సంకలనాలు
Telugu

ఇంట్లోనే సెలూన్ స్థాయి అనుభూతి

ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ నుంచి బ్యూటీ బిజినెస్‌లోకితనకు వచ్చిన ఇబ్బందితో వ్యాపార ఆలోచనవర్కింగ్ విమెన్ కోసం ఇంటి దగ్గరికే సెలూన్హోం సెలూన్ తరహా సేవలకు పెరుగుతున్న ఆదరణకొత్త ఆలోచనతో స్ఫూర్తిగా నిలుస్తున్న రిషిక చందన్

team ys telugu
30th Mar 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

రిషిక చందన్.. ! ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన మహిళ. వృత్తిగత జీవితంలోనే ఈమెకు ఊపిరి సలపనంతటి పని. అంతటి బిజీ జీవితంలో... వ్యక్తిగత అలంకరణ, సౌందర్య రక్షణ కోసం ఈమెకు సమయమే దొరికేది కాదు. తప్పని పరిస్థితుల్లో... తరచూ వీకెండ్స్ లో.. రిషిక చందన్ దగ్గర్లోని సెలూన్లకు వెళ్ళాల్సి వచ్చేది. వారమంతా అలసిపోయి.. కనీసం మిగిలిన ఆ సమయాన్నైనా కుటుంబ సభ్యులు మిత్రులతో సరదాగా గడుపుదామన్న ఆమె ఆశ పూర్తిగా తీరేది కాదు. సెలూన్ వెళ్ళేందుకు, తప్పనిసరిగా తన వీకెండ్ సమయాన్ని కేటాయించాల్సి వచ్చేది. ఇది రిషిక చందన్ ను ఎంతగానో బాధించేది. కానీ ఇది ఆమె ఒక్క బాధే కాదు.. నగరాల్లో నివసించే చాలామంది వర్కింగ్ విమెన్ ది ఇదే గాథ... అదే వ్యథ. మరి ఈ సమస్య నుంచి పుట్టిన బిజినెస్ ఐడియా ఏంటో చూడండి.

రిషిక చందన్, ది హోమ్ సెలూన్ వ్యవస్థాపకురాలు

రిషిక చందన్, ది హోమ్ సెలూన్ వ్యవస్థాపకురాలు


సౌందర్య పరిరక్షణకు అవసరమైన సెలూన్‌లు అందుబాటులో లేకో.. దగ్గర్లోనే ఉన్నా వెళ్ళేందుకు సమయాన్ని కేటాయించలేకో... సతమతమవుతున్న ఎందరో మహిళల్లా రిషిక మౌనంగా ఉండిపోలేదు. ఆ ఇబ్బందులను తొలగించే మార్గాన్ని అన్వేషించింది. అంతే.. ఆమె మదిలో సరికొత్త ఆలోచనకు బీజం పడింది. దాని ఫలితమే... ది హోమ్ సెలూన్.

image


అసలు హోమ్ సెలూన్ ప్రారంభించాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది అని రిషికని అడిగితే.. “ మా పెళ్ళై నగరంలోని ఓ భారీ అపార్ట్ మెంట్ లో చేరాక.. కేశాలంకరణ, ఫేసియల్ లాంటి కనీసపు అవసరాలు తీర్చుకునేందుకు సెలూన్ కి వెళ్ళాలన్నా కుదిరేది కాదు. అంటే.. అలాంటి సెలూన్ లు దగ్గర్లో ఉండేవి కావు. అప్పుడే ఈ మొబైల్ సెలూన్ ఆలోచన వచ్చింది. నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు, అద్దెకార్లు లాంటి సేవలన్నీ ఇంటి ముంగిటికే వస్తున్నప్పుడు.. ఈ సౌందర్య పరిరక్షణ (బ్యూటీ సెలూన్) సేవలను వినియోగదారుల ఇళ్ళకే ఎందుకు చేర్చలేము? సుశిక్షితులైన థెరపిస్ట్ ల సేవలను వినియోగదారుల ఇళ్ళవద్దకే ఎందుకు చేర్చలేము? అన్న ఆలోచన వచ్చింది. ఆ యోచనకు పదును పెట్టి.. పకడ్బందీగా ప్రణాళికను రచించాను. అలా.. ది హోమ్ సెలూన్ ఆవిర్భవించింది..’’ అని ఆనందంతో బదులిస్తారు.

తన ప్రస్థానం గురించి,, తాను ఎంచుకున్న మార్గంపై తనకున్ననమ్మకాల గురించి, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ కెరీర్ ను వదిలిపెట్టడం ద్వారా ఎంత రిస్క్ తీసుకున్నదీ.. యువర్ స్టోరీ (మీ కథ/మీ గాథ) బృందంతో... ఆత్మీయంగా పంచుకున్నారు.,,, రిషిక!

image


యువర్ స్టోరీ :మార్కెట్ లో మీ వ్యాపారం విభిన్నమైనదని ఎలా విశ్లేషిస్తారు..? దీని అభివృద్ధికి మీవద్దనున్న ప్రణాళికలేంటి..?

రిషిక : అసలు మా ఆలోచనే పూర్తి భిన్నమైంది. ఇప్పుడున్న సెలూన్లకు విభిన్నంగా మేము ఇంటివద్దకే వచ్చి సేవలను అందిస్తున్నాము. సుప్రసిద్ధ సంస్థల్లో శిక్షణ పొందిన నిష్ణాతులతో థెరపీ అందిస్తున్నాము. స్థానికంగా ఇలాంటి సేవలు అందించే.. శిక్షణ పొందని ఇతర మహిళలకన్నా.. మా బృందంలోని సభ్యులు మెరుగైన సేవలను అందించగలుగుతారు. సాధారణంగా వినియోగదారులు కాస్తంత ఊరట కోసం సెలూన్లను ఆశ్రయిస్తుంటారు. అయితే.. ఇంటివద్దనే ఈ సేవలు పొందడం వల్ల... ఆ ఊరట లభించదని వారు భావిస్తుంటారు. అందుకే... ఇలాంటి వారి అసంతృప్తిని రూపుమాపేలా మా ఆలోచనను సిద్ధాంతీకరించాము. 

మేము సెలూన్లలో లభించే లాంటి ఊరటను వినియోగదారులకు వారి ఇళ్ళ వద్దే కచ్చితంగా అందించగలం. వినియోగదారుకి అవసరమైన పానీయాన్ని అందిస్తాము. ప్రస్తుతం మేము టీ, కాఫీ, గ్రీన్ టీ, టాంగ్ లను అందిస్తున్నాము. స్పా క్యాండిల్స్ ను ప్రతి సేవకూ తీసుకు వెళుతున్నాము. వాటర్ హీటర్స్, యాఫ్రాన్స్ లాంటి వాటితో పాటు.. వాడి పాడేసే సౌందర్య పరిరక్షణ వస్తువులనూ మా వెంట తీసుకు వెళుతున్నాము. మా చికిత్స ద్వారా వినియోగదారులు సంపూర్ణంగా రిలాక్స్ అవుతారని ఘంటాపథంగా చెప్పగలను. ఒక్కసారి మా సేవల కోసం కూర్చున్న వినియోగదారులు మధ్యలో లేచి వెళ్ళే అవసరం రాకూడదన్నదే దీని ఉద్దేశం. త్వరలోనే సంగీతాన్నీ మా సేవల్లో జోడించాలనుకుంటున్నాము. అప్పుడు వినియోగదారురాలు.. హాయిగా టీ తాగుతూ.. సంగీతాన్ని వింటూ.. రిలాక్స్ అవుతూ.. మా సేవలను వినియోగించుకోగలుగుతారు.

ఇలా ఇళ్ళ వద్ద విడివిడిగానే కాకుండా... మహిళల స్పా పార్టీలకూ మా సేవలను అందిస్తున్నాము. కిట్టీ పార్టీల్లో స్పా కేంద్రాలు, వధువు అలంకరణ, పిల్లలను సింగారించడం, ఇళ్ళల్లోనే పార్టీలు జరుపుకుంటే ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళి సేవలు అందించడం లాంటివి చేస్తున్నాము. ఇది మాకు ఘనవిజయాన్ని అందించి పెట్టింది. ఈ విధానం, విభిన్న వర్గాల మహిళలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటోంది. కొత్తగా మాతృత్వ అనుభూతిని పొందుతున్న మహిళలు, వివిధ వృత్తుల్లోని వారు, ఇళ్ళ వద్దే పనిచేసుకునే వారు... ఇలా రకరకాల మహిళలకు సెలూన్లకు వెళ్ళే అవకాశం ఉండడం లేదు. అలాంటి వారికి సేవలు అందించే మా వ్యాపారం కచ్చితంగా లాభసాటేనని చెబుతాను. ఇప్పుడు మా సేవా కేంద్రాలను ముంబై నగరంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించాలనుకుంటున్నాము. దీనివల్ల... మా కొత్త కేంద్రాల పరిధిలోని మహిళలకు సత్వరమే సేవలు అందే వీలుంటుందన్నది మా భావన. అతి తక్కువ రుసుము తీసుకుంటూ.. మేము అత్యున్నత శ్రేణి సేవలను అందించగలుగుతున్నాము.

image


యువర్ స్టోరీ : మీకు సంబంధించినంత వరకూ.. మీకున్న అనుకూలతలేంటి..? మీ వ్యాపారంలో ప్రమాణాలు పాటించే విషయంలో ఎలాంటి హామీని ఇవ్వగలుగుతారు?

రిషిక : వేగంగా వెళ్ళి సేవలు అందించడమే మా ప్రత్యేకత. ఈ ప్రాంతంలో ఇలాంటి వ్యాపారం ఒక్కటి కూడా లేదు. దీనికి తోడు, కనీసం మూడు నుంచి ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న థెరపిస్టులను, అది కూడా ఇళ్ళ వద్ద సేవలు అందించగలిగిన వారినే మేము తీసుకుంటున్నాము. మేము ప్రత్యేక శిక్షణ ద్వారా వారి పనిలో మరిన్ని ప్రమాణాలు నెలకొల్పుతాము. వినియోగదారులకు నమస్కరించడం మొదలు.. సేవలు అందించడం,, రుసుము వసూలు చేయడం వరకూ ఎంతో హూందాగా, అణకువగా ఉండేలా శిక్షణనిస్తాం. కొత్తగా వచ్చే థెరపిస్టులు.. మా వద్ద అప్పటికే శిక్షణ పొందిన వారి నుంచి నేర్చుకుంటారు. మాకొచ్చే ఆదాయంలో కొద్ది మొత్తాన్ని ఈ శిక్షణకే ఖర్చు చేస్తుంటాం. సర్వీస్ కిట్స్ ప్యాకింగ్ లో కాని, థెరపిస్టు ధరించాల్సిన దుస్తులు.. కనిపించాల్సిన విధానంలో గానీ, ప్రతి దానిలోనూ మాకే సొంతమైన కొన్ని విధివిధానాలుంటాయి. వీటిని ప్రతి థెరపిస్టూ కచ్చితంగా ఆచరించాల్సిందే. కచ్చితమైన సేవలు అందించాల్సిందే. ఇలాంటి విధానాల వల్ల.. మా వ్యాపారం క్రమ వృద్ధిని సాధిస్తోంది. ఇది కాస్త నెమ్మదిగానే ఉన్నట్టు కనిపించ వచ్చు. అయితే.. పునాది గట్టిగా ఉంటేనే.. ఏ వ్యాపారమైనా విజయవంతమవుతుందన్న నమ్మకంతో... మా సేవలను విస్తరించే దిశగా సాగుతున్నాము.

యువర్ స్టోరీ : మీ పనిలో మీకు ఉత్తేజాన్ని నింపే అంశమేంటి..? ఈ రంగంలో ఒత్తిళ్ళను ఎలా అధిగమిస్తారు.?

రిషిక - నాకు ప్రతి రోజూ.. కొత్తదే. వినియోగదారులు, మా సేవలను, మా సరికొత్త ఆలోచనను అభినందించినప్పుడు కలిగే ఆనందమే వేరు. వినియోగదారుల అభిప్రాయాలను ( ఫీడ్ బ్యాక్ ) రోజూ పదే పదే చదువుతుంటాను. దీనివల్ల.. నేను కచ్చితంగా సరైన మార్గంలోనే ఉన్నానన్న భావన పెరుగుతుంది. వస్తువులను కొనడం, థెరపిస్టులను ఇంటర్వ్యూ చేయడం, వారిలో స్ఫూర్తిని నింపడం, డ్రైవర్లు సెలవులో ఉన్నప్పుడు, మా బృందం సభ్యులను వినియోగదారుల ఇళ్ళ వద్దకు నేనే డ్రైవ్ చేస్తూ.. చేర్చడం.. వాళ్ళు తిరిగి వచ్చే వరకూ కారులోనే ఎదురు చూస్తూ ఉండడం.. ఇలా ప్రతి విషయంలోనూ నా పాత్ర ఉంది. వినియోగదారుల ప్రశంసలే నాలో ఉత్తేజాన్ని నింపుతాయి. ఇవాళ వ్యాపార రంగంలో ప్రధాన సమస్య మార్కెటింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వినియోగదారులను సంతృప్తి పరచడం అంత సులభమేమీ కాదు. ఆన్ లైన్ లోనూ మా వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుంటున్నాము. ఈరోజుల్లో యువత సోషల్ మీడియాలో బాగా చురుగ్గా ఉంటోంది. అయితే.. మా వినియోగదారులు వారే కాదు. ఇంటర్నెట్ లో ప్రచారం వల్ల.. తల్లులు, గృహిణులు, లేదా దీర్ఘకాలం ఆఫీసుల్లో పనిచేసి అలసి ఇంటికి తిరిగొచ్చే మహిళలు మా సేవల గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. అందుకే కరపత్రాలను (పాంప్లెట్స్) ముద్రించి పంచుతున్నాము. అయితే.. ఇది బాగా ఖర్చుతో కూడుకున్నది. ఇవన్నీ చేస్తున్నా.. ఒకరి నుంచి మరొకరికి తెలిసే మౌఖిక ప్రచారమే మాకు ఎక్కువగా ఉపకరిస్తుందని నమ్ముతున్నాము. వినియోగదారులను ఆకట్టుకునేలా సేవలు అందించడం ఈ రంగంలో మరొక సవాలు. అయితే.. నేను ఇంతకు ముందే చెప్పినట్లు... నిర్దిష్టమైన పద్ధతులతో దాన్ని అధిగమించగలుగుతున్నాము.

యువర్ స్టోరీ : మీ బృందం గురించి... మీ పెట్టుబడి గురించి చెప్పండి ?

రిషిక : మా వ్యాపారం ప్రారంభించి ఇంకా మూడు నెలలే అయింది. ప్రస్తుతం ఐదుగురు థెరపిస్టులున్నారు. గడచిన మూడునెలల్లో మా ఆలోచనకు ఒక రూపు నిచ్చేందుకే సరిపోయింది. నిర్దిష్ట విధానాన్ని రూపొందించడం, దాన్ని లోపరహితంగా తీర్చిదిద్దడం, నిర్దిష్టమైన బృందాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ మూడు నెలలూ పనిచేశాము. ప్రస్తుతం మేము మూడో స్టేజ్ లో ఉన్నాము. ఇద్దరు గ్రాడ్యుయేట్లను తీసుకున్నాము. మా సెలూన్ ను మార్కెటింగ్ చేయడం, వ్యాపారాన్ని వృద్ధి చేయాలనే ఉద్దేశంతో... ఒకరిద్దరు ఎంబిఏ అభ్యర్థులను తీసుకునే ఆలోచనలో ఉన్నాము. మా థెరపిస్టులు కాకుండా మరో ఐదుగురు సభ్యులతో బృందాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. వీరు సంస్థలో వివిధ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మా సేవల విస్తరణ దిశగా.. ఇది ఎంతో కీలకమైనదని భావిస్తున్నాను. మేము పెట్టుబడుల కోసం ఎక్కడికీ వెళ్ళలేదు. కేవలం మేము పొదుపు చేసుకున్న మొత్తం.. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇచ్చిన సొమ్ముతోనే వ్యాపారం ప్రారంభించాము.

image


యువర్ స్టోరీ : రాబోయే రోజుల్లో మీ నుంచి ఇంకా ఏమేమి ఆశించవచ్చు..?

రిషిక : కొన్ని నెలల్లో.. ది హోమ్ సెలూన్... నిష్ణాతుల బృందంగా రూపొందాలి. మా సేవలను విస్తరించేందుకు.. మార్కెటింగ్ కు ఇది దోహదపడాలి. మా సేవల విస్తరణకు కార్పొరేట్ సంస్థలనూ లక్ష్యంగా చేసుకుంటున్నాము. మహిళలు జరుపుకునే ప్రతి పార్టీలోనూ మా సేవలను విభిన్నంగా అందించేందుకు... నిత్యనూతన రీతులను ఆవిష్కరించుకుంటూ.. ముందుకు సాగాలన్నదే మా ధ్యేయం. పురుషుల కోసమూ ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాము. అదింకా ఆలోచనల దశలోనే ఉంది. వ్యాపార విస్తరణ కోసం.. కొత్త ప్రాంతాల్లో కార్యాలయాలు నెలకొల్పేందుకు... పెట్టుబడులనూ ఆహ్వానించాలనీ భావిస్తున్నాను.

యువర్ స్టోరీ : మీ ప్రస్థానంలో సాహసం అని భావించేది ఏదైనా ఉందా..? అది మీకు ఎలా ఉపకరించింది?

రిషిక : సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం.. విజయవంతంగా సాగుతున్న ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ కెరీర్ ను వదిలిపెట్టడమే నా జీవితంలో తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయం. ఇక ఫలితాలంటారా..? ఇంకొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది.

భారతీయ సౌందర్య సాధనాల విపణిలో సగటున ప్రతి సంవత్సరం, 20 నుంచి 25 శాతం వృద్ధితో, 230 నుంచి 245 బిలియన్ల వ్యాపారం జరుగుతున్నట్లు 2012 ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్/ఫిక్కీ నివేదికలు చెబుతున్నాయి. ఈ రంగం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉందనీ తెలియజేస్తున్నాయి. సౌందర్య సాధనాల వినియోగం అంశంలో క్రమ వృద్ధి కనిపిస్తున్నట్లు యూరో మానిటర్ నివేదిక సూచిస్తోంది. ఒత్తిళ్ళకు గురవుతోన్న ఆర్థిక రంగం.. ఆలోచనాపరుల్లో రకరకాల మార్గాలను అన్వేషించేలా చేస్తోంది. ఈక్రమంలో... సౌందర్య పరిరక్షణ రంగం.. కచ్చితంగా అలాంటి ఓ మార్గమేననడంలో ఎలాంటి సందేహమూ లేదు.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags