అంతరించిపోతున్న చేనేతకు బ్రాండింగ్ చేసి.. అద్భుతమైన బిజినెస్
మనం ధరించే ప్రతీ దుస్తుల వెనుకా ఓ కథ కూడా అల్లికలో కలిసిపోయి ఉంటుంది. వాటిల్లో అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయిన విదర్భ రైతు కథ కావచ్చు, లేదంటే చైనా తీర ప్రాంత సరిహద్దుల్లోని స్వెట్ షాప్ వర్కర్ పడ్డ కష్టం చెప్పే కథ కూడా అయిండొచ్చు. లేదంటే ఆ డ్రస్ కేవలం సాదాసీదాగా డిస్ట్రిబ్యూటర్లతో డిజైనర్ కుదుర్చుకున్న డీల్ మేరకు తయారైన డిజైన్ అవొచ్చు. ఐతే తాను డిజైన్ చేసిన దుస్తులు మాత్రం ఇలాంటి కథలు చెప్పాలని డానియల్ సైయిమ్ అనుకోలేదు.
డానియల్ సైయీమ్ బాల్యం
" నేను పెద్దయ్యాక ఫ్యాషన్ ప్రపంచంలోకే అడుగుపెట్టాలని చిన్నప్పటి నుంచీ అనుకునేవాడినని" చెప్తాడు డానియల్. బాల్యంలో డానియేల్, అతని సోదరుడు ఇద్దరూ స్కెచ్‌లు వేయడంలో గడిపేవారట. సోదరుడు ఇళ్లకు సంబంధించిన బొమ్మలేస్తుంటే..డానియల్ మాత్రం డ్రస్సులకు సంబంధించినవి గీసేవాడు.
టార్గెట్ దిశగా పయనం
పెద్దయ్యాక బ్రదర్ ఆర్కిటెక్చర్‌ను చదివేందుకు ఎంచుకుంటే... డానియల్ మాత్రం ఫ్యాషన్ స్కూల్‌వైపు అడుగులు వేశాడు. దీనికి కారణం..తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోకపోవడమే.. షిల్లాంగ్ కన్పించడానికి మోడ్రన్‌గా కన్పించినా..చాలామంది తల్లిదండ్రులు తమ సంతానం తమ వ్యాపారాన్ని వృధ్ది చేయాలనో..లేదంటే వైద్యరంగంలోకి ప్రవేశించాలనో కోరుకునేవారు. ఇవి రెండూ కానివారికి గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించడమే లక్ష్యంగా ఉండేది.
అక్కడి కాలేజీ వార్షికోత్సవాల్లో, ఫ్యాషన్ ఫెస్టివల్స్‌లో డానియల్ పార్టిసిపేట్ చేసేవాడు. డిగ్రీ పూర్తైన తర్వాత కూడా అతను స్థిరంగా ఓ ఉద్యోగంలో అని కుదురుకోలేదు. ఒకదాన్నుంచి ఒకదానికి మారుతూనే ఉండేవాడు. కాల్ సెంటర్‌లో పని చేశాడు. క్యాబ్ డ్రైవర్‌గా , నైట్ క్లబ్ మేనేజర్‌గా కూడా ఉద్యోగాలు చేశాడు. అలా నైట్ క్లబ్ మేనేజర్‌గా పని చేస్తున్న సమయంలోనే డేనీ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. డేనీ.. మేఘాలయ ప్రభుత్వంలోని ఎరీకల్చర్ డిపార్ట్‌మెంట్లో ఉన్నతాధికారిగా పని చేసేవాడు. వారిద్దరి ఆ పరిచయమే తర్వాత కాలంలో డానియల్ కలను నిజం చేసేందుకు దోహదపడింది. ఫ్యాషన్ డిజైనర్ కావాలనే అతని కల డేనీ స్నేహంతో నిజమైంది. డేనీ... అతడిని రి-భోయ్ జిల్లాలోని పేద చేనేత మహిళలకు పరిచయం చేశాడు. మేఘాలయలోని అత్యంత నిరుపేద జిల్లా రి-భోయ్. ఈ జిల్లాలో ఖాసీ తెగకు చెందిన వారే అధికం. వారిలో కూడా సగానికి పైగా చదువురానివారే. ఇక్కడి మహిళలు తమకు వారసత్వంగా వస్తున్న రిండియా హ్యాండ్లూమ్‌ను నేయడం దాదాపుగా మానేసే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే అది లాభసాటిగా లేదు. ఆ దశలోనే డానియల్ వారితో మాట్లాడి.. స్థితిగతులను అవగతం చేసుకున్నారు.
రిండియా సిల్క్ మందంగా ఉండే ఓ ఆర్గానిక్( సేంద్రియ) సిల్క్. ఒకప్పుడు ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో విరివిగా వాడేవారు. ఇది తయారయ్యే విధానం కూడా ప్రత్యేకమైనది. కకూన్ (పట్టుగూళ్లు)లోని పురుగును చంపకుండా పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో దారం తీయడం దీని ప్రత్యేకత. అస్సోంలో దీన్నే ఎరి సిల్క్‌గా పిలుస్తారు.
కల నెరవేరిన వైనం
ఇలా ఎరి సిల్క్ తయారు చేసే గ్రామాలన్నింటిలో రి-భోయ్ లో అండెన్ ప్రసిధ్ది గాంచింది. అండెన్ గ్రామంలోనే అత్యంత నాణ్యమైన క్వాలిటీతో రిండియా సిల్క్ తయారవుతోందని చెప్పుకోవాలి. భోయ్ గ్రామస్తులను కలిసిన తర్వాత డానియల్‌కు తన అన్వేషణ ఫలించిందని అనిపించింది.
" వాళ్లు తయారు చేసే ఫ్యాబ్రిక్ ను చూసి తర్వాత ఐ జస్ట్ ఐ లవ్డ్ . అక్కడి పరిస్థితి నన్ను ఆహ్వానించినట్లుగా అన్పించింది " అని చెప్తారు డానియల్..
డానియల్ తాత, తండ్రి సామాజికంగా జనాలకు సేవ చేసినవారే. ఫ్యాషన్ రంగంలో తన ముద్ర వేయడానికి సిధ్దమైనప్పుడు రిబోయ్ చేనేత వర్గాలకు కూడా అది మేలు చేసే విధంగా ఉండాలని భావించాడు. " రిభోయ్ చేనేతలతోనే పని చేయాలని నిర్ణయించుకున్నా. జనేస్సలైన్ పైన్ గ్రోప్ అనే మరో సోషల్ యాక్టివిస్ట్‌తో పరిచయం ఆ నిర్ణయాన్ని మరింత ధృడపరిచింది. జనేస్సలైన్.. రిభోయ్ చేనేత వర్గాల కోసం కోసం ఓ స్వఛ్చంద సంస్థ తరపున చాలా రోజులుగా పని చేస్తుండేవారు.
" మా లక్ష్యాల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని ఫ్యాబ్రిక్ (చేనేత వస్త్రాలను)ను ప్రమోట్ చేయడం ఒకటి. రిభోయ్ మహిళల్లో చాలా మంది ఈ పనిని మానేసి వ్యవసాయం బాట పట్టారు. అలాంటి వారితో పని చేయడం ద్వారా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడం మా మరో లక్ష్యం.." ఎత్నిక్ (సంప్రదాయతరహా), ఎథికల్ ఫ్యాషన్ డిజైన్లు తయారు చేసేందుకు నిర్ణయించుకున్న డానియల్ అందుకోసం మేఘాలయలో దొరికే వెజిటబుల్ డైస్‌నేవాడటం ప్రారంభించాడు. రిండియా లేబుల్‌తో లాక్మే ఇండియా ఫ్యాషన్ వీక్ షోస్‌లో తన డిజైన్లు పాపులర్ అయిన తర్వాత.... ఈ ఫ్యాబ్రిక్‌పై జనాల్లో ఆసక్తి పెరగడం గమనించానని చెప్తాడు డానియేల్.
ప్రత్యేకంగా పొరుగురాష్ట్రాల నుంచి మగ్గం పని చేసేవాళ్లు రిభోయ్‌కు వచ్చి రిండియా తయారీ నేర్చుకోవడం ప్రారంభించారు.." ఈ ప్రాచీనమైన కళ.. వృత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా చేనేతలకు ఉపయోగపడేలా మగ్గం యంత్రాలు కూడా సరఫరా చేయడం ప్రారంభించింది. " మేం కూడా ఈ కళ మనుగడ కోసం కృషి చేస్తున్నాం"
ప్రతీచోటా తమ పంజాతో అసలు మనుషులకు ప్రతిఫలం దక్కకుండా చేసే దళారీ వ్యవస్థను డానియల్ తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అందుకే ఈ రిండియా హ్యాండ్లూమ్ ప్రమోషన్లలో వారికి అసలు తావీయలేదు. ఇండియన్ ఫ్యాషన్ ప్రపంచంలో తన ముద్ర వేయడానికి సాయపడిన రిభోయ్ మనుషులకు తానుగా ఎంతో కొంత తిరిగి ఇవ్వడానికే అతను దృఢంగా నిశ్చయించుకున్నాడు. అందుకే మిడిల్ మేన్ ప్రమేయం లేకుండా డైరక్ట్‌గా రిబోయ్ జనాలతోనే వ్యవహారాలు సాగించేవాడు. అక్కడి మహిళలకు, చేనేతలకు ప్రభుత్వ పథకాలు..ఇతర పథకాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిపేలా అవగాహన పెంచాడు. " ప్రస్తుతం మా కృషితో ఇక్కడ మహిళల్లో చాలామంది వ్యాపారవేత్తలు కాగలిగారు. వాళ్లే వారి పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. రిండియా కళ విలువ ఇప్పుడు వారికి తెలిసివచ్చింది. దానికి ఉన్న మార్కెట్ కూడా తెలిసొచ్చింది. ఇది చాలా సంతోషించాల్సిన విషయం " అంటారు డానియేల్
ప్రస్తుతానికి డానియల్ మేఘాలయలోని ఇతర సంప్రదాయ చేనేతలపై దృష్టి పెట్టారు. అస్సోంలోని గారో పాట్రెన్ చేనేతవర్గాలను కలుసుకునే పనిలో ఉన్నాడు. గత ఏడు సీజన్లుగా రిభోయ్ జిల్లాలోని రిండియా వస్త్రాలను ప్రపంచానికి మరోసారి పరిచయం చేసి విమర్శకుల నోళ్లను మూయించాడు. రిండియా స్టైల్ ఏదో ఒకే సీజన్ కు పరిమితమవుతుందనేది వాళ్ల అభిప్రాయాన్ని అతడు పూర్తిగా మార్చేశాడు. " నా స్టైల్ పరిమితం అని వాళ్లంటారు. కానీ నాకు రిండియాకు ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకే ప్రతీసారీ రిండియాతో కొత్తదనం కోసం ప్రయత్నించా. అది విజయవంతమైంది కూడా " అని చెప్పాడు డానియల్.
సంప్రదాయబద్దమైన వస్త్రాల తయారీ కనుమరుగు అవుతుండటానికి..మార్కెట్లో తక్కువ ధరకే పాశ్చాత్య దుస్తులు లభించడం ఓ కారణం అంటాడు డానియల్. అలానే పాతతరం లూప్ మగ్గాలతో ప్రయోగాలు చేయడానికి..డిజైన్లలో కొత్తదనం కోసం డిజైనర్లు కూడా సిద్ధంగా లేకపోవడం మరో కారణంగా చెప్తారు.
అందుకే ఖాసీ మహిళల్లో చాలా కొద్దిమంది మాత్రమే సంప్రదాయబద్దమైన జైనిజమ్ దుస్తుల్లో కన్పిస్తారంటారు. కారణాలు ఎలా ఉన్నా... ప్రస్తుతం తన బొటిక్‌కి మాత్రం యూత్ ఎక్కువ మంది వచ్చి ప్రాచీన సంప్రదాయాన్ని ప్రతిబింబించే దుస్తులను కొనడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్తున్నారు. ఎత్నిక్ ..ఎథికల్ ఫ్యాషన్ కోసం మార్కెట్ సృష్టించడం అంటే సంప్రదాయబద్దమైన డిజైన్లకు మాస్ అప్పీల్ అద్దడమే అని డానియల్ చెప్తారు. ఈ రంగంలో ఎక్కువ మంది యువత వచ్చి అంతరించిపోతున్న కళలను బతికించుకోవాలని డానియల్ కోరుకుంటున్నారు.