శ్రీమంతుడికి సిసలైన అర్థం 'జీతాబాయ్ సోమయ్య'
" సమాజం మనకు చాలా ఇచ్చింది.. నాలుగింతలుగా దాన్ని తిరిగి ఇవ్వాలి.." ఈ ఆదర్శాన్ని తన జీవన విధానంగా మార్చుకున్నారు పద్మశ్రీ కరమ్షీ జీతాబాయ్ సోమయ్య. అదే ఆదర్శాన్ని విలువలనూ తాను స్థాపించిన సోమయ్య విద్యావిహార్ ట్రస్ట్ ద్వారా ఆచరణలోకి తెచ్చారాయన. 1959 నుంచి ఈ ట్రస్ట్ తాను బలంగా నమ్మిన సిద్ధాంతాన్నే ఆచరిస్తోంది. 19వశతాబ్దపు మొదటి రోజుల్లో అంటే 1902, మే 16న ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన సోమయ్య ఆరవ తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగారు. చదువు వరకూ పేదగా ఉన్న జీతాబాయ్ సోమయ్య..పట్టుదలలో మాత్రం ఎంతో ధనవంతుడినని నిరూపించుకున్నారు. మహారాష్ట్రలోని సకార్వాడీ, లక్ష్మీవాడిలో పేరొందిన షుగర్ ఫ్యాక్టరీలను స్థాపించారు. ఎంతోమందికి ఉపాధి కల్పించారు. తాను చిన్ననాడు దూరమైన విద్యకు మరెవరూ దూరం కాకూడదని.. కేజే సోమయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్సెస్, సోమయ్య విద్యామందిర్ స్కూళ్లను నెలకొల్పారు. కార్మికులు ఎక్కువగా నివసించే ఆ ప్రాంతాల్లో వారికి ఉపయోగకరంగా ఉండటానికే ఈ ఏర్పాటు చేశారు సోమయ్య. గోదావరి నది ఒడ్డున నిర్మించిన సకార్వాడీ స్కూల్ ప్రారంభంలో కోపర్ గావ్ తాలూకాలో నివసించే పిల్లలందరికి ఉపయోగపడుతోంది.
మోడ్రన్ స్కూళ్లకు ధీటుగా ఎదిగిన ఈ మరాఠీ స్కూళ్లు
సోమయ్య విద్యామందిర్ స్కూళ్లు ఇప్పుడున్న స్థితికి రావడానికి ఓ సంఘటనే టర్నింగ్ పాయింట్. గ్రామీణ ప్రాంతాన్ని ప్రతిబింబించే ఈ స్కూళ్లు 13ఏళ్ల క్రితందాకా మిగిలిన వాటిల్లానే ఉండేవి. ఐతే ఓ రోజు సమీర్ సోమయ్య (సోమయ్య విద్యావిహార్ ప్రస్తుత ప్రెసిడెంట్ & గోదావరి బయో రిఫైనరీస్ ఛైర్మన్ ) తన రెండేళ్ల కుమార్తెతో విద్యామందిర్‌లను సందర్శించారు. అరకొర వసతులతో నడుస్తున్న ఈ స్కూళ్లను సందర్శించిన తర్వాత వాటికి అవసరమైన సైన్స్ ల్యాబ్స్, స్లైడ్స్ ప్రదర్శించడానికి మూవీ హాల్స్, లైబ్రరీ, కంఫ్యూటర్ ల్యాబ్స్, సంగీత ప్రదర్శనశాల ఏర్పాటయ్యాయి. కోపర్గావ్ ,రహతా గ్రామాల పిల్లలైనా..తన కుమార్తె అయినా ఒకే దృష్టితో చూడటం వల్లనే ఈ వసతులన్నీ సమకూర్చారు సమీర్ సోమయ్య. పట్టణంలో తన కూతురుకు ఎలాంటి వసతులున్న స్కూల్లో చదువుకోవాలని కోరుకుంటారో ...అదే వసతులు ఈ గ్రామ విద్యార్ధులకు కల్పించాలనే సత్సంకల్పంతో ఇవన్నీ సమకూర్చారాయన. జీతాబాయ్ సోమయ్య సంస్థలను మరాఠీ ఇన్సిట్యూషన్స్‌కు ఓ మోడల్‌లా మార్చాలని కృతనిశ్చయంతో పని చేశారాయన.
ప్రాంతీయ భాషల్లో నడిచే స్కూళ్లను అంతరించిపోతున్న జ్ఞానాన్ని అందించే పాఠశాలలుగా తీర్చిదిద్దాలనుకున్నారు సమీర్. సోషియాలజీ స్టూడెంట్లు, ఎస్ కే సోమయ్య డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్లను ఈ రెండు పాఠశాలలను డెవలప్ చేసే యత్నంలో భాగస్వాములుగా మార్చారు. శాస్త్రపరమైన జ్ఞానాన్ని విద్యార్ధులకు అందించేందుకు ప్రయోగశాలలో వీరి కోసమే సొంతంగా ఓ టెలిస్కోప్‌ను కూడా ఏర్పాటు చేశారు సమీర్. ఓ మారు మూల పల్లెల్లో ఇంత గొప్ప బోధన అందించగలగడంతో..గ్రామీణ విద్యార్థులు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న అనుభూతి పొందుతున్నారు.
కుగ్రామాల్లో పుట్టినంత మాత్రాన ప్రపంచస్థాయి ప్రమాణాలకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదంటారు సమీర్ సోమయ్య. సమీర్‌కు ఉన్న ఈ నిశ్చితాభిప్రాయమే పాఠశాలల విద్యార్ధుల పాలిట వరంగా మారిందని చెప్పాలి. మిగిలిన మరాఠీ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో ధీటుగా ఈ రెండు స్కూళ్ల విద్యార్ధులు మంచి ఫలితాలను ఇప్పుడు సాధిస్తున్నారు.
గుడ్ స్కూల్స్ మేక్ గుడ్ టీచర్స్
మంచి ఉపాధ్యాయులే మంచి విద్యార్ధులను తయారు చేస్తారు. విద్యావ్యవస్థను గమనించినప్పుడు ఈ రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. డల్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు వారిని మంచి విద్యార్ధులుగా తీర్చి దిద్దడమనేది ఓ టీచర్ ప్రాథమిక బాధ్యత. ఎలాంటి వసతులూ లేకుండా ఓ మంచి టీచర్ కూడా విద్యార్ధులను చురుకుగా తయారు చేయలేడు. వాళ్లకు అవసరమైన వాటిని అందిస్తే.. మంచి టీచర్..గొప్ప టీచర్‌గా రూపుదిద్దుకుంటాడు.
విద్యామందిర్ ప్రిన్సిపల్ సునీత పారే మాటల్లో చెప్పాలంటే " విద్యార్ధులు వెనుకబడినప్పుడు టీచర్లు అర్ధం చేసుకుని సరిదిద్దాలి. అందుకు మనస్సు పెట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్ధులు ఎదుర్కొనే సమస్య సరైన ఉపాధ్యాయులు లేకపోవడం. అది సోమయ్య విద్యామందిర్‌లో మాత్రం ఉండదు.." అని చెప్తారు.
పరిసరాల శుభ్రతతో పాటు..పారిశుధ్ద్యం పై అవగాహన ఓ విద్యార్ధి భవిష్యత్తునే మార్చివేయవచ్చంటారు సునీత పారే. పాఠశాలలో మంచి వసతులు, టాయిలెట్స్ ఉన్నాయంటే తల్లిదండ్రులు ఏ శంకా లేకుండా స్కూళ్లకు పంపుతారని అంటారామె. అందులో విద్యార్ధి బాలిక అయితే ఆ ప్రభావం ఇంకా ఎక్కువ. మధ్యాహ్నభోజన పథకాన్ని ఇక్కడి గోదావరి రిఫైనరీస్ నిర్వహిస్తోంది. దీంతో మిగిలిన ప్రభుత్వ పాఠశాలలకంటే ఇక్కడ ఆ పథకం సమర్ధవంతంగా కొనసాగుతోంది.
విశాలమైన తరగతి గదులు, ధారాళంగా వెలుతురు, గాలి ప్రసరించే విధంగా ఉన్నప్పుడు బోధన సక్రమంగా జరుగుతుంది. విద్యామందిర్ లోని క్లాస్ రూమ్స్ లోపలి గోడలు చక్కని ఛార్టులు..డ్రాయింగ్స్ తో నిండిఉంటాయ్. ఫుట్ బాల్, హాకీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్న సంగీతం, నృత్యం కూడా క్లాసుల్లో భాగం. ఇవి ఓ విద్యార్థి ఆల్‌రౌండ్ డెవలప్‌మెంట్‌కు దోహదపడ్తాయి.
విద్యామందిర్ గురించి విద్యార్ధులేమంటున్నారంటే..!
లక్ష్మీవాడీలోని సోమయ్య విద్యామందిర్ నుంచి పూజా త్రిభువన్ తాజాగా పదో తరగతి పాసైంది. కుటుంబ నేపధ్యానికి వస్తే తండ్రి వైర్ మెన్. తల్లికి స్థానిక స్వీట్ షాపులో పని. ఓ చిన్న అద్దెంట్లో ఉండే నిరుపేద కుటుంబం వీళ్లది. ఇక్కడి టీచర్లు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యానని చెప్తోంది.
ఇంజనీర్ కావాలనేది పూజ లక్ష్యం.. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన నాటి నుంచి పూజలో ఆత్మవిశ్వాసం మెరుగుపడటమే కాకుండా.. తన కలలు ఖచ్చితంగా నెరవేరతాయనే నమ్మకం కలిగిందామెకు..
ఆచరించదగిన ఆదర్శం
బాల్యాన్ని బతికించుకోవాలని చెప్పడం సులువే.. కానీ పసిపిల్లలు కూడా పనిపిల్లలుగా మారే పరిస్థితి ఉంది. వారి కుటుంబాల జీవనం గడిచేందుకు తప్పనిసరి పరిస్థితుల్లోనే వారు కూడా పనికి వెళ్తున్నారు. అలాంటి వారికి భోజనానికి కూర్చున్నప్పుడు అందరికీ సరిపోయేలా ఆహారం దొరకడం కూడా ఓ అదృష్టమే. అలాంటి దశలో సంపాదనకు మరో చేయి తోడైతే ఎందుకు వద్దనుకుంటారు.
" అందుకే..మేం వారి బాధలను పరిస్థితిని అర్ధం చేసుకున్నాం. విద్యార్ధులకు వారి స్థితిని గుర్తు చేస్తూ.. మోటివేట్ చేస్తుంటాం. లక్ష్యం గురించి ఎప్పుడూ మర్చిపోనీయకుండా..చూస్తాం'' అని పూర్తి చేశారు సునీత పారే.
మారుమూల గ్రామాల్లోనూ కార్పోరేట్ స్థాయి ప్రమాణాలతో విద్య అందిస్తున్నసోమయ్య విద్యామందిర్ ట్రస్ట్ సేవలను అభినందించక తప్పదు. మీ చుట్టుపక్కలా ఇలాంటి సేవ చేస్తున్నవారెవరైనా ఉంటే యువర్ స్టోరీతో పంచుకోండి..!