డేరింగ్, డ్యాషింగ్ జనాలను కట్టిపడేసే 'డెవిల్స్ సర్క్యూట్'
చీకటి గుహల్లో పాకడం, బురద గుంటలు దాటేందుకు ప్రయాసపడటం, కర్రలపై బ్యాలెన్స్ చేసుకోవడం, తాళ్లతో పైకి ఎక్కడం, ముళ్లున్న వైరు కింద నుంచి పాకడం… ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా ? భాగ్ మిల్కా భాగ్, మేరీ కోమ్ సినిమాలు చూసినట్లుందా ? ఈ సినిమాల్లోని ప్రధాన పాత్రలు తమ జీవితాల్లో ఈ కఠిన పరిస్థితులన్నీ ఎదుర్కొంటారు కదా…అది చూసినప్పుడు మన ఒళ్లు జలదరించి ఉంటుంది. సరిగ్గా ఇటువంటివే డెవిల్స్ సర్క్యూట్, డెవిల్స్ సర్క్యూట్ స్విఫ్ట్ చాలెంజ్‌లతో తమ పార్టిసిపెంట్స్‌కి సవాల్ విసురుతోంది వొలానో.
పట్నీ, ఐగేట్ వంటి కంపెనీల్లో 20 ఏళ్లకి పైగా టెకీగా పనిచేసిన అనుభవం అద్నాన్ అదీబ్ది. అంతే కాదు దుబాయ్‌లో 2,50,000 అమెరికన్ డాలర్ల ఉద్యోగాన్ని వదులుకుని మరీ ఇండియాలో సొంత వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఆయన నిర్ణయాన్ని చాలా మంది ప్రశ్నించారు. మరికొంత మంది విమర్శించారు. కానీ ఆయన మాత్రం జంకలేదు. ఒక ఆంట్రప్రెన్యూర్‌గా తన కొత్త బాధ్యతపై ఆయనకు పూర్తి స్పష్టత ఉంది.
సహజంగానే స్పోర్ట్స్ అంటే ఇష్టపడే అద్నాన్, 2012 ఏప్రిల్‌లో ఢిల్లీలో ఒక రూఫ్ టాప్ హౌస్‌లో స్పోర్ట్స్ కంపెనీ ప్రారంభించారు. భార్య జెబా జైదీతో కలసి, దేశంలోని అమెచ్యూర్ స్పోర్ట్స్‌కి ప్రచారం కల్పించే కంపెనీని ఏర్పాటు చేసారు. మిగతా స్పోర్ట్స్ కంపెనీల్లా కాకుండా.. వినూత్నమైన స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్తో కూడిన ప్రాపర్టీస్‌ని డిజైన్ చేసి అందిస్తోంది. డెవిల్స్ సర్క్యూట్, డెవిల్స్ సర్క్యూట్ స్విఫ్ట్ చాలెంజ్ వంటి ఈవెంట్స్ ద్వారా వీళ్లు రకరకాల అమెచ్యూర్ స్పోర్ట్స్ ని ప్రచారం చేస్తున్నారు. చివరకు టఫెస్ట్ మ్యాన్, టఫెస్ట్ విమెన్‌గా ఇద్దరిని సెలక్ట్ చేస్తారు.
“ భారతదేశంలోనే మరే ఇతర స్పోర్ట్స్ కంపెనీ ప్రయత్నించనటువంటి ప్రత్యేకమైన ఆలోచన ఇది. చాలామంది సంప్రదాయక క్రీడలైన క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్‌ల క్రీడా నిర్వహణ కార్యక్రమాల్లో మాత్రమే నిమగ్నమై ఉంటారు. ఇతరుల కంటే భిన్నంగా ఉండడం మా ప్రత్యేకతం ” - అద్నాన్.
కంపెనీ ముందుగా గేమ్ ఆన్ ఇండియా ప్రాపర్టీతో మొదలైంది, ఇది సంప్రదాయ క్రీడలకి పూర్తి పరిష్కారం చూపించే ఒక వేదిక. స్థలం చూడటం దగ్గర నుంచి, కావల్సిన పరికరాలు సమకూర్చడం, లైక్‌మైండెడ్ వాళ్లను కనిపెట్టడం వరకూ వీళ్లదే బాధ్యత. క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, టెన్నిస్, అథ్లెటిక్స్.. ఇలా ప్రతీదీ ఆర్గనైజ్ చేస్తుంది వొలానో. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వేదిక చాలా విస్తృతమైంది. అన్ని క్రీడల సమాచారాన్ని అందించే ఒక మొబైల్ యాప్ కూడా త్వరలో ప్రారంభించబోతున్నారు.
2012 చివర్లో, వొలానో తన రెండో ప్రాపర్టీ… డెవిల్స్ సర్క్యూట్ మొదలుపెట్టింది. 15 నుంచి 20 రకాల మిలటరీ స్టైల్ అడ్డంకులతో సాగే ఐదు కిలోమీటర్ల పొడవైన రేస్ ట్రాక్ ఇది. ఇందులో పాల్గొనేవాళ్లు కాంపిటిటివ్ మరియు నాన్ కాంపిటిటివ్ విభాగాల నుంచి ఎంచుకోవచ్చు. ఇప్పటివరకూ ఈ కంపెనీ మొత్తం 10,000 కంటే ఎక్కువ మందికి ఇందులో పాల్గొనే అవకాశం కల్పించింది. రాబోయే మూడు సంవత్సరాల్లో భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో 34 కంటే ఎక్కువ ఈవెంట్లు నిర్వహించడానికి సిద్ధంగా ఉంది.
2015 లో, కంపెనీ విస్తరణ ప్రణాళిక… డెవిల్స్ సర్క్యూట్ స్విఫ్ట్ చాలెంజ్‌తో కొనసాగుతోంది. భారతీయ కార్పొరేట్ ప్రొఫెషనల్స్‌కి ఉండే అత్యుత్తమ సామర్ధ్యాలను చూపించే స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ ఆధారిత ప్రోగ్రాం ఇది. ఇదొక కార్పొరేట్ టీమ్ సవాలు, ఇందులో పాల్గొనే కంపెనీలకు ప్రతినిధులుగా ఉంటాయి టీమ్స్. వారి శారీరక, మానసిక సామర్ధ్యాలను పరీక్షిస్తారు. ఈ సంవత్సరం…ఈ చాలెంజ్ లో, ఐదు నగరాల్లోని 50 కార్పొరేట్ల నుండి సుమారు 1,000 కంటే ఎక్కువ మంది పాల్గొన్నారు. ఈవై, కెపిఎంజి, డాక్టర్ రెడ్డీస్, అపోలో హెల్త్ కేర్, ఐబిఎమ్, విప్రో మరియు సోనీలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నాయి.
వ్యాపార అభివృద్ధి
ఒక మేడ మీద మొదలైన వొలానో ఇప్పుడు ఢిల్లీలోని గ్రీన్ పార్క్ ఏరియాలోని ఆఫీస్‌కి మారింది. “ మేం సాధించిన అభివృద్ధికి సంతోషంగా ఉన్నాం. ఇద్దరితో ఈ కంపెనీ ప్రారంభమైంది. ఇవాళ, మేము 20 సభ్యుల టీంగా ఉన్నాం. మరో 40 మందిని కూడా తీసుకోవాలనుకుంటున్నాం. నెమ్మదిగా మా ప్రయత్నాలన్నీ సఫలం కావడం చాలా సంతృప్తికరంగా అనిపిస్తోంది ”, అంటున్నారు అద్నాన్.
సబ్స్క్రిప్షన్, స్పానర్షిప్ అనే రెండు పద్ధతుల ద్వారా వొలానోకి ఆదాయం సమకూరుతోంది. పార్టిసిపెంట్స్ నుంచి రూ.1500 నుంచి రూ.3,000 వరకూ తీసుకుంటున్నారు. స్పానర్షిప్స్ ద్వారా కూడా ఆదాయాన్ని అందుకుంటున్నారు. ఈ సంవత్సరం.. మారుతి సుజుకితో కొన్ని మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది వొలానో. ఇందులో భాగంగా, రాబోయే రెండేళ్ల వరకూ డెవిల్స్ సర్క్యూట్ రేస్‌కి సుజుకి స్విఫ్ట్, టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. రీబాక్, రెడ్ బుల్ తో కూడా వీళ్లకి భాగస్వామ్య ఒప్పందాలున్నాయి.
భవిష్యత్తులో ఎదుగుదల
న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వారి వెల్నెస్ విభాగం నుంచి వొలానోకి బ్రిడ్స్ ఫండ్ లభించింది. త్వరలో సిరీస్ ఎ ఫండింగ్‌లో భాగంగా రూ.40 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో వీళ్లు పనిచేస్తున్నారు. అయితే సిరీస్ ఎ కోసం వెళ్లే ముందు మరొక బ్రిడ్జ్ రౌండ్ ఫండింగ్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
“గత రెండేళ్లలో, కంపెనీ 100% ఎదుగుదల చూపించింది. ఈ సంవత్సరం, మేము దాన్ని 10 రెట్లు పెంచాము. మరింత ఆసక్తికరమైన ఆలోచనలతో కొత్త ప్రాపర్టీస్ ని కూడా ప్రారంభించే ఉద్దేశ్యంలో ఉన్నాం. వచ్చే నాలుగేళ్లలో, 500 కోట్లకి అవకాశమున్న స్పోర్ట్స్ వ్యాపారంలో , మేము 100 కోట్ల టర్నోవర్ సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం”, అంటూ ముగించారు అద్నాన్.