టాక్సీలకు ఉందిలే మంచికాలం!!

2015లోగతుకుల దారిలో నడిచిన క్యాబ్ సర్వీస్ -2016 పైనే ట్యాక్సీల ఆశలు-

1st Jan 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

కారులో తిరగటం ఒకప్పుడు కల. కానీ, ఇప్పుడు క్షణాల్లో పని. దానికి సొంత కారు అక్కర్లేదు.. బ్యాంకు బాలెన్స్ తో పనీ లేదు. అరచేతిలో ఒక స్మార్ట్ ఫోన్, అందులో ఒక యాప్ ఉంటే చాలు... వెంటనే గల్లీ చివర కారు హార్న్ వినపడుతుంది. ఇప్పటికే నగరాల్లో టాక్సీ కంపెనీలకు కస్టమర్లు బాగా దగ్గరవుతున్నారు. ఈ పరిణామాలు చూస్తే రాబోయే కాలం అంతా టాక్సీలో కదిలే భారత దేశం అవుతుందేమో అనిపించటంలో ఆశ్చర్యం లేదు.

దూసుకుపోతున్న టాక్సీ....

దూసుకుపోతున్న టాక్సీ....


2014 డిసెంబర్..

ఢిల్లీలో ఓ రేడియో టాక్సీ డ్రైవర్ అందులో ఎక్కిన ప్రయాణికురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పటికి నిర్భయ ఘటన జరిగి ఏడాది కావొస్తోంది. మళ్లీ నిరసనలు, టాక్సీ ప్రయాణంలో భద్రతపై ప్రశ్నలు... ఇవన్నీ నిర్భయ నాటి స్పందనను గుర్తు తెచ్చాయి. దీని ఫలితం 2015లో టాక్సీ కంపెనీలు ప్రత్యక్షంగా చూశాయి. మరో పక్క ప్రభుత్వం ఈ సర్వీసుల్లో భద్రతను వదిలేసి దేశంలో కొన్ని ప్రాంతాల్లో నిషేధం విధించింది. ఈ పరిస్థితి 2015 మూడో త్రైమాసికం వరకూ కొనసాగింది. ఇటు ప్రభుత్వానికి కూడా నింబధనావళి రూపొందించటానికి చట్టాలు తీసుకు రావటానికి పూర్తిగా కొత్త విషయమయింది.

ఇక్కడ విశేషం ఏంటంటే, ఇన్ని అడ్డంకులున్నా, దేశంలో టాక్సీ ఇండస్ట్రీ ఎదుగుదల ఆగలేదు. వినియోగదారుల డిమాండ్ లో మార్పులేదు. కొత్తగా వచ్చే పెట్టుబడులూ తగ్గలేదు. ఎందుకంటే 2015లో కొన్ని పెద్ద కంపెనీలు 100కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. అదే సమయంలో పలు చిన్న కంపెనీలు కూడా ఈ రంగంలో ప్రవేశించాయి. ప్రముఖ టాక్సీ అగ్రిగేటర్ ఓలా ఏకంగా సింగపూర్ కంపెనీ గ్రాబ్ టాక్సీ, అమెరికన్ దిగ్గజం లిఫ్ట్, చైనా కంపెనీ దిది కౌదీ లతో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ఈ ఏడాది పట్టాలెక్కబోతోంది. ఫలితంగా ఒక టాక్సీ కంపెనీ తన మార్కెట్ ని ఇతర దేశాల్లో కూడా విస్తరించే అవకాశాలు వచ్చాయి.

కీలకంగా మారిన పెట్టుబడులు

2015లో టాక్సీ అగ్రిగేటర్లలో పెట్టుబడిని ఆకర్షించటంలో ఓలా ముందంజలో ఉంది. సాఫ్ట్ బ్యాంక్, సెఖోయా క్యాపిటల్, మాట్రిక్స్ పార్ట్‌ నర్స్, యాక్సెల్, స్నాప్ డీల్, టైగర్ గ్లోబల్ లాంటి పెద్ద కంపెనీలు ఇందులో దాదాపు 900 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాయి. వీటిలో కొన్ని ఉబర్ లో కూడా పెట్టుబడులు పెట్టాయి. జుగ్నూ సంస్థకు పేటిఎమ్ నుండి పెట్టుబడులు వచ్చాయి.

ఈ కామర్స్ తో పాటు ఇతర సేవల రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపే సాఫ్ట్ బ్యాంక్ ఓలాతో పాటు, ఇతర దేశాల్లో ఓలాతో ఒప్పందాలు చేసుకున్న గ్రాబ్ టాక్సీ, దీదీకౌదీ లాంటి సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టింది. అదే సమయంలో మ్యాట్రిక్స్ పార్ట్‌ నర్స్ సంస్ధ, క్వికర్, లైమ్ రోడ్, హౌస్ జాయ్, ఛమ్ బక్, లాంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఇతర రంగాల్లోనూ ఆసక్తి చూపుకుంది..

అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే.. పెట్టుబడులు వ్యాపార విస్తరణకు మాత్రమే పనికొస్తాయి. సేమ్ టైమ్ అనుమతులు కూడా కావాలి. అప్పుడే బిజినెస్ అనుకున్న దారిలో వెళ్తుంది. 2015 అక్టోబర్ లో కేంద్ర రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఇచ్చిన గైడ్ లైన్స్ టెక్నాలజీ ఆధారంగా- అంటే స్మార్ట్ ఫోన్లతో టాక్సీ సర్వీసులను అందించే అగ్రిగేటర్ సంస్థలకు, టాక్సీ సంస్థలకు మధ్య విభజన చేసింది. ఈ మార్పులన్నీ టాక్సీ సర్వీసులకు, వాటి సంస్థలకు, అగ్రిగేటర్లకు కొంత ఇబ్బందికరంగా అనిపించినా, ఈ రంగంలో స్థిరపడాలని వచ్చే కంపెనీలకు నియమావళి తయారయినట్టైంది.

కొత్త కంపెనీలు... పాత సమస్యలు

టాక్సీ సేవా రంగంలోకి కొత్త కంపెనీలు, సరికొత్త ఆలోచనలతో వస్తున్నప్పటికీ స్థానిక ప్రభుత్వ విధానాలు కొంత అడ్డంకిగా మారిన మాట వాస్తవం. ఉదాహరణకు యూరప్ లో సక్సెస్ అయిన ఫ్రెంచ్ కంపెనీ బ్లాబ్లా కార్ ఇండియాలో ఇంటర్ సిటీ షేరింగ్ సర్వీస్ ప్రవేశ పెట్టింది. దీన్ని ఏహెచ్ ఏ టాక్సీస్, బైక్ టాక్సీస్ బెంగళూరు, గుర్గావ్ లలో ప్రవేశ పెట్టినప్పటికీ ఆ షటిల్ సర్వీసులు ఆపాల్సి వచ్చింది. ఇదే అనుభవం ఓలా, షటిల్, ట్రెవో కంపెనీలకూ ఎదురైంది.

ప్రయాణికుల భద్రతే ప్రాధాన్యం..

ఈ పరిణామాల మధ్య ప్రయాణికుల భద్రత క్యాబ్ అగ్రిగేటర్లకు ప్రధానంగా మారింది. ఈ క్రమంలో ఓలా, ఉబెర్ లాంటి సంస్థలు తమ యాప్ లలో అత్యవసర మెసేజ్ లను పంపే ఏర్పాట్లను కూడా చేశాయి. మేరు ఇంకో అడుగు ముందుకేసి, క్యాబ్ లో పెప్పర్ స్ప్రే కూడా అందుబాటులోకి తెచ్చింది. ఉబర్ క్యాబ్ సంస్థ పుణె, కోల్ కతాలలో పోలీస్ డిపార్ట్ మెంట్ తో కలసి పనిచేయటమే కాకుండా, డ్రైవర్లుగా కూడా రిటైర్డ్ పోలీసులను తీసుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఓలా సంస్థ సైనిక్ డ్రైవర్ ప్రోగ్రామ్ పేరుతో మాజీ సైనికులను తీసుకునే ప్రయత్నాల్లో ఉంది. అంతే కాదు.. ఈ రెండు కంపెనీలు తమ డ్రైవర్లను తీసుకునేటపుడు థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ను మార్చేశాయి. మేరు లాంటి కంపెనీలు మహిళల కోసం ప్రత్యేకంగా క్యాబ్ సర్వీసులను ప్రారంభించాయి. ఢిల్లీలో జిప్గో సంస్థ మహిళలకు ప్రత్యేకంగా షటిల్ ప్రారంభించింది..

కొత్త కంపెనీలొస్తున్నాయ్... మార్కెట్ విస్తరిస్తోంది..!!

టాక్సీ సంస్థలకు, అగ్రిగేటర్లకు పోటీగా ఇతర సంస్థలూ వస్తున్నాయి. ఉదాహరణకు ఆన్‌ లైన్ ట్రావెల్ సెర్చ్ సంస్థ ఇగ్సిగో కూడా క్యాబ్స్ బుకింగ్ సర్వీసు మొదలు పెట్టింది. నికి, లోకొ క్యాబ్స్ లాంటి యాప్స్ అగ్రిగేటర్లకే అగ్రిగేటర్లుగా మారాయి. అంటే, ఓలా, ఉబెర్ లాంటి యాప్ లను విడిగా ఉపయోగించకుండా ఒక చోట చేరుస్తున్నాయి. క్యాబ్స్ గురు యాప్ కూడా ఇదే బాటలో ఉంది. అదే సమయంలో కొన్ని యాప్స్ టాక్సీ, ఆటోలలో కూడా షేరింగ్ ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి.

2015లో అగ్రిగేటర్ల ప్రయాణం ఇలా...

2015లో అగ్రిగేటర్ల ప్రయాణం ఇలా...


మరికొన్ని పెద్ద సంస్థలు టాక్సీ సర్వీసులతో పాటు ఇతర వ్యాపారాల్లోనూ అడుగు పెడుతున్నాయి. ఓలా కేఫ్, ఓలా స్టోర్ లతో ఈ సంస్థలు ఆంట్ర ప్రెన్యూర్లుగా మారుతున్నాయి. ఓలా, ఉబెర్ సంస్థలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో కలసి, ఆంట్రప్రెన్యూర్ షిప్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. మేరు తన బిజినెస్ మోడల్ మార్చుకుని కార్ల అగ్రిగేటర్ నుంచి స్వంతంగా కార్లను సమకూర్చుకునే పనిలో ఉంది.

2016లో వేగం పుంజుకుంటుందా..?

2015లో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, కొత్త ఏడాది చాలా ఆశావహంగా కనిపించటం టాక్సీ అగ్రిగేటర్లకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు నింబధనలు రూపొందించేలా సూచనలిచ్చింది. ఇది ఓలా, ఉబర్ లాంటి సంస్థలకు మరింత స్పష్టతనిచ్చింది. మరోపక్క క్యాబ్ డ్రైవర్లు, ట్యాక్సీ యూనియన్ల నుంచి ఇన్సెంటివ్ ల గురించి వస్తున్న డిమాండ్లు ఇంకా తేలాల్సి ఉంది. ఇలాంటి ఎన్ని సమస్యలున్నా... భారత్ లో టాక్సీ సంస్థలకు, అగ్రిగేటర్లకు అపారమైన డిమాండ్ ఉన్నమాట వాస్తవం. 15 బిలియన్ డాలర్ల భారత టాక్సీ వ్యాపారం మరింత పెట్టుబడిదారులను ఆకర్షించటం ఖాయం. ఓలా కంపెనీ ఒక్కటే బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించటమే దీనికి పెద్ద ఉదాహరణ.

భారతదేశంలో రేడియో టాక్సీ మార్కెట్ వాటా అనూహ్యంగా పెరగబోతున్నదనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఇది 2020కల్లా కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో 17శాతం ఉంటుందని అంచనా. అదే క్రమంలో బస్ షటిల్ మార్కెట్ 9.36శాతం వృద్ధి అంచనా ఆశావహంగా కనిపిస్తోంది. ఇది దేశ ప్రజా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావటం ఖాయంగా కనిపిస్తోంది

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close
Report an issue
Authors

Related Tags

Our Partner Events

Hustle across India