స్త్రీల హక్కుల కోసం 'మేల్' కొలుపుతున్న హరీష్ సదానీ
ఫెమినిజానికి పురుషులు వ్యతిరేకం కాదు.. పురుషాధిక్య సమాజంలో మగవాళ్లకూ సుఖం లేదు..
ఆమె ఆకాశంలో సగం. అవకాశాల్లో సగం. అన్నింటా సగం. ఇవన్నీ ఇప్పటికీ నినాదాలకే పరిమితమయ్యాయి. ఇంటా బయటా ఎన్నో పరిమితులు, అంతులేని వివక్ష. ఒకప్పటిలా వంటింటికే పరిమితం చేసే ఆలోచనా ధోరణిలో కొంతవరకు మార్పు కనిపిస్తున్నా.. అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఆ బట్టలు వద్దు, ఈ ఉద్యోగం వద్దు, ఇది మాత్రమే చేయాలి, దీనికే పరిమితం.. అంటూ ఎన్నో ఆంక్షలు. అయినా వాటిపై పోరాడుతూ ఆధునిక మహిళ తన హక్కుల సాధనలో ముందుకు పయనిస్తోంది. ఈ పోరాటంలో నారీలోకం అంతకంతకూ భాగస్వామ్యం అవుతోంది.
మరి.. ఫెమినిజం అంటే కేవలం స్త్రీలు మాట్లాడే భాషేనా? వాళ్లకు సంబంధించిన అంశమేనా? ఇందులో మగవాళ్లకు చోటులేదా? అయ్యో అదెంత భాగ్యం! స్త్రీ పురుష సమానత్వాన్ని శ్వాసించే ఏ వ్యక్తయినా, లింగభేదాన్ని వదిలిపెట్టి చేయిచేయి భుజంభుజం కలపొచ్చు కదా! ఈ నిజాన్ని గ్రహించిన ఎంతోమంది పురుషులు మహిళల హక్కుల ఉద్యమాలకు బాసటగా నిలుస్తున్నారు. ముంబయికి చెందిన హరీష్ సదానీ కూడా ఈ కోవలోకే వస్తారు.
హరీష్ సదాని. మహిళల హక్కుల ఉద్యమకారుడు. మహిళలపై వివక్ష తొలగిపోవాలని, అణచివేత అంతం కావాలని తపిస్తున్నవ్యక్తి. ఒక మగవాడు ఆడవాళ్ల హక్కుల కోసం పని చేయటమేంటీ అని కొత్తగా అనిపించవచ్చు. అలా భావించే సమాజంలో ఉన్నాం! కానీ, వివక్షను మనస్ఫూర్తిగా వ్యతిరేకించే హరీష్ సదానీ, తన లక్ష్యం కోసం ఏకంగా ఓ సంస్థనే నడుపుడుతున్నారు.
ఈ ప్రయాణం గురించి చెప్పాలంటే కొంత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి..
నిజానికి హరీష్ ఆలోచనలకు పునాది అతని తండ్రి నుంచే పడిందని చెప్పాలి. ఆయన ప్లస్ టూ వరకు చదువుకున్నాడు. కానీ, సమాజాన్ని అర్ధం చేసుకోవటంలో మాస్టర్ డిగ్రీ ఉన్నవ్యక్తి. ఇంటి పనుల్లో సాయంచేస్తూ... చుట్టుపక్కల మగవాళ్లకు భిన్నంగా కనిపించేవాడు. ఈ పెంపకంలో పెరిగిన హరీష్ సదానీ తీరులో కూడా స్పష్టమైన మార్పు వచ్చింది. హరీష్ కూడా చిన్నతనం నుండే ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉండేవాడు. ఆ పనులు చూసి చుట్టుపక్కల వాళ్లు ఆడంగి పనులు చేస్తున్నాడంటూ గేలిచేసేవారు. కానీ, హరీష్ వారి మాటలు ఏ మాత్రం లెక్కచేసేవాడు కాదు.
"ఇళ్లలో మహిళలు పురుషుల చేత ఎలా హింసకు గురవుతున్నారో, తక్కువగా చూడబడుతున్నారో గమనించినపుడు చాలా ఆశ్యర్యమేసేది. ఆలోచింపజేసేది. కానీ, మా నాన్నను గమనించాకే, పురుషులు స్త్రీలను హెరాస్ చేయాల్సిన అవసరం లేదని, సమానంగా ఉండొచ్చని నేర్చుకున్నాను.."- హరీష్ సదానీ..
సినిమాలంటే అమితంగా ఇష్టపడే సదానీ, అప్పట్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన స్మితాపాటిల్ కు పెద్ద ఫ్యాన్ కూడా. బాలీవుడ్ నటీమణుల్లో ఆమెది ప్రత్యేక స్థానం. పలు సినిమాల్లో స్మితా పాటిల్ పాత్రలు చాలా ఆకట్టుకుంటాయి. ఇండిపెండెంట్ నేచర్, ధైర్యం కలగలసిన స్మితా పాటిల్ హరీష్ ని చాలా ఇన్ స్పైర్ చేసింది. సదానీ ఆమెకు ఉత్తరాలు కూడా రాసేవాడు. స్మిత పలు ఉత్తరాలకు సమాధానం కూడా ఇచ్చింది.
ఆమె స్ఫూర్తితోనే, సదానీ, ముంబయి టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుండి సోషల్ వర్క్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ కోర్సు చేసే టైమ్ లోనే మహిళల హక్కుల కోసం పనిచేసే ఓ ప్రముఖ సంస్థలో పనిచేశాడు. కానీ, వాళ్ల పనితీరు నచ్చక అక్కడ మానేశాడు.
" కుటుంబాల్లో సమస్యలు రాగానే ఆ సంస్థ వాళ్లు ఇంటిముందు ధర్నాకు దిగేవారు. పురుషులను అవమానించటానికి ప్రయత్నాలు చేసేవారు. కానీ, దానివల్ల ప్రయోజనం ఏమిటి? మగవాళ్లలో మార్పు వచ్చేలా ప్రయత్నించాలి... మళ్లీ అలాంటి పని చేయకుండా చేయగలగాలి తప్ప... ఎటాక్ చేయటం వల్ల ప్రయోజనం లేదు.." -- సదానీ..
1991లో ప్రముఖ జర్నలిస్ట్ సీవై గోపీనాధ్ పేపర్ లో ఓ ప్రకటన ఇచ్చారు. డొమెస్టిక్ వయొలెన్స్ ని వ్యతిరేకించే వారందరినీ ఆ మీటింగ్ కి ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి 200మంది పైగా మగవాళ్లు వచ్చారు. ఆ సందర్భంలోనే సదానీకి జెండర్ ఈక్వాలిటీపై పోరాటం చేయాలనే ఆలోచన వచ్చింది. అది కూడా, పురుషుల టీమ్ ని కూడగట్టి. అలా పుట్టిందే మెన్ ఎగైనెస్ట్ వయోలెన్స్ అండ్ ఎబ్యూజ్ సంస్థ. ఈ సంస్థ మహిళల హక్కులకోసం పనిచేస్తుంది.
పురుషులు కూడా రియలైజ్ కావాలి
విమెన్ రైట్స్ ఆర్గనైజేషన్లు పురుషులను శత్రువుల్లా చూస్తాయనే వాదనలు తరచు వినిపిస్తుంటాయి. కానీ, పురుషస్వామ్య ప్రపంచంలో మనం ఉన్నాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాంటపుడు లింగ వివక్ష సమసిపోవాలంటే, స్త్రీలకు సమాన హక్కులు రావాలంటే, పురుషులు కూడా రియలైజ్ కావాలి కదా. అలాంటపుడు వారిని తమ పోరాట రూపాలతో దూరం చేస్తే ప్రయోజనం ఏమిటి అంటారు సదానీ. అసలీ పోరాటం వివక్షా పూరిత సమాజ విలువలపై తప్ప పురుషులపై కాదు కదా.. పురుషాధిక్య ప్రపంచపు లక్షణాలపై తప్ప సాటి మగవాళ్లపై కాదు కదా అంటారాయన.
"అసలు ఫెమినిజం అంటే మగవాళ్లను టార్గెట్ చేసేది అనే భావనే లేకుండా పోవాలి. నిజానికి పురుషాధిక్య సమాజం స్త్రీలకే కాదు... పురుషులకూ సరైనది కాదు. ఇది మహిళలకు హక్కులను నిరాకరించటమే కాదు.. మగవాళ్లపై బాధ్యతల పేరుతో అనవసరమైన వత్తిడిని కూడా పెంచుతోంది. సమానత్వం పురుషులకు కూడా మనశ్శాంతినిస్తుందనే విషయాన్ని గ్రహించేలా చేయాలి"- హరీష్ సదాని
సైకాలజిస్టులతో కౌన్సిలింగ్
1993లో ఈ సంస్థ స్థాపించినప్పటినుంచి, అన్నిరకాల వయస్సు ఉన్న మగవాళ్లతో, అన్ని సామాజిక, ఆర్ధిక తరగతుల వారితో కలసి పనిచేసింది. సదానీ తన 20మంది వాలంటీర్లతో కలసి, చాలామంది మగవాళ్లకి సైకాలజిస్టులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తూ వస్తున్నారు. ఇప్పుడు పలు కంపెనీలకు -సెక్సువల్ హెరాస్ మెంట్ కు సంబంధించిన కమిటీల్లో ఎడ్వైజర్ గా ఉన్నారు. ఈ సంస్థ ప్రతి దివాలీకి పురుష్ స్పందన పేరుతో ఓ మ్యాగజైన్ ని కూడా ప్రచురిస్తోంది. ఇందులో జెండర్ ఈక్వాలిటీపై కథలు, వ్యాసాలు మగవాళ్లే రాస్తున్నారు.
గత దశాబ్ద కాలంగా, యువతలో జెండర్ ఈక్వాలిటీపై అవగాహన కల్పించేందుకు హరీష్ పనిచేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా యువమైత్రి పేరుతో మహారాష్ట్రలోని ఏడు జిల్లాలతో పాటు, ముంబయి, పుణె నగరాల్లో కూడా పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దీనికోసం ఆయా కళాశాలల్లో ఉన్న NSS టీమ్ లతో టై అప్ కూడా పెట్టుకుంటున్నారు.
ఇలా పలు కళాశాలలనుండి విద్యార్ధులను ఎంపిక చేసి, ఏడాదిలో కొన్ని రోజులు స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపుల్లో జెండర్ ఈక్వాలిటీ, సెక్సువాలిటీ, సమాజంలో నెలకొన్న అనేక తప్పుడు అభిప్రాయాలపై అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం వీధి నాటకాలు, షార్ట్ ఫిల్మ్స్ కూడా ఉపయోగిస్తున్నారు.
చాలా మార్పు కనిపిస్తోంది
ఇప్పుడు 600 మంది పైగా యువత ఈ సంస్థ కార్యకలాపాల్లో, యువమైత్రి హెల్ప్ లైన్ లో పనిచేస్తున్నారు. ఈ సంస్థ కార్యకలాపాలలో పాల్గొన్న యువత ఆలోచనా ధోరణిలో ఎంతో మార్పు కనిపిస్తోంది. సాటి ఆడవాళ్లతో మెలిగే విధానంలో చాలా మార్పు కనిపిస్తోంది.
మొదట్లో హరీష్ సదానీ స్థాపించిన సంస్థని, దాని కార్యకలాపాలని చూసిన కొందరు విమెన్ యాక్టివిస్టులు, ఈ సంస్థవల్ల తమ లక్ష్యం పలుచ బడుతుందని భావించారు. పురుషాధిక్య సమాజం వల్ల పురుషుడు కూడా ఇబ్బందిపడుతున్నాడనే వాదన అసలు లక్ష్యాన్నివదలి, కొత్త చర్చదిశగా సాగుతుందనే కామెంట్స్ వినిపించాయి. కానీ, మహిళలకు సమాన హక్కులే తమ మొదటి లక్ష్యమని స్పష్టం చేశారు హరీష్ సదానీ.
మార్పు మంచికే
క్రమంగా మహిళా సంఘాల దృక్పథంలో మార్పు వచ్చింది. హరీష్ స్థాపించిన మెన్ ఎగైనెస్ట్ వయోలెన్స్ అండ్ ఎబ్యూజ్ సంస్థతో ఇతర మహిళా యాక్టివిస్టులు కూడా కలసి పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈ సంస్థ యువతను లక్ష్యంగా చేసుకుని పనిచేయటం సత్ఫలితాలనిస్తోంది. ఎందుకంటే ఇళ్లలో తండ్రులకంటే, అన్నాదమ్ముళ్లే అమ్మాయిల అణచివేతకు ఎక్కువగా కారణం అవుతున్నారని గతంలోనే చాలా సర్వేలు తేల్చాయి.
ఇప్పుడు హరీష్ బాటలో చాలా సంస్థలు నడుస్తున్నాయి. మహిళలపై అణచివేత పోవాలంటే, సమాన హక్కులు రావాలంటే, పురుషుల్లో మార్పురావలసిన అంశాన్ని చాలా మంది గుర్తిస్తున్నారు. ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్, ఫోరమ్ టు ఏంగేజ్ మెన్, సమ్యక్ మొదలైన సంస్థలు ఇదే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ఇప్పుడు సదానీకి 49 ఏళ్లు. సమాజంలో మహిళల పట్ల వివక్ష సమసిపోయి సమానత్వం పరిమళించాలని కలలుకనే ఆయన తన బాటలో అలుపెరుగకుండా సాగిపోతున్నారు.