ఒక్క క్లిక్ తో మెడికల్ హిస్టరీ అందించే ఇకిన్ కేర్
చిన్నప్పుడెప్పుడో తలకు తగిలిన దెబ్బ ఇప్పుడు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందంటే నమ్ముతారా? మీకు ఇప్పుడు వచ్చిన తీవ్రమైన జబ్బుకి కొన్నేళ్ల క్రితమే బీజం పడిందని మీకు తెలుసా? ఇలాంటివి తెలుసుకోవాలంటే మీ పాత రిపోర్టులు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు మీకు వచ్చిన జబ్బులకు పాత రిపోర్టుల సాయంతో ఇంకా మెరుగైన చికిత్స చేయొచ్చు. ఈ రోజుల్లో అది సాధ్యమే. ఆలోచన బాగానే ఉంది కానీ... ఆ రిపోర్టులన్నీ ఎక్కడ పడేశారో ఏమో. వెతుక్కోవడం మీకు పెద్ద తలనొప్పి. అందుకే రిపోర్టులను భద్రపర్చేందుకు ఇటీవల కొన్ని వెబ్ సైట్లు బాగా సాయపడుతున్నాయి. ప్రాక్టో లాంటి సంస్థలు కేవలం డాక్టర్ అపాయింట్ కోసమే కాదు... కొంతవరకు మెడికల్ రికార్డులను భద్రపరచడానికీ ఉపయోగపడుతున్నాయి. ఇలా మెడికల్ హిస్టరీని రికార్డు చేసే స్టార్టప్ మరొకటి ఉంది. అదే ఇకిన్ కేర్.
శుభారంభం
కిరణ్ కలకుంట్ల, డ్యూక్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. అమెరికాలో దశాబ్ద కాలంలో ముప్పైకి పైగా టెక్నాలజీ ప్రొడక్ట్స్ ఆవిష్కరించిన అనుభవం ఉందాయనకు. ఆ అనుభవంతోనే ఇకిన్ కేర్ కు రిబ్బన్ కట్ చేశారు. మెడికల్ ఇన్ఫర్మేషన్, హిస్టరీని భద్రపర్చుకోవడమే కాదు... ఎప్పుడైనా ఎక్కడైనా చూసుకునే అవకాశం కల్పించడమే ఇకిన్ కేర్ అందించే సర్వీస్. ఇకిన్ కేర్ మొదట 2014లో ఎన్నారైల కోసం ప్రారంభమైంది. వారి తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని ట్రాక్ చేసేందుకు, వారి పేరెంట్స్ ఆరోగ్య చరిత్రను పరిశీలించి భవిష్యత్తులో వచ్చే ప్రమాదమున్న జబ్బులపై ఓ అంచనాకు వచ్చేందుకు సేవలందించేది. అయితే ఇప్పుడున్న టెక్నాలజీని సమర్థవంతంగా వాడుకుంటూ సేవల్ని మరింత మెరుగుపర్చాలని యూజర్లు కోరుకున్నారు. రిపోర్టులను భద్రపరిచే ప్లాట్ ఫామ్ కోసం వాళ్లు ఎదురుచూశారు. అలా ఇకిన్ కేర్ ఐడియా వచ్చింది. మెడికల్ హిస్టరీ భద్రపర్చుకునేందుకు వినియోగదారులు పడుతున్న ఇబ్బందులపై ప్రాథమికంగా పరిశోధనలు చేసిన తర్వాత మేము ఇకిన్ కేర్ స్టార్టప్ మొదలైంది.
వీరి టెక్నాలజీ సామాన్యమైనది కాదు. అందుకే పేటెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. హెల్త్ కేర్ ప్రొవైడర్స్ నుంచి మెడికల్ రిజల్ట్స్ ని సేకరించడం, ప్రొఫైల్స్ ని అప్ డేట్ చేయడం, యూజర్లు వారి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ వివరాన్ని భద్రపరిచేలా చూడటం, వాటిని విశ్లేషించి భవిష్యత్తులో రాబోయే జబ్బులను అంచనా వేయడం, అంతేకాదు... జబ్బులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సూచించడం... ఇవీ ఇకిన్ కేర్ అందించే సేవలు. యూజర్లకు ఉచితంగా సేవలందిస్తోంది. డాటా స్టోర్ చేసుకోవడానికి లిమిట్ ఏమీ లేదు. ఎన్ని ప్రొఫైల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. వినడానికి మంచి ఐడియానే అయినా ఇందులో చాలా సవాళ్లు ఉన్నాయంటున్నారు కిరణ్.
"చికిత్స కన్నా నివారణ మేలంటారు. అయితే ఈ ప్రక్రియలో యూజర్లు భాగస్వామ్యం కావడమనేది రాత్రికి రాత్రి జరిగేది కాదు. ముందు వాళ్ల ప్రవర్తనలో మార్పురావాలి. మానసికంగా సిద్ధం కావాలి. అందుకే మెడికల్ రికార్డ్స్ ని సేకరించడం, భద్రపరచడం ఓ సవాల్" అంటారు కిరణ్.
ఇకిన్ కేర్ టీమ్
ఇకిన్ కేర్ లో అందరూ అనుభవజ్ఞులు, వివిధ రంగాల్లో మేధావులే. దినేష్ కోకా... ఐఐఎం గ్రాడ్యుయేట్. ఈ సంస్థకు కో-ఫౌండర్, సీఓఓ. జీఈ హెల్త్ కేర్ లో 12 ఏళ్ల అనుభవం ఉంది. శ్రీకాంత్ సముద్రాల...ఐఐటీ గ్రాడ్యుయేట్. ఈ సంస్థకు సీటీఓ. హెచ్ఎస్బీసీ, బార్ క్లేస్ కోసం ఎనిమిదేళ్లు వివిధ అఫ్లికేషన్స్ రూపొందించిన అనుభవం ఉంది. గణేష్ వూనా... ఐఐటీ గ్రాడ్యుయేట్. డాటా సైన్స్ వ్యవహారాలు చూసుకుంటారు. బిజినెస్ స్ట్రాటజీ, డాటా మోడలింగ్ లో నాలుగేళ్ల అనుభవం ఉంది. డాక్టర్ ఉన్ని క్రిష్ణన్, మెడికల్ అడ్వైజర్. వెల్ నెస్, ఇమేజింగ్, హెల్త్ కేర్ డివైజులు తయారు చేయడంలో 19 ఏళ్ల అనుభవం ఉంది. డాక్టర్ పూజా సింఘానియా... దీర్ఘకాలిక వ్యాధి నిర్వహణ కార్యక్రమాలు రూపొందించడంలో ఏడేళ్ల అనుభవం ఉంది.
ఇలా వీరి బృందంలో అందరూ అనుభవజ్ఞులే. అందుకే ఈ స్టార్టప్ ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. ప్రతీ త్రైమాసికానికి 150 శాతం వృద్ధి కనిపిస్తోంది. కొన్నేళ్ల మెడికల్ హిస్టరీకి సంబంధించిన ఐదు లక్షలకు పైగా డాటా పాయింట్స్ వీరి దగ్గర అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా పలు రోగాలు రాకముందే గుర్తించొచ్చని అంటున్నారు కిరణ్.
ప్రస్తుతం ఈ టీమ్ పార్థా డెంటల్, అపోలో వైట్ డెంటల్, వాసన్ ఐకేర్, మ్యాక్సీ విజన్, థైరో కేర్ లాంటి సంస్థలతో కలిసి పనిచేస్తోంది. భారతదేశంలోని రెండు వేలకు పైగా ప్రాంతాల్లో ఆన్ లైన్, ఆఫ్ లైన్ సేవలతో సత్తా చాటాలనుకుంటోందీ కంపెనీ. కొన్ని వారాల క్రితం వీరికి బిట్కెమీ వెంచర్స్, మహేశ్వరీ ఇన్వెస్ట్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి సంస్థలతో పాటు అన్షూ గౌర్, రామక్రిష్ణారెడ్డి, సందీప్ సీరపు లాంటి వాళ్ల నుంచి ప్రి-సిరీస్ ఏ ఫండింగ్ కింద నాలుగున్నర కోట్ల నిధులు వచ్చాయి. ఈ నిధుల్ని ఐపీ, ప్రొడక్ట్ డెవలప్ మెంట్ పటిష్టపర్చడం, మరికొందరు ప్రతిభావంతులను నియమించుకోవడం కోసం ఖర్చు చేస్తారు. పలు వ్యాల్యూ యాడెడ్ సర్వీసెస్ లతో రెవెన్యూ రాబట్టుకోవాలన్న ఐడియా ఉంది. ఇక వారి టెక్నాలజీపై పేటెంట్ పొందే దిశగా అడుగులు వేస్తున్నారు. దాంతో పాటు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్ మెంట్ కు సంబంధించిన ISO 27001 సర్టిఫికెట్ తీసుకోవాలనుకుంటున్నారు.
హెల్త్ టెక్ రంగం
ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ రిపోర్ట్ ప్రకారం భారతీయ హెల్త్ కేర్ మార్కెట్ విలువ 2020 నాటికి 22.9 శాతం వృద్ధితో 280 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ లెక్కల ప్రకారం 2000-2015 మధ్య ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ 3.21 బిలియన్ డాలర్లు. ఇక సబ్ సెగ్మెంట్ వాటా 65 శాతం ఉంది. 2015లో హెల్త్ కేర్ రంగంలో 57 డీల్స్ కుదిరాయి. 277 మిలియన్ డాలర్ల నిధులొచ్చాయి. ఈ ఏడాదిలోనే 1ఎంజీకి వందకోట్ల సీరీస్ బీ పెట్టుబడులు వచ్చాయి. సిక్వోయా మద్దతుతో ఇ-ఫార్మసీ స్టార్టప్ హెల్త్ రికార్డ్, మెడికల్ స్పేస్ లోకి దూసుకొస్తోంది. ఈ రంగంలో తాము కూడా సత్తా చాటుతామని ఇప్పటికే ప్రాక్టో ప్రకటించింది. ఇక ఈ రంగంలో లిబ్రేట్ తో సహా మరిన్ని బడా సంస్థలున్నాయి.