వితవుట్ ఫెయిల్యూర్. గెలవాలనే తపన, పట్టుదల ఉన్న వ్యక్తికి ఓటమి తాత్కాలిక అవరోధమే తప్ప శాశ్వతం కాదు. వాటిని అధిగమించి కష్టాలను దాటుకుంటూ ముందుకు సాగిపోతే విజయం దానంతటదే వరిస్తుంది. విజయ్ పెంటారెడ్డి జీవితాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
ఓ వైపు ఆర్థికమాంద్యం.. మార్కెట్ డౌన్ . చేతిలో చిల్లిగవ్వలేక.. ఈఎంఐలు కట్టలేని దుస్థితి.. 2008 లో విజయ్ పెంటారెడ్డి లాస్ట్ మైల్ అనే స్కిల్ డెవలెప్మెంట్ సంస్థని ప్రారంభించినప్పుడు పరిస్థితి ఇది. కానీ అలాంటి స్థితి నుంచి కృషి,పట్టుదల మొక్కవోని విశ్వాసం తో ఆయన సాగించిన ప్రయాణం ఇప్పుడు లాస్ట్ మైల్ ని విజయవంతమైన సంస్థగా నిలబెట్టింది.కేవలం ఏడుగురు ట్రైనింగ్ టీమ్ తో అవరోధాలన్నీ అధిగమించి ఈరోజు తాను ఎంచుకున్న రంగంలో విజయుడిగా నిలిచాడు విజయ్. డిగ్రీ, పీజీ స్థాయి విద్యార్థులతో పాటు కార్పొరేట్ సంస్థలకు కూడా సేవలందిస్తున్నాడు. విజయ్ తీర్చిదిద్దిన 600 మందికి పైగా విద్యార్థులు డెచ్ బ్యాంక్, బ్యాంక్ అఫ్ అమెరికా, అమెజాన్, జెన్ ప్యాక్ట్, అసెంచర్, ఫ్యాక్ట్ సెట్, సీటీఎస్ లాంటి ప్రముఖ ఎమ్మెన్సీల్లో ఉద్యోగాలు పొంది ఉన్నతస్థాయిలో ఉన్నారు.
’’ ఈ ఆర్థిక సంవత్సరంలో లాస్ట్ మైల్ 20 కోట్ల రెవెన్యూని అందుకునే స్థాయికి చేరుకుంది. వచ్చే ఐదేళ్లలో ఇండియా అంతటా 100 ట్రైనింగ్ సెంటర్స్ స్టార్ట్ చేయడంతో పాటు ప్రతీ సెంటర్ ద్వారా వెయ్యిమంది విద్యార్థులతో రెండు నుంచి మూడుకోట్ల అదాయాన్ని అందించేలా విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మా సెంటర్ కు వచ్చే విద్యార్ధుల్లో 80 శాతంమంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వారే కావడం విశేషం”-విజయ్
ప్లాష్ బ్యాక్...
ఒకసారి గతంలోకి వెళ్తే..హైదరాబాద్ జేఎన్టీయూలో బీటెక్ పూర్తిచేసిన విజయ్.. ఆ తర్వాత ఎంఎస్ కోసం అమెరికా వెళ్లారు. చదువు పూర్తయిన వెంటనే ఆసెంచర్ లో ఉద్యోగం వచ్చింది. కొన్నేళ్లకు ఆర్థికమాంద్యం ఎఫెక్ట్ తో ఆ కంపెనీలో ఉద్యోగం పోయింది. అప్పుడప్పుడే డాట్ కామ్ బూమ్ ఓ రేంజిలో ఉంది. తను సంపాదించిన దానితో పాటు కొంతమంది భాగస్వాములతో కలిసి 25 మిలియన్ డాలర్ల పెట్టుబడితో గ్రానిటార్ పేరుతో ఓ ఐటీ కన్సల్టెన్సీని ప్రారంభించారు. మొదట్లో లాభాలొచ్చినా..డాట్ కామ్ బూమ్ బుడగలా పేలిపోవడంతో నష్టం నషాళానికి అంటింది. బిజినెస్ పూర్తిగా దివాళా తీసింది. ఆశలన్నీ ఆవిరయ్యాయనుకునే లోపే ఇన్ఫోసిస్, విప్రో, వర్చూసా వంటి ప్రముఖ కంపెనీలు మంచి ప్యాకేజ్ తో ఉద్యోగం ఆఫర్ చేశాయి. వాటిలో విప్రోని ఎంచుకుని ఫ్యామిలీతో కలిసి బెంగళూరుకి షిప్టయ్యాడు. అక్కడ తన పనితీరుతో అప్పటి సీఈవో టే.కే.కురియన్ ఇంప్రెషన్ కొట్టేశాడు. 2007 లో విప్రో యూరప్ ప్రాజెక్ట్ చేపట్టే అవకాశం విజయ్ కి దక్కింది. అది లీన్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ .అప్పుడే చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చిన వాళ్లను తీసుకుని పని పూర్తిచేయాలి. కానీ కొత్తవాళ్లతో ప్రాజెక్ట్ ఆశించిన స్థాయిలో ముందుకు జరగడం లేదని అర్థమైంది. ఈ సమస్య మూలాలు వెతికే ప్రయత్నంలో ఆయనకో విషయం స్పష్టంగా అర్థమైంది. కాలేజీ చదువు పూర్తి చేసుకుని క్యాంపస్ నుంచి నేరుగా ఆఫీసుల్లోకి అడుగుపెట్టిన విద్యార్థులకు ఇండస్ట్రీ గురించి గానీ.. వాళ్లు చేసే ప్రాజెక్ట్ పైన గానీ అస్సలు అవగాహన ఉండడం లేదని. అసలు 90 శాతం మంది బేసిక్స్ స్కిల్స్ కూడా లేకుండానే ఉద్యోగాల్లో చేరుతున్నారని అవగతమైంది. గ్రౌండ్ రియాలిటీ తెలసుకోవాలని చాలా కాలేజీలు తిరిగాడు.. ఆంధ్రప్రదేశ్ లోని చాలా ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని విజయ్ కి అర్థమైంది. అప్పుడే కొన్ని కళాశాలలకి వెళ్లి అక్కడ ప్లేస్ మెంట్ డ్రైవ్స్ జరిగే పద్దతిని, రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ని పరిశీలించాడు. ఉద్యోగాల ఎంపికలో విద్యార్థి ఐక్యూని తప్ప నిజమైన వర్క్ స్కిల్స్ ని పరీక్షించడం లేదనే విషయం అర్థమైంది. దీంతో ఈ గ్యాప్ ని ఫిల్ చేసి, నాణ్యమైన విద్యార్థులను పరిశ్రమకు అందించేందుకు తనే సొంతంగా ఓ స్టార్టప్ ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.
లాస్ట్ మైల్ అంకురార్పణ
విప్రో జాబ్ కి రిజైన్ చేసి లాస్ట్ మైల్ సొల్యూషన్స్ పేరుతో ఓ స్కిల్ డెవలెప్ మెంట్ ఇన్ స్టిట్యూట్ ప్రారంభించాడు. ఓ వైపు ట్రైనింగ్ సెంటర్ నడుపుతూనే మరోవైపు కాలెజీల్లో తిరుగుతూ శిక్షణా తరగతుల్లో పాల్గొంటూ విద్యార్థులకు అవగాహన కల్పించేవాడు. ట్రైనింగ్ సెషన్స్ కి వచ్చిన వాళ్లంతా అలా విని ఇలా దిలేసే వారే తప్ప -సీరియస్ గా తీసుకునేవారు కాదు. దీంతో లాస్ట్ మైల్ కి స్పందన అంతంత మాత్రంగానే ఉండేది. చివరికి తన ఐడియాల్ని అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి వివరించి ప్రభుత్వ భాగస్వామ్యం తో కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకుని ఆయన అపాయింట్ మెంట్ కోరాడు. అదే సమయంలో ఓ స్కిల్ డెవలెప్ మెంట్ స్కీమ్ కోసం ఆలోచిస్తున్న వైఎస్ కూడా విజయ్ ఐడియాలజీ నచ్చి.. అపాయింట్ మెంట్ ఇచ్చారు. దీంతో విజయ్ లో మళ్లీ ఆశలు చిగురించాయి. అంతలోనే మరో ట్విస్ట్. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోయారు. మళ్లీ కష్టాలు మొదటికొచ్చాయి.వైఎస్ మరణం తర్వాత తెలంగాణ విభజన ఉద్యమం ఊపందుకోవడంతో పాటు నిర్వహణ ఖర్చులు రోజు రోజుకీ ఎక్కువయ్యాయి. చివరకి ఇక లాభం లేదని లాస్ట్ మైల్ ని మూసేయ్యాలనే నిర్ణయానికి వచ్చాడు.
సరికొత్త ప్రారంభం
కానీ తన ఐడియాలజీ మీదున్న నమ్మకంతో మూసేయ్యాలనుకున్న దాన్ని కాస్త మళ్లీ కొత్తగా ప్రారంభించాడు. ఈసారి స్టూడెంట్స్ కి చేరువలో ఉండాలని బస్టాప్ కి దగ్గర్లోనే అఫీస్ ని తీసుకొని దాంట్లో ఓ గది ని కంప్యూటర్ ల్యాబ్ గా మార్చాడు. అలా బంద్ టైంలో కూడా విద్యార్థులు తప్పకుండా క్లాసులకు హాజరయ్యేలా చూసుకున్నాడు. తన దగ్గరకు ట్రైనింగ్ కి వచ్చే వాళ్లలో చాలా మంది పేద విద్యార్థులు ఉండడంతో వారికి ఫీజులో రాయితీ కూడా ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉండేవాడు. రాను రాను ట్రైనింగ్ కి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరగడంతో తన స్టూడెంట్స్ నే సహాయకులుగా నియమించుకున్నాడు. ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షించేందుకు మే 2011 లో లాస్ట్ మైల్ కైజెన్ పేరుతో ఓ పేస్ బుక్ పేజ్ తెరిచారు. జాబ్ అప్ డేట్స్, ఇంటర్వూ టెక్నిక్స్, కౌన్సిలింగ్ వంటి వాటిలో విద్యార్థులకు ఉచిత సలహాలు సూచనలు ఇస్తుండడంతో అనతి కాలంలోనే 25వేల మంది కనెక్టయ్యారు. ఈ గ్రూప్ పేస్ బుక్ లో యమ పాపులర్ అయ్యింది. దాదాపు 4000 మంది వరకూ గ్రూప్ విద్యార్థులు మంచి ఉద్యోగాలు సంపాదించగలిగారు. కాలేజ్ వర్క్ షాప్స్ సక్సెస్ అవ్వడంతో విజయ్ పేరు అంతటా మార్మోగిపోయింది. విజయ్ సక్సెస్ గురించి విన్న అహ్మదాబాద్ ఐఐఎం డైరెక్టర్ ఎన్వీ రమణ తమ స్టూడెంట్స్ కు కూడా ట్రైనింగ్ ఇచ్చేలా విజయ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
విజయం వైపు తొలి అడుగులు
2014 అక్టోబర్ లో విజయ్ తన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కి ప్రభుత్వం తరపునుంచి సాయం అందించాలని కోరుతూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. 2015 ఏప్రిల్ లో కేటీఆర్ నుంచి పిలుపు అందింది. తెలంగాణ అకాడమీ అఫ్ స్కిల్ డెవలెప్ మెంట్ (టాస్క్) అఫీస్ కి వచ్చి సీఈవో సుజీవ్ నాయర్ ని కలవాలని దాని సారాంశం. వెంటనే వచ్చి నాయర్ ని కలిసి తన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోని ప్రత్యేకతలను వివరించారు.
లాస్ట్ మైల్ ట్రెయిన్ చేసిన స్టూడెంట్స్ లో 80 శాతం మంది మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. పైగా వాళ్లంతా గ్రామీణ ప్రాంత విద్యార్ధులే ..ఇదే ఆయన్ని బాగా ఆకర్షించింది.
ఓ గంట సుదీర్ఘ చర్చల తర్వాత లాస్ట్ మైల్ తో ఓ పైలట్ ప్రాజెక్ట్ చేసేందుకు టాస్క్ తో ఒప్పందం కుదుర్చుకుంది. గత ఆగస్ట్ 3న వరంగల్ లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. 10-12 వారాల సాగిన ఈ ట్రైనింగ్ సెషన్ లో 100 మంది బీటెక్, ఎంసీఎ విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్కో విద్యార్థికి కేవలం 2000 రూపాయల ఖర్చుతో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమం అద్భుత ఫలితాలనిచ్చింది.
విజయ్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. ఈ గ్రూప్ లోని 25 మంది విద్యార్థులు 4 ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 75 శాతం మంది విద్యార్థులు ఇంటర్వూ ఫైనల్ రౌండ్ కి వెళ్లారు. 60 శాతం మంది విద్యార్థులు అప్టిప్యూడ్ రౌండ్ వరకూ క్లియర్ చేయగలిగారు. మిగిలిన విద్యార్థులకు ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ డ్రైవ్ కంప్లీటైన తర్వాత టాస్క్ ఇంటర్వూలు నిర్వహించింది.
యువర్ స్టోరీ.కామ్ టేక్
కేపీఎంజీ. ఎన్ఎస్ డీసీ వంటి సంస్థల అధ్యయనాల ప్రకారం 2022 కల్లా ఇండియాలో 500 మిలియన్ స్కిల్డ్ ఎంప్లాయీస్ అవసరం ఉంది. కానీ ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారిలో 15 శాతం కూడా ఉద్యోగాలకు సరిపోయేవారు లేరు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే సౌత్ కోరియాలో 96 శాతం, జపాన్ లో 80 శాతం, జర్మనీలో 75 శాతం, బ్రిటన్ లో 70 శాతం స్కిల్డ్ మ్యాన్ పవర్ అందుబాటులో ఉంది. వాటితో పోల్చుకుంటే ఇండియాలో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ 2 శాతం మాత్రమే. ఈ గ్యాప్ ని ఫిల్ చేసేందుకు ఈ మధ్యకాలంలో ఒరియన్ ఎడ్యుటెక్, వర్క్ బెటర్, ఎడ్జ్ ఫిక్సిట్స్, అప్లికేట్, డిజైర్.కామ్ వంటి స్టార్టప్స్ పుట్టుకొచ్చాయి. కానీ ఈ రంగంలో మార్కెట్ బాగా విస్తరించడంతో అవసరాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని ఎదగాలంటే టెక్నాలజీని మరింత బాగా వినియోగించుకోవాల్సిన అవసరం విజయ్ కి ఎంతైనా ఉంది.