చౌకధర ఇంక్యుబేటర్లతో వేలాది మంది పిల్లలకు ప్రాణదానం
నెలలు నిండకముందు పుట్టిన శిశువు బరువు తక్కువగా ఉంటుంది. ఇలాంటి శిశువులు బతకడం చాలా కష్టం. బరువు తక్కువగా పుట్టిన శిశువులు మృతికి ప్రధాన కారణం నియోనాటల్ హైపోథేరియా. దీని నుంచి రక్షించాలంటే చిన్నారిని వెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. వెచ్చగా ఉంటే శిశువు బరువు పెరుగుతుంది. (ఆరోగ్యం కుదుటపడుతోంది అనడానికి బరువుపెరగడం ఓ సంకేతం). అయితే సంప్రదాయ ఇంక్యూబేటర్లు చాలా ఖర్చుతో కూడుకున్నవి. అలాగే వాటికి నిరంతర విద్యుత్ సరఫరా అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో ఇది తీవ్రమైన సమస్యగా మారింది. మరోవైపు సంప్రదాయ ఇంక్యూబేటర్లను ఉపయోగించడం కూడా చాలా కష్టం. వీటిని ఉపయోగించేందుకు మెడికల్ స్టాఫ్‌కు మెరుగైన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు ఈ పరికరాలు ఒక్కసారి పాడైతే వాటిని రిపేర్ చేయడం కూడా చాలా కష్టం.
కొత్త ఆవిష్కరణలు
ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు 2012లో ఎంబ్రేస్ నెస్ట్‌ను ఆవిష్కరించారు. దీన్ని ఉపయోగించడం కూడా చాలా సులభం. ఇదెంతో చిన్నగా ఉంటుంది. దీన్ని ఉపయోగించేందుకు నిరంతర విద్యుత్ సరఫరా కూడా అవసరం లేదు. ఆస్పత్రులలో, అంబులెన్సులలో, ఎన్ఐసీయూలలో, వార్డులలో, ప్రయాణ సమయాల్లో ఉపయోగించేందుకు దాన్ని రూపొందించారు. ఈ ఎంబ్రేస్ సంస్థను రాహుల్ పణికర్, జేన్ చెన్, లీనస్ లియాంగ్, నాగానంద్ మూర్తీ స్థాపించారు.
ఈ ఎంబ్రేస్ నెస్ట్‌ను ఉపయోగించి ఎంతోమంది చిన్నారులు పునర్జన్మను పొందారు. లక్ష్మమ్మ లంబాడి తెగకు చెందిన మహిళ. ఈమె కుటుంబం కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నది. వీరి నెలసరి ఆదాయం వెయ్యి రూపాయల కంటే తక్కువే. లక్ష్మమ్మకు నెలలు నిండకముందే పాప జన్మించింది. పాప బరువు 1.6 కిలోలు. దీంతో ఆ పాపకు థర్మల్ మద్దతు అవసరమైంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే రోజుకు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు పాపను ఎన్ఐసీయూలో ఉంచాలి. ఈ కనీస సౌకర్యాలు వారు ఉండే గ్రామంలో లేకపోవడంతో 24 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి పాపను తరలించాల్సి వచ్చింది. రోజు కూలీ చేసుకునే లక్ష్మమ్మకు హాస్పిటల్ ఖర్చు తలకుమించిన భారమైంది. ఈ సంప్రదాయ ఇంక్యూబేటర్లకు బదులుగా వైద్యులు పాపను ఎంబ్రేస్ ఇన్‌ఫాంట్ వార్మర్ లలో పెట్టారు. అందుకు రోజుకు అయిన ఖర్చు రూ. 75 మాత్రమే. తక్కువ ఖర్చుతోనే పాపను రక్షించారు వైద్యులు.
బేబీ వెట్రివేల్‌ది ఇంకో స్టోరీ. తమిళనాడులోని కృష్ణగిరిలో నివసించే మరియమ్మల్ అనే మహిళకు నెలలు నిండకముందు పుట్టిన బాబు వెట్రివేల్. బాబు తండ్రి చిలక జోస్యం చెప్తారు. ఇంటింటికి తిరిగి ఆసక్తి ఉన్నవారికి జాతకాలు చెప్పే కుటుంబాన్ని పోషిస్తుంటారు. పుట్టినప్పుడు 1.6 కిలోలతో ఉన్న వెట్రివెల్ ఎంబ్రేస్‌లో ఉంచిన మూడు నెలల్లో పూర్తిగా కోలుకుని మూడు కిలోల బరువు పెరిగాడు.
రాహుల్ పాణికర్ ఐఐటీ మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజీనిరింగ్ లో 2002లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పూర్తి చేశారు. అక్కడే పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం లభించింది. ఆ క్యాంపస్ డీ స్కూల్‌కు కేంద్రం,. ఎన్నో రకాలైన కోర్సులను ఆ క్యాంపస్ ఆఫర్ చేస్తుంది. డీ స్కూల్ అప్పుడప్పుడే ప్రారంభమైంది. క్యాంపస్‌లో కావాల్సినంత ప్లేస్ లేకపోవడంతో అక్కడే పార్క్ చేసి ఉన్న ఓ ట్రైలర్ వ్యాన్ లో కోర్సులను ప్రారంభించారు.
‘‘క్యాంపస్‌లోని ల్యాబ్‌లోనే ఉన్నట్టు అనిపించేది. అక్కడికి వెళ్లి నేను చాలా సమయం గడిపేవాణ్ని. అక్కడి స్టాఫ్ ఎంతో మంచివారు. కొత్త కొత్త ఆవిష్కరణలు చేసేవారిని ప్రోత్సహిస్తుంటారు’’ అని రాహుల్ వివరించారు.
మూడేళ్లపాటు సిలికాన్ వ్యాలీలో ఉన్న రాహుల్ ఆ తర్వాత ఆంట్రప్రెన్యూర్‌షిప్ వైపు మొగ్గుచూపారు.
‘‘అదే సమయంలో గూగుల్ ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. ఫేస్‌బుక్ కూడా ప్రజల నోళ్లలో నానుతుంది. అక్కడి పరిస్థితులను చూసి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. అనేక సమస్యలకు అక్కడి వ్యాపారం, టెక్నాలజీ పరిష్కారంలా కనిపించింది‘‘ అని రాహుల్ చెప్పారు.
మన విద్యా వ్యవస్థలో సమస్యకు సరైన పరిష్కారమేంటో ఎప్పుడూ చేప్పలేదు. సమస్యను పరిష్కరించేందుకు ఎన్నో అవకాశాలున్నాయి.
డీ స్కూల్ లో ‘‘ఎంటర్‌ప్రెన్యూరియల్ డిజైన్ ఫర్ ఎక్స్ట్రీమ్ అఫర్డబిలిటీ’’ కోర్సును ప్రారంభించారు. అభివృద్ధి చెందుతున్న ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రొడక్ట్స్‌ను రూపొందించారు. పీహెచ్‌డీలో లాస్ట్ లెగ్ థీసిస్ సమర్పించే దశలో ఉన్న రాహుల్‌కు ఈ రెండు కోర్సులకు ఒకేసారి కేటాయించేందుకు కావాల్సినంత డబ్బుకానీ, సమయం కానీ లేవు. ఇదే విషయాన్ని డీ స్కూల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బెర్నీ రోత్‌కు వివరించారు. ఎటూ నిర్ణయం తీసుకోలేని తన పరిస్థితిని వివరించారు. అప్పుడు బెర్నీ ఓ సలహా ఇచ్చారు. ‘‘క్లాస్ తీసుకోకుండా పీహెచ్‌డీ పూర్తిచేసేందుకు సమయం వెచ్చించు. లేదంటే పీహెచ్‌డీనిను పక్కనపెట్టి క్లాస్ తీసుకో. అలా ఇలా కాదనుకుంటే.. నిన్ను నువ్వే సూపర్‌మెన్‌గా ఊహించి రెండింటిని ఒకేసారి కొనసాగించు’’ అని చెప్పారు. దీంతో ఈ కొత్త కోర్సును తీసుకునేందుకు రాహుల్ సిద్ధమయ్యారు.
జీవితాన్ని మార్చేసిన కోర్స్..
‘‘ఐఐటీ ఓ టెక్నికల్ స్కూల్. స్టాన్‌ఫోర్డ్ ఓ యూనివర్సిటీ. ఆర్థికవేత్తలు, రాజనీతిజ్ఞులు, లా స్టూడెంట్స్ ఇలా ఎంతో మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు మా పొరుగున ఉండేవారు. ప్రజలు, వారి సమస్యలను పరిష్కరించేందుకు వారు సాయం చేశారు’’ అని రాహుల్ వివరించారు.
సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు ఎంటర్‌ప్రెన్యూరియల్ డిజైన్ ఫర్ ఎక్స్ట్రీమ్ అఫర్డబిలిటీలో పలు ప్రయోగాలు చేసేవారు. ఇందుకోసం చాలా సంస్థలు తమ సమస్యలను ఈ రీసెర్చ్ స్కాలర్స్‌కు వివరించేవి. నేపాల్‌కు చెందిన మెడిసిన్ మోన్డియల్ అనే ఎన్జీవో సంస్థ నియోనాటల్ పరికరాలపై ప్రయోగాలు చేసింది. సంప్రదాయ బద్ధమైన ఇంక్యూబేటర్లను గ్లాస్‌లతో రూపొందిస్తారు. వాటిని రూపొందించేందుకు భారీగా వ్యయమవుతుంది. దీంతో తక్కువతో కూడుకున్న ఇంక్యూబేటర్లు కావాలని మెడిసిన్ మోన్డియల్ టీమ్ కోరింది. ఈ ప్రాజెక్ట్‌లో రాహుల్, జేన్‌లతోపాటు మరికొందరు కూడా పనిచేశారు.
‘‘మేం తొందరలోనే గుర్తించాం. తక్కువ ఖర్చుతో గ్లాస్ బాక్స్‌లను రూపొందిస్తే.. వాటని మరికొందరికి మాత్రమే ఇవ్వగలుగుతాం. ఇందులో పెద్ద మార్పు ఏమీ ఉండదు అని’’ అని రాహుల్ చెప్పారు.
ఈ ప్రాజెక్ట్ చేస్తున్న సమయంలో రాహుల్, జైన్‌లకు తెలిసొచ్చిందేమిటంటే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకే ఈ అవసరం ఎక్కువగా ఉందని. అలాగే తక్కువ ధరకు పరికరాన్ని కనుగొనడం కూడా సమస్యకు పరిష్కారం కాదని రాహుల్ గుర్తించారు. అందుకు కారణం గ్రామీణ ప్రాంతాల్లో చాలావరకు ఇంక్యూబేటర్లను విరాళాలుగా ఇస్తుంటారు. అవన్నీ వృథాగా పడి ఉంటాయి.
‘‘పశ్చిమ దేశాలతో పోలిస్తే, మన దేశంలో వైద్య రంగం కాస్త భిన్నంగా ఉంటుంది. డాక్టర్-పేషెంట్ నిష్పత్తి, శిక్షణ పొందిన మెడికల్ స్టాఫ్, ఇలా ఎన్నో సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో వెంటాడుతున్నాయి’’ అని రాహుల్ చెప్పారు.
రాహుల్, జేన్‌లతోపాటు ప్రాజెక్ట్‌లో ఉన్న ఇతర సభ్యులు కూడా ఈ సమస్యకు మరో పరిష్కారాన్ని వెతకడం ఆరంభించారు. ఫేస్‌చేంజ్ మెటీరియల్‌తో బేబీని వెచ్చగా ఉంచొచ్చన్న ఆలోచన వీరికి వచ్చింది. వారి వ్యవధి ముగిసేలోపే ఓ నమూనాను, సర్వీస్, డెలివరీ కార్యాచరణను రూపొందించారు. దీన్ని సంస్థ ప్రారంభించింది కూడా. అయితే ఎన్జీవో సంస్థ మాత్రం మరింత తక్కువ వ్యయమయ్యే గ్లాస్ బాక్స్ లను రూపొందించమని కోరింది.
డిగ్రీస్ వర్సెస్ ఎడ్యుకేషన్
చాలామంది పెద్ద పెద్ద డిగ్రీలు చదువుతుంటారు. కానీ ఏదైనా సమస్య వస్తే మాత్రం ఆ డిగ్రీలు ఎందుకూ పనికిరావు. వాస్తవ పరిస్థితుల్లో సమస్యను పరిష్కరించేందుకు డిగ్రీలు పనికిరాకపోవడంపై రాహుల్ ఆందోళన వ్యక్తంచేశారు.
‘‘ఆ సమయంలో మా వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవు. కానీ మేం మాత్రం దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాం. మా పరిశోధనలు చూస్తే మాత్రం అది సాధ్యమవుతుందని అనిపించింది. ఒకవేళ మేం ఏదో ఒకటి చేయలేకపోతే, మరెవ్వరూ ఇది చేయలేరనిపించింది. అప్పుడు మా మదిలో ఎన్నో ఆలోచనలు. ఎన్నో అవకాశాలు ఉన్న మేమే ఇప్పుడు దీన్ని పరిష్కరించలేకపోతే, ఆ ప్రపంచంలోని ప్రధానమైన సమస్యలన్నీ ఎలాంటి అవకాశాలు లేని ప్రజలకే విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఇది సరైనది కాదు. నేను సాధించిన డిగ్రీలు నన్ను ఇప్పుడు మంచి స్థానంలో నిలబెట్టాయి. కానీ నా విద్యకు మాత్రం నేను న్యాయం చేయలేకపోతున్నాను’’ అని ఆయన చెప్పారు.
ప్రైజ్ మనీలే పెట్టుబడి
స్టాన్‌ఫోర్డ్‌లో నిర్వహించిన బిజినెస్ ప్లాన్ కాంపిటేషన్‌లో జేన్, రాహుల్ విజయం సాధించారు. ఆ కాంపిటీషన్ ప్రైజ్‌మనీ 25 వేల డాలర్లు. న్యాయనిర్ణేతలు మరో పది వేల డాలర్లను అధికంగా ఇచ్చారు. అలాగే గ్రీన్ ఫెలోషిప్‌ను రెండేళ్లపాటు 90 వేల డాలర్లు గెలుచుకున్నారు. దీంతో వీరి వద్ద మొత్తం లక్షా 25 వేల డాలర్ల ఆదాయం సమకూరింది.
సిలికాన్ వ్యాలీలో ఉద్యోగాన్ని సంపాదించిన రాహుల్ రాత్రిళ్లు, వారాంతాల్లో ప్రాజెక్ట్‌కు సమయం కేటాయించారు. సెలవుల్లో ఇండియాకు వచ్చినప్పటికీ సమయాన్ని మాత్రం రీసెర్చ్‌కే కేటాయించారు. 14 రాష్ట్రాల్లో పర్యటించి ప్రజల ఇళ్లలో, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో కాలం గడిపేవారు. 2009లో తన ఉద్యోగాన్ని రాహుల్ వదులుకున్నారు. జేన్ 2008లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ప్రాజెక్ట్ కోసం నిధుల సమీకరణపై దృష్టిసారించారు.
ఆరంభంలో కిరణ్ మజూందార్ షా, మణిపాల్‌కు చెందిన రాజన్ పాయి ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. సిరీస్ ఏను వినోద్ ఖోస్లా, కాప్రికాన్ ఇన్వెస్ట్ మెంట్ సపోర్ట్ చేయగా, సిరీస్ బీని సేల్స్ ఫోర్స్ డాట్‌కామ్ సీఈవో మార్క్ బెనీఫ్ సపోర్ట్ చేశారు.
సవాళ్లు, విజయాలు..
తమ ప్రాడక్ట్‌ను ఆవిష్కరించేందుకు వారికి మూడేళ్లు పట్టింది. 2012లో ప్రాడక్ట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.
‘‘నమూనాను తయారు చేయడం చాలా సులభం. అన్ని నిబంధనలు పాటించి, సురక్షితమైన వైద్య పరికరాన్ని తయారు చేయడం చాలా కష్టం. అప్పట్లో ఇండియాలో పెద్దగా మార్గదర్శకాలు లేవు. ఎలాంటి మార్గదర్శకాలకు తలవొంచాల్సిన అవసరం లేకపోయింది. సీఈ మార్క్ పొందిన ఆ ప్రాడక్ట్ యూరోప్‌లో అమ్మేందుకు అన్ని అర్హతలు సాధించింది’’ అని రాహుల్ వివరించారు.
తయారు చేసిన ఇంక్యూబేటర్లను విక్రయించడం కూడా అంత సులభం కాదు.
‘‘ఇది అమ్మకానికి సిద్ధంగా ఉన్న ప్రాడక్ట్‌లా కనిపించేది కాదు. ఇలాంటి వార్మర్ ను కానీ, ఇంక్యూబేటర్‌ను కాని డాక్టర్లు ఎప్పుడూ చూసి ఉండలేదు. వీటిని అమ్మేందుకు ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి వచ్చింది’’ అని అన్నారు రాహుల్. ఐఐటీ మద్రాస్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన రఘు ధర్మరాజు ఈ ప్రాడక్ట్‌ను విక్రయించడంలో కీలక పాత్ర పోషించారు. కార్నెల్‌లో ఎంబీఏ చేసిన రఘు, స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్ తిరిగొచ్చారు.
మంచి సంస్థల్లో విద్యను అభ్యసించడం తమ క్రెడిబిలిటీని పెంచిందంటారు రాహుల్. ‘‘ఆరంభంలో కొనుగోలుదారుల కోసం ఎంతో వెతకాల్సి వచ్చేది. పది మందిని సంప్రదిస్తే, ఒకరు మాత్రమే తీసుకునేవారు’’ అని ఆయన చెప్పారు. మూడొందల ఆస్పత్రులను సందర్శించిన తర్వాత, వీరి కృషిని ప్రభుత్వం గుర్తించింది.
‘‘కొత్త ఉత్పత్తులను తీసుకోవడం ఎంతో కష్టమైన విషయం. అదీ వైద్య పరికరం. ప్రభుత్వ పరిమితులను మేం అర్థం చేసుకున్నాం. కానీ మా విషయంలో అధికారులు వేగంగా స్పందించారు. ఈ వైద్య పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనుకున్నారు. ఈ పరికరం గురించి వివరించేందుకు నేను హెల్త్ సెక్రటరీ రాజీవ్ సదానందన్‌ను కలిశాను. మేం చెప్పింది విన్న వెంటనే.. పని ప్రారంభించేందుకు ఆయన ఒప్పుకున్నారు’’ అని రాహుల్ చెప్పారు.
ఐదు యూనిట్లతో కేరళలలో ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో 50 యూనిట్లు, కర్ణాటకలో 50 యూనిట్ల స్థాయికి ఎదిగింది. ఎంబ్రేస్ ఇంక్యూబేటర్ల వెచ్చటి కౌగిలింతలతో లక్షన్నరమంది చిన్నారులను కాపాడగలిగారు.
భవిష్యత్ ప్రణాళికలు
ఈ ఉత్పత్తులను అద్దెకు ఇవ్వాలన్న ఆలోచనలో కూడా ఎంబ్రేస్ ఉంది. దీనిపై ఆశా వర్కర్లతో కలిసి పైలెట్ ప్రాజెక్ట్ కూడా నిర్వహించి విజయం సాధించింది. పర్యవేక్షణ, విశ్లేషణా సామర్థ్యాల్లోకి లోతుగా పరిశీలన చేయాలని కూడా ఎంబ్రేస్ భావిస్తున్నది. నిమోనియా, సెప్సిస్ వంటి వ్యాధులను ఆరంభంలోనే గుర్తించేందుకు సెల్‌ఫోన్ కనెక్టివిటీ, మోడ్రన్ సెన్సార్లను ఉపయోగించాలనుకుంటున్నది.
‘‘మేం ఉత్పత్తులను విక్రయించడంలేదు. అలవాట్లను మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. దానికి కొంత సమయం పడుతుంది. మా తొలి లక్ష్యం ఏంటంటే వైద్యరంగం, విధానాల్లో మార్పు తీసుకురావడం. ప్రజా వైద్య ప్రపంచంలో చర్యలు వేగంగా జరగడం లేదు. ఇందులో మార్పులు తేవాలనుకుంటున్నాం. ప్రతీ చిన్నారి తమ తొలి పుట్టిన రోజును జరుపుకోవాలన్నదే మా కోరిక. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అత్యున్నత డిగ్రీలు పొందిన యువత మరో మార్గాన్ని ఎంచుకునే పరిస్థితులు కల్పించాలన్నదే మా రెండో లక్ష్యం. ఈ రంగంలో మరిన్ని విజయగాథలు, ఆరాధ్య దైవాలు అవసరం. మనం మరికొన్ని ఉదాహరణలను చూపిస్తే, అందులో ఒక ఉదాహరణ మనదే అయితే, మరింత మంది ఇందులో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకు వస్తారు’’ అని రాహుల్ చెప్పారు.
రాహుల్ తన లక్ష్యాలను సాధించాలని మనమూ కోరుకుందాం..