ఖరీదైన డయాలసిస్‌ను కారుచౌక చేసి చూపించిన తెలుగు కుర్రాళ్ల ఆలోచనే 'నెఫ్రోప్లస్'
హార్ట్, కిడ్నీ ఫెయిల్యూర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఇండియా..డయాలసిస్ చాలా ఖరీదైన వ్యవహారం..జేబులోంచి ఖర్చు పెట్టాలంటే సామాన్యుడికి అసంభవం..తక్కువ ఖర్చుకే డయాలసిస్ సేవలు అందిస్తున్న ‘నెఫ్రోప్లస్’.హైద్రాబాద్ నుంచే ప్రయాణం ప్రారంభించిన విక్రం ఉప్పల..
ప్రభుత్వాలు అందించే సబ్సిడీ స్కీముల్లోనో, బీమా కంపెనీల కవరేజ్‌తోనే కాకుండా... డయాలసిస్ చేయించడమంటే... గుండె అప్పుడే ఆగిపోయినంత పని అవుతుంది సామాన్యుడికి. అత్యంత అవసరమైన ఈ ట్రీట్మెంట్... కేవలం ఖరీదు కారణంగానే కామన్‌మేన్‌కి పెనుభారమవుతోంది. మన దేశంలో 950మంది నెఫ్రాలజిస్టులు, 7వేల డయాలసిస్ సెంటర్లు, 4 వేల డయాలసిస్ మెషీన్లు ఉన్నాయని ముంబై కిడ్నీ ఫౌండేషన్ తన స్టడీలో వెల్లడించింది. ఈ రీసెర్చ్ జరిగి ఇప్పటికి ఆరేళ్లు పూర్తయిపోయింది. దీర్ఘకాల కిడ్నీ వ్యాధులతో బాధపడ్తున్న 2.3 లక్షల మందిలో 90శాతం మంది నెలల వ్యవధిలోనే మరణిస్తున్నారని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2009లోనే వెల్లడించింది.
కమల్ షా, సందీప్ గుడిబంద, విక్రం ఉప్పల సహవ్యవస్థాపకులుగా... 2009లో నెఫ్రోప్లస్‌ను ప్రారంభించారు. హైద్రాబాద్‌లో ఏర్పాటైన ఈ సంస్థ హై క్వాలిటీ డయాలసిస్ నెట్వర్క్‌ను నిర్వహిస్తోంది.
“1999లో ఐఐటీ, ఖరగ్‌పూర్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నేను... పదేళ్లపాటు అమెరికాలో ఉన్నాను. చివర్లో కొన్ని సంవత్సరాలపాటు న్యూజెర్సీలో మెకెన్సీకి స్ట్రాటజీ కన్సల్టెంట్‌గా విధులు నిర్వహించాను. భారత్‌కు తిరిగి వచ్చి, హెల్త్‌కేర్ వెంచర్‌ను ప్రారంభిస్తానని నాకు అప్పుడే తెలుసు”అని చెప్పారు విక్రం.
మన దేశంలో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడం, ఈ భారం ప్రజలపైనా, తద్వారా వ్యవస్థపైనా పడుతోందని గ్రహించారు విక్రం. అందుకే ఈ రంగంలోనే తాను వెంచర్ ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం మన దేశంలో ఆరున్నర కోట్ల మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉండగా... 14కోట్ల మంది బీపీ వ్యాధిగ్రస్తులున్నారు. ఈ రంగంపై పరిశోధన చేస్తున్న సమయంలో విక్రంకు కమల్ షా పరిచయమయ్యారు. యాపిల్ సంస్థలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పని చేస్తున్న కమల్... ఒక కెమికల్ ఇంజినీర్ కావడం విశేషం. హెమొలైటిక్ యురెమిక్ సిండ్రోమ్‌తో బాధపడ్డ కమల్.. 1997నుంచి 12 ఏళ్లపాటు డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇది ప్రారంభిచినప్పటి నుంచీ డయాలసిస్ సెషన్స్ అనుభవాలను ఒక బ్లాగ్ ద్వారా పంచుకుంటున్నారు కమల్ షా.
“నేను అమెరికాలో ఉన్నపుడు... కమల్‌తో చాలాసార్లు ఫోన్‌లో సంభాషించాను. ఆయనది స్ఫూర్తిని కలిగించే ఒక జీవితం. ఇప్పటికి 18 ఏళ్లుగా ఆయన డయాలసిస్ తీసుకుంటున్నారు. ప్రతీ రోజు ఉదయాన్నే లేవడం, స్విమ్ చేయడం, ప్రతీ నెలా ప్రయాణాలు, ఫుల్‌టైం జాబ్... ఇదీ ఆయన లైఫ్‌స్టైల్”
ఖరీదైన చికిత్సలు చేయించుకోలేని వారి కోసం.. ఇలాంటి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని భావించారు విక్రం, కమల్, సందీప్‌లు. కేన్సర్ పేషెంట్ల కోసం పనిచేసే పల్లియేటివ్ కేర్ అనే స్వచ్ఛంద సంస్థ కోసం పని చేస్తున్న ఇంజినీర్ ఈ సందీప్. వీరు ముగ్గురు కలిసి నెఫ్రోప్లస్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
“మా కార్యకలాపాలను హైద్రాబాద్‌లోనే ప్రారంభించడానికి కారణం... స్వరాష్ట్రంతోనే మొదలుపెట్టాలనే ఆలోచనే. ఇక్కడే రెండో సెంటర్‌ను ప్రారంభించాక... అనేక సెంటర్లను నిర్వహించడం ఎలాగో అర్ధమైంది. ఆ తర్వాత ఒకదాని వెంట మరొకటి చొప్పున... డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పలు హాస్పిటల్స్, నెఫ్రాలజిస్ట్‌లతో భాగస్వామ్యం కారణంగా... మానిటరింగ్, స్టాఫ్, ఇన్వెంటరీ వంటి విషయాల్లో నిర్వహణ పరమైన సమస్యలు తలెత్తాయి. అప్పుడే ప్రారంభించిన సంస్థ కావడం కూడా ఇందుకు కారణమే. ఆ తర్వాత బెంగళూర్, చెన్నై, పూనే, నోయిడా, రోహ్‌తక్, బొకారో, నల్గొండ, కాన్పూర్‌లతో సహా... 14 రాష్ట్రాల్లో 34 నగరాల్లో సేవలందించే స్థాయికి చేరుకున్నాం”అని చెప్పారు విక్రం.
“సంస్కృతి, సామాజికం కంటే... పేషెంట్లకు నాణ్యమైన సేవలు అందించడంపైనే దృష్టి పెట్టాం. ఈ అంశంపై మాకు ముందునుంచీ ప్యాషన్, విజన్ ఉండడంతో... ఎదురైన సమస్యలన్నిటికీ పరిష్కారాలను కనుగొన్నాం. అయితే హైద్రాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ.. ఉత్తర్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో సేవలు అందించడం అంత సులభం కాదు. నిజానికి యూపీ అంటే అదో ప్రత్యేకమైన దేశంలా ఉంటుంది అక్కడి సంస్కృతి. అయితే.. ఇప్పుడు ఆ రాష్ట్రంలో మాకు 5 సెంటర్లు ఉన్నాయ”ని తెలిపారు విక్రం.
చిన్న పట్టణాలు, సిటీలు, టౌన్లతో పోల్చితే.. మెట్రోపాలిటన్ నగరాల్లో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు సులభం అంటారు విక్రం ఉప్పల. “ఉత్తర్ ప్రదేశ్‌లో ఆగ్రాలాంటి పట్టణాలను తీసుకుంటే... అనేక క్లిష్టమైన సమస్యలు ఎదురవుతాయి. వస్తువుల సరఫరాపై అక్కడ ఉండే ప్రత్యేక ట్యాక్సింగ్ విధాన చిక్కులు తెచ్చిపెడుతుంది. అలాగే క్లినికల్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో నైపుణ్యమున్న ఉద్యోగులను రిక్రూట్ చేయడం... చిన్న పట్టణాల్లో కష్టమైన విషయం. చాలామంది ఇలాంటి ప్రాంతాల్లో పని చేసేందుకు ఇష్టపడరు. దీంతో ఉద్యోగులను తీసుకోవడం, వారిని నిలబెట్టుకోవడం కూడా కష్టమమే. మేం ఇప్పటికీ ఈ సమస్యన ఎదుర్కుంటూనే ఉన్నాం. ఆయా ప్రాంతాలకు చెందినవారినే ఎంపిక చేయడమే దీనికి పరిష్కారం. వీరు మాత్రమే... ఇలాంటి పట్టణాల్లో పని చేసేందుకు అంగీకరిస్తారు. వీరిని వెతికి పట్టుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. నిజానికి నేను అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిందికూడా అందుకే కదా”అన్నారు విక్రం.
ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే... ఇలాంటి ఏరియాల్లో పనిచేసేవారికి అధిక మొత్తంలో జీతాలు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి చిన్న టౌన్లలో డయాలసిస్ సెంటర్ల నిర్వహణ కష్టమైన పనే.
మెడికల్ రంగం కోణం లోంచి చూస్తే... మనకు కనపించే వాస్తవాలు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తాయి. అవసరమైన టెక్నాలజీని జపాన్, జర్మనీ వంటి దేశాల నుంచి తెచ్చుకోవాలి. అదే సమయంలో అవసరమైన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అంతా స్వయంగా ఏర్పాటు చేసుకోవాలి. తయారీదారులు లైసెన్సులకు సంబంధించిన వ్యవహారాలను నిర్వహించుకోవడమే కాకుండా... ఈ మెషీన్లతో రేడియేషన్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. ఇప్పటికి నిబంధనలు అంత కఠినంగా లేకపోయినా... ఈ యంత్రాలు చాలా ఖరీదైనవి కావడంతో అప్రమత్తత చాలా అవసరం. ఒక్కో మెషీన్ ఖరీదు కనీసం ₹7 లక్షలకు పైగానే పలుకుతోంది. ”అన్నారు విక్రం ఉప్పల.
కనీస ధరలకే ఆరోగ్య సేవలు అందించడమే నెఫ్రోప్లస్ ప్రధాన లక్ష్యం అయినా... తాము సేవలు అందిస్తున్న రేట్లు కూడా సామాన్యుడి స్థాయికి మించినవే అంటోంది ఈ సంస్థ. ఈ ధరలను మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని చెబ్తున్నారు వ్యవస్థాపకులు. దేశంలో అతి పెద్ద డయాలసిస్ నెట్వర్క్ కావడంతోనే... ఇతరులతో పోల్చితే తక్కువ ధరలకు అందించగలగుతున్నామని చెబ్తున్నారు.
“అతి పెద్ద నెట్వర్క్ కావడంతో మాకు కొన్ని సానుకూలతలు ఉన్నాయి. మంచి ప్రోడక్ట్ ఎంచుకోవడం, సరిగా నిర్వహించగలగడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తులకు ఎక్కువ మొత్తమైనా చెల్లించగలం. చిన్న సెంటర్లకు ఈ అవకాశం లేకపోవడంతో... ఇలా డీల్ చేయగలగడం సాధ్యమైన విషయం కాదు” అన్నారు విక్రం.
వీలైనంత ఎక్కువమంది పేషెంట్లకు నాణ్యమైన డయాలసిస్ కేర్ సర్వీసులు అందించేందుకు పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకుంటోంది నెఫ్రోప్లస్. “మేం ప్రభుత్వంతో కలిసి పని చేయడాన్ని కొనసాగిస్తున్నాం. వాస్తవానికి ఈ ప్రాసెస్ చాలా మెల్లగా ఉంది. దీంతో ప్రైవేట్ భాగస్వాములను ఏర్పాటు చేసుకోబోతున్నాం. డయాలసిస్ చాలా ఖరీదైన వ్యవహారం. సొంత డబ్బులతో చేయించుకోవడం సామాన్యుడికి సాధ్యమయ్యేది కాదు. ప్రభుత్వాలు ఈ విషయంలో తగిన విధంగా స్పందించడం లేద”ని చెప్పారు విక్రం.
త్వరలో ఆసియాలోని ఇతర దేశాలకు విస్తరించేందుకు నెఫ్రోప్లస్ సిద్ధమవుతోంది. ఈ ఖండంలోనే అతి పెద్ద నెట్వర్క్‌గా ఎదిగేందుకు మరికొన్నేళ్లు పడుతుందని అంచనా. కిడ్నీ సంబంధిత వ్యాధులను ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు వాటిని సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నెఫ్రోప్లస్ నిర్వాహకులు. "గత కొన్ని దశాబ్దాలుగా మెడికల్స్ సైన్స్ అభివృద్ధి చెందుతుండగా... అంతర్జాతీయంగా ప్రజల ఆరోగ్య పరిస్థితులు దిగజారుతున్నాయి. తీవ్ర వ్యాధులకు చికిత్స తీసుకోవడం రోజురోజుకూ ఖరీదు పెరిగిపోతోంది. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు... అందని ద్రాక్షలా మారకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం "అని చెబ్తున్నారు విక్రం ఉప్పల.