ఆట సాయంతో చదువులో చురుకు పెంచుతున్న ‘క్రాస్ ఓవర్ అకాడమీ’
ఆటలేమైనా అన్నం పెడతాయా అంటూ పిల్లల్ని వారి తల్లిదండ్రులు వారించడం చూస్తూనే ఉంటాం. కానీ ఆ ఆటతోనే పిల్లల భవిష్యత్ ను ఉజ్వలంగా మార్చవచ్చంటున్నారు చెన్నైకి చెందిన షాన్ జయచంద్రన్. ఆయన స్థాపించిన క్రాస్ ఓవర్ బాస్కెట్ బాల్ అకాడమీ ఇప్పుడు కొన్ని వందల మంది విద్యార్థులను ఇటు ఆటలోనూ.. అటు చదువులోనూ రాణించేలా చేస్తోంది. నిజానికి ఆటే వారిని చదువులోనూ ముందువరుసలో నిలుపుతోంది.
అనాథాశ్రమంలో పుట్టిపెరిగిన షాన్ జయచంద్రన్ తల్లి మొదట ఎవరో స్పాన్సర్ చేస్తే చదువుకుంది. తర్వాత ఆమే ఓ యూనివర్సిటీ స్కాలర్ షిప్ పొందే స్థాయికి ఎదిగింది. జీవితంలో ఆమె పోరాడిన తీరు షాన్ పై చాలా ప్రభావం చూపింది. అధ్యాపకుడిగా.. బాస్కెట్ బాల్ కోచ్ గా జయచంద్రన్ అమెరికాలో స్థిరపడ్డారు. భారత్‌లో క్రీడాభివృద్ధికి, గ్రాడ్యుయేషన్ రేట్ తక్కువగా ఉండటానికి మధ్య సంబంధం ఉందన్నది ఆయన నమ్మకం. ఆట ద్వారా విద్యార్థులను చదువుకు దగ్గర చేయొచ్చని భావించిన షాన్ జయచంద్రన్.. 2010లో అమెరికాలో ‘క్రాస్ ఓవర్ బాస్కెట్ బాల్ అండ్ స్కాలర్స్ అకాడమీ’ని ఓ లాభాపేక్ష లేని సంస్థగా ప్రారంభించారు. అప్పటి నుంచి తన సంస్థను ముందుకు తీసుకెళ్లడానికి వివిధ క్యాంపులకు హాజరయ్యారు. నిపుణుల ఉపన్యాసాలు విన్నారు. ‘స్పోర్ట్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్’ సంస్థలతో కలిసి పనిచేశారు.
యువత చదువే లక్ష్యంగా..
భారత్ లో మధ్యలోనే చదువు మానేస్తున్నవారి సంఖ్యను తగ్గించడానికి, ఆట ద్వారా చదువుపై ఆసక్తి పెంచడానికి క్రాస్ ఓవర్ అకాడమీ క్రుషి చేస్తోంది. ‘ప్రపంచంలోని యువతలో దాదాపు 20 శాతం మంది భారత్ లోనే ఉన్నారు. వారిలో 90 శాతం మంది తమ చదువు పూర్తి చేయకపోతే అది ప్రపంచ యువతలో 18 శాతానికి సమానమవుతుంది. రానురాను ఈ సంఖ్య మరింత పెరుగుతూ పోతుంది. దానికి అడ్డుకట్ట వేయడమే మా లక్ష్యం. దానిని చేరుకోవడానికి ఆటకు, చదువుకు ముడిపెట్టాలని నిర్ణయించుకున్నాం’ అని జయచంద్రన్ అంటున్నారు. విద్యార్థులను ఒక ప్రొఫెషనల్ అథ్లెట్‌గా మార్చడం తమ ఉద్దేశం కాదని.. ఆట ద్వారా చదువు కొనసాగించడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దీనికి సానుకూలంగా స్పందించారు. పెద్దగా స్థలం, వనరులు అవసరం లేని బాస్కెట్ బాల్ ఆటను ఇండియాలాంటి దేశంలో ముందుకు తీసుకెళ్లడం పెద్ద కష్టమేమీ కాదని షాన్ భావించారు. ప్రొఫెషనల్ అథ్లెట్‌ను తయారు చేయడం లక్ష్యం కాకపోయినా.. ఇక్కడ సత్నమ్ సింగ్ లాంటి వ్యక్తి మరొకరు పుట్టుకొస్తారన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదే ఎన్‌బీఏ (నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్) టోర్నీలో ఆడిన తొలి భారతీయునిగా సత్నమ్ సింగ్ చరిత్ర సృష్టించారు. మారుమూల పల్లెలో పుట్టిపెరిగిన సత్నమ్ కు.. అతని తండ్రి చిన్నప్పుడే బాస్కెట్ బాల్ కోచింగ్ ఇప్పించారు. ఈరోజు అతనీ స్థాయికి చేరడానికి ఆనాడే బీజం పడింది.
ఏడాదికి పది రోజులు
2012లో క్రాస్ ఓవర్ తొలిసారి చెన్నై అడయార్ లోని సెయింట్ పాట్రిక్ స్కూల్ తో కలిసి తన తొలి ప్రాజెక్ట్ ను విజయవంతంగా పూర్తి చేసింది. ముగ్గురు క్రాస్ ఓవర్ నిర్వాహకులు ఎనిమిది రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీని ప్రభావం విద్యార్థులపై స్పష్టంగా కనిపించింది. ఆట ద్వారా వాళ్లలో నేర్చుకోవాలన్న తపన పెరిగింది. సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ఆసక్తి కనబరిచారు. అన్నిటికీ మించి చదువుపై శ్రద్ధ పెరిగింది. ‘మా మెథడాలజీని మార్చుకుంటూ ముందుకు వెళ్లినకొద్దీ విద్యార్థుల్లో గణనీయమైన మార్పు రావడాన్ని గమనించాం. స్థానికంగా వివిధ స్కూళ్లతో సంబంధాలు మెరుగుపరచుకోవడంపైనా దృష్టిసారించాం. అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ చెన్నై కూడా వీటిలో ఒకటి’ అని షాన్ తెలిపారు. క్రాస్ ఓవర్ కార్యక్రమం పది రోజుల పాటు సాగుతుంది. ప్రతి రోజు విద్యార్థులకు క్లాస్ రూమ్ సెషన్స్, యోగా, బాల్ హ్యాండ్లింగ్, బాల్ షూటింగ్/పాసింగ్‌లపై శిక్షణ ఇస్తారు. పది రోజుల తర్వాత పాల్గొన్న ప్రతి విద్యార్థికి ఒక క్రాస్ ఓవర్ షర్ట్, ఓ బాస్కెట్ బాల్ ఇస్తారు. కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ప్రత్యేకంగా ఓ పాఠ్యప్రణాళిక రూపొందించి అక్కడి ఉపాధ్యాయులకు అందజేస్తారు. విద్యార్థులు తమ చదువు కొనసాగించే దిశగా ప్రేరేపిస్తూ మెదడుకు మేతలాంటి క్రీడలపై ప్రత్యేకంగా ఆ పాఠ్య ప్రణాళికను రూపొందిస్తారు. ‘మా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కార్పొరేట్ స్పాన్సర్ల కోసం ఎదురుచూస్తున్నాం. దీనిద్వారా రీసెంట్‌గా డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు ఏడాదిపాటు ఫెలోషిప్ అందించే వీలు కలుగుతుంది. ఇలా శిక్షణ పొందిన విద్యార్థులు.. ప్రతి విద్యార్థి దగ్గరికి వారానికోసారి వెళ్లి స్కూళ్లలో వారి హాజరు శాతం, చదువులో వారు రాణిస్తున్న తీరును ఎప్పటికప్పుడు నమోదు చేయడంతోపాటు వారితో బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటారు. ఇలా ఎంత ఎక్కువ మంది విద్యార్థులను మేము పరిశీలిస్తూ ఉంటే అంతలా మా కార్యక్రమంలో మార్పులు చేసుకుంటూ మా విద్యార్థులు చదువులో రాణించేలా చేయగలం’ అని షాన్ జయచంద్రన్ చెబుతున్నారు. ఈ ఏడాది క్రాస్ ఓవర్ అకాడమీ నిర్వహించిన కార్యక్రమంలో 400కు పైగా విద్యార్థులు పాల్గొనడం గమనార్హం. వారికి అమెరికాలోని ఎనిమిది ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థి అథ్లెట్లు శిక్షణ ఇచ్చారు. వీరిలో కొందరు ఐవీ లీగ్స్ లో పాల్గొన్నవారు కూడా ఉండటం విశేషం.
ఆడపిల్లలే ఎక్కువ
క్రాస్ ఓవర్ అకాడమీ తాము నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో బాలబాలికలు సమాన సంఖ్యలో ఉండేలా చూసుకుంటుంది. అయితే రెండో ఏడాది మాత్రం దీనికి విరుద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో 65 శాతం మంది బాలికలే కావడం విశేషం. నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వం, టీమ్ వర్క్, కమ్యూనికేషన్ లాంటి వాటి గురించి నేర్చుకోవడానికి బాలికలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తమ పిల్లలు క్రాస్ ఓవర్ నిర్వహించే కొన్ని కార్యక్రమాల్లోనైనా పాల్గొనడానికి తాము తమ పనిని తొందరగా పూర్తి చేసుకుంటున్నామని సదరు బాలికల తండ్రులు తనతో చెప్పినట్లు షాన్ తెలిపారు.
దాతల కోసం ఎదురుచూపు
ఇటు చదువులో, అటు ఆటల్లో ఆసక్తి ఉన్నవారిని క్రాస్ ఓవర్ కార్యక్రమాలు ఆకర్షిస్తున్నా.. దాతలుగానీ, పెట్టుబడిదారులుగానీ ముందుకు రావడం లేదని షాన్ వాపోతున్నారు. అంతేకాదు ఆటకు, చదువుకు ఉన్న సంబంధం ఏంటో భారత్‌లోని చాలా ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నాయి. క్రాస్ ఓవర్ తన తొలి కార్యక్రమాన్ని నిర్వహించడానికి 7000 డాలర్లు ఖర్చు చేసింది. ఇప్పటికీ రెండు వారాల కార్యక్రమం నిర్వహించడానికి ఒక్కో విద్యార్థికి వంద డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేకపోతోంది. ‘ఇదే కార్యక్రమం అమెరికాలో నిర్వహించినపుడు ఒక్కో విద్యార్థికి వారం రోజులకే 300 డాలర్లు ఖర్చు చేయగలిగాం. గ్రాడ్యుయేషన్ రేట్ పెంచడంలాంటి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేస్తున్నపుడు దాతలు, స్పాన్సర్లను పట్టుకోవడం కష్టమే అవుతుంది. దీర్ఘకాలంలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ఈ సమస్యను అధిగమించాల్సిన అవసరం ఉంది’ అని షాన్ చెప్పారు. క్రాస్ ఓవర్ స్టార్టప్ వలంటీర్లతోనే మొదలైంది. జీతాలు అందుకునే ఉద్యోగులు ఇందులో లేరు. అయితే చాలా వరకు అమెరికాకు చెందిన కాలేజీలు, హైస్కూళ్ల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ముందుకు వస్తుండటంతో క్రాస్ ఓవర్‌కు వలంటీర్ల కొరత లేకుండా పోయింది. ప్రస్తుతానికి అకాడమీ వ్యక్తిగత విరాళాలు, చిన్నచిన్న గ్రాంట్లపై ఆధారపడి నడుస్తోంది. ‘బియాండ్ స్పోర్ట్స్ అవార్డు’తో పాటు యూఎస్ కాన్సులేట్, యూఎస్ ఎంబసీ, యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ ఇచ్చే గ్రాంట్ల కోసం క్రాస్ ఓవర్ దరఖాస్తు చేసుకుంది. అకాడమీ కార్యక్రమాలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా బాగానే ఉంది. కొంతమంది తమ కార్యక్రమాలను విరివిగా నిర్వహించాలని కోరుతున్నారని షాన్ చెబుతున్నారు. ట్యూషన్లు లేని స్కూళ్లను తయారు చేయడమే తన అంతిమ లక్ష్యమని ఆయన అంటున్నారు. చదువు, ఆటలను సమానంగా ప్రోత్సహిస్తూ విద్యార్థులను గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నవారిగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో చెన్నైలో ఫెలోషిప్ మోడల్‌ను రూపొందించడంతోపాటు దేశంలోని మిగతా నగరాలకు కూడా క్రాస్ ఓవర్ కార్యకలాపాలను తీసుకెళ్లాలని షాన్ జయచంద్రన్ భావిస్తున్నారు.