పాతికవేల లోపు రుణాలతో గ్రామాల్లో పాతుకుపోయిన చైతన్య ఫైనాన్స్ క్రెడిట్
విదేశాల్లో చదువు.. ఆ తర్వాత స్వదేశంపై మమకారం పోని వాళ్లు చేసే పని..ఇక్కడో సాఫ్ట్‌వేర్ కంపెనీయో.. లేదంటే ఏదో ఒక చిన్న బిజినెస్ ఫర్మ్ స్టార్ట్ చేయడం. ఐతే కర్నాటకలోని మంగళూరుకు చెందిన ఆనంద్ రావ్ మాత్రం అలా అనుకోలేదు. తన రాష్ట్రంలో వ్యవసాయంతో అష్టకష్టాలు పడుతున్న రైతులకు ఏదైనా చేయాలనుకున్నాడు. అలా... ''చైతన్య ఇండియా ఫైనాన్స్ క్రెడిట్ " అనే సూక్ష్మ రుణ సంస్థ పురుడు పోసుకుంది.
అలా మొదలైంది
అమెరికాలోని సైరాకాజ్ యూనివర్సిటీలో ఇంటర్నేేషనల్ రిలేషన్స్‌లో ఎంఏ పూర్తి చేసిన ఆనంద్ రావ్ అది పూర్తవగానే ఇండియాకి తిరిగొచ్చారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృధ్దికి కృషి చేయడం ప్రారంభించారు. దాని కోసం ఓ ట్రస్ట్ ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ... గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలతో తరచూ కలిసేవారు. అలా నాలుగేళ్లు ఓ స్వఛ్చంద సంస్థ తరపున పనిచేసిన తర్వాత ఆయనకో ఆలోచన వచ్చింది. అదే చైతన్య ఇండియా ఫైనాన్స్ క్రెడిట్. ఇదో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్.
" 2008 లో ప్రారంభించిన మా కంపెనీ... 2009 వరకూ కూడా చాలా చిన్నదిగా ఉండేది. లాభాలు కూడా వచ్చేవి కావు. అప్పుడే సంస్థను ఓ కార్పొరేట్ పద్దతిలో నడపాలనే నిర్ణయం తీసుకున్నాం. కమర్షియల్ లైసెన్స్ కోసం అప్లై చేశాం " అని చెప్పారు ఆనంద్.
చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్ సంస్థకు ప్రారంభంలో అవసరమైన పెట్టుబడినంతా తన సంపాదన నుంచే పెట్టారు. కర్నాటక చిత్రదుర్గ జిల్లాలోని నయకనహత్తి అనే గ్రామంలో ఓ స్థానిక టీచర్‌తో కలిసి పని చేసిన ఆ సమయంలోనే ఆనంద్ రూ. 5 లక్షల రూపాయలు పొదుపు చేయగా..అదంతా చైతన్య క్రెడిట్ సంస్థకోసం ప్రారంభ పెట్టుబడిగా పెట్టారు. కర్నాటకలోని మంగళూరు ఆనంద్ స్వస్థలం. చైతన్య సంస్థను తమ సొంత సంస్థగా గ్రామస్తులు భావించేందుకు చాలానే కష్టపడ్డారు. ఎందుకంటే... అది పనిచేసే చోట వారికోసమే అది ఏర్పాటైనట్టు గుర్తించాలి. చైతన్య ఫిన్ క్రెడిట్ తాలుకా,గ్రామ స్థాయిలో తన వ్యాపారం చేస్తుంది. భారీ స్థాయిలో కమర్షియల్‌గా వ్యాపారం చేసే సంస్థల కోసం కాకుండా చిన్న స్థాయి రైతులు, స్థానికుల కోసం లైవ్ స్టాక్ , యానిమల్ హజ్బెండరీ, అగ్రికల్చర్ అవసరాల కోసం చైతన్య రుణాలు అందిస్తుంది.
" మేం చేసినట్టుగా ఎవరూ చేయడం లేదు. ఫామ్‌లో పెంచగలిగే జంతువులు, కోళ్లు, గొర్రెలు, బర్రెలు ఇలాంటి వాటి కొనుగోలు అప్పులు ఇస్తాం. ఐతే అది కూడా వారి వ్యక్తిగత అభివృధ్ది కోసమే. అంతే కానీ భారీస్థాయిలో వ్యాపారం చేసేవారికి మాత్రం రుణాలు ఇవ్వము.." చెప్పారు ఆనంద్. చైతన్య సంస్థ... గ్రామస్తులను పెద్ద రుణాల కోసం ప్రోత్సహిస్తుంది కానీ..అదే సమయంలో ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలనే షరతు విధిస్తుంది. ఎందుకంటే ఏదైనా అనూహ్య పరిస్థితుల్లో వారు కొనుగోలు చేసిన గేదెలు మరణించినా..నష్టం వాటిల్లినా.. రుణం కట్టకపోవడం అంటూ ఉండదు. అలా రుణాలు ఎగవేసే రిస్క్ కూడా తగ్గుతుంది.
ఇప్పటిదాకా చైతన్య సంస్థ అందించిన పెద్ద లోన్ ఎంత తెలుసా... రూ. 35వేల రూపాయలు మాత్రమే. ఇది కూడా పెద్ద లోనా అని అనుకోవచ్చు. కానీ ఓ చిన్నస్థాయి రైతు .. రెండెకరాల పొలాన్ని పండించుకోవడానికి అవసరమైన పెట్టుబడికి 35వేలు సరిపోతుంది. ఓ శెనగ పండించే రైతుకు, పొద్దు తిరుగుడు వేసే రైతుకు ... విత్తనాలు వేయడానికి 25వేలు సరిపోతాయి. మిగిలిన డబ్బుతో సేద్యం చేయవచ్చు. చైతన్య సంస్థ తరపున జంతువుల కొనుగోళ్లకే కాకుండా.. ప్రకృతి సిధ్దంగా సాగయ్యే పూలతోటలకూ రుణాలు ఇస్తుంది.
" వర్షం ఇవాళ పడితే... రెండు మూడు రోజుల్లోనే విత్తనాలు నాటాలి. విత్తనాలు సిద్ధం గా చేతిలో లేవంటే.. అదో పెద్ద సమస్య. విత్తన వ్యాపారుల మాయాజాలం లో పడి ఇక అవి కొనలేనంత రేట్లు అవుతాయ్. దాని తర్వాత వచ్చే పంటకి అందే రేటు విషయంలో కూడా అదే జరుగుతుంది. రైతుకు మంచి రేటు వచ్చినా ఇవ్వకుండా ఓ ఫిక్స్‌డ్ ధర దగ్గర లాక్ చేస్తారు. ఇక ఎంత రేటు పెరిగినా ఆ లాభం రైతుకు అందనీయరు. అందుకే ఇది టైంకి సంబంధించి విషయం " అంటారు ఆనంద్.
పెద్ద మొత్తంలో అప్పులంటే అది గ్రూపులకే అందిస్తుంది చైతన్య. కుగ్రామాల్లో రైతులకు గేదెలు,గొర్రెలు కొనడానికి మార్కెట్లు.. సంతలు ఉండవు. దగ్గర్లోని పట్టణాలకో..పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకో వెళ్లాలి.." ఇలాంటి సందర్భాల్లో వారికి వ్యక్తిగతంగా లోన్లు ఇవ్వం. గ్రూపుగా ఏర్పడితే వారికి రుణాలు మంజూరు చేస్తాం. ఈ గ్రూపులు పక్కరాష్ట్రాల్లో కానీ.. సుదూర ప్రాంతాల నుంచి పశువులను కొన్నప్పుడు వాటి రవాణా చేయడంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సమర్ధవంతంగా వ్యవహరిస్తాయి. అదే సమయంలో పశువులు కొనుగోలు చేసే సమయంలో వారి బృందంలోని సభ్యులంతా ఉండాల్సిన అవసరం లేదు. దీంతో పొలంపనులపై దృష్టిపెట్టుకునే వీలు కలుగుతుంది. ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది ''.
అప్పులు ఇవ్వడంతోనే చైతన్య సంస్థ తన పని అయిపోయిందని సరిపెట్టుకోదు. రుణాలు తీసుకున్నవారు దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారనే విషయాన్నీ ట్రాక్ చేస్తూ ఉంటుంది. దాంతో పాటే అవసరమైన సలహాలు ఇస్తుంది. ఉదాహరణకు ఓ గొర్రెనో..గేదెనో కొంటే దాని ద్వారా చేసే వ్యాపారంలో మెళకువలు చెప్తుంది. పశువుల ద్వారా వచ్చే ఉత్పత్తుల అమ్మకంలో సాయపడుతుంది.
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్సిట్యూషన్స్‌కి రుణాలు మంజూరు చేసే క్రమంలో ఎదురయ్యే సమస్య మధ్యవర్తులు. గత కొన్నేళ్లుగా ఈ మధ్యవర్తుల వ్యవస్థ వేళ్లూనుకుపోయిందంటారు ఆనంద్.. " చైతన్య సంస్థ ద్వారా లోన్‌తో పాటు..ఇన్సూరెన్స్ పత్రాలు కూడా ఇస్తాం. దాంతో పెట్టిన పంట కానీ..కొనుగోలు చేసిన పశువుల ఉత్పత్తి కానీ రైతులే డైరక్ట్‌గా అమ్ముకోవచ్చు. దీంతో అమ్మకందారుకు..కొనుగోలుదారుడికీ మధ్య లో ఉండే దళారులను దాదాపుగా అడ్డుకోవచ్చని చెప్తారు ఆనంద్.."
ఐనా మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించడమనేది చాలా కష్టమైన పనిగా మారిపోయింది. దళారుల నెట్వర్క్ చాలా పెద్దది. బయ్యర్లు ఎవరో..సెల్లర్లు ఎవరో వారికి బాగా తెలుసు. వారి అవసరాలు బాగా తెలుసు కాబట్టి.. సమయానికి తగినట్లు వ్యవహరిస్తూ దోచుకుతింటున్నారు. ఐతే మేం మాత్రం చేయగలిగినంత చేస్తున్నాం.. రుణం తీసుకున్న కస్టమర్లలో బార్గెయినింగ్ (బేరం అడటం) తత్వం పెంపొందిస్తున్నాం. దీంతో వారికి వీలైనంత ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. ఇలాంటి చిన్న చిన్న అడుగులే రేపొద్దున పెద్ద మార్పునకు దారి తీస్తాయ్.. "
మంచి పరిణామం ఏంటంటే..ఇప్పుడిప్పుడే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్సిట్యూషన్స్ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేసేలా వారి పథకాలు రూపకల్పన చేస్తున్నాయి. రుణాలు మంజారు చేయడం..కస్టమర్లకు ఎక్కువ ఆదాయం వచ్చేలా చూడటం వంటి లక్ష్యాలతో పని చేసే ఇలాంటి సంస్థలు దళారుల వ్యవస్థను నివారించడంలో పోరాడుతున్నాయంటారు ఆనంద్. చైతన్య సంస్థ కూడా ఇలానే 15వేల మంది వేరుశెనగ రైతులకు రుణాలు మంజూరు చేస్తూ విజయవంతమైంది.
ఇంకో అభినందించదగ్గ విషయం ఏమిటంటే.. చైతన్య ఒక్క మైక్రో ఫైనాన్స్‌కే పరిమితం కాలేదు. చిన్నస్థాయి రైతుల్లో ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ను అభివృధ్ది చేసేందుకు కూడా ప్రణాళికలు రచిస్తోంది. వారిలో ఆర్ధిక స్థితి మెరుగుపరచడంతోపాటు ఆదాయవనరులు పెరిగేందుకూ సాయపడుతుంది. ఉదాహరణకు వేరుశెనగ పంట పండించే రైతును.. ఆ పంటనుంచి నూనె తీసే యంత్రం కొనుగోలు చేయించినట్లైతే.. అది ఇంకో ఆదాయ మార్గంగా ఉపయోగపడుతుంది కదా ?
రుణాల మంజూరు వాటి ప్రభావం
రుణాలు ఇచ్చేవిధానం గురించి ఆనంద్ చెప్తూ.." వ్యవసాయం చేసే ఓ రైతు ఆవును కొనుక్కోవడానికి రుణం తీసుకున్నాడనుకోండి. అది అతని ఆర్థిక పరిస్థితిలో మార్పు తెస్తుంది. దాని తర్వాత తీసుకునే అప్పు మొత్తం ఇంకా పెంచుకోగలుగుతారు. సంస్థ కూడా అతని ఆర్ధిక స్థితి మెరుగుపడటంతో..ఎక్కువ మొత్తం ఇవ్వడానికి ముందుకు వస్తుంది. మొదట్లో ఎవరైతే రుణాలు తీసుకోవడానికి ముందుకు రారో(రకరకాల అనుమానాలతో) ఇష్టపడరో..వారే వారి తోటి రైతుల స్థితి మెరుగుపడటం గమనించి చైతన్య సంస్థను సంప్రదిస్తుంటారు. గ్రామీణ భారతంలో ఇంకో పెద్ద సమస్య ఏమిటంటే మార్కెటింగ్. కమర్షియల్ నెట్వర్క్తో ముడిపడని ఉత్పత్తులకు రుణం ఇస్తే..అది వారికెంత మాత్రమూ సాయపడదు. అందుకే చాలామంది రైతులు వ్యవసాయంవైపే మొగ్గు చూపిస్తున్నారు. వర్షాధార పంటలనే రైతులు ఎక్కువ సాగు చేస్తుండటంతో..ఇక లాభాల మాట ప్రసక్తే లేదు. అందుకే మేం ఎక్కువ లైవ్ స్టాక్(పశుపెంపకం) ను ప్రోత్సహిస్తాం. అలా చేస్తేనే... వ్యవసాయం మీదనే ఆధారపడటం తగ్గుతుంది. పశువుల పెంపకం ద్వారా వాటి ఉత్పత్తులు అమ్మకంతో లాభాల బాట పట్టిన తర్వాత..వ్యవసాయంలో నష్టం వచ్చినా తట్టుకోగలుగుతారనే అర్ధం ఆనంద్ మాటల్లో కన్పించింది.
ఇలాంటి వాతావరణం లో పని చేసే సంస్థలకు ఎదురయ్యే సమస్య ఏంటంటే... సంస్థను కేవలం ఇక ఇదే సెట్టింగ్‌లో బిల్డ్ అప్ చేసుకుంటూ పోవడం. తర్వాత ఏం చేయాలనేది .. ఎలా సంస్ధను మరింత ముందుకు తీసుకుపోవాలనేది అర్ధం కాదు.. ఎప్పుడైతే శాచురేషన్ పాయింట్‌కి చేరాం అన్పిస్తుందో..సంస్థ పురోగతికి అప్పుడిక వేరే పార్ట్‌నర్‌నో... లేక ఇన్వెస్టర్‌నో వెతుక్కోవాలి. చైతన్య ఫైనాన్స్ విషయానికి వస్తే.." పాల ఉత్పత్తి రంగంలో అనుభవం సాధించాం.. ఇది చాలదు. బిజినెస్ పెంచాలని అనుకుంటున్నాం.. మేం ఎదగడమే కాకుండా. భాగస్వాములు..వారితో పాటు పదిమందీ ఎదగాలి.."
ఆదాయ మార్గం..!
చైతన్య సంస్థకు ఆదాయ మార్గం అది ఇచ్చే రుణాలపై వచ్చే వడ్డీ మార్జిన్. '' ఈక్విటీ రూపంలో..డెట్ ఫండింగ్ రూపంలో పెట్టుబడి ఉండగా.. చైతన్య స్థాపించిన ఏడోనెల నుంచే లాభాలు వస్తున్నాయి. దీనికి కారణం నేను తీసుకున్న చర్యలే. మా కస్టమర్ల ఖాతాలన్నీ ఫైనాన్షియల్ వ్యవస్థలో ఇంటిగ్రేట్ చేసాం. ప్రస్తుతానికి జన్‌థన్ యోజన కింద మా కస్టమర్ల ఖాతాలన్నీ బ్యాంకుల్లో ఓపెన్ చేయించాం. అలానే ఎక్కువగా మహిళలకు రుణాలు మంజూరు చేస్తున్నాం" అని చెప్పారు ఆనంద్. వారైతేనే కష్టించేగుణంతో పాటు..బాధ్యత కలిగి ఉంటారని ఆనంద్ విశ్వాసం.
బిజినెస్... సామాజిక ధృక్పథం ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ కోల్పోకూడదు. పూర్తిగా వ్యాపారమైనా..సర్వీసైనా సంస్థ మనుగడ ప్రశ్నార్ధకమవుతుంది. అలాంటి సంస్థను నడుపుతూ దానికి పెట్టుబడి పెట్టేవారిని వెతకడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే వ్యాపారవేత్తలు తక్కువ లాభాలు వచ్చే వ్యాపారం చేయడానికి త్వరగా ఇష్టపడరు. దానికి వారిని ఒప్పించడం చాలా కష్టమైన పని. అలాంటి కష్టతరమైన జాబ్‌ను ఆనంద్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు..
" పూర్తిగా వ్యాపారమే చేయకూడదు. అలా అని సమాజాన్ని ఉద్దరించడం కోసమే అప్పులూ ఇవ్వకూడదు. ఈ రెండింటికీ మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ..అటు రైతులకు ఉపయోగపడేలా..సంస్థకు ఆదాయం వచ్చేలా నిర్వహించాలి "అని ముగించారు ఆనంద్.