ప్రాంతీయ భాషలతో టెక్నాలజీని సులువు చేస్తున్న రెవరీ
రెవెరీ టెక్నాలజీస్ భాషా కీపాడ్ లుఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా స్థానిక భాషలుఅంతర్జాతీయ స్థాయిలో విస్తరణ
This article is sponsored by Qualcomm Ventures
భారతదేశం డిజిటల్ ఇండియాగా రూపాంతరీకరణ చెందుతోంది. డిజిటల్ టెక్నాలజీ దేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్స్, ట్యాబ్లెట్లు దేశగతిని మార్చివేస్తున్నాయి. ఏ విషయానికైనా టెక్నాలజీ మీద ఆధారపడే స్థితి నెలకొంది. ఇంటర్నెట్ లేని సమాజాన్ని ఊహించలేకపోతున్నాం. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో స్మార్ట్ ఫోన్ల వ్యాప్తితో ఇంతకుముందెన్నడూ లేని విధంగా భారతీయలు ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. భారత్ లో నిమిషానికి కొత్తగా దాదాపు 75 ఇంటర్నెట్ కనెక్షన్లు ఏర్పాటవుతున్నాయి. దీన్ని బట్టి దేశంలో ఇంటర్నెట్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతోందో అర్ధం చేసుకోవచ్చు.
అయితే ఇదంతా నాణేనికి ఒక వైపే. ఇంటర్నెట్ అనుసంధానం లేని గ్రామాలూ ఇప్పటికీ దేశంలో ఉన్నాయి. దేశంలో 650 మిలియన్ల మంది ప్రజలకు ఇంటర్నెట్ అనుసంధానం లేదు. ఈ సంగతి పక్కన పెడితే కనెక్షన్ ఉన్నా...నెట్ సేవలు ఉపయోగించుకోలేని పరిస్థితులూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం భాషా సమస్య. ఇంటర్నెట్ ప్రధానంగా ఇంగ్లీషు భాష ఆధారంగానే పనిచేస్తోంది. భాషా వైవిధ్యమున్న భారతదేశంలో ఇంటర్నెట్ వాడకానికీ, వ్యాప్తికీ ఇది ప్రధాన ప్రతిబంధకంగా మారుతోంది.
ఇంటర్నెట్ వాడాలంటే ఇంగ్లీషు కొంచెంగానైనా తెలిసుండాలి. దేశంలో సగం జనాభాకు ఇంగ్లీషుతో పరిచయం లేదు. ముఖ్యంగా దేశప్రజలు ఎక్కువమంది నివసిస్తున్న గ్రామాల్లో ఇంగ్లీషు తెలిసిన వారు తక్కువ. ఇంటర్నెట్ ద్వారా గ్రామీణ రైతులకు అవసరమయ్యే వ్యవసాయ సమాచారం అందిస్తున్నప్పటికీ వాటిని వాడుకోగల భాషా పరిజ్ఞానం ప్రజలకు ఉండటం లేదు. ఓ సర్వే ప్రకారం ఇంటర్నెట్ వాడుతున్న వారిలో 30 కోట్ల మందికి ఇంగ్లీషులో ప్రావీణ్యం ఉంటే. మిగిలిన 28 కోట్ల మంది ప్రజలకు ఇంగ్లీషులో అంత ప్రవేశం లేదు. ఇంటర్నెట్ లో సగానికి పైగా ఎక్కువ సమాచారం ఇంగ్లీషులో లభ్యమవుతున్న పరిస్థితుల్లో ఆన్ లైన్ సేవలు ఇంగ్లీషు మాట్లాడలేని ప్రజలకు ఎలా చేరువవుతాయి ? ఇది డిజిటల్ ఇండియా మధ్య విభజన రేఖను సృష్టిస్తోంది. ఈ సమస్యను అధిగమించటానికి ఏర్పాటయిందే రెవెరీ టెక్నాలజీస్. బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్.... ఇండియాకు, డిజిటల్ ఇండియాకు మధ్య ఖాళీని పూడ్చే ప్రయత్నం చేస్తోంది.
దేశంలోవినియోగదారులకు అవసరమైన సమాచారంతో పాటు....టెక్నాలజీ పరికరాల తయారీ, ఆటలు, అప్లికేషన్లు డెవలప్ చేసే వారికి, ఇతరులకు స్థానిక భాషల్లో వాటిని అందించే సౌకర్యాన్నికల్పిస్తోంది రెవరీ టెక్నాలజీస్. మొబైల్ ఫోన్ ల వినియోగం పెరిగిన 2000 సంవత్సరంలోనే తాము భాష సమస్యను గుర్తించామని రెవరీ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకులు, సీఈవో అరవింద్ పాని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న రకరకాల స్థానిక భాషలు, మాండలికాల్లో మాట్లాడే ప్రజలకు ఇంగ్లీషు భాషతో సమస్యలు ఎదురవుతుందని గ్రహించినా...2009లో కాని తన ఆలోచన కార్యరూపం దాల్చలేదని తెలిపారు. సహచరులు వివేక్ పానీ, ఎస్.కె. మొహంతీతో కలిసి అరవింద్ పానీ 2009లో రెవెరీ టెక్నాలజీస్ ను నెలకొల్పారు.
తొలినాళ్లలో...
రెవెరీ టెక్నాలజీస్ 2011లో క్వాల్కామ్ వెంచర్స్ కు చెందిన క్యూ ప్రైజ్ సీడ్ ఇన్వెస్ట్మెంట్ కాంపిటీషన్ లో గెలుపొందింది. అప్పటికి రెవరీ నమూనా స్థితిలోనే ఉంది. బహుమతి ద్వారా వచ్చిన లక్ష డాలర్లు, ఇతర పెట్టుబడులు కంపెనీని కమర్షియల్‌గా ముందుకు తీసుకువెళ్లటానికి ఉపయోగపడ్డాయి. క్వాల్కామ్ నుంచి రెవరీకి కు మార్గదర్శకత్వమే కాదు...సమర్థులైన వినియోగదారులు, పెట్టుబడుదారుల పరిచయం కూడా జరిగింది. క్వాల్ కామ్ సాయంతో ఉత్పత్తులు కొన్నింటికి అనుమతులు సాధించి, ఆదాయం పొందే అవకాశం కూడా కలిగింది. రెవెరీ టెక్నాలజీస్‌లో క్వాల్ కామ్ ప్రమేయమున్నప్పటికీ అది నామమాత్రమే. సొంతంగా తమకు నచ్చిన విధానంలో కార్యకలాపాలు నిర్వహించగల స్వేచ్ఛ రెవరీకు ఉందని అరవింద్ చెప్పారు.
రెవెరీ ప్రవేశపెట్టిన లాంగ్వేజ్ ఎంగేజ్మెంట్ ప్లాట్ ఫాం అనేక రంగాల్లో వ్యాపారానికి ఎంతగానో దోహదపడుతోంది. క్లౌడ్ టెక్నాలజీస్ ఆధారంగా లాంగ్వేజ్ ప్లాట్ ఫాం పనిచేస్తుంది. HDFC సెక్యూరిటీస్, హంగామా, ఇతర పెద్ద సంస్థలు రెవెరీ టెక్నాలజీస్ క్లయింట్లుగా ఉన్నాయి. ఎక్కువ ప్రభావం చూపించగల ఈ-కామర్స్, రీటైల్, ట్రావెల్, చాట్ , కాబ్ లకు చెందిన యాప్‌లపై రెవరీ ప్రధానంగా దృష్టిపెడుతోంది.
ఆదాయంలో వృద్ధి
టెక్నాలజీని సొంత భాషలో వినియోగించుకునే వారి సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని రెవెరీ బృందం అంచనా వేస్తోంది. గత కొన్నేళ్లలో స్థానిక భాషను ఉపయోగించే వారి సంఖ్య 20 నుంచి 50శాతం పెరిగిందని అరవింద్ చెప్పారు. కొత్తగా ఆవిష్కృతమైన సర్వీస్ ఆధారిత సాఫ్ట్ వేర్... సాస్‌తో వచ్చే ఏడాది నాటికి వివిధ భాషల్లో వినియోగదారుల సంఖ్య ఐదారు రెట్లు పెరుగుతుందని భావిస్తున్నారు. 2013-14లో రెవరీ సంస్థకు ఆదాయం... ప్రధానంగా టెక్నాలజీ అనుమతుల ద్వారానే వచ్చింది. 2015 మొదటి అర్ధభాగంలో లాంగ్వేజ్ ప్లాట్ ఫాంలో ఆదాయం రెండింతలు పెరిగింది. ఈ పెరుగుదల 2016వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు.
మొబైల్, కంప్యూటర్ రెండింటిలోనూ రెవెరై సంస్థకు వినియోగదారులున్నారు.రెవెరీ ప్రవేశపెట్టిన బహుభాషా కీపాడ్ 'స్వలేఖ్' తో అనేక స్థానిక భాషల్లో టైప్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లు వినియోగించేవారి సంఖ్య గత ఏడాది మొత్తం 80 మిలియన్లు ఉంటే...ఈ ఒక్క ఏడాదిలోనే వారి సంఖ్య 90 మిలియన్లకు చేరుకుంది. అందుకే మొబైల్ లాంగ్వేజ్ కోసం రెవరీ భారీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం రెవెరీ లాంగ్వేజ్ ఎంగేజ్మెంట్ ప్లాట్‌ఫాంలో అనేక అంతర్జాతీయ భాషలు సహా 50 దేశీయ భాషలు అందుబాటులో ఉన్నాయి. చాలా భాషల అక్షరాలు తయారుచేయటం ఇంగ్లీషు అంత తేలిక కాదు. చాలా భాషలకు స్క్రిప్టులు చాలా కష్టంగా ఉంటాయి. వాటి రూపకల్పనకు ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది. ఈ భాషల్లో స్క్రిప్టు వినియోగదారులకు ఉపయోగపడేలా చేయటానికి ఎంతో పరిశోధన చేసి రూపొందించాల్సి ఉంటుంది. భారతీయ స్థానిక భాషలు, అంతర్జాతీయ భాషలకు మంచి ఆదరణ ఉంది. హిందీ, మరాఠీ, తెలుగు, తమిళ్, బెంగాలీ, అస్సామీ వంటి భారతీయ భాషలతో పాటు అరబిక్, బర్మీస్, థాయ్ వంటి విదేశీ భాషల్లో రెవెరీ టెక్నాలజీస్ రూపొందించిన స్క్రిప్ట్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 కోట్ల ఫోన్లు, కంప్యూటర్లలో రెవరీ లాంగ్వేజ్ ప్లాట్ ఫాం వినియోగంలో ఉంది.
ఏదైనా పరాయి భాషలో కన్నా మన భాషలో వింటేనే...చూస్తేనే...మాట్లాడితేనే మనసుకు హాయిగా ఉంటుంది. చేసే పని మనసుకు చేరువవుతుంది. సంస్కృతి మనుగడకు, మనిషి పురోగమనానికి భాషే కీలకం. టెక్నాలజీ ఇందుకు మినహాయింపు కాదు. ఇంగ్లీషు భాషలో అందుబాటులోకొచ్చిన టెక్నాలజీ స్థానిక భాషల్లో రూపాంతరం చెందితే....ఆ ఫలాలు మరింతమందికి చేరువవుతాయి. టెక్నాలజీ వేగంగా విస్తరించటంతో పాటు అందరికీ అర్ధమయ్యేరీతిలో ఉంటేనే డిజిటల్ ఇండియా అన్న భావానికి నిజమైన అర్ధం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన రెవెరై టెక్నాలజీస్ ఆ దిశగా కృషిచేయటం డిజిటల్ ఇండియా రూపకల్పనకు మరింతగా దోహదం చేస్తుంది.