ఈ-టెయిలింగ్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్న 21 ఏళ్ల కుర్రాడు
ఆన్ లైన్ గ్రోసరీ మార్కెట్లో పట్టుబిగిస్తున్న ఢిల్లీ స్టార్టప్
గ్రూఫెర్స్ ... ఓ పెద్ద కిరాణా ఈ-టెయిలింగ్ కంపెనీ. ఇటీవల పలు నగరాల్లో కార్యకలాపాలు నిలిపివేసింది.
లోకల్ బన్యా ... కిరాణా ఈ-టెయింలింగ్ లో ఓ సంచలనం లాంటిది. కానీ ఇప్పటికే మూతపడింది.
పెప్పర్ ట్యాప్.... నిత్యావసర వస్తువుల ఆన్ లైన్ మార్కెట్ లో ట్రెండ్ సెట్టర్. కానీ ఈ ఏడాదే వ్యాపారాన్ని క్లోజ్ చేసింది
ఇది ప్రస్తుతం కిరణా ఈ-టెయిలింగ్ మార్కెట్ ప్రస్తుత పరిస్థితి. ఆన్ లైన్ వ్యాపారం క్రేజ్ తారస్థాయికి చేరినప్పుడు.. అన్నింటిలోలాగే నిత్యావసరసరుకుల కోసం కూడా పెద్ద ఎత్తున ఆన్ లైన్ బజార్లు పుట్టుకొచ్చాయి. వినూత్నమైన పోకడలు, వింత మార్కెట్ పద్దతులతో ఖర్చులు, ఆదాయంపై అవగాహన లేకుండా చాలా కంపెనీలు పరుగులు ప్రారంభించడంతో మొదటికే మోసం రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఓ రకంగా ఇప్పుడు కిరణా ఈ-టెయిలింగ్ మార్కెట్లో కరెక్షన్ లాంటిది వస్తోంది. ముందస్తు వ్యూహం, ఆదాయమార్గాలు, ఖర్చుల నియంత్రణ లాంటివాటిపై స్పష్టమైన అవగాహనతో ప్రారంభిస్తే తప్ప నిలదొక్కుకోవడం కష్టంగా మారింది.
ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో కొత్తగా మార్కెట్లోకి అడుగు పెట్టాడు 21ఏళ్ల షెరుంజ్ జలాన్. ఢిల్లీకి చెందిన ఈ కుర్రాడు పెద్ద పెద్ద సంస్థలు చేతులెత్తేసిన స్పేస్ లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయాణం ప్రారంభించాడు. ఇప్పటికే షెరుంజ్ ఆలోచనలు అతని ప్రయాణం సరైన దిశలోనే సాగుతోందని అనిపించేలా చేస్తున్నాయి.
19 ఏళ్లకే అంట్రపెన్యూర్ ఆలోచనలు
ఢిల్లీకి చెందిన షెరుంజ్ రెండేళ్ల కిందటే సీఏ విద్యార్థిగా ఉన్నప్పుడే ఆన్ లైన్ గ్రోసరీ ఫ్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ఆలోచనను తల్లిదండ్రులతో కూడా పంచుకున్నాడు. వాళ్లూ ప్రొత్సాహించారు. తన పాకెట్ మనీ రూ.30 వేలతో కొంత పని కూడా పూర్తి చేశాడు. తల్లిదండ్రుల వద్ద నుంచి మరికొంత సాయం పొందాడు. అయితే వ్యాపారం ప్రారంభించినా.. చదువు కూడా కొనసాగించాలని షెరుంజ్ కు తల్లిదండ్రులు షరతు పెట్టారు.
పేరెంట్స్ ఆర్థిక సాయంతో ఆక్టోబర్ 2014లో బజార్ క్రాఫ్ట్ ఈ-టెయిలింగ్ ఫ్లాట్ ఫామ్ ను ప్రారంభించాడు జలాన్. ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాద్ లలో మొదటగా కార్యకలాపాలు ప్రారంభించారు. అప్పట్లో ఈ-టెయిలింగ్ మార్కెట్లో ఉన్న పరిస్థితులతో జస్ట్ ఇన్ టైమ్ మోడల్ ను వినియోగదారులను ఆఫర్ చేశాడు. ఆర్డర్ చేసిన తర్వాత గంటలోపే డెలివరీ ఇవ్వడం బజార్ క్రాఫ్ట్ ప్రత్యేకత. ఇందు కోసం కొన్ని కీలకమైన ప్రాంతాల్లో చిన్న చిన్న కిరాణా షాపు యజమానులతో ఒప్పందాలు చేసుకున్నాడు.
అయితే కొన్ని రోజులకే జలాన్ కి అసలు కష్టం అంటే ఏమిటో తెలిసొచ్చింది. వ్యాపారాన్ని చురుగ్గా చేయాలంటే మరింత సిబ్బంది అవసరమని గుర్తించారు. కానీ అది చాలా ఖరీదైన వ్యవహారం. ఆర్డర్స్ డెలివరీ చేయడం కూడా తలనొప్పిగా మారిపోయింది. పైగా లాభాలను ఏ పద్దతిలో సాధించాలో జలాన్ కు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
సమస్యలపై సమరం...
చిన్న వయసులోనే అంట్రప్రెన్యూర్ షిప్ ప్రారంభించినా ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టినా జలాన్ వెనక్కి తగ్గలేదు. అసలు తన వ్యాపారం ఏమిటి..? తను ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి..? వాటిని పరిష్కరించుకునే మార్గాలేమిటి..? అని ఒక్కొక్కటిగా లెక్క వేసుకుని.. పరిష్కరించుకోవడం ప్రారంభించాడు.
అందులో జలాన్ కు కనిపించిన మొదటి సమస్య వర్క్ ఫోర్స్. ఉద్యోగులు లేనిదే ఏ పనీ చేయలేమని గుర్తించాడు. అందుకే వీలైనంత తక్కువ ఖర్చు అయ్యేలా అప్పుడే స్టడీస్ పూర్తి చేసుకున్నవారిని రిక్రూట్ చేసుకోవడం ప్రారంభించాడు. అది సత్ఫలితాలను ఇచ్చింది. తక్కువ వేతనాలకు ప్రతిభావంతమైన ఉద్యోగులు లభించారు.
రెండో సమస్య డెలివరీ... దీన్ని అధిగమించేందుకు మొదటిగాఆఫర్ చేసిన జస్ట్ ఇన్ టైమ్ మోడల్ ను తీసేశాడు. ఇరవై నాలుగ్గంటల్లో డెలివరీ చేస్తామనే ప్రచారం ప్రారంభించారు.
ఇక తర్వాత తన బజార్ క్రాఫ్ట్ లో కొత్త కొత్త అంశాలను చేర్చారు. పర్సనల్ కేర్, స్టేషనరీ కూడా అందుబాటులో ఉంచారు.
చివరిగా లాభాలను పెంచుకోవడానికి రీటైలర్లతో ఒప్పందాలను రద్దు చేసుకున్నాడు. నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేసి వినియోగదారులకు డెలివరీ చేయడం ప్రారంభించాడు.
దాంతో ఒక్కసారిగా చుట్టుముట్టిన సమస్యలు వరుసగా పరిష్కారం కావడం ప్రారంభమయ్యాయి. దాంతో జలాన్ కు ఆత్మవిశ్వాసం రెట్టింపయింది.
" బజార్ క్రాఫ్ట్ లో 43 మంది టీం ఉంది. వీరి సగటు వయసు 23 మాత్రమే. డెలివరీ మోడల్ ను మార్చడంతో మరింత సేవింగ్స్ పెంచుకున్నాం. నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేయడం వల్ల కమిషన్ శాతం పెరిగింది. దీని వల్ల వినియోగదారులకు మేము డిస్కౌంట్స్ కూడా ఆఫర్ చేసి ఆకర్షించగలుగుతున్నాం" ష్రెనుజ్ జలాన్, బజార్ క్రాఫ్ట్ ఫౌండర్
సక్సెస్ దారిలో మొదటి అడుగులు
ఇప్పటికి బజార్ క్రాఫ్ట్ కు 45,000 మంది యూనిక్ కస్టమర్లున్నారు. ఇందులో నలభై శాతం మంది తమ ఇంటికి అవసరాలకు పూర్తిగా బజార్ క్రాఫ్ట్ ఫ్లాట్ ఫామ్ నే వాడుకుంటున్నారు. రోజుకు రెండు వందల ఆర్డర్లు ఏడాదికి ఒకటిన్నర కోట్ల రూపాయల టర్నోవర్ ప్రస్తుతం బజార్ క్రాఫ్ట్ నమోదు చేస్తోంది.
" మా సొంత డెలివరీ టీమ్.. తక్కువ వేతనాలు తీసుకునే ఉద్యోగులు, కొత్త డెలివరీ మోడల్ తో వ్యయం బాగా తగ్గిపోయింది. మా ఆదాయంతో పోలిస్తే ఇప్పుడు నెలకు రెండు లక్షలు మాత్రమే ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. అతి త్వరలోనే బ్రేక్ ఈవెన్ సాధించగలం" ష్రెనుజ్, బజార్ క్రాఫ్ట్ ఫౌండర్
వెబ్ సైట్ , యాప్ లను పూర్తిస్థాయిలో ఆధునీకరించడంతో పాటు ఈ-వాలెట్, పర్సనలైజ్డ్ ఆఫర్లు ఇచ్చే సౌకర్యాలను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు పనులు ప్రారంభించారు. మెడిసిన్స్ ను బజార్ క్రాఫ్ట్ లో యాడ్ చేయనున్నారు. బజార్ క్రాఫ్ట్ పేరుతో ఆఫ్ లైన్ స్టోర్లనూ ప్రారంభించే యోచనలో ఉన్నారు. అలా.. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రంగాల్లో తనదైన ముద్రవేయాలని ష్రెనుజ్ గట్టి పట్టుదలతో ఉన్నారు. వచ్చే రెండేళ్ల కాలంలో కనీసం పది మెట్రో, టైర్ టూ సిటీస్ లో కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టున్నాడు ష్రెనుజ్.
మార్కెట్ పెద్దదే.. కానీ ఒడిసి పట్టుకోవాలి
భారత ఆన్ లైన్ గ్రోసరీ మార్కెట్ 2019 కల్లా 2.7 బిలియన్ల మార్క్ ను అందుకుంటుందని అంచనా. గణాంకాలు ఎంతో ప్రొత్సాహకరంగా ఉన్నప్పటికీ ఈ రంగంలో ఉన్న కంపెనీలు ఆ స్థాయిలో పనితీరు చూపించడంలో మాత్రం విఫలమవుతున్నాయి. 2011 నుంచి గ్రూఫెర్స్, బిగ్ బాస్కెట్, జాప్ నౌ, పెప్పర్ ట్యాప్, లోకల్ బన్యా లాంటి సంస్థలు 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. పెప్పర్ ట్యాప్, లోకల్ బన్యా భారీగా పెట్టుబడులను సాధించినప్పటికీ నిలబడలేకపోయాయి. కార్యకలాపాలు నిలిపివేశాయి.
అయితే ఈ రంగంలో బజార్ క్రాఫ్ట్ లాంటి చిన్న సంస్థలు తమదైన ప్రత్యేకత చూపిస్తున్నాయి. ఇవి 2.7 బిలియన్ల ఆన్ లైన్ గ్రోసరీ మార్కెట్ లో బిగ్ ప్లేయర్స్ గా మారినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ష్రెనుజ్ లాంటి యువత అంట్రప్రెన్యూర్ల ఆలోచనలు ఈ దిశగానే సాగుతున్నాయి.