చెత్తతో కొత్త ఐడియాలు - వినూత్న కాన్సెప్ట్‌తో 'కబాడీవాలా కనెక్ట్'
పెద్ద పెద్ద నగరాలతో పాటు..పట్టణాలు కూడా ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలో చెత్త కూడా ఒకటి. వ్యర్ధపదార్ధాలను సరిగా నియంత్రించడం, నిర్వహించడం తెలియకపోవడంతో రకరకాల పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. వీటితో అటు జనానికి ఇటు ప్రభుత్వాలకు ఎన్నో చిక్కులు వచ్చిపడ్తున్నాయి. డంపింగ్ యార్డుల కోసమని ఏర్పాటు చేసిన స్థలంలో కూడా విపరీతమైన కాలుష్యకారకాలు ఎలాబడితే అలా పడేయడంతో అక్కడ పరిస్థితి నానా బీభత్సంగా తయారవుతోంది. పొడి చెత్త, తడి చెత్త... ఇలా వేరు చేయకుండా..అంతా కలిపేయడం వల్ల మున్సిపల్ కార్మికులూ కష్టపడ్తున్నారు. ఇలా వచ్చే చెత్తలో ప్లాస్టిక్ వ్యర్ధాలే ఎక్కువ. ఇవి అంత త్వరగా మట్టిలో కలిసిపోవు. మొండి ఘటాల్లా అలా పేరుకుపోతూనే ఉంటాయి. మిగిలిన వాటికీ అడ్డం పడుతుంటాయి. భవిష్యత్తులో ఈ ప్లాస్టిక్ వేస్ట్ మరింత ప్రమాదకరంగా పరిణమించేట్టు కనిపిస్తోంది. తో కష్టంగా మారిపోయే ప్రమాదం ఏర్పడింది..
ఈ నేపధ్యంలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపించడానికి , వ్యర్ధాలను వేరు చేసి డంపింగ్ యార్డుల్లో పరిస్థితి మెరుగు పరచడానికి ఓ స్టార్టప్ రూపంలో కొంతమంది సోషల్ ఆంట్రప్రెన్యూర్లు ముందుకు వచ్చారు. చైన్నైలో కబాడీవాలా కనెక్ట్ పేరుతో ప్రారంభమైన ఈ సంస్థ.. ప్రస్తుతమున్న వ్యర్ధాల నిర్వహణా పద్ధతిని మెరుగుపరిచేందుకు సహకరిస్తుంది. డంపింగ్ యార్డులకు పంపే వ్యర్ధాలను ఎలా పంపాలనే అంశంపై ప్రచారం చేస్తోంది.
" చైన్నైలోని 13వ జోన్ అంటే అడయార్, గిండి, వెలాచెరీ, అడంబాకం ఏరియాల్లో ఈ సర్వీసును లాంచ్ చేసినట్లు సంస్థ సీఈఓ సిధ్దార్ధ్ హండే చెబ్తున్నారు. మిగిలిన జోన్లకూ ఈ సేవలను విస్తరించే యోచనలో ఉన్నట్లు చెప్పారాయన.
కబాడీవాలా కనెక్ట్ ప్రత్యేకతలేంటి ?
కబాడీవాలా కనెక్ట్ సిటీ జనాలతో పాటుగా... కమర్షియల్ వ్యాపార సంస్థలతో కలసి పని చేస్తుంది. వారి దగ్గర నుంచి చెత్తను వ్యర్ధాలను వేరు వేరుగా చేయడంలో సాయపడుతుంది. అలానే రీసైక్లబుల్ వ్యర్ధాలుంటే.. స్థానిక కబాడీవాలా (పాత పేపర్లు..సామాన్లు..ప్లాస్టిక్ కొనేవారు)లకు అమ్మడంలోనూ సాయపడుతుంది. వాటిని తిరిగి కబాడీ వాలాలు తమకు లాభం వచ్చేచోట అమ్ముకుంటారు. అలా ఈ కాన్సెప్ట్‌తో విన్-విన్ సిచ్యుయేషన్ ఉంటుందని సిద్ధార్ధ్ చెప్పారు.
"ఇది కేవలం డంపింగ్ యార్డుల్లో చెత్తను తగ్గించడమే కాకుండా... స్థానిక స్క్రాప్ వ్యాపారులకూ ఆదాయం పెంచుతుంది. మేం ఈ స్క్రాప్ వ్యాపారుల నుంచి సేకరించిన చెత్త నుంచి కొత్త రకమైన ప్రొడక్ట్స్ తయారు చేస్తాం. అలా చేసే డిజైనర్లతో మాకు ఒప్పందాలు చేసుకున్నాం. ఆ ప్రొడక్ట్స్‌ను కబాడీవాలా కనెక్ట్ సైట్‌తో ఆన్లైన్ వేదికగా కూడా అమ్మకాలు చేస్తాం అన్నారు సిధ్దార్ధ్
వరల్డ్ ఎకనమిక్ ఫోరం అందించిన గ్రాంట్ కబాడీవాల్ కనెక్ట్‌కు చెన్నై,బెంగళూరులో మ్యాపింగ్ సెషన్స్ భారీగా నిర్వహించేందుకు సాయపడింది. వాలంటీర్ల సాయంతో ఈ రెండు నగరాల్లో స్థానిక కబాడీవాలాలను సంధానపరిచే పని చేస్తోందీ సంస్థ . కబాడీవాలా కనెక్ట్ టీమ్ గతేడాది క్లైమేట్ ఛేంజ్‌కు సంబందించిన గ్రాంట్‌ను వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నుంచి గెలుచుకుంది. దాంతో ఫుల్‌టైమ్‌గా కొంతమంది ఉద్యోగులను నియమించుకుని.. కబాడీవాలా డేటాను ఓ క్రమపద్దతిలో సేకరించడం మొదలుపెట్టింది..
" అప్పట్నుంచి మేం ఓ రోబోటిక్ సర్వే చేపట్టాం. తర్వాత ఓ టీంకు ట్రైనింగ్ ఇచ్చాం. స్థానిక కబాడీవాలాలతో ముఖాముఖీ మాట్లాడేలా ప్లాన్ చేశాం. ప్రస్తుతానికి చెన్నైలోని మూడు జోన్లను మ్యాప్ చేశాం. వచ్చే కొద్ది రోజుల్లోనే మిగిలిన ప్రాంతాలను కవర్ చేస్తాం " అని చెబ్తున్నారు సిధ్దార్ధ్.
కోర్ టీమ్ -ప్యూచర్ ప్లాన్
సిధ్దార్ధ్తో పాటుగా సంస్థను స్థాపించడంలో సోనాల్ బంగేరా, రోహిత్ కోలియత్ అనే మరో ఇద్దరు భాగస్వాముల పాత్ర ముఖ్యమైనది. ప్రొడక్ట్, డిజైనింగ్‌ను సోనాల్ చూసుకుంటూ ఉండగా రోహిత్ బిజినెస్‌ను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెట్టారు.
జనాలు వాడి పడేసే వ్యర్ధాలను తిరిగి రీసైక్లింగ్ చేయడంలో కబాడీవాలా కనెక్ట్ ఇతర సంస్థలతోనూ పని చేస్తోంది. ఈ రంగంలోని వివిధ పద్దతులను తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందంటారు సోనాల్.. " స్క్రాప్ షాపులోళ్ల దగ్గర సేకరించిన వ్యర్ధాల నుంచి ఏదైనా ప్రోటోటైప్ మోడల్ ప్రొడక్ట్ తయారు చేసే ఆలోచనలో ఉన్నాం" అని చెప్పారు సోనాల్.
ప్రస్తుతం నగరాల్లో అమల్లో ఉన్న చెత్త సేకరణ, నిర్వాహణలో తగిన మార్పులు తీసుకురావడంతో పాటుగా.. పట్టణ ప్రాంత వేస్ట్ మేనేజ్మెంట్లో లీడర్‌గా ఎదగాలనే కబాడీవాలా కనెక్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.
అందుబాటులో ఉన్న అన్ని పద్ధతుల ద్వారా స్థానిక కబాడీవాలాల కోసం సైక్లింగ్‌కు ఉపయోగపడే వస్తువులతో పాటు... కొత్త పద్ధతుల్లో వాటిని వాడటానికి అనువుగా ఉండే వస్తువులును సేకరిస్తున్నారు. అలానే ఒక ఏరియా నుంచి ఎంతెంత మెటీరియల్‌ను సేకరించగలరో కూడా సమాచారం క్రోడీకరిస్తోంది.
ప్రస్తుతమున్న చెత్త సేకరణ పద్దతితో కాకుండా..మేం చేపట్టే పధ్దతిలో ఎన్ని నగరాలు వేస్ట్ మేనేజ్మెంట్ను చేయగలవో.. గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని" చెప్పారు సోనాల్.
ఫీల్డ్‌లో కాంపిటీటర్స్
భవిష్యత్తులో కబాడీవాలా కనెక్ట్.. బన్యన్ తో పోటీ పడే అవకాశం కన్పిస్తోంది. బన్యన్ ఇప్పటికే ఇదే రంగంలో తన కృషి చేస్తూ ఉంది. రీసైక్లింగ్ వేల్యూ చెయిన్ ద్వారా వ్యర్ధాల నిర్వహణ చూసుకుంటోంది. చెత్తను రకాలవారీగా వేరు చేయడం నుంచి.. వాటిని ఆ తర్వాత ఏ వస్తువులు, ఏ కేటగిరీ కింద రీసైక్లింగ్‌కు పంపాలో కూడా సార్టింగ్ చేస్తుంది బన్యాన్.
కబాడీవాలా కనెక్ట్ తో పాటు..పేపర్ మేన్ అనే మరో స్టార్టప్ కూడా వ్యర్ధాలను రీ సైక్లింగ్‌ను ఆన్లైన్ ద్వారా చేపడుతోంది. ప్రస్తుతానికి వీటి నిర్వహణలో ఈ రెండు సంస్థల పోటీని కబాడీవాలా కనెక్ట్ ఎదుర్కొనే అవకాశం కన్పిస్తోంది.