కాలిఫోర్నియాలో చదివి కుగ్రామల్లో సౌర వెలుగులు నింపుతున్న రుస్తుం

రాజస్థాన్‌లో అద్భుతాలు సృష్టిస్తున్న సంస్థ సంస్థల సామాజిక బాధ్యతకు నిలువెత్తు నిదర్శనం బూంద్పేద ప్రజల సంక్షేమమే ప్రధాన అజెండా

కాలిఫోర్నియాలో చదివి కుగ్రామల్లో సౌర వెలుగులు నింపుతున్న రుస్తుం

Tuesday September 01, 2015,

4 min Read

బొట్టు బొట్టు కలిస్తేనే సముద్రం అవుతుంది. ఈ సిద్ధాంతం బూంద్ ఇంజనీరింగ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చక్కగా నప్పుతుంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సంప్రదాయేతర ఇంధన వనరుల్ని తయారుచేస్తోంది బూంద్ కంపెనీ. రుస్తం సేన్‌గుప్తా... ఈ కంపెనీని స్థాపించారు. 2010 నుంచి ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో వీధి లైట్లు, సురక్షిత మంచినీరు, పరిశుభ్రత, పెస్ట్ కంట్రోల్ వంటి సామాజిక బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది. అంతేకాదు గ్రామాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకున్న వాళ్లకు సోలార్ ల్యాంప్, సోలార్ హోం సిస్టమ్స్, వాటర్ ఫిల్టర్స్, స్టవ్స్ తయారుచేసేందుకు శిక్షణ ఇస్తున్నారు.

రుస్తుం సేన్‌గుప్తా, బూంద్ వ్యవస్థాపకులు

రుస్తుం సేన్‌గుప్తా, బూంద్ వ్యవస్థాపకులు


‘‘మన దేశంలో గ్రామీణ ప్రాంతాలకు ఎలాంటి సదుపాయాలు చేరడం లేదు. వారికి అత్యాధునిక విద్యుత్ పరికరాలు, సంప్రదాయేతర ఇంధన వనరులు చేరాలనేది మా లక్ష్యం’’ అంటారు బూంద్ ఇంజనీరింగ్ వ్యవస్థాపకుడు రుస్తం సేన్‌గుప్తా. 

మనకు సోలార్ ఎనర్జీపై అంతగా అవగాహన లేదు. అన్ని గ్రామాల్లోనూ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందంటారు సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ రుస్తుం. అందుబాటులో ఉన్న వివిధ సంప్రదాయేతర ఇంధన వనరుల్ని చౌక‌గా అంద‌రికీ అందించాల‌నే సంక‌ల్పంతో ఉన్నారు.

ఎంబీయే గ్రాడ్యుయేట్ అయిన రుస్తం సేన్‌గుప్తా అమెరికాలోని ఇర్విన్ యూనివ‌ర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్‌లో ఎంఎస్ పూర్తిచేశారు. సింగ‌పూర్, స్విట్జర్లాండ్‌ల‌లోని ప్రముఖ కంపెనీల‌కు క‌న్సల్టెంట్‌గా కూడా ప‌నిచేశారు. సింగ‌పూర్‌లోని స్టాండ‌ర్డ్ ఛార్టర్డ్ కంపెనీకి, స్విట్టర్లాండ్‌లోని డెలాయిట్‌కు క‌న్సల్టెంట్‌గా ప‌నిచేశారు. 

'' గ్రామీణ ప్రాంతాల‌కు అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అంద‌చేయాలి. వివిధ వ‌స్తువులు, సేవ‌ల‌ను అందరికీ అందుబాటులోకి తేవాలి. గ్రామాల్లో ఉత్పాద‌క‌త పెర‌గాలి. కొత్త మార్కెటింగ్ ప‌ద్ధతులు, ఆర్థిక సంస్థల వివ‌రాలు గ్రామీణుల‌కు తెలియ‌చేయాలంటారు '' రుస్తుం.

ఉత్తర‌ప్ర‌దేశ్‌లోని ఉన్నవ్ జిల్లా పారా గ్రామంలో 25 కుటుంబాలు ఉన్నాయి. వీరికి వ్యవసాయ‌మే ఆధారం. వీరి నెల‌వారీ ఆదాయం ఐదువేల రూపాయ‌లు మాత్రమే. వీరిలో చాలామంది ఇళ్ళకు కరెంటు సదుపాయం లేదు.

image


ప్రీపెయిడ్ క‌రెంటు ద్వారా వాళ్ళంతా తమ ఇళ్ళకు కరెంట్ కొనుక్కుంటూ ఉంటారు. ఇలాంటి వారి కోసం బూంద్ కంపెనీ ఒక ఏర్పాటు చేసింది. భారీగా ఖర్చుపెట్టలేని వారికోసం సంస్థే సోలార్ ప్యానెల్స్ కొనుగోలుచేసి వారి గ్రామాల్లో ఏర్పాటు చేసింది. కిలోవాట్ సామర్ధ్యం ఉన్న అపికో గ్రిడ్ సిస్టమ్ ద్వారా కరెంటు సరఫరా చేసింది. అన్ని ఇళ్ళకు ప్రీ పెయిడ్ క‌రెంటు స‌ర‌ఫ‌రా చేయాల‌ని సంక‌ల్పించారు. అపికో గ్రిడ్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికీ కరెంటు ఇచ్చే ఏర్పాటుచేసింది. 25 పేద కుటుంబాలకు దీనివల్ల ఎంతో ప్రయోజనం కలుగుతోంది. 800 వాట్స్ సామర్ధ్యం ఉన్న అపికో గ్రిడ్ ద్వారా ఈ 25కుటుంబాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. విద్యుత్ వినియోగంలో పొదుపును పాటించేందుకు బూంద్ కంపెనీ ఎనర్జీ మీటర్లను బిగించింది.

ఈ కుటుంబాల వారు తమ ఆర్థిక స్థితిని బట్టి ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ బిల్లులు చెల్లించే అవకాశం ఉంటుంది. దీనివల్ల విద్యుత్ పొదుపుతో పాటు దుబారా తగ్గుతుంది. ప్రతి ఇంట్లో రెండు బల్బులు, ఒక మొబైల్ ఛార్జర్, డీసీ ఫ్యాన్ ఏర్పాటుచేశారు.

ప్రీపెయిడ్ కరెంటు మీటర్లు

బూంద్ కంపెనీ తయారుచేసిన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ఎనర్జీ మీటర్లు ఎంతో విజయవంతం అయ్యాయి. ప్రతి కస్టమర్‌కు కంట్రోల్ సర్క్యూట్ మీటర్ అమర్చారు. దీని ద్వారా వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకునేందకు అవకాశం కలుగుతుంది. తమకు ఎంత వాటేజ్ అవసరమో తెలియచేస్తే సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్ నుంచి డబ్బులు చెల్లించి ప్రీ పెయిడ్ కార్డులు కొనుక్కోవచ్చు. విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలకు 11 అపికో గ్రిడ్‌లను బూంద్ ఇంజనీరింగ్ కంపెనీ ఏర్పాటుచేసింది. మే 2014 నాటికి రాజస్థాన్‌లోని 275 కుటుంబాలు బూంద్ ద్వారా ప్రయోజనం పొందారు.

ఇప్పటికీ కిరోసిన్ దీపాలు వెలిగించుకునే పరిస్థితి ఇప్పుడు దాదాపు తగ్గిపోయింది. దీనివల్ల మహిళలకు ఎక్కువ వెసులుబాటు కలుగుతోంది. కుటుంబాల ఆదాయం పెరగడంతో పాటు ఆరోగ్య రక్షణకు బూంద్ కంపెనీ ఎంతో ప్రయత్నం చేస్తోంది. ఈ టెక్నాలజీ వల్ల దేశంలో విద్యుత్ సమస్య రాదంటున్నారు రుస్తం. తక్కువ ధరకు విద్యుత్ అవసరాలు తీరతాయంటున్నారు.

‘‘వినియోగదారులు ఎవరైనా తమ అవసరాల కోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాడకపోయినా బిల్లులు చెల్లించే అవకాశం ఉండదు. ఎందుకంటే వారు ఊరికి వెళ్ళేటప్పుడు మీటర్ ఆఫ్ చేసుకుని వెళితే ఊరినుంచి వచ్చాక మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. విద్యుత్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదంటున్నారు’’రుస్తం.

ఇలాంటి మీటర్లు, అపికో గ్రిడ్‌ల తయారీ వల్ల విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల్లోని 20 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది. దీనివల్ల సామాజిక మార్పునకు జరుగుతుందంటున్నారు.

పల్లె పల్లెకూ విద్యుత్ వెలుగులు

ప్రతీ గ్రామంలో విద్యుత్ సౌకర్యం ఉండాలనేది బూంద్ కంపెనీ ఆలోచన. విద్యుత్ కాంతులు సమాజంలో ఎన్నో అనర్థాలను పారద్రోలుతుంది. రోజుకి ₹200 వందల నుంచి ₹400 సంపాదించే వారు సరైన కరెంట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడడం ఎంతవరకూ సమంజసమనే ప్రశ్న ఉదయించడం సహజం. కరెంట్ కోసం వేలాది రూపాయలు నెలకు ఖర్చు చేయలేని వారి పరిస్థితేంటి ? ఉన్నవ్ జిల్లాలోని హసన్‌గంజ్‌లో పాల వ్యాపారం చేసే 27 ఏళ్ళ అమిత్ కుమార్ పరిస్థితిని మనం గమనిస్తే అతను పాలను సరిగా నిల్వచేయలేకపోతున్నాడు. దీనికి కారణం సరిగా కరెంటు లేకపోవడం. కరెంట్ ఉంటే పాలను నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. అతని వ్యాపారం నష్టాల బాట పట్టింది. అయితే ఇతంతా గతం. మిల్క్‌టెస్టింగ్ సెంటర్‌లో 225 వాట్ సోలార్ పవర్ సప్లై సిస్టమ్‌ని బూంద్ సాయంతో ఏర్పాటుచేసుకున్నారు. దీంతో అతని పాల వ్యాపారంలో మార్పులు వచ్చాయి. మిల్క్ టెస్టింగ్ పరికరాలు, ఫ్యాట్ మెజర్‌మెంట్ మీటర్, కంప్యూటర్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మార్పుల తర్వాత కుమార్ ఆదాయంలో గణనీయమైన మార్పులొచ్చాయి. గతంలో కంటే 30 నుంచి 40 శాతం ఆదాయం పెరిగింది. అంతేకాదు నాణ్యమైన పాలను కూడా సేకరించి అమ్మగలుగుతున్నాడు. అతని మిల్క్ పాయింట్‌లో మూడు బల్బులు, మొబైల్ ఛార్జింగ్ ఏర్పాటుచేశాడు.

సోలార్‌తో వ్యాపారాల్లో మార్పులు

‘‘ప్రతి గ్రామంలో విద్యుత్ సౌకర్యం కావాలంటే సోలార్ ప్యానెల్స్ ఒక్కటే మార్గం అంటారు’’రుస్తం. అయితే సోలార్ ప్యానెల్స్ కొనుగోలు అంత ఆషామాషీ కాదు. ఎందుకంటే ఇవి ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. ప్రభుత్వాలు, బ్యాంకులు ముందుకు వచ్చి వీటి ఏర్పాటుకు ఇతోధిక సాయం చేయగలిగితే ఎక్కువమంది సోలార్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంటుంది అంటున్నారు రుస్తం. బూంద్ కంపెనీ ఇప్పటివరకూ 7500 సోలార్ సిస్టమ్స్ కొనుగోలు చేసింది. వీటి ద్వారా సుమారు 50 వేలమంది గ్రామీణుల జీవితాల్లో వెలుగులు వచ్చాయంటారు.

రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లోని గ్రామాల్లో విద్యార్ధులు, చిన్నారులు ఇప్పుడు హాయిగా చదువుకుని త్వరగా నిద్ర పోగలుగుతున్నారు. విద్యుత్ కొరత అనేది వారికి తెలియడంలేదు. అలాగే వివిధ వ్యాపార సంస్థల్లో ఎక్కువ సమయం గడపడం వల్ల ఉత్పాదకత కూడా బాగా పెరుగుతోంది. సోలార్ సిస్టమ్ వల్ల ఈ ప్రాంతంలో వ్యాపారులు తమ వ్యాపారం 30 శాతం పెరిగిందంటున్నారు. 

‘‘ 2015 చివరి నాటికి 10 జిల్లాలను గుర్తించి అక్కడ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. 1500 కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా లక్ష మందికి ప్రయోజనం కలుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలు కూడా ఇందులో భాగం అవుతున్నాయి.వీటి వల్ల వేలాది మందికి ఉపాధి కలుగుతుంది’’ అని చెబుతున్నారు రుస్తం. 

అంతర్జాతీయ సంస్థల సహకారంతో సోలార్ ఎనర్జీని విస్తరించాల్సిన అవసరం ఉందంటారు రుస్తం. భారతీయ యూనివర్శిటీల్లో వాతావరణ మార్పులపై అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. సోలార్ ప్యానెల్స్ ఖర్చును తగ్గించేందుకు ఇంజనీర్లు తమవంతు ప్రయత్నాలు చేయాలని రుస్తం కోరుతున్నారు. గ్రామాల్లో విద్యుత్ వెలుగులకు మించింది లేదు కదా. అది కూడా తక్కువ ధరకు వస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. కార్పోరేట్ కంపెనీలు గ్రామాల్లో విద్యుద్దీకరణను సామాజిక బాధ్యతగా స్వీకరిస్తే గ్రామాల్లో వెలుగులు విరజిమ్ముతాయి.