సోలార్ టెక్నాలజీతో అద్భుతాలు చేస్తానంటున్న లక్నో యువకుడు
విద్యుత్ లేని ప్రపంచాన్ని ఊహించగలమా..? విద్యుత్ వినియోగం లేకుండా బతకగలమా..? ఊహే కష్టంగా వుంది కదా. మరి అంతలా కరెంట్ మన దైనందిన జీవితంలో భాగమైంది . ప్రస్తుతం కరెంటు లేకపోతే క్షణం కూడా గడవని పరిస్థితి . అలాంటిది విద్యుత్ తో అవసరం లేని లోకాన్ని ఒక కొత్త ప్రపంచాన్ని ఊహించండి. కష్టం కదా.. కానీ టెక్నాలజీని ఉపయోగించుకుని విద్యుత్ తో పనేలేని లోకం సృష్టించడానికి శ్రమిస్తున్నాడు ఓ ముప్పై మూడేళ్ల లక్నో యువకుడు.
బిగ్ ఐడియాస్
యోగి త్రిపాఠి. వయసు 33. పూనేలోని ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన యోగికి సోలార్ ఎనర్జీపై ఇంట్రెస్ట్ ఎక్కువ. అదే ఆయనను ఆ రంగంపై దృష్టి పెట్టేలా చేసింది. నిజానికి సోలార్ ఎనర్జీ టెక్నాలజీలో మాస్టర్స్ చేయాలన్న కోరికతో ఆస్ట్రేలియా వెళ్లాడు. అయితే కోర్సులో చేరిన రెండు నెలలకే ఆయన అభిప్రాయం మార్చుకున్నాడు. పుస్తకాల్లో నేర్పే చదువు కన్నా ప్రాక్టికల్ గా చేస్తే వచ్చే అనుభవమే మంచిదన్న నిర్ణయానికొచ్చాడు. పెట్టా బేడా సర్దుకుని ఇండియా విమానం ఎక్కేశాడు. అలా భారత్‌కు తిరిగొచ్చిన యోగి 2008లో ఆన్ లైన్ సోలార్ స్టోర్ ప్రారంభించాడు.
రూ. 50 ఖర్చుతో 60కిలోమీటర్ల ప్రయాణం
సోలార్ ఎనర్జీపై ఉన్న ఆసక్తి యోగిలో దాగి ఉన్న ప్రతిభ బయటి ప్రపంచానికి తెలిసేలా చేసింది. అలా ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే సోలార్ ఎలక్ర్టిక్ కార్. యోగి తన మారుతి 800 కారును సోలార్ ఎలక్ట్రిక్ కారుగా మార్చేశాడు. ఒక్కసారి దాన్ని ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. అలా తీర్చిదిద్దాడు దాన్ని. 2 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ ఉపయోగించిన రూపొందించిన సోలార్ కారు తయారీకి ఆయన చేసిన ఖర్చు 5 లక్షల రుపాయలు. కారును ఒక్కసారి చార్జ్ చేసేందుకు అయ్యే వ్యయం 45 నుంచి 50 రూపాయలు. అంటే 50 రూపాయల్లోనే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చన్నమాట. అదే పెట్రోల్ కారుకు అయ్యే ఖర్చు 325 రూపాయలు. సోలార్ కారులో అమర్చిన బ్యాటరీ దాదాపు 50 వేల కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది.
తక్కువ ఖర్చుతో సోలార్ ప్రోడక్ట్స్
సోలార్ ప్రాజెక్ట్స్ కు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. అందుకే వాటిని తక్కువ ధరకే లభించే సోలార్ ప్రొజెక్టర్స్, సోలార్ ఎనర్జీ గాడ్జెట్స్ తయారీపై దృష్టి పెట్టాడు యోగి. వాస్తవానికి 2010లో ఎలక్ట్రిక్ కార్, హోం ఎమిషన్ కంట్రోల్ సిస్టం లాంటి వాటిని తయారు చేసిన ఆయన మార్కెట్ ఫీడ్ బ్యాక్ నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాడు. భారత్‌లో సోలార్ ఎనర్జీ వినియోగం ఇప్పుడిప్పుడే పెరుగుతోందని... తక్కువ ధరకు సోలార్ ఉత్పత్తుల్ని అందిస్తే మార్కెట్‌ను శాసించడం ఖాయమని డిసైడయ్యారు.
ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ
భారత్ లో ఏటా 360 కోట్ల ఏఏ, ఏఏఏ, కాన్ డి సెల్స్ వాడి పారేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోలార్ స్టోర్ లో రీచార్జబుల్ ఎన్ఐఎమ్ హెచ్ సెల్స్ బ్యాటరీ ఛార్జర్స్ డెవలప్ చేశారు. వీటిని కనీసం వెయ్యి సార్లు రీచార్జ్ చేసుకుని ఉపయోగించుకునే వీలుంటుంది. వీటితో పాటు సూర్యకాంతిని ఉపయోగించి చార్జ్ చేసుకునే సోలార్ చార్జర్స్ కూడా రూపొందించారు.
“మార్కెట్లో ఎవరెడీ, నిప్పో, డ్యూరోసెల్ లాంటి ప్రముఖ కంపెనీలకు ప్రత్యామ్నాయంగా సోలార్ బ్యాటరీలను మార్కెట్ చేస్తున్నాం. గతంలో నెలకు 15 నుంచి 20వేల రూపాయల అమ్మకాలు జరిగేవి. ఇప్పడవి లక్షకు చేరాయి”.-యోగి
ప్రస్తుతం సోలార్ స్టోరుకు వస్తున్న లాభాలు సంస్థ నిర్వాహణకే సరిపోతున్నాయి. దీంతో ప్రొడక్ట్ ప్రమోషన్‌కి పబ్లిసిటీకి అవసరమైన నిధులు లేక అంతగా ప్రచారం చేయలేకపోతున్నాయి. క్యాపిటల్ ఇన్వెస్టర్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవరూ ముందుకు రాలేదు. అయినా ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగుతున్నానంటున్నారు యోగి.
“ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు సెల్ కన్వర్టర్స్, సోలార్ సెల్స్, ఛార్జర్స్ అందించే ఇండియాలో ఉన్న ఏకైక సంస్థ మాదే అనుకుంటా.”-యోగి
వినూత్నమైన ఆవిష్కరణలు చేయాలన్నదే యోగి లక్ష్యం. ఇందులో భాగంగా మనిషి కదలికలకు అనుగుణంగా పనిచేసే మోషన్ సెన్సార్ స్టీట్ ల్యాంప్, కేవలం 18 ఓల్ట్ కరెంటును మాత్రమే ఉపయోగించుకునే బ్యాటరీతో కూడిన ఎయిర్ కూలర్, బ్యాటరీ ఫుల్ అయిన వెంటనే ఆటోమేటిక్‌గా పవర్ డిస్ కనెక్ట్ చేసుకునే 12 ఓల్ట్ ల బ్యాటరీ డెవలప్ చేస్తున్నారు. ఆన్లైన్ వెబ్ కోసం 10 లక్షలు, డీలర్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ డెవలప్ చేసేందుకు 50 లక్షలు నిధులు సమీకరించాలన్నది సోలార్ స్టోర్ లక్ష్యం. ఇందుకోసం క్రౌడ్ ఫండింగ్ సంస్థ కెట్టో సాయం తీసుకుంటోంది.
యవర్ స్టోరీ.కామ్ టేక్
గతంతో పోలిస్తే ...గ్రీన్ ఎనర్జీ ఉపయోగం, లాభాలపై జనంలో అవగాహన పెరిగినప్పటికీ వెస్ట్రన్ కంట్రీస్ తో పోలిస్తే ఇంకా చాలా వెనుకబడే ఉన్నాం. ప్రపంచ వ్యాప్తంగా సోలార్ మొబైల్ ఫోన్స్, హీటింగ్ పరికరాలు, చార్జర్స్ కొత్త కాకపోయినా ఇండియాలో మాత్రం ఆ ఒరవడి ఇంకా మొదలుకాలేదు.
ఇతర వస్తువుల తయారీ దారులలాగే సోలార్ ప్రోడక్ట్స్ మాన్యుప్యాక్చర్స్ కూడా ఎక్కువగా చైనా, తైవాన్ నుంచి దిగమతులపైనే ఎక్కువగా ఆధాపరడుతున్నారు. ఏదేమైనప్పటికీ గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ ఇండియాలో మెల్లిమెల్లిగా విస్తరిస్తోంది. మరి ఈ పరిస్థితుల్ని ఎదురీదుతూ సోలార్ స్టోర్ ఎలా నిలదొక్కుకుంటుందో వేచి చూడాలి.
website: www.solarstore.co.in