మీ చేతిలో కూయ్ ఉంటే మీరు కులాసాగా ఉన్నట్టే..!
కూయ్... ఎప్పుడూ వినని ఈ పదం కాస్త విచిత్రంగా, కొత్తగా అనిపిస్తోంది కదూ. కానీ ఈ పదం వెనుక చాలా అర్థం ఉంది. ఇది ఆస్ట్రేలియన్ ఆదిమవాసులు ఎక్కువగా ఉపయోగించే విచిత్రమైన శబ్దం. ఎవరి దృష్టినైనా ఆకర్షించడానికి, ముఖ్యంగా అప్రమత్తం చేయడానికి కూయ్ అని పిలుస్తుంటారు. అంటే ఆపద సమయాల్లో అన్నమాట. ఆస్ట్రేలియా నుంచి అరువు తెచ్చుకున్న పదంతో ఓ యాప్ ని స్టార్టప్ చేసింది ఓ స్టార్టప్. ఇది కూడా అప్రమత్తం చేసేందుకు ఉపయోగపడే యాప్. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారి లైఫ్ స్టైల్ మిగతావారికంటే వేరుగా ఉంటుంది. ఆహారపు అలవాట్లలో తేడా ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు వాడాల్సిన మెడిసిన్ చాలా ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటి మర్చిపోయినా దుష్పరిణామాలు ఉంటాయి. దీంతో అలాంటి పేషెంట్లు ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టిపెట్టడం చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది. అందుకే ఏమీ మర్చిపోకుండా పెన్ అండ్ పేపర్ పద్ధతిని ఎప్పట్నుంచో పాటిస్తున్నారు పేషెంట్లు. మెడిసిన్ షెడ్యూల్ దగ్గర్నుంచి డాక్టర్ అపాయింట్ మెంట్ వరకు అన్నింటినీ పేపర్ పై నోట్ చేసుకుంటారు. ఇదంతా పాత పద్ధతి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. అన్నీ స్మార్ట్ ఫోన్ లోకి వచ్చేస్తున్నాయి. ఆ టెక్నాలజీని అందిపుచ్చుకొని పేషెంట్ల కోసం కూయి యాప్ సిద్ధమైంది.
కూయ్... హెల్త్ మానిటరింగ్ యాప్. ఇలాంటి యాప్స్ ద్వారా సమయాన్ని ఆదా చేయొచ్చు. డయాబెటిస్, రక్తపోటు లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి అనుక్షణం సాయంగా ఉండే నేస్తం. ఆరోగ్య సమస్యలు, వాడాల్సిన ఔషధాల జాబితా, ల్యాబ్ రిపోర్ట్స్ లాంటివన్నీ యాప్ లో ఎంటర్ చేస్తే చాలు. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. యాప్, స్మార్ట్ డివైజ్ ల ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి డాక్టర్లకు, పేషెంట్లకు కీలక సమయంలో సాయపడుతుంది ఈ యాప్. అందుకే ఇప్పటి వరకు 75 వేల డౌన్ లోడ్లు జరిగాయి. వీరిలో 60 శాతం మంది భారతీయులే. మిగతా వాళ్లంతా మిడిల్ ఈస్ట్, యూఎస్ఏ, యూకేల నుంచి ఉన్నారు.
ఎలా మొదలైందంటే..?
భారతదేశంలో దీర్ఘకాలిక రోగులపై అధ్యయనం చేసిన తర్వాత మను మధుసూదనన్, ప్రభాకరన్ లు జూన్ 2015లో కూయ్ ని ప్రారంభించారు. ఓసారి మను కూతురుకు న్యూమోనియా సోకింది. తన తల్లికీ ఓసారి న్యూమోనియా వచ్చిందని గుర్తించాడు. ఆమెకు బీపీతో పాటు ఉన్న పలు వ్యాధులను ఓ పేపర్ పై రాసుకుని కూతురు విషయంలో జాగ్రత్త తీసుకున్నారు. ఇలా హెల్త్ కేర్ రంగంలో అత్యంత కచ్చితమైన డాటా ఉంటే భవిష్యత్తులో రాబోయే వ్యాధుల నుంచి అప్రమత్తం కావచ్చు. మను, ప్రభాకరన్ లు కూడా ఇలాగే ఆలోచించారు. పేషెంట్ల నుంచి డాటా సేకరించి డిజిటైజ్డ్ చేయాలనుకున్నారు. పేషెంట్ల అవసరాలకు తగ్గట్టుగా పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నించారు. మార్కెట్ రీసెర్చ్ చేసి, పేషెంట్లు, డాక్టర్లతో మాట్లాడిన తర్వాత కూయ్ ని ప్రారంభించారు.
"ఇప్పటి వరకు హెల్త్ ఐటీలో హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇతర ఉత్పత్తులు, సేవలు, యాప్స్ ఉన్నాయి. కానీ పేషెంట్ ను భాగస్వాములను చేయడంలో ఇంకా ఏదో లోటు కనిపిస్తోంది. ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడంలో పేషెంట్లను భాగస్వాములను చేస్తూ వారికి సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది ఈ యాప్" అంటారు మను.
ఈ స్టార్టప్ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది. కూయ్ టీమ్ లో ఆరుగురు ఉన్నారు. భవిష్యత్తులో నిధుల సేకరణ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ యాప్ ని ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ పై అందుబాటులో ఉన్న బ్లడ్ ప్రెషర్ మానిటర్, స్మార్ట్ బాడీ అనలైజర్ లాంటివి అమ్మడం ద్వారా ఆదాయం పొందుతున్నారు. ప్రీమియం ఫీచర్స్ తో నెలవారీ సబ్ స్క్రిప్షన్స్ లేదా ప్రీమియం మోడల్ అమలులోకి తీసుకురావాలని కూయ్ ప్లాన్ చేస్తోంది. యూజర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ఆన్ లైన్ ఫార్మసీలు, ల్యాబ్స్, హోమ్ కేర్ సర్వీసెస్ తో భాగస్వామ్యం చేసుకోవాలని భావిస్తోంది. హెల్త్ కేర్ రంగాన్ని స్మార్ట్ గా మార్చేందుకు చాలా అవకాశాలున్నాయంటారు మను. తద్వారా పేషెంట్లకు, డాక్టర్లకు కచ్చితమైన హిస్టారికల్ డాటా అందుబాటులోకి తీసుకురావొచ్చంటున్నారు. త్వరలో పేషెంట్లకు స్మార్ట్ గ్లూకోమీటర్స్, టూత్ బ్రషెస్, వెస్ట్స్ లాంటి పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు.
ఇలా పనిచేస్తుంది
యూజర్లు కూయిలో సైనప్ చేసుకోవాలి. వారి ప్రాథమిక వివరాలు నమోదు చేయాలి. దాంతో పాటు మానిటర్ చేయాల్సిన వ్యాధుల వివరాలను ఎంట్రీ చేయాలి. అప్పుడు కూయి యాప్... ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో, ఎలా ఉపయోగించాలో వివరిస్తుంది. యాప్ లోని ప్రధానమైన ఫీచర్లలో 'హెల్త్ టైమ్ లైన్' ఒకటి. ఇందులో యూజర్లు నోట్స్ యాడ్ చేయొచ్చు. వారి ఆరోగ్యానికి సంబంధించిన రిమైండర్లు తయారు చేసుకోవచ్చు. యూజర్లు వారి మెడికల్ రికార్డ్స్ ని పీడీఎఫ్, ఇమేజ్ ఫార్మాట్లలో అప్ లోడ్ చేసి వారి పర్సనల్ హెల్త్ రికార్డ్ ను డిజిటైజ్డ్ చేయొచ్చు.
1. పర్యవేక్షణ: యూజర్లు వారి డాటాను మ్యాన్యువల్ గా ఎంటర్ చేయొచ్చు లేదా బ్లూటూత్ తో పనిచేసే బీపీ మానిటర్స్, స్మార్ట్ బాడీ అనలైజర్స్ ద్వారా మెడికల్ డాటా ఆటోమెటిక్ గా ఫీడ్ అవుతుంది. ఈ డాటాను డాక్టర్లతో, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవచ్చు.
2.ఛాటింగ్: కూయీ యాప్ లో ఛాటింగ్ ద్వారా యూజర్లు ఆరోగ్య సంబంధిత సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. దగ్గర్లోని ఫార్మసీల్లో మెడిసిన్ ఆర్డర్ చేయొచ్చు. వృద్ధులు, టైపింగ్ చేయడం రానివాళ్లు పర్సనల్ అసిస్టెంట్ 'మాయ' ద్వారా వాయిస్ బేస్డ్ కమాండ్స్ ఇవ్వొచ్చు.
3. విశ్లేషణ: పేషెంట్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై పూర్తిస్థాయి ప్రొఫైల్ తయారు చేసేందుకు... డివైజ్ ల నుంచి సేకరించిన డాటా, తరచూ వాడే మెడిసిన్స్, ల్యాబ్ రిపోర్ట్స్ ఉపయోగిస్తున్నారు. వ్యక్తిగత బీమా సేవలకు ఈ విశ్లేషణ ఉపయోగపడుతుంది.
4. స్థానికంగా సేవలు: ఆరోగ్య సేవలు అందించేవారు స్థానికంగా ఉండే కస్టమర్లకు సరసమైన ధరలకే తమ సర్వీసులను ఆఫర్ చేయొచ్చు. దీని ద్వారా స్థానికంగా సేవలందించే వారి వ్యాపారం పెరుగుతోంది. ఇది కూయీకి మరో రెవెన్యూ మోడల్.
ఈ రంగం గురించి...
భారతదేశంలో హెల్త్ కేర్ మార్కెట్ విలువ 80 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇందులో ఎక్కువగా ఆఫ్ లైన్ లోనే ఉంది. హెల్త్ కేర్ డాటా డిజిటల్ రికార్డ్ చేయడం ద్వారా ఎమర్జెన్సీ సమయాల్లో డాక్టర్లు పేషెంట్ హిస్టరీ గురించి తెలుసుకునే అవకాశం ఉంది. భారతదేశంలో 13 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతుంటే, ఏడున్నర కోట్ల మంది డయాబెటిక్ పేషెంట్లున్నారు. హెల్త్ కేర్ కు సంబంధించిన డివైజ్ లకు మంచి గిరాకీ ఉంది. డిజిటల్ గ్లూకోమీటర్స్, యాపిల్ వాచెస్, ఫిట్ బిట్స్ లాంటివి బాగా అమ్ముడుపోతున్నాయి. అందుకే ఆంట్రప్రెన్యూర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు హెల్త్ కేర్ పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా కన్సల్టేషన్ అందిస్తున్న డాక్స్ యాప్... రీబ్రైట్ పార్ట్ నర్స్ నుంచి 12 లక్షల మిలియన్ డాలర్ల నిధులు సేకరించింది. చాట్, వీడియో ద్వారా కన్సల్టేషన్ అందిస్తున్న లిబ్రేట్... టైగర్, నెక్సస్, రతన్ టాటాల నుంచి 2015లో కోటి రూపాయల నిధులు అందుకుంది. ఇక మెడిసిన్ కామర్స్ లో మిరా మెడిసిన్, మెడెక్స్, ప్రాక్టో లాంటివి చాలా ఉన్నాయి.
నచ్చే అంశాలు
కూయ్ యాప్ లో హెల్త్ రికార్డ్ ట్రాక్ చేసే ప్రక్రియను అద్భుతంగా తీర్చిదిద్దారు. వినియోగదారులు వారి ఆరోగ్యంపై నిఘా పెట్టుకునేందుకు ది హెల్త్ టైమ్ లైన్ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. రిమోట్ ట్రాకింగ్ ఫీచర్ కూడా బాగుంది. లొకేషన్ తో సంబంధం లేకుండా కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా వారి ఆరోగ్యంపై నిఘా పెట్టేందుకు ఉపయోగపడుతుంది ఈ యాప్. బీపీ, బ్లడ్ షుగర్, వెయిట్ లాంటి మూడు ప్రధానమైనవాటిని ఒకే యాప్ లో సమర్థవంతంగా ట్రాక్ చేయడం లేదా స్మార్ట్ డివైజుల ద్వారా నిఘా పెట్టడం ఈ యాప్ గొప్పదనం. మినీ క్విజ్ ల ద్వారా యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం బాగుంది. వారికి సంబంధించిన వ్యాధుల గురించి బ్లాగుల ద్వారా తాజా సమాచారాన్ని అందిస్తుంది.
ఇంకా మెరుగు పర్చాల్సినవి
మొదట్లో నాలుగు నిమిషాల ఇంట్రడక్షన్ వీడియో పలు రకాల ఫీచర్ల గురించి వివరిస్తుంది. టెక్నాలజీ గురించి తెలియని వారికి కూడా అర్థమయ్యేలా ఉన్నాయి. అయితే బీటాలో ఉన్న వాయిస్ యాక్టివేటెడ్ కమాండ్స్ ను ఇందులో వాడారు. కానీ అవి కచ్చితమైన ఫలితాలను ఇవ్వట్లేదు. ఈ యాప్ లో హోమ్, హిస్టరీ, ఆఫర్స్ పేరుతో మూడు ప్రధానమైన ట్యాబ్స్ ఉన్నాయి. కానీ మరిన్ని ముఖ్యమైన ఫీచర్లు పెట్టాల్సిన అవసరం ఉంది. మరిన్ని ట్యాబ్స్, సబ్ ట్యాబ్స్ ఉండటం ద్వారా యాప్ ని సులువుగా ఆపరేట్ చేయొచ్చు.
యువర్ స్టోరీ మాట
కూయ్... ఆలోచనాత్మకమైన యాప్. డయాబెటిక్స్, బ్లడ్ ప్రెషర్, ఊబకాయం పేషెంట్లు రెగ్యులర్ గా వారి ఆరోగ్యాన్ని మానిటర్ చేసేందుకు బాగా ఉపయోగపడుతోంది. అత్యవసర సమయాల్లో అప్రమత్తం చేసి, వెంటనే చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉంది. ఇక పలు రకాల రెవెన్యూ మోడల్స్ తో ఆదాయాన్ని పొందడం మంచి ప్రయత్నమే. ఇక భవిష్యత్తులో ఇంకా ఎలాంటి అద్భుతాలు చేస్తారో... ఎలా విస్తరిస్తారో... పేషెంట్ల జీవితాల్లో ఎలా భాగస్వాములౌతారో చూడాలి..