దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కారు సీటుని తయారుచేసిన మెకానికల్ ఇంజినీర్
2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో 2.7కోట్ల మంది ప్రజలు వైకల్యంతో బాధపడుతున్నారు. ప్రపంచంలో మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో దివ్యాంగుల అవస్థ వర్ణనాతీతం. ముఖ్యంగా రవాణ వ్యవస్థలో వాళ్లు పడే అగచాట్లు పగవాడికి కూడా రాకూడదు. ప్రత్యేకంగా వాహనాలను తయారుచేయడం తప్ప.. వాళ్లకోసమంటూ ఏ ఆర్కిటెక్టూ ఆలోచించడు.. ఏ డిజైనరూ వాళ్లను దృష్టిలో పెట్టుకోడు. ట్రై సైకిల్, సైడ్ కార్ బైక్ లాంటివి స్పెషల్ గా డిజైన్ చేసినవే తప్ప.. మిగతా వాహనాల విషయంలో దివ్యాంగులు సాయం కోసం ఎదురు చూడాల్సిందే.
వాహనాల విషయంలో వికలాంగులు ఎందుకు ఇతరులపై ఆధారపడాలి. బెంగళూరుకు చెందిన ఆనంద్ ఈ విషయంలో తీవ్రంగా కలత చెందాడు. వాళ్ల కోసం ప్రత్యేకంగా డ్రైవింగ్ సీట్ ఎందుకు డిజైన్ చేయలేం అని ఆలోచించాడు. నాలుగైదు ప్రయోగాల తర్వాత మెకానిజాన్ని బిల్ట్ చేశాడు. డిసేబుల్డ్ ఫ్రెండ్లీ డ్రైవింగ్ సీటుని కారులో సక్సెస్ ఫుల్ గా ఇన్ స్టాల్ చేశాడు.
మెకానికల్ ఇంజినీరింగ్ లో బాచిలర్ డిగ్రీ చేసిన ఆనంద్ కొన్నాళ్లు పుణెలో పనిచేశాడు. తర్వాత 2000 సంవత్సరంలో డెట్రాయిట్ వెళ్లిపోయాడు. అక్కడ క్రిస్లర్స్ జీప్ అండ్ ట్రక్ విభాగంలో పనిచేశాడు. 2006లో తిరిగి ఇండియాకి వచ్చేశాడు. ఓ మిత్రుడి భాగస్వామ్యంతో ఆగన్ టెక్నాలజీస్ అనే ఇంజినీరింగ్ సర్వీసెస్ కంనెనీ స్థాపించాడు. మూడేళ్లలోనే 24 కోట్ల టర్నోవర్ సాధించారు. దాదాపు 200 మంది దాకా కంపెనీలో పనిచేశారు. ఇంతలో పార్ట్ నర్ తో కొన్ని విబేధాలు రావడంతో అతను 2010లో వైదొలిగాడు. దాంతో ఆనంద్ సొంతంగా ట్రూ కన్సల్టెన్సీ ప్రారంభించాడు.
ఆనంద్ అమెరికాలో ఉన్నప్పుడు దివ్యాంగుల బాధను కళ్లారా చూశాడు. తన స్నేహితుడి రూమ్మేట్ ఒకతను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. అతణ్ని బయటకి తీసుకెళ్లాలంటే ఎవరో ఒకరు సాయపడాల్సిందే. అయితే అక్కడ అదేం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే డిసేబుల్డ్ పర్సన్ కి అక్కడి రోడ్లు, పార్కింగ్ ఏరియా అంతా ఫ్రెండ్లీగా వుంటుంది. వాళ్లకోసం పార్కింగ్ లాట్ ప్రత్యేకంగా వుంటుంది. ఖాళీగా వున్నా ఆ స్థలంలో ఎవరూ బండి నిలపరు. ఒకవేళ పార్క్ చేసినా డోర్ విండోకు డిసేబుల్డ్ అని ప్లకార్డు తగిలిస్తారు. లేదంటే పోలీసులు వచ్చి బండిని ఈడ్చేస్తారు. అదొక్కటనే కాదు.. వికలాంగులకు ఇంకా చాలా సౌకర్యాలుంటాయి.
అయితే ఇండియాలో అలా కాదు. దివ్యాంగుల ప్రయాణం నరకయాతన. అందుకే వాళ్ల బాధల్ని దృష్టిలో పెట్టుకుని టర్న్ ప్లస్ అనే సీటింగ్ మెకానిజాన్ని విజయవంతంగా ఇన్ స్టాల్ చేశాడు. దానికోసం కారుకు ఎలాంటి మోడిఫికేషన్ చేయలేదు. కేవలం పుట్ బ్యాక్ ద్వారా సీటుని అనుకూలంగా మార్చుకునే వెసులుబాటు కల్పించాడు. ఇందులో ఎలాంటి ప్రత్యేక అమరికల్లేవు. మాన్యువల్ గానే ఆపరేట్ చేయొచ్చు. దాదాపు ఆరువేలసార్లు ప్రయోగం చేసి ఓపెనింగ్- క్లోజింగ్ ఫైనల్ చేశారు. ఈ రకమైన సీటింగ్ తో ఎవరి సాయం లేకుండా వికలాంగులు కారులోకి ఎక్కడం, దిగడం లాంటివి తేలిగ్గా చేయగలుగుతారు.
సీటు ఖరీదు 25వేల నుంచి 30 వేలు ఉంటుంది. టర్న్ ప్లస్ కేవలం దివ్యాంగులకు మాత్రమే కాదు.. బ్యాక్ పెయిన్, మోకాలి నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్నవాళ్లకు కూడా బాగా పనిచేస్తుంది. ఇలాంటి యూనిట్లను కొన్ని టొయోటా, రెనాల్ట్, జనరల్ మోటార్స్ కంపెనీలకు అమ్మారు. ఉబర్, మెరు వంటి క్యాబ్ కంపెనీలతో కూడా చర్చలు జరుపుతున్నారు.
సీటుకి వీల్ చైర్ అటాచ్ చేయడం ఆనంద్ ఫ్యూచర్ ప్లాన్. కారులో ఉన్నంత సేపు సీటులా పనిచేస్తుంది. బయటకు వచ్చిన వీల్ చైర్ లా ఉపయోగపడుతుంది. అలాంటి మెకానిజంపై ఫోకస్ చేశాడు. దాని మరో ప్రత్యేకత ఏంటంటే.. వీల్ చైర్ పెడల్స్ ద్వారా నడిచేలా కూడా కస్టమైజ్ చేస్తున్నాడు.
ప్రస్తుతానికి ఇద్దరు డిజైనర్లతో ప్రాజెక్ట్ పని మొదలైంది. ఆల్రెడీ టర్న్ ప్లస్ కు ఇండియాలోనే పేటెంట్ దొరికింది. ప్రత్యేకంగా వికలాంగుల కోసమనే కాదు.. సమాజానికి ఏదో రకంగా ఉపయోగ పడాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టాం అంటాడు ఆనంద్