50 రూపాయకే కృత్రిమ స్వరపేటిక ! ఓ మనసున్న డాక్టర్ సరికొత్త ఆవిష్కరణ!!

50 రూపాయకే కృత్రిమ స్వరపేటిక ! ఓ మనసున్న డాక్టర్ సరికొత్త ఆవిష్కరణ!!

Wednesday January 06, 2016,

2 min Read

వైద్యో నారాయణో హరి అంటారు. అంటే వైద్యుడు దేవుడితో సమానమని అర్థం. వైద్యం వ్యాపారంలా మారిన ఈ రోజుల్లో కూడా ఈ నానుడిని అక్షరాలా నిజమని నిరూపించారు బెంగళూరుకు చెందిన అంకాలజిస్ట్ డాక్టర్ విశాల్ రావు. ఆయన కనుగొన్న పరికరం ఎంతో మంది గొంతు కేన్సర్ రోగుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. జీవితంలో ఇక మాట్లడలేం అనుకున్నవాళ్లు కూడా మళ్లీ గొంతు విప్పుతున్నారు. ఇంతకూ ఏంటా పరికరం? దాని కథాకమామీషు ఏంటి?


image


ఒంట్లో చిన్నపాటి నలత అనిపించి హాస్పిటల్‌కి వెళ్తే ఆ స్కాన్ ఈ స్కాన్ అనీ- ఆ టెస్టు ఈ టెస్టనీ వేలు, లక్షలు గుంజేస్తారు. ఇవాళరేపు ఆసుపత్రుల తీరే అది. కొన్ని హాస్పిటళ్లు పేషెంట్లను కస్టమర్లలా ట్రీట్ చేస్తాయి! రోగం నయంచేయడం కన్నా వారిరోగాన్ని సొమ్ముచేసుకోవడం కంటే దౌర్భాగ్యం మరోటి లేదు. కానీ, అలాంటి వైద్యులకు భిన్నంగా ఖరీదైన కేన్సర్ వైద్యంలో కేవలం యాభై రూపాయలతోనే రోగులకు స్వాంతన చేకూరుస్తున్నారు డాక్టర్ విశాల్ రావు.

థ్రోట్ కేన్సర్‌తో బాధపడే రోగులకు శస్త్రచికిత్సలో భాగంగా స్వరపేటికను తొలగిస్తారు. దాంతో వారు మాట్లాడలేరు. అసలే కేన్సర్ సోకిందన్న బాధలో ఉంటారు. పైపెచ్చు స్వరపేటిక లేదన్న విషయం షాక్ లా తగులుతుంది. మార్కెట్‌లో దొరికే ఆర్టిఫిషియల్ వాయిస్ బాక్స్ ఎంతలేదన్నా రూ. 20 -30 వేల వరకు ఉంటుంది. అయినా, దాన్ని ప్రతీ ఆరు నెలలకోసారి మార్చుకుంటూ ఉండాలి.

“వాయిస్ బాక్స్ మార్చుకోవాలంటే బాగా డబ్బున్న వాళ్లే తటపటాయిస్తారు. అలాంటిది నిరుపేదల పరిస్థితేంటి? ఈ ఆలోచనే సరికొత్త ఆవిష్కరణకు దారితీసింది”- డాక్టర్ విశాల్

బెంగళూరులోని హెల్త్ కేర్ గ్లోబల్ కేన్సర్ సెంటర్‌లో నెక్ సర్జన్ డిపార్టుమెంట్ హెడ్ గా పనిచేస్తున్న విశాల్ రావ్ అంకాలజిస్టుగా చాలా ఫేమస్. ఎన్నో సర్జరీలు చేసిన అనుభవం ఉంది. స్వరపేటిక తొలగించిన తర్వాత పేషెంట్స్ పడే కష్టాలు తెలుసు. తిండి సహించదు. సరిగా మాట్లాడలేరు. నరకయాతన. వారి కష్టాల్ని చూసి చలించిన విశాల్ రావ్ -స్వచ్ఛంద సంస్థలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకే ఆర్టిఫిషియల్ వాయిస్ బాక్స్ దొరికేలా సాయపడ్డాడు. కానీ రాను రాను రోగుల సంఖ్య పెరగడంతో స్వచ్ఛంద సంస్థలు కూడా చేతులెత్తేశాయి. అప్పుడే వచ్చింది ఆలోచన. ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా వాయిస్ ప్రోస్థసిస్ డివైస్ ని ఎందుకు డెవలెప్ చేయకూడదు అనుకున్నాడు. ఐడియా వచ్చిందే ఆలస్యం స్నేహితుడైన శశాంక్ సపోర్ట్ తీసుకుని రెండేళ్ల పాటు కష్టపడ్డారు. చివరికి సాధించారు.

“2.5 సెంటీ మీటర్ల పొడవు. 25 గ్రాముల బరువు. పరికరాన్ని చూడగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. పేషెంట్లకు కావాల్సిన ధైర్యం కూడా అదే. పెద్దగా నొప్పి తెలియదు. హాయిగా తినేయొచ్చు. ఇబ్బంది లేకుండా మాట్లాడొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే రోగికి పునర్జన్మ లాంటింది. అందుకే ఈ పరికరానికి ఆదిప్రణవ నాదమైన ఓం అని పేరు పెట్టాం”- డా. విశాల్

ప్రస్తుతం సైంటిఫిక్ అండ్ ఎథికల్ కమిటీ ఈ డివైస్ పనితీరుపై స్టడీ చేస్తోంది. వారినుంచి అప్రూవల్ అందిన వెంటనే ఈ పరికరం దేశంలోని అన్ని కేన్సర్ ఆసుపత్రుల్లో అందుబాటులోకి వస్తుంది. డాక్టర్ విశాల్ కనిపెట్టిన ఈ ఓం కేన్సర్ పేషెంట్ల పాలిట వరంగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందో లేదో తెలియదు కానీ- కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రం వైద్యం నోట్ల కట్టలమీదనే నడుస్తున్నది. ఆ పరిస్థితుల్లో ఒక మనసున్న డాక్టర్ సాబ్- సమాజానికి ఎంతోకొంత మేలు చేయాలని ముందుకు రావడం అభినందించాల్సిన విషయం. స్వార్ధపూరిత వాతావరణాన్ని సవాల్ చేస్తూ పేద రోగుల కోసం సరికొత్త ఆవిష్కరణ చేసిన ఈ డాక్టర్ గారు అందరికీ ఆదర్శం కావాలి.