ఆహారం... కేవలం కడుపు నింపేది మాత్రమే కాదు. ఓ ప్రాంత సంస్కృతిని చాటిచెప్పేది కూడా. హైదరాబాద్ అంటే బిర్యానీనే ఎందుకు గుర్తొస్తుంది? బందరు పేరు వినగానే లడ్డూ ఎందుకు మదిలో మెదుల్తుంది? ఆత్రేయపురం అంటే పూతరేకులు ఎలా గుర్తొస్తాయి? ఈ ఉదాహరణలు చాలు ఆహారానికి సంస్కృతికి ఉన్న విడదీయలేని బంధాన్ని తెలియజెప్పడానికి. భారతదేశంలో ఆహారం చుట్టూ అల్లుకున్న వ్యాపారాలెన్నో. ఇటీవల కాలంలో ఫుడ్ స్టార్టప్స్ చాలా పుట్టుకొస్తున్నాయి. స్థానిక వంటకాలే పైచేయిగా ఉన్న దేశం మనది. అయినా గ్లోబల్ చెయిన్స్ పోటీకి వస్తున్నాయి. ఈ పోటీని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి మన ఫుడ్ స్టార్టప్స్. ఈ ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలు. అధ్భుతమైన విజయాలు. ఇండియాను దాటి బిజినెస్ చేస్తున్న కంపెనీలూ ఉన్నాయి. గట్టి పోటీ ఎదుర్కొంటూ మనుగడ సాధిస్తున్నవీ ఉన్నాయి. ఇప్పటికీ ఫుడ్ స్టార్టప్ స్పేస్ లో చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు.
ఫుడ్ స్టార్టప్స్ కోసం ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ నిర్వహించి రెండేళ్లవుతోంది. దీంతో కొత్త ఫుడ్ స్టార్టప్స్ కు ఒడిదుడుకులు తప్పట్లేదు. ఈ సెక్టార్ లో 2007 నుంచి ఎదుగుదల కనిపిస్తున్నా ఇలాంటి కంపెనీలను ఏకతాటిపైకి తెచ్చే కార్యక్రమాలు ఇటీవల జరగట్లేదు. అయినా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ కస్టమర్ల లైఫ్ స్టైల్ లో భాగమైపోతున్నాయి. వినియోగదారుల నడవడికలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నాయీ ఫుడ్ స్టార్టప్స్. అయితే జనం బాగా అలవాటుపడ్డ ఫుడ్ టెక్ కంపెనీల్లోకే పెట్టుబడులు ప్రవహిస్తాయంటున్నారు ఖేతర్ అడ్వైజర్స్ కు చెందిన కునాల్ వాలియా. ఒక యూజర్ తరచుగా ఉపయోగించే సర్వీసు ఏదైనా(నెలకు 10-12 సార్లు) అలాంటి కంపెనీలకే పెట్టుబడుల లభిస్తాయి.
"మిగతా సెగ్మెంట్లతో పోలిస్తే ఫుడ్ టెక్ రంగంలో సవాళ్లు ఎక్కువ. జనం ఎక్కువగా మక్కువ చూపించే ఉత్పత్తుల్లో ఆహారం కూడా ఒకటి. ధరల్లో తేడా ఒక్కటే కంపెనీ విజయానికి కారణం కాదు. గల్లీగల్లీలో డెలివరీ చేయగలిగేట్టు పంపిణీ వ్యవస్థను సిద్ధం చేసుకుంటేనే కంపెనీ మనుగడ సాధ్యం. తమ సొంత కిచెన్లలో లేదా హోమ్ షెఫ్ ల సాయంతో ఆహారం వండి క్యాటరింగ్ చేస్తున్నప్పటికీ... లాజిస్టిక్స్ మాత్రం పీడకలే" - కునాల్.
ఫండింగ్
ఈ రంగంలో ఫండింగ్ 2014 చివర్లో మొదలైంది. 2015 నాటికి ఊపందుకుంది. గతేడాది చివరి నాటికి కాస్త తగ్గింది. మళ్లీ ఈ ఏడాది పెరిగింది. గతేడాది ఉన్న విపత్కర పరిస్థితులతో పోలిస్తే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఈ రంగంలో పెట్టుబడులు స్థిరంగా పెరుగుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... డీల్స్ సంఖ్య పెరిగింది కానీ నాటకీయంగా పెట్టుబడుల మొత్తం తగ్గింది.
త్రైమాసికం డీల్స్ సంఖ్య పెట్టుబడి(డాలర్లు)
Q1 2015 7 $131,840,000
Q2 2015 11 $183,450,000
Q3 2015 15 $76,718,000
Q4 2015 17 $19, 954,00
Q1 2016 10 $51,500,00
ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో పది డీల్స్ కుదిరాయి. వీటిలో రెండు పెద్ద డీల్స్. అందులో ఫ్రెష్ మెనూకు సిరీస్ ఏ ఫండింగ్, స్విగ్గీకి 35 మిలియన్ డాలర్ల సిరీస్ సీ ఫండింగ్. ఫుడ్ సర్వీసెస్ మార్కెట్ 50 బిలియన్ల యూఎస్ డాలర్లు. ఏటేటా 16 నుంచి 20 శాతం వృద్ధి కనిపిస్తోంది.
భవిష్యత్తు అద్భుతమా... గాలిబుడగా?
ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ ఈ రంగం కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని అనుకుంటున్నారు ఇన్వెస్టర్లు. అందుకే చాలామంది ఈ రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కంపెనీల్లోకి ప్రవహిస్తున్న పెట్టుబడుల్ని చూసి చాలా తక్కువ సమయంలో ఫండింగ్ వస్తుందని అర్థం చేసుకుంటే పొరపాటే. ఇన్వెస్టర్ల దగ్గర పెట్టుబడులు తరిగిపోతుండటంతో మిగతా కంపెనీలకు ఫాలో అప్ రౌండ్స్ కోసం పెట్టుబడులు కూడా తగ్గుతున్నాయని అర్థం చేసుకోవాలి.
"ఇప్పటివరకు ప్రతీ వెంచర్ క్యాపిటల్ కు ఏదో ఓ రూపంలో ఏదో ఓ రంగంలో పెట్టుబడులున్నాయి. కనీసం ఓ దశాబ్దం స్వయంగా నిలదొక్కుకునే సత్తా ఫుడ్ స్టార్టప్ కు ఉండాలి. అలాంటి ప్యాషన్ తో బిజినెస్ ను నడపాలి"- ఇండియా కోషెంట్ వ్యవస్థాపకుడు ఆనంద్ లునియా.
ఇటీవల ఈ సంస్థలన్నీ వృద్ధి సాధించడం, కస్టమర్లను సంపాదించుకోవడం, ఆర్డర్లు పెంచుకోవడం, ఒకే కస్టమర్ల నుంచి పదేపదే ఆర్డర్లు పొందడం లాంటివాటిపైనే దృష్టిపెట్టాయి.కానీ ఒక్కరు కూడా లాభాలు, వ్యాప్తి, స్థిరత్వం గురించి మాట్లాడట్లేదు. బిజినెస్ ను ఎలా మేనేజ్ చేయాలి, ఎలా నిలదొక్కుకోవాలని ఇప్పుడిప్పుడు నేర్చుకుంటారు వాళ్లంతా. ఇది మాత్రమే సరిపోదు. కంపెనీకి నిలదొక్కుకునే సామర్థ్యం ఉండటంతో పాటు... ఇన్వెస్టర్ల దగ్గర నిధులు చాలా ఉండాలి.
"వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేంతవరకు వాళ్లు మీ ప్రొడక్ట్ కొనరు, సేవలు పొందరు. ఎలాంటి ఆఫర్లు ఇచ్చినా, మార్కెటింగ్ స్ట్రాటజీలు ఫాలో అయినా కస్టమర్లను సంపాదించుకోలేం" అని అంటారు నార్వెస్ట్ వెంచర్ పార్ట్ నర్స్ ప్రిన్సిపాల్ సుమేర్ జునేజా.
నెంబర్ గేమ్
ఫుడ్ స్టార్టప్ కు కస్టమర్లు మొదట్లో సులువుగా ఆకర్షితులౌతారని అంతా అనుకుంటారు. తొలి 300 ఆర్డర్లు సంపాదించుకోవడం సులువే. కానీ రోజుకు మూడు వందల ఆర్డర్లు దాటినప్పుడే కష్టాలు తెలుస్తాయి. ఏంజిల్ ఇన్వెస్ట్ మెంట్ మొదటి 300 ఆర్డర్లకు సరిపోతుంది. ఆ తర్వాత వచ్చే నిధులు ఆర్డర్ల పెరుగుదలపై ఆధారపడి ఉంటాయి. టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించడమే కాదు... తెరపైనా, తెరవెనుక వ్యవహారాలన్నీ జాగ్రత్తగా చేస్తూ పోవాలి. ఫుడ్ టెక్ రంగంలో కస్టమర్లను సంపాదించుకోవడం చాలా ఖరీదైన వ్యవహారం. కస్టమర్ల అవసరాలు తీర్చే సరైన పరిష్కారాన్ని చూపకపోతే కస్టమర్లు రారు. ఫుడ్ పాండాలాంటి కంపెనీలు ఒక్క కస్టమర్ ను సంపాదించుకునేందుకు రూ.400 నుంచి రూ.500 వరకు ఖర్చు చేస్తున్నాయని ఓ అంచనా.
"చాలావరకు యాప్ బేస్డ్ ఫుడ్ బిజినెస్ లు చూస్తే వారి నగరాల్లోని వేర్వేరు ప్రాంతాల కస్టమర్లు మొదట్లో ఆకర్షితులౌతారు. కానీ దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి బిజినెస్ అలాగే ఉంటుందని చెప్పలేం. స్థిరత్వం సాధించడానికి, కస్టమర్ల అలవాట్లలో మార్పు తీసుకురావడానికి ఒక జెనరేషన్ లేదా పదేళ్ల సమయం పడుతుంది" -మెంటార్ సంజయ్.
ఈ వ్యాపారంలో పాఠాలు నేర్పే మలుపులెన్నో ఉంటాయి. ప్రస్తుతం ఫుడ్ టెక్ లో ఉన్న యంగ్ ఆంట్రప్రెన్యూర్స్ వాటిని ఎదుర్కొంటున్నారు. నేర్చుకుంటున్నారు. ఫుడ్ సర్వీసెస్ మార్కెట్ యువ ఆంట్రప్రెన్యూర్లను ఎప్పటికీ ఆకర్షిస్తూనే ఉంటాయన్నది సుస్పష్టం. అయితే నిలకడగా వ్యాపారాన్ని కొనసాగించడం, లాభాల వెంట పరుగులు తీయించడంలోనే ఉంటుంది టాలెంట్ అంతా. ఇలాంటి యువ ఆంట్రప్రెన్యూర్ల కోసం గుర్గావ్ లో ఏప్రిల్ 23న లుఫ్తాన్సా, టై ఆధ్వర్యంలో ఒక ఈవెంట్ జరగబోతోంది. స్టార్టప్స్, పెట్టుబడిదారులు, విద్యార్థులు, వాటాదారులు, కార్పొరేట్స్, ప్రొఫెషనల్స్, ఎంబసీస్, సపోర్ట్ ఆర్గనైజేషన్స్, సర్వీస్ ప్రొవైడర్స్ లాంటి వారందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ఈవెంట్ అది. ఇక లుఫ్తాన్సా రన్ వే టు సక్సెస్ కు అప్లికేషన్స్ పంపేందుకు చివరి రోజు ఏప్రిల్ 30, 2016.