కంపెనీ రిజిస్ట్రేషన్ వ్యవహారాలు చూసుకునే 'ఇండియా ఫైలింగ్స్'
భారతదేశంలో ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభించాలంటే చాలా కష్టం. అది ఏ రకమైన వ్యాపారమైనా....స్వదేశీయులు, విదేశీయులు ముక్తకంఠంతో ఈ విషయంపై విమర్శలు చేస్తుంటారు. చాంతాండంత విధివిధానాలు పూర్తిచేసి అనుమతులు తెచ్చుకునేసరికి వ్యాపారంపై ఉన్న ఆసక్తి కాస్తా పోయి విసుగు వచ్చేస్తుంది. ప్రపంచ బ్యాంకూ ఇదే విషయాన్ని తెలియజేసింది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం చేయటం అనుకూలంగా ఉన్న దేశాల్లో భారత్ 142వ స్థానంలో ఉంది. మొత్తం 189 దేశాలుంటే మనదేశం 142 వ స్థానంలో ఉందంటే యువ పారిశ్రామిక వేత్తలకు ఇక్కడ ఎంత అనువైన వాతావరణం ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే 2013తో పోలిస్తే పరిస్థితి కాస్త మెరుగుపడ్డా ఇంకా మనం ఎక్కడో వెనకే ఉన్నాం.
పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం విధివిధానాలను సులభతరం చేస్తోంది. అలాగే విస్తృత అవకాశాలున్న మార్కెట్ సామర్థ్యాన్ని ప్రయివేట్ వ్యక్తులు గుర్తిస్తున్నారు. ఆ కోవకే చెందుతారు లియోనెల్ చార్లెస్.
పారిశ్రామికవేత్త కావాలనుకున్న చార్లెస్ సొంతంగా న్యూట్రాస్యూటికల్ వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నారు. విధివిధానాల లోపం వల్ల ఆ ప్రణాళిక విఫలమయింది. దీనికి తోడు విజ్ఞానవేత్తగా ఆయనకు ఎలాంటి శిక్షణా లేదు.
నిజానికి ఆయన అమెరికాలో పబ్లిక్ ఎకౌంటెంట్ పట్టా పొందారు. ఆయన పొందిన శిక్షణ ద్వారా ఇప్పటిదాకా ఏం చేశారో అదే చేయాలని కోరుకుంటున్నారు. అనుకోకుండా అవకాశం దానంతట అదే వచ్చింది. తన ఆన్‌లైన్ బిజినెస్‌ను మొదలుపెట్టాలని క్లయింట్ ఒకరు చెప్పటంతో చార్లెస్ మనసులో కొత్త వ్యాపారంపై ఆలోచన మొదలయింది.
అలా తండ్రి ఎల్ చార్లెస్‌తో కలిసి లియోనిల్ చార్లెస్ 2013లో ఇండియా ఫైలింగ్స్.కామ్ స్థాపించారు. ఈ వెబ్ సైట్ కొత్త వ్యాపారాలను ప్రారంభించటం, రిజిస్టర్ చేయటంతో పాటు టాక్స్ ఫైలింగ్ వంటి ఇతర వ్యవహారాల్లో సేవలందిస్తోంది. ఇద్దరితో ప్రారంభమైన కంపెనీలో ప్రస్తుతం 15 మంది టెక్నికల్ బృందం సహా 110 మంది సిబ్బంది ఉన్నారు.
“మార్గనిర్దేశనంలో నిపుణుల సాయం తీసుకుంటే...తాము మరింత మెరుగ్గా చేయగలుగుతామని సాధారణంగా ప్రజలు అనుకుంటూ ఉంటారు. విధివిధానాలను ప్రభుత్వం సులభతరం చేసినప్పటికీ... సీఏ లేదా కంపెనీ సెక్రటరీ అవసరం ఇంకా ఉంది. వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఎలాంటి తప్పులూ చేయకుండా పర్యవేక్షించటానికి వీరి అవసరం ఉంది. ఇండియా ఫైలింగ్స్. కామ్ ఈ విధమైన సేవలే అందిస్తోంది” అని చార్లెస్ చెప్పారు. ”
టెక్నాలజీ ఉపయోగంలోనే తేడా
సామర్థ్యాలను సృష్టించటంలో టెక్నాలజీని ఉపయోగించటంపైనే...స్టార్టప్‌ల ప్రభావం, తేడా ఆధారపడి ఉంటుంది. తప్పులను తగ్గించటానికి, పరిస్థితులను పరిశీలించటానికి టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
వినియోగదారులతో ఒప్పందం కుదుర్చుకుని వారి వ్యవహారాల్లో సాయపడటానికే పరిమితమవ్వాలని ఇండియా ఫైలింగ్స్.కామ్ కోరుకోవటం లేదు. వ్యాపారం కొనసాగినంతకాలం వారితో భాగస్వామ్యంతో ఉండాలని భావిస్తోంది. అందుకే ఐసీఎఫ్ ఓ పేరుతో ఓ ప్లాట్‌ఫాంను ప్రారంభించారు చార్లెస్.
స్టార్టప్‌ల కోసం పత్రాలు తయారుచేయటం ప్రారంభంతో ఆగిపోదని, వ్యాపార కార్యకలాపాల కోసం దీర్ఘకాలికంగా వాటి అవసరం ఉంటుందని చార్లెస్ చెప్పారు. ఐసీఎఫ్ సరైన సమయానికి అలాంటి అనేక డాక్యుమెంట్లు తయారుచేస్తుంది. ఆన్ లైన్‌లో ఆ ప్రశ్నలకు వినియోగదారులు సైతం సమాధానమిచ్చేలా అవి ఉంటాయి.
“నియామక పత్రం కానీ, బహిరంగ పర్చని ఉద్యోగ ఒప్పంద పత్రం కానీ ఇవ్వాలని కోరుతూ స్టార్టప్ నిర్వాహకులు తిరిగి మా దగ్గరకు వస్తారు. మా దగ్గర అలాంటివి 50 డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంటాయి. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను కొన్ని ప్రశ్నలడిగి, వారిచ్చే సమాధానాల ఆధారంగా సరైన సమయానికి డాక్యుమెంట్లు తయారుచేస్తాం. మొదటగా మేం చేసే పని ఇది ” అని ఇండియా ఫైలింగ్ విధివిధానాలను ఎంతో గర్వంతో వివరించారు చార్లెస్.
ఐసీఎఫ్ ఓ ఫ్లాంట్ ఫాం యాప్ లో రిమైండర్ ఫీచర్ కూడా ఉంది. టీడీఎస్ రిటర్న్స్ వంటి విషయాలను కొందరు వ్యాపారవేత్తలు గుర్తుపెట్టుకోలేరు. డాక్యుమెంట్లను ఫైలింగ్ చేయటానికి మూడు నాలుగు రోజుల ముందు ఈ యాప్ వారికి ఆ విషయాన్ని రిమైండర్ ద్వారా గుర్తుచేస్తుంది. ఐసీఎఫ్ ఓ ప్లాట్ ఫాంను రోజుకు 50 మందికి పైగా క్లయింట్లు వీక్షిస్తున్నారు.
కంపెనీ వృద్ధి, ఆదాయం
ఇండియా ఫైలింగ్.కామ్ ప్రస్తుతం నిలకడైన వృద్ధిని సాధిస్తోంది. కోటి రూపాయల పెట్టుబడితో ఇది ప్రారంభమైంది. నెల నెలకూ ఆదాయం 20 శాతం పెరుగుతూ వస్తోంది. వెబ్ సైట్‌ను రోజుకు సుమారు 13వేలమంది వీక్షిస్తున్నారు. కొత్త వెర్షన్ మొబైల్ యాప్‌తో ముందుకు రావాలని చార్లెస్ భావిస్తున్నారు. త్వరలోనే దాన్ని ప్రారంభించనున్నారు. ఈ స్టార్టప్ లో ఉన్న మరో ఆసక్తికర ఫీచర్ 30 నిమిషాల్లో ట్రేడ్ మార్క్. ఓ సంస్థ ట్రేడ్ మార్క్‌ను సరిగ్గా 30 నిమిషాల్లోనే రిజిష్టర్ చేయటం దీని ప్రత్యేకత.
తమ ప్రయాణం చాలా సాఫీగా జరిగిపోతోందంటున్నారు చార్లెస్. వ్యాపారాలను ప్రారంభించటం సులభతరం చేయాలన్న ఆలోచనలోనే ప్రభుత్వం ఉండటం తమకు ఎంతో అనుకూలంగా ఉందని తెలిపారు. ఇటీవలే ప్రారంభించిన ఫాస్ట్ ట్రాక్ కంపెనీ ఐఎన్‌సీ 29 రిజిస్ట్రేషన్ కు అనుసరించిన విధానమే ఆ ఆలోచనకు నిదర్శనమని ఆయన చెప్పారు.
క్లయింట్లు
షాపులు, రెస్టారెంట్లు వంటి సాధారణ వ్యాపారాలు ప్రారంభించే వ్యాపారవేత్తలు ఇండియా ఫైలింగ్.కామ్‌కు క్లయింట్లుగా ఉన్నారు. ఇలా నెలకు 500కు పైగా వ్యాపారస్తులు వెబ్ సైట్‌కు క్లయింట్లుగా మారుతున్నారు. కొత్త వ్యాపారాల్లో టెక్నాలజీ స్టార్టప్స్ కోసం వచ్చేవారు 20 నుంచి 30శాతం మాత్రమే. క్లయింట్లు ఎక్కువగా మెట్రో, టైర్ 1 నగరాలకు చెందిన వారు. కొందరు విదేశీయులు కూడా ఇండియా ఫైలింగ్.కామ్‌కు క్లయింట్లగా ఉన్నారు.
పరిశ్రమలో ఇతర కంపెనీలు
ప్రభుత్వం 2009లో పరిమిత బాధ్యత భాగస్వామ్యం పద్దతి (LLP)ని ప్రారంభించటంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎక్కువమంది ఇన్కార్పొరేటెడ్ LLP విధానాన్నే కోరుకుంటున్నారు.
వకీల్ సెర్చ్, క్విక్ కంపెనీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎంసీఏ లెక్కల ప్రకారం మార్కెట్ సామర్థ్యం పెద్ద స్థాయిలో ఉంది. మార్కెట్లో ప్రవేశించటానికి ఇతర ప్రయివేట్ వ్యక్తులకు కావల్సినంత అవకాశం ఉంది.
కొత్త విధానాలు
ఆన్‌లైన్ విధానంలో విశ్వసనీయత, రహస్యంగా ఉంచగలిగే అవకాశం ఉంటుందా అనే అనుమానాలకు చార్లెస్ ఇలా బదులిస్తారు. “ఆన్ లైన్ సేవలను ప్రజలు ఎక్కువగా నమ్మే సంస్కృతి పెరుగుతోంది. సీఏ సేవలను తాత్కాలికంగా వినియోగించుకునే సంస్కృతి నెమ్మదిగా తొలగిపోతోంది. ఈ-కామర్స్‌కు లభిస్తున్న ఆదరణ ఆన్‌లైన్ వేదికలను నమ్మేందుకు సాయపడుతుంది. కార్యకలాపాలు చురుగ్గా ఉంచుకునే క్లయింట్లకు వారి సంస్థల్లో ఏం జరుగుతుందో సమాచారం తెలియజేసే ఫీచర్లు ఉంటాయి. వీటిద్వారా నమ్మకం పెంచవచ్చు. అయితే అలాంటి భరోసా కల్పించటానికి ఒప్పందం కుదుర్చుకోవటం ప్రధానమని ఇండియా ఫైలింగ్స్.కామ్ నమ్ముతోంది ” అని ఆన్ లైన్ భవిష్యత్తును వివరించారు చార్లెస్.