ఎంతైనా బ్రాండెడ్ బ్రాండెడే గురూ..!!

ఎంతైనా బ్రాండెడ్ బ్రాండెడే గురూ..!!

Sunday March 06, 2016,

2 min Read


ఇప్పటి జనరేషన్ లో యూత్ స్టైల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ కొలువులు, మార్కెట్లో ల‌భిస్తున్న ఛాన్స్ లతో రెండు ప‌దుల వ‌యస్సుకే ఆరంకెల శాల‌రీల‌తో యువ‌త హల్ చల్ చేస్తున్నది. అలాంటప్పుడు ఆటోమేటిగ్గా యువ‌తరం విలాస‌వంత‌మైన లైఫ్ స్టైల్‌కు అల‌వాటు ప‌డుతుంది. ఈ సిట్యువేషన్ ను క్యాష్ చేసుకునేందుకు మార్కెట్ ఇప్పుడు ఎక్స్ క్లూజివ్ మంత్రాన్ని జపిస్తోంది. 

ల‌గ్జరీ సాధ‌నాలు అన‌గానే మ‌న‌కు అద్దాల మేడ‌ల్లాంటి షోరూంలే గుర్తుకువ‌స్తాయి. కానీ ట్రెండ్ మారింది. ఐటీ విప్ల‌వం పుణ్య‌మాని ఇప్పుడు లగ్జ‌రీ సాధ‌నాలు ఆన్‌లైన్ మార్కెట్‌లోకి ప్ర‌వేశించాయి. ఇత‌ర మార్కెట్ వస్తువుల క‌న్నా ఇవి కాస్త లేట్ గా ఆన్ లైన్ షాపింగ్ లోకి ప్ర‌వేశించాయి. అయితే ఇత‌ర వ‌స్తువుల‌కి ల‌గ్జరీ వ‌స్తువుల‌కీ మధ్య ఉన్న తేడా ఏమిటంటే.. ఎక్స్‌క్లూజివ్. ఈ ప్రోడ‌క్ట్స్ కొద్దిమంది వినియోగ‌దారులకు మాత్ర‌మే అందుబాటులో ఉంటాయి. ఆయా ప్రొడక్టుల‌ను పొందేందుకు కస్టమర్లు ఖ‌ర్చుకు సైతం భయపడరు. 

image


టెక్నాల‌జీలో విలాసం..

యాపిల్ కంపెనీ ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల‌కు పెట్టింది పేరు. ఆ కంపెనీ ఉత్ప‌త్తుల‌న్నీ మార్కెట్‌లో ఖ‌రీదైన‌వే. వాటిని విలాసవంత‌మైన వ‌స్తువుల జాబితాలోనే చేర్చ‌వ‌చ్చు. అయితే యాపిల్ ఎక్స్‌క్లూజివ్‌గా ఇటీవ‌లే యాపిల్ స్మార్ట్ వాచ్ ని రిలీజ్ చేసింది. అవి కూడా చాలా పరిమితంగానే. సాధార‌ణంగా ఏవైనా కొత్త ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు మార్కెట్‌లోకి ప్ర‌వేశిస్తే గ్యాడ్జెట్ వ‌రల్డ్ లాంటి సైట్ల‌లోనూ, మ్యాగ‌జైన్ల‌లోనూ ప్ర‌ద‌ర్శిస్తారు. కానీ యాపిల్ స్మార్ట్ వాచ్ ప్ర‌క‌ట‌న మాత్రం ఫ్యాష‌న్ మాగ‌జైన్ వోగ్ లో ప్ర‌చురించారు. ఆ మ్యాగ‌జైన్ వారు యాపిల్ స్మార్ట్ వాచ్ ని ఒక స్టేట‌స్ సింబల్ గా గుర్తించారు. వీటి అమ్మ‌కాలు కూడా ప‌రిమితంగానే జ‌రిపారు. తద్వారా త‌మ ప్రాడక్టుకు ఎక్స్‌క్లూజివ్ స్టేట‌స్ ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నించింది యాపిల్‌.

మా వెబ్ సైట్లో మాత్రమే.. ల‌భించును

ఈ మధ్యకాలంలో భార‌త్‌లో జియోమీ రెడ్మీ ఫోన్ ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసిన‌ప్పుడు ఆ మొబైల్ ను కేవ‌లం ఫ్లిప్ కార్ట్ వెబ్‌సైట్‌లో మాత్ర‌మే అమ్మ‌కానికి ఉంచారు. అదొక్కటే కాదు అనేక సంస్థ‌లు ఈ కామర్స్ సైట్ల ద్వారా మాత్ర‌మే త‌మ ఉత్ప‌త్తులను మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. ఆన్ లైన్ ఎక్స్‌క్లూజివ్ అమ్మ‌కాలు అనగానే క‌స్ట‌మ‌ర్లు కూడా ఎగబడి కొంటున్నారు. 

వేసే డ్రెస్‌లోనూ బ్రాండ్ బాజా..

వ‌స్త్ర ప్ర‌పంచంలో ఇప్పుడు న‌డుస్తున్న ఏకైక మంత్రం- బ్రాండ్. ఫ‌లానా బ్రాండ్‌ అని పేరు క‌నిపిస్తే చాలు.... ఎంత‌ఖ‌ర్చు పెట్టేందుకైనా వెనుకాడ‌ట్లేదు. జిమ్మి కూ, టాడ్స్ లాబౌటిన్‌, గుస్సి, జెగ్నా, బ‌ర్బ‌రీ లాంటివి ల‌గ్జ‌రీ ప్రాడక్టులుగా మార్కెట్‌లో గుర్తింపు పొందుతున్నాయి. డిజైన‌ర్ వేర్ ఎక్స్ క్లూజివ్ అంటే ప్ర‌త్యేకంగా రూపొందించిన వ‌స్త్రాల‌ను కొద్ది మందికి మాత్ర‌మే అందుబాటులో ఉంచుతారు. దీంతో ఆ బ్రాండ్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. ప‌లు బ్రాండ్లు ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా వ్యాపారం చేస్తున్నాయి. ప్ర‌ఖ్యాత డిజైన‌ర్లు మ‌నీష్ ఆరోరా, స‌బ్య‌సాచి లాంటి వారు ఆన్ లైన్ పోర్ట‌ల్స్ జబాంగ్‌, మింత్రా, అమెజాన్ లాంటి సంస్థ‌ల‌తో ఒప్పందాలు కుదుర్చుకొని ఎక్స్ క్లూజివ్ డిజైన్ లను అందుబాటులో వుంచుతున్నారు.

కిరాణాలోనూ ఎక్స్‌క్లూజీవే..

యూకే, యూఎస్ లాంటి దేశాల్లో కిరాణా వ‌స్తువుల‌ను ఆన్‌లైన్‌లో ఎక్కువ‌గా విక్ర‌యిస్తున్నారు. నెట్ ఏ పోర్ట‌ర్ అనే సైట్ ప్ర‌సిద్ది పొందింది. ఎన్నో ఎక్స్ క్లూజివ్ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తేవ‌డంతో ఈ డిపార్ట్‌మెంట‌ల్ స్టోర్ల‌కు విప‌రీత‌మైన గిరాకీ పెరిగింది. 

క‌స్ట‌మ‌ర్లను తృప్తి ప‌ర‌చ‌డ‌మే వ్యాపార కిటుకు

నిజ‌మే ఏ క‌స్ట‌మ‌ర్ అయినా త‌న‌కు మాత్ర‌మే ఒక వ‌స్తువు ప్రత్యేకంగా ల‌భించిందంటే ఆ ఆనంద‌మే వేరు. అమెరికాలో ఓ స‌ర్వే ప్ర‌కారం 60 శాతం మంది ప్ర‌జ‌లు ల‌గ్జ‌రీ వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేందుకు ఆన్ లైన్‌ను ఎంచుకుంటున్నారు. జ‌ర్మ‌న్లు అయితే ఆఫ‌ర్ల‌ను అనుస‌రించి మరీ ఆస‌క్తి చూపుతున్నారట.