నెట్ న్యూట్రాలిటీ ఉద్యమంలో 22 ఏళ్ల కుర్రాడు

నెట్ న్యూట్రాలిటీ ఉద్యమంలో 22 ఏళ్ల కుర్రాడు

Thursday July 09, 2015,

5 min Read

నెట్ న్యూట్రాలిటీకి మద్దతుగా టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ట్రాయ్) ఈ-మెయిల్స్ పంపిన 10 లక్షల మందిలో మీరూ ఒకరైతే కార్తీక్ బాలకృష్ణన్‌కు కృతజ్ఞతలు చెప్పాల్సిందే. వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫైనలియర్ విద్యార్థి అయిన ఈ 22 ఏళ్ల కుర్రాడు.. చూడ్డానికి సాధారణ హ్యాకర్‌లా కనపడ్డా ‘సేవ్ ద ఇంటర్నెట్’ ఉద్యమాన్ని నడిపిన ముగ్గురిలో ఒకరిగా నిలవడమే ఆయన ప్రత్యేకత.

image


సాధారణ విద్యార్థి.. బెంగళూరులోని ఫ్రాంక్ ఆంటోని పబ్లిక్ స్కూల్‌లో కార్తీక్ చదువు సాగింది. చదువులో ఆయన సగటు విద్యార్థే కాదు అల్లరి పిల్లాడు కూడా. సమస్యలు కొనితెచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఇంట్లో ఏదో ప్రయోగం చేయబోతే పడకకు మంటలు అంటుకోవడం, ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టు బయటికి రావడం మనవాడి వంతైంది. కార్తీక్ తండ్రి విప్రోలో దాదాపు మూడు దశాబ్దాలపాటు ఉద్యోగం చేసి రెండేళ్ల క్రితమే పదవీ విరమణ చేశారు. కార్తీక్ తల్లి సాఫ్ట్‌వేర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కంపెనీ యాక్సెండ్ ఆటోమేషన్ అండ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ నిర్వహిస్తున్నారు. కార్తీక్ తల్లిదండ్రులు ఇద్దరిదీ బాగా కష్టపడేతత్వం. అందుకే చిన్న చిన్న సమస్యలపై ఫిర్యాదుకు ఈ కుర్రాడు దూరంగా ఉండేవాడు. చిన్ననాటి నుంచే కంప్యూటర్ వినియోగం అలవాటున్నా వాటిపట్ల అంత ఆసక్తి కనబర్చలేదు. 12వ తరగతి పూర్తి అయ్యాక డిజైనింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఈ రెండింటిలో దేనిని ఎంచుకోవాలో అర్థం కాలేదు. డిజైనింగ్ తీసుకుని కెరీర్‌ను ఎలా మలుచుకోవాలో తెలియక చివరకు కంప్యూటర్ సైన్స్‌ను ఎంచుకున్నాడు. సవాల్‌గా ఉన్న కోడింగ్ పట్ల తనకు అమితాసక్తి అని కార్తీక్ అంటున్నారు. టాప్ 1 శాతం కోడర్లకు, మిగిలిన 99 శాతం మందికి పెద్దగా తేడా లేదు. వారు చూసే దృష్టి కోణమే పెద్ద అంతరాన్ని సృష్టిస్తుంది. ఒక విభాగం నుంచి మరో విభాగానికి మారడానికి మేధావి కానక్కర లేదు. సరైన నిర్ణయం చాలు అని అంటారు కార్తీక్. యువ కోడర్లు కొత్త విభాగాల్లోకి ప్రవేశించేలా వర్క్‌షాప్స్, సెషన్లు, ఇతర వేదికల ద్వారా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సొంతంగా యాప్..కళాశాలలో రెండో సంవత్సరంలో రూమ్మేట్‌తో కలిసి ఒక యాప్‌ను అభివృద్ధి చేశాడు కార్తీక్. విద్యార్థులు రోజువారీ అటెండెన్స్‌ను ఈ యాప్‌లో చూసుకోవచ్చు. 18 వేలకుపై చిలుకు వీఐటీ విద్యార్థులు ఇప్పుడీ యాప్‌ను వినియోగిస్తున్నారు. అటు కళాశాల సైతం దీనిని అధికారిక యాప్‌గా మలచాలని భావిస్తోంది. ‘మొబైల్ ఫోన్‌లో వెబ్‌సైట్ ఇంటర్ఫేస్ సాధారణంగా భయానక అనుభవం. అన్ని సబ్జెక్టుల్లో 75 శాతం అటెండెన్స్ ఉన్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే విద్యార్థులకు ఇన్‌స్టంట్ యాక్సెస్ ఉండాలి. ఈ విషయంలో కళాశాల నుంచి అనుమతి లభించడంలో విఫలం అవడంతో క్యాంపస్‌లోని ఇంక్యుబేటర్‌లో ఉన్న ఒక స్టార్టప్‌ను సంప్రదించాం. వారి కార్యాలయంలో వారంలో రెండు రోజులు వారితో కలిసి పనిచేశాం’ అని కార్తీక్ తెలిపారు. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై యాప్‌ను అభివృద్ధి చేయడం కూడా ఆయనకు ఇదే తొలిసారి. యాప్ రూపకల్పన ద్వారా సాంకేతిక విజ్ఞానం లభించడంతోపాటు ఆయనలో స్థైర్యాన్ని నింపింది కూడా. గూగుల్ క్లౌడ్ డెవలపర్ చాలెంజ్ 2013లో ఈ ప్రాజెక్టు టాప్-3లో చోటు దక్కించుకుంది.
స్నేహితులతో కార్తీక్ బాలకృష్ణన్

స్నేహితులతో కార్తీక్ బాలకృష్ణన్

ఆండ్రాయిడ్ ఇంటెర్న్‌గా 2014 డిసెంబరులో హాస్‌గీక్‌లో కార్తీక్ చేరారు. ఆండ్రాయిడ్ అప్లికేషన్ల అభివృద్ధితోపాటు బ్యాక్ ఎండ్ కార్యకలాపాలు నిర్వహించడం ఆయన విధి. ఇక్కడే కీలక మలుపు తిరిగింది. కార్తీక్ బాస్ అయిన కిరణ్ జొన్నలగడ్డకు నిఖిల్ పాహ్వా నుంచి పిలుపు అందింది. నిఖిల్‌ను నెట్ న్యూట్రాలిటీ ఉద్యమానికి ఆద్యుడిగా చెప్పవచ్చు. సేవ్ ద ఇంటర్నెట్ ఉద్యమంతో నాకు తెలిసిన ఏకైక వ్యక్తి కిరణ్ అని కార్తీక్ అంటారు. ఓవర్ ద టాప్(ఓటీటీ) సేవలపై కన్సల్టేషన్ పేపర్‌ను మార్చి 27న ట్రాయ్ వెబ్‌సైట్లో ఉంచింది. ట్రాయ్ పేపర్‌కు సమాధానంగా ఈమెయిల్స్ పంపేలా నెటిజన్లను సమాయత్తం చేయాల్సిందిగా కిరణ్‌ను నిఖిల్ పురమాయించారు. సొంత ఈమెయిల్స్ ద్వారా సమాధానాలను పంపేలా ప్రజలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ పని చేయగలవా అని కిరణ్ అడిగారు’ అని కార్తీక్ తెలిపాడు. ఇంకేముంది అడిగిందే తడవుగా రంగంలోకి దిగాడు కార్తీక్. 14 రోజుల్లో 10,000 ఈమెయిల్స్ ట్రాయ్‌కి పంపగలమని కార్తీక్‌తోపాటు అందరూ భావించారు. వెబ్‌సైట్‌ను రూపొందించే పనిలో కార్తీక్ నిమగ్నమయ్యారు. సాంకేతిక సమస్యలు రాకుండా చాలా ఉపకరణాల్లో, ఓఎస్, బ్రౌజర్లపై పరీక్షించారు. కొన్ని రోజుల్లోనే వెబ్‌సైట్ రెడీ అయింది. అయితే ఏప్రిల్ 11న వెబ్‌ను ఆవిష్కరించారు.
కన్సల్టేషన్ పేపర్‌కు పంపే అభిప్రాయాలపై న్యాయవాదులతో కలిసి పనిచేశాం. ఆధారాలతో వాదించేందుకు వీలుగా అత్యుత్తమ సమాచారాన్ని రూపొందించాం. ఉద్యమానికి ముందస్తు మద్దతు కోసం తన్మయ్ భట్, ఏఐబీ బృందంతో నిఖిల్ చర్చించారు. పూర్తి ప్రణాళికతో రంగంలోకి దిగాం అని కార్తీక్ వివరించారు. ఏఐబీతోపాటు రెడిట్ ఇండియా, మొజిల్లా ఇండియా కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపాయి.ఉద్యమ విశేషాలివీ..సేవ్ ద ఇంటర్నెట్ ఉద్యమానికి ముందు ప్రపంచంలో ఏ ఒక్కరూ ఈ స్థాయిలో చొరవ తీసుకోలేదని అంటారు కార్తీక్. ప్రజల తరఫున ఒక సంస్థ లేదా వ్యక్తులు అభిప్రాయాలను పంపడం సహజం, ఉద్యమంలో పాల్గొన్న వారు (ఈమెయిల్స్ పంపేవారు) ఏ స్థాయిలో శ్రమకోర్చారో అధికారులకు తెలిసేలా వ్యవహరించామని చెప్పారాయన. కార్తీక్ చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అవి ఏమంటే..
1. ట్రాయ్‌కి 10,000 ఈ-మెయిల్స్ చేరాలన్నది ఉద్యమం ముందస్తు లక్ష్యం. ఈ లక్ష్యాన్ని వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చిన ఆరు గంటల్లోనే చేరుకున్నాం. 10 లక్షల ఈ-మెయిల్స్‌కు చేరుకోవాలని రెండో రోజు లక్ష్యించాం. ఆ రోజు లక్షకుపైగా మెయిల్స్ వచ్చి చేరాయి.2. జీరో బడ్జెట్‌పైనే మొత్తం ఉద్యమం సాగింది. సేవ్‌ ద ఇంటర్నెట్.ఇన్ డొమెయిన్‌ను అప్పుగా తీసుకున్నాం. హీరోకు ఉచిత సర్వర్లను వెబ్‌సైట్‌కు వినియోగించాం. గిట్‌హబ్ సహకారం అందించింది. అంతర్గత సమాచారం కోసం స్లాక్ తోడ్పడింది.3. ప్రజలు పంపిన ఈమెయిల్స్‌ను ట్రాక్ చేసేందుకు 62 ఈమెయిల్ ఐడీలకు రూపకల్పన చేశారు.4. ప్రాజెక్టు విశేషాలను గిట్‌హబ్‌లో పొందుపరిచారు. డెవలపర్లను ఆకర్షించడమేకాదు సలహాలను సైతం పొందింది. డెవలపర్లు ఇచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని వెంటనే వెబ్‌సైట్లో చేర్చారు.
క్లిష్టమైన సమస్యలు కూడా చిన్నపాటి పరిష్కారంతో ఇట్టే తొలగిపోతాయని అంటారు కార్తీక్. ఈమెయిల్స్ సంఖ్య విషయంలో ట్రాయ్ పొరపడకుండా ఈమెయిల్ ఐడీలను రూపొందాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. తొలుత ఒక ఈ మెయిల్ ఐడీ రూపొందించాం. వేలాది ఈమెయిల్స్ రావడంతో గూగుల్ దానిని స్పామ్‌గా పరిగణించింది. దీంతో మరిన్ని ఐడీలను క్రియేట్ చేశాం అని కార్తీక్ చెప్పారు. సాంకేతిక సమస్య ఏది తలెత్తినా దగ్గరుండి కార్తీక్ సరిచేసేవారు. తొలి మూడు రోజులు నిద్రలేని రాత్రులు గడిపారాయన. స్క్రోల్‌బ్యాక్‌కు చెందిన అరవింద్ రవి మరియు మితేష్ అషర్‌ల పాత్ర కూడా ఉద్యమంలో మరవలేనిదని కార్తీక్ చెబుతున్నారు. నూరు రెట్ల స్పందన..ముందు నిర్దేశించికున్న లక్ష్యం కంటే 105 రెట్ల స్పందన లభించిందని కార్తీక్ అంటున్నారు. ‘దీని ప్రభావం ఈ స్థాయిలో ఉంటుందని మేము ఊహించలేదు. మరోవైపు ఎయిటెల్ జీరో నుంచి తప్పుకోవాలంటూ ఫ్లిప్‌కార్ట్, క్లియర్‌ట్రిప్ తదితర కంపెనీలపై సోషల్ మీడియాలో ప్రజల ఒత్తిడి. ఏదైతేనేం నెట్ న్యూట్రాలిటీపై చర్చలో టీవీ చానెళ్లలో ప్రత్యక్షమయ్యాం. 60 గంటల్లోనే మార్క్ జుకర్‌బర్గ్ స్పందించారు’ అని కార్తీక్ వివరించారు. బెంగళూరులో సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ నిర్వహించిన చర్చలో కార్తీక్‌తోపాటు ప్రనేష్ ప్రకాశ్, రోహిణ్ ధర్మకుమార్, కిరణ్ జొన్నలగడ్డ పాల్గొన్నారు.
ఉద్యమంలో మేము సైతం..కొన్ని సందర్భాల్లో భారీ సాంకేతిక పరిష్కారం కూడా ఉత్తమ పరిష్కారం కాకపోవచ్చని అంటారు కార్తీక్. ఇలాంటి సందర్భాల్లో మౌలిక వసతుల కల్పనకు సమయం ఉండదు. ఉన్న వనరులనే మెరుగుపర్చుకోవచ్చు. నూతన వ్యవస్థను రూపొందించే బదులు గూగుల్ డాక్స్, స్లాక్, గిట్‌హబ్‌తోపాటు ఎన్నో టూల్స్‌ను వినియోగించడం తెలివైన నిర్ణయమని అంటారు కార్తీక్. ఎటువంటి ఖర్చు లేకుండా ఇంత భారీ స్థాయిలో ఉద్యమాన్ని నడిపించడం సాధారణ విషయం కాదు. అయితే అందుకు అధిక సమయమే పట్టిందని చెబుతున్నారాయన. ఉద్యమ భాగస్వామ్యంలో ఇంటర్నెట్, సోషల్ మీడియాల శక్తి ఆశ్చర్యానికి లోను చేసిందని అన్నారు. మేము సైతం అంటూ చిన్న పిల్లల నుంచి ప్రొఫెసర్ల వరకు ఉద్యమానికి మద్దతుగా తమ సమయం, వనరులను ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం.
 నేను సాధారణ విద్యార్థినే..ప్రోగ్రామింగ్ జటిలమన్న భావన ఇంజనీరింగ్ విద్యార్థుల్లో తొలగిపోవాలన్నది కార్తీక్ విశ్వాసం. టాప్ 1 శాతం కోడర్ల సరసన చేరడం పెద్ద కష్టమేమీ కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ‘నాకు గొప్ప బ్యాక్‌గ్రౌండ్‌గానీ, గొప్ప మెంటార్‌గానీ లేరు. అందరిలాగే సాధారణ విద్యార్థిని. కళాశాలలో కంప్యూటర్ సైన్స్ తొలి పరీక్షలో ఫెయిల్ అయ్యాను కూడా. భిన్నత్వానికి కారణమేమంటే నాలాంటి మనస్తత్వంగల విద్యార్థులను గుర్తించాను. వారు చర్చలను సులభతరం చేయడమేకాదు, ఇతర విషయాలను ట్రాక్ చేసేందుకూ నాకు వారి సహాయం ఉంది’ అని కార్తీక్ అంటారు. నిజాయితీ ఆవశ్యకతను తండ్రి నుంచి నేర్చుకున్నారు. తన జీవితంలోనూ తండ్రిని అనుకరిస్తున్నారు. ఏదైనా హామీ ఇస్తే దానిని నిలబెట్టుకుంటున్నారు. 22 ఏళ్ల ఈ కుర్రాడి దగ్గర చాలా మందిలాగే జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకదు. ప్రస్తుత ఇంటర్న్‌షిప్ పూర్తి అయ్యాక కెరీర్ ఎటు మలుపుతిప్పుతుందో కూడా ఆయనకు తెలియదు. ఏడాది తర్వాత మాస్టర్ చేసేందుకు వెళ్లాలని ఆయన ఆలోచన. తిరిగి వచ్చి ప్రయోగాలకు ప్రోత్సాహాన్నిచ్చే స్వేచ్ఛా వాతావరణంలో ఉండాలన్నది ఆయన భావన. బోధకుడిగానా, విద్యార్థిగా కొనసాగుతారా అన్నది ఇప్పటికి అస్పష్టం. అయితే ప్రయత్నం మాత్రం ఆగదని అంటున్నారు. తనకు ఉన్న అత్తెసరు గ్రేడ్స్ తోడ్పాటు అందిస్తాయా లేదా అన్నది భవిష్యత్తులో తేలుతుందని అంటారు.
తల్లితో కార్తీక్ బాలకృష్ణన్

తల్లితో కార్తీక్ బాలకృష్ణన్

తనను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారో ఇప్పటికీ తనకు అవగతం కావడం లేదని యువర్ స్టోరీ.కామ్‌తో మూడు గంటల పాటు సాగిన చర్చలో ఆయన చివరగా అన్న మాటలు.