నా స్టార్టప్... షట్టర్ దించేసిన రోజు !
గెస్ట్ రచయిత - సాహిల్ కినీ మాటల్లోనే..
అది జూన్ 17, 2014. బెంగళూరు జేపీ నగర్‌లో ఉన్న మా చిన్న ఆఫీస్ 'మాగ్నెట్ వర్క్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్' ఎదురుగా నేను నిలబడి ఉన్నా. ఆ బోర్డ్ వైపు చూస్తుంటే.. ఎన్నో వందల ఆలోచనలు.. వేల గుర్తులు. అలా అన్నీ ఒకొక్కటిగా కరిగిపోతున్నాయి. నేను నిర్మించుకున్న నా సామ్రాజ్యం... పెనుతుఫాను ధాటికి వణికిన వృక్షంలా నేలరాలుతోంది. సాయంత్రం నాలుగు గంటలవుతోంది.. కానీ.. నాకు మాత్రం అంత వెలుతురులోనూ చీకటే. నిశీధిలో నేనొక్కడినే ఒంటరిగా నిలబడినట్టు, కొలవనంత బరువును మోస్తున్న హెర్కులస్‌లా అలా నిలబడే ఉన్నా.
కూలిపోతోందని తెలిసినా నా స్టార్టప్‌ను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేశాను. గత కొన్ని వారాలుగా రేయింబవళ్లూ అక్కడే ఉన్నా. చివరకు నా కో ఫౌండర్ నోట్లోనుంచి తూటా లాంటి మాట నా గుండెల్లో దిగబడింది. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో 'నీ మీద నమ్మకం పోయింది, సీఈఓగా నీకంత సీన్ లేదని అర్థమైపోయింది' అనేశాడు. దిమ్మతిరిగినంత పనైంది. ఏం చేయాలో దిక్కుతెలియక మా నాన్నకు ఫోన్ చేశాను. 50 ఏళ్లుగా వ్యాపారంలో తలపండిన ఆయన.. ఏదైనా దారిచూపిస్తారేమో అనే ఆశతో. అంతా విన్న తర్వాత ఆయన అన్న మాట ఒక్కటే...
'' బాబూ, జీవితంలో కొన్ని రోజులు మనవి కావు. నష్టాలు తగ్గించుకుని.. రేపటి కోసం బతుకు ''
బ్యాంకు ఖాతా తెరిచాను. అందులో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 14,130. నా స్టార్టప్ ఆఫీసుకు కట్టే ఒక నెల రెంట్ కన్నా తక్కువే. నాకు ఐదు నెలల్లో పెళ్లి కాబోతోంది. నేను ఎంత సంపాదిస్తున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను అనే ప్రశ్నలేవీ తన తరపు వాళ్లు ఇప్పటికీ దాకా అడగలేదు. కానీ ఆ పద్నాలుగు వేల నెంబర్.. నాపై పద్నాలుగు టన్నుల భారాన్ని పడేసినట్టు అనిపించింది.
ఫ్యాక్టరీ మెషీన్లు తమంతట తాము పనిచేసేందుకు వీలుగా రూపొందించిన ఇండస్ట్రియల్ ఐఓటి బిజినెస్ మా అంచనాలను తలకిందులు చేసింది. మా ఆలోచనలన్నీ ఆవిరైపోయేలా చేసింది.
ఆఖరి రోజున నా ఎంప్లాయీస్ అందరినీ సమావేశపరిచాను. కో ఫౌండర్ చెప్పిన మాటను వివరించి.. ఇక షట్టర్ దింపేయబోతున్నామని ప్రకటించేశా. ఎవరికైనా కొత్త జాబ్ వెతుక్కోవడంలో ఇబ్బందులు ఉంటే సహాయం చేస్తామనే ఫ్రీ హామీని కూడా ఇచ్చేశా. కానీ వాళ్లందరికీ ఇప్పటికే చేతుల్లో బోలెడు ఆఫర్లున్నాయి. డైరెక్టుగా ఇటు నుంచి ఇటే వెళ్లి మరో స్టార్టప్‌లో చేరిపోగల సత్తా ఉన్న వాళ్లు.
హుఫ్.. కనీసం వాళ్లయినా సేఫ్ అంటూ లోలోపల కొద్దిగానైనా ఆనందం.
నా బెస్ట్ ఇంజనీర్, కోడ్ అంటే తలకోసుకునేంత పిచ్చి ఉన్న నా టీం మేట్ వచ్చి ఈ మాట అనేసరికి నా గుండెపగిలినంత పనైంది. నాకే సిగ్గేసింది.
'' సాహిల్.. నీ దగ్గర ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పు. నీతో కలిసి పనిచేసేందుకు నేను ఇప్పటికీ రెడీ. డబ్బు గురించిన టెన్షన్ వద్దు ''
అతనివైపు చూసి మెల్లిగా నవ్వా. ఐడియాలకు నా దగ్గరేమీ కొరతలేదు, కానీ ఇప్పుడు వాటిని అమలు చేసే ధైర్యమే లేదని లోలోపల అనుకున్నా. కానీ మళ్లీ ఏదో ఒక రోజు కలిసి పనిచేద్దాం అంటూ ఊరడించి పంపించేశా.
ఒకరొకరు.. అంతా మెల్లిగా సర్దుకున్నారు. వాళ్ల డెస్కులు ఖాళీ చేసి బయలు దేరారు. కానీ నాకు ఇంకా మమకారం చావలేదు. కొంతసేపు అందరూ వెళ్లాక అక్కడే ఉన్నా. మిగిలిన సామాను OLX లో అమ్మేశా. జీతాలను క్లియర్ చేసేశా. కొన్ని ఎలక్ట్రానిక్ సామాన్లు, ఇంకా ఏవో జ్ఞాపకాలను కట్టగట్టి నా కారులో పడేశా. ఆఫీసు గోడలపై ఉన్న బోర్డును తొలగించా. సరిగ్గా ఏడాది క్రితం ఎన్నో అంచనాలతో ఆ బోర్డును డిజైన్ చేయించి అక్కడ పెడ్తున్నప్పుటి జ్ఞాపకం గుర్తొచ్చింది. ఏడాదిలో ఎంత మార్పు, రోజులు ఎంత వేగంగా మారిపోయాయ్... !?
ఏదో తెలియని వెలితి. ఎవరికీ చెప్పుకోలేనంత బాధ. గుండె పగిలేలా ఏడ్వాలని ఉన్నా.. ఏదో తెలియని ఫీలింగ్ అడ్డొస్తోంది. చివరకు ఆపుకోలేకపోయా...!!
మోకాళ్లపై కూర్చుని.. కరువుతీరా ఏడ్చేశా.
కొన్ని రోజులు ఒంటరిగా గడిపాను.. (నేను ఏ మాత్రం ఇష్ట పడని పని ఇదే) ఎవరైనా వచ్చి ఇలా చేసి ఉంటే బాగుండేది అనే సలహా ఇస్తారేమోననే భయమే నన్ను మరింత కుంగదీసింది. దేశంలో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివా, ప్రపంచంలో అత్యుత్త మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థలో పనిచేశా. ఎన్నో రిస్కులు తీసుకున్నా, రియల్ బిజినెస్‌ను నిర్మించా, రియల్ టెక్నాలజీని నమ్ముకున్నా. ఇప్పటికీ డబ్బు ఇచ్చేందుకు రెడీగా ఉన్న కస్టమర్లు కొంత మంది సిద్ధంగా కూడా ఉన్నారు. అయినా నేను ఫెయిల్ అయ్యాను.. !
మొదటి నెల రోజుల పాటు నేను పెద్దగా ఎవరితో మాట్లాడింది కూడా లేదు. మా చెల్లి, నా ఫియాన్స్ (ఇప్పుడు భార్య)తో పొడిపొడి సంభాషణలు. అలా ఎక్కువ రోజులు కుమిలిపోవాలని అనుకోలేదు. నేనేం తప్పుచేయలేదే..? ఎందుకు ఎవరికీ దాక్కోవాలి..? ఎందుకు భయపడ్తూ బతకాలి..?? అనిపించింది!!
మెల్లిగా కోలుకుని రెజ్యూమె తయారు చేశాను. కొన్ని ఆఫీసులకు పంపాను. (వాస్తవానికి నా బాసులన్నా, నెలనెలా వచ్చే పే చెక్స్ అన్నా.. పరమ చిరాకు... కానీ ఇప్పుడు తప్పేలా లేదే..!!)
ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూ. కానీ వాళ్లెవరూ నన్ను ఆకర్షించలేకపోయారు. ఒక రోజు కార్తీక్ నుంచి ఫోన్ వచ్చింది. తను ఐఐటి - మద్రాసులో నా సీనియర్. బాగా సరుకున్నోడు. తను సొంతంగా ఓ ఫండ్ మొదలుపెట్టబోతున్నాడు. అందుకోసం కలిసి పనిచేయడానికి రమ్మని నన్ను ఆహ్వానించాడు. తనకు నేను రెజ్యూమె కూడా ఏమీ పంపలేదు.
కార్తీక్‌ను అతని టీం అస్పదాను కలిశాను. వాళ్లెవరూ వీసీ ఫండింగ్ గేమ్‌పైనే ఆసక్తి ఉన్నవాళ్లు కాదు. రియల్ ఐడియాను నిర్మించాలని తపన పడేవాళ్లు. కేవలం నాలుగు లక్షల మందికో, నలభై లక్షల మందికో మాత్రమే పనికొచ్చే ఆలోచనకు పరిమితమయ్యే వాళ్లూ కాదు. చివరకు వాళ్లకు ఓకే చెప్పేశా.
నా సంస్థ వ్యవస్థాపకుల భయాలను, సమస్యలను, ఒంటరితనాన్ని తెలుసుకుంటానని, వాళ్ల మనసులోని మాటలను కచ్చితంగా వినాలని ఆ రోజే ప్రమాణం చేశా..
నిధులు లేక ఎన్నో స్టార్టప్స్ మూతబడటం చూస్తుంటాం. అయితే ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు ప్రస్తావించడం ఎందుకని ఎవరైనా భావించవచ్చు. పాత గాయాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చుకునేందుకు ఈ వ్యాసం రాయడంలేదు. ఇది రాస్తున్నంత సేపూ నా చేతులు వణికాయి. ఏదో తెలియని భయం నన్ను కొంతసేపు కమ్మేసింది.
కనీసం ఒక్క ఫౌండర్ అయినా నాలా బాధపడి ఉండొచ్చేమో..!! నాలా ఒంటరిగా కుమిలిపోయి ఉండొచ్చేమో..!!అని తెలుసుకునేందుకు రాశా...!!
ఎకో సిస్టమ్‌లో తప్పులు వెతకడం చాలా సులువు. కానీ వాస్తవాలను చాలామంది గుర్తించరు. ఆ బాధ అంత సులువుగా మాయమయ్యేది కూడా కాదు. కానీ మెల్లిమెల్లిగా కాలమే మన బాధను మాన్పుతుంది.
ఇక ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా వేయలేకోపోతున్న ఆ ఫౌండర్‌కు ఈ మాటలు అంకితం.
నోయెల్ గలాగెర్ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ..
Hold up, Hold on
Don’t be scared
You’ll never change what’s been and gone
May your smile
Shine on
Don’t be scared
Your destiny may keep you warm
Cos all of the stars, are fading away
Just try not to worry
You’ll see them some day
Take what you need
And be on your way
And stop crying your heart out
(Disclaimer: The views and opinions expressed in this article are those of the author and do not necessarily reflect the views of YourStory)
రచయిత - సాహిల్ కినీ
అనువాదం - నాగేంద్ర సాయి
రచయిత గురించి
సాహిల్ కినీ - ప్రస్తుతం అస్పదా ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్‌లో పోర్ట్‌ఫోలియో - వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు మాగ్నెట్ వర్క్స్ అనే స్టార్టప్ ఫౌండర్, సిఈఓ. ఐఐటి మద్రాసులో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, మెకెన్సీలో మూడేళ్లు పనిచేశారు. ఆధార్ కార్డ్ ప్రాజెక్టులోనూ కీలక పాత్ర పోషించారు.