ఇడ్లీ పిండిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన iD ఫ్రెష్. రూ. 1000 కోట్ల వ్యాపారమే లక్ష్యం

7th Nov 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

వేడి వేడి ఇడ్లీలు, కరకరలాడే దోసెలు.. దిట్టంగా ఉండే పరాఠాలు.. వీటిని చూస్తే.. ఎవరికైనా నోరూరుతుంది. బయట తినాలంటే.. భయం, ఇంట్లో చేసుకునే ఓపిక లేదు. ఇలాంటి వాళ్ల కోసమే పుట్టుకొచ్చాయి ఇన్‌స్టంట్ దోసె, ఇడ్లీ మిక్స్‌లు. కానీ ఇవి అంతగా సక్సెస్ కాలేకపోయాయి. సంప్రదాయ ఇడ్లీ,దోసె పిండితో ఇవి సరితూగలేకపోయాయి. ఆ తర్వాత కొద్దికాలానికి రెడీ మిక్స్ బ్యాటర్ మార్కెట్లోకి వచ్చేది. రుబ్బిన పిండితో చాలా మంది ప్రయోగం చేశారు. షాపు నుంచి కొనుక్కు వెళ్లి.. ఇంట్లో ఇడ్లీ, దోశెలు వేసుకునే వెసులుబాటు కలిగింది. అయితే.. వాటిని ఎలా తయారు చేస్తారో అనే ఆందోళన ఉండేది. జస్ట్ ఓ ప్లాస్టిక్ కవర్‌లో పిండి పోసి.. జస్ట్ రబ్బర్ బ్యాండ్ బిగించేవారు. ఇవి బాగానే పాపులర్ అయినా.. అన్ని వర్గాలూ ఆదరించలేదు.

image


దీన్నే ఓ వ్యాపారావకాశంగా మార్చుకుంది iD సంస్థ. బ్యాటర్ మార్కెట్లో వీళ్లకు పోటీలేకుండా పోతోంది. ఇడ్లీ, దోశె పిండికి కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్ తెచ్చిన ఘనత వీళ్లది. ఆశ్చర్యం ఏంటంటే.. ఈ వ్యాపారాన్ని ప్రారంభించింది ఓ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, అది కూడా బెంగళూరు ఐఐఎం నుంచి ఎంబిఏ పూర్తిచేసిన ముస్తఫా.

ఉన్నత చదువులు చదివి మెరుగైన ఉద్యోగాలు చేసే అవకాశం ఉన్నా.. ముస్తఫాలోని భోజన ప్రియుడు మాత్రం అలా చేయనీయలేదు. ఫుడ్ ఇండస్ట్రీలో తానొక ట్రెండ్ సెటర్‌గా మిగిలిపోవాలనే యోచనలో ఉండేవారు. అయితే చదివిన చదువుకు.. చేయాలని అనుకున్న వ్యాపారానికి ఏ మాత్రం పొంతన లేదు. దీంతో ఆలోచన పడినా.. ఓ ప్రయోగానికి మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇందుకోసం ఇడ్లీ, దోసె బ్యాటర్ వైపే మొగ్గుచూపారు. ఎందుకంటే.. దక్షిణాదిలో అధిక శాతం మంది వీటికే మొగ్గుచూపుతారు. ఇక్కడ ఇడ్లీ అనేది ప్రతీ ఇంటి వంటకం. అందుకే ఇందులోకి దిగితే తనకు తిరుగు ఉండదని అనిపించింది. పుట్టింది పెరిగింది.. అంతా కేరళలోనే అయినా.. ఈ మధ్యలోనే బెంగళూరుకు మకాం మార్చారు.

ముస్తఫా

ముస్తఫా


తన నలుగురు అన్నాదమ్ములతో కలిసి ఓ చిన్న పైలెట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. బెంగళూరు నగర శివార్లలో ఓ చిన్న స్థలం తీసుకున్నారు. పిండిని రుబ్బేందుకు, వాటిని ప్యాక్ చేసేందుకు రెండు మెషీన్లను కొనుగోలుచేశారు. 'iD Fresh' అనే బ్రాండ్‌ను ఖాయం చేశారు. అప్పటికి వీళ్లకు పెద్ద బిజినెస్ ప్లాన్ ఏమీ లేదు. అంతా సింపుల్ ఐడియా. నాణ్యతతో కూడిన పిండిని తయారు చేయడం, వాటిని కంటికి ఇంపుగా ప్యాకింగ్ చేయడం.. అదే కాన్సెప్ట్.

అప్పటి వరకూ ఓ ప్లాస్టిక్ కవర్‌లో పిండిని నింపి, రబ్బర్ బ్యాండ్‌తో చుట్టిన ప్యాకింగ్‌లకు అలవాటు పడిన జనాలు.. వీటిని చూసి ఆశ్చర్యపోయారు. పిండిని కూడా ఇంత చక్కగా ప్యాక్ చేయొచ్చా.. అని తెలుసుకుని.. జనాలు బాగా ఆదరించారు. ఊహించిన దానికంటే ఎక్కువ.. రెస్పాన్స్ వచ్చింది. దీంతో.. బెంగళూరులోనే మరో పెద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేని పిండిని తయారు చేసి.. ఇంటి రుచిని తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేశారు.

'' పిండి నాణ్యత, ప్యాకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎందుకుంటే.. మేం కలకాలం ఉండాలనుకుంటే.. అవే మమ్మల్ని కాపాడతాయి. ఇవి నిలబెట్టుకుంటే మార్కెట్‌కు మాత్రం ఎలాంటి ఢోకా ఉండదనేది మా బలమైన నమ్మకం '' - ముస్తఫా.

సరుకు తయారీ, ప్యాకింగ్‌తో పాటు డెలివరీ, డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. బెంగళూరులో ప్రధానంగా ఉన్న 65,000 రిటైల్ స్టోర్లలో 12,000 షాపులకు రెఫ్రిజిరేషన్ ఉంది. రెండు, మూడు రోజులు నిల్వ ఉంచాల్సిన ఉత్పత్తి కావడంతో రెఫ్రిజిరేషన్ తప్పనిసరి. అందుకే అలాంటి షాపులను అన్వేషిస్తూ.. తమ పరిధిని నానాటికీ పెంచుకుంటూ పోతున్నారు.

image


రూ.35 కోట్ల ఫండింగ్

కొన్ని సంవత్సరాల స్థిరమైన వృద్ధిని గమనించిన తర్వాత ముస్తఫా అండ్ టీం.. నిధుల సమీకరణ చేసింది. 2014లో హీలియన్ వెంచర్స్ పార్ట్‌నర్స్‌ రూ.35 కోట్ల ఫండింగ్‌ను అందించింది. అప్పట్లో కంపెనీలో 600 మంది సిబ్బంది పనిచేసేవారు. వచ్చిన నిధులను విస్తరణ, ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు ఉపయోగించారు.

ఇప్పుడు iD ఫ్రెష్‌లో 1000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఏడు ఫ్యాక్టరీ లొకేషన్లతో పాటు ఎనిమిది ఆఫీసులు ఉన్నాయి. '' మేం రోజూ 50,000 కిలోల ఇడ్లీ/దోసె పిండి తయారు చేస్తాం. ఇది సుమారు పది లక్షల ఇడ్లీలతో సమానం '' అంటారు ముస్తఫా.

పిండితో పాటు కొద్దికాలం క్రితమే మలబార్ పరాఠాలు, చట్నీలను కూడా తయారు చేస్తున్నారు. కేరళ, కర్నాటక, తమిళనాడు ప్రాంతాల్లో పరాఠాలు కూడా మంచి గిరాకీ ఉంటుంది. ఇవి కూడా ఇన్‌స్టంట్ పరాఠాలు. హాఫ్ బేక్డ్/రోస్టెడ్ ఫుడ్ ఇది. కస్టమర్లు జస్ట్ వేడి చేసుకుని తినేలా తయారు చేశారు. వీటికి కూడా మంచి ఆదరణే లభించింది.

నాణ్యత ఎలా కాపాడుతున్నారు ?

'' పిండి తయారైన తర్వాత ప్యాక్ చేసి, సీలింగ్ పూర్తవుతుంది. వాటిని శీతల వ్యాన్లలోకి ఎక్కిస్తాం. ఉదయం ఐదింటికల్లా ఆ పని పూర్తైపోతుంది. ఆ తర్వాత బెంగళూరు సహా చుట్టుపక్కల ప్రాంతాలకు డెలివర్ చేస్తాం. రిటైల్ స్టోర్లతో పాటు చాలా మంది సప్లై చైన్ ఏజెంట్లు కూడా ఉన్నారు. మధ్యాహ్నం రెండింటికల్లా డెలివర్ అంతా పూర్తైపోతుంది. ''.

ఏ స్టోర్‌లో ఎంత పిండి అమ్ముడుపోతుంది.. ? ఏ ఏరియాలో ఎంత డిమాండ్ ఉంటుంది ? అనే క్షేత్రస్థాయి డిటైల్స్ కూడా కంపెనీ దగ్గర సిద్ధంగా ఉన్నాయి. అంత పక్కాగా రిటైల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌ను ప్లాన్ చేసుకున్నారు. ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీ సంస్థలైన బిగ్ బాస్కెట్, గ్రోఫెర్స్ వంటి సంస్థలతోనూ ఒప్పందం చేసుకున్నారు. ఆన్‌లైన్ సేల్స్ ఉన్నా.. దాని పరిణామం చాలా చిన్నదిగా ఉందని చెబ్తున్నారు ముస్తఫా.

ఫుడ్ ఇండస్ట్రీలో ఓ బ్రాండ్‌ను తయారు చేసుకోవడం, ఆ నాణ్యతను నిలబెట్టుకుని.. మరింత మందికి చేరువ కావడం.. అంత సులువైన విషయమేమీ కాదు. కానీ iD ఫ్రెష్.. ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పుకోవాలి.

ఫుడ్ డెలివరీ రంగంలో ఈ మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఎన్నో కొత్త స్టార్టప్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఫండింగ్ కూడా రావడంతో చాలా మంది ఈ స్పేస్‌లోకి అడుగుపెడ్తున్నారు. కానీ ఈ మధ్యే ఈ రంగంలో కొద్దిగా కరెక్షన్ కనిపిస్తోంది. డెలివరీ ఫ్రం రెస్టారెంట్స్, ఇంటర్నెట్ - ఫస్ట్ కిచెన్స్ వంటి మోడల్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. ఈ మార్కెట్ చాలా విస్తృతంగా ఉన్నప్పటికీ ప్లేయర్స్ కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. రాబోయే రోజుల్లో కన్సాలిడేషన్ (సర్దుబాట్లు) తప్పనిసరి అయినట్టు కనిపిస్తోంది.

కానీ iD ఫ్రెష్‌కు మాత్రం స్పష్టమైన లక్ష్యం ఉంది. ప్రొడక్ట్ లైన్ పెంచుకుని వివిధ నగరాలకు విస్తరించాలని భావిస్తోంది. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో కూడా విస్తరించి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ముస్తఫా.

''మేం ఈ రంగంలో వృద్ధిపై చాలా నమ్మకంగా ఉన్నాం. మార్కెట్ లీడర్ స్థానాన్ని నిలబెట్టుకోగలం అనే ధైర్యం ఉంది. 2020 నాటికి రూ.1000 కోట్ల లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలం అని భావిస్తున్నాం'' అంటూ ముగించారు ముస్తఫా.

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close