ది బ్రేక్‌ఫాస్ట్ బాక్స్ అనేది రోజులో ఎంతో ముఖ్యమైన బ్రేక్‌ఫాస్ట్‌ను ఇంటికి డెలివరీ ఇచ్చే కంపెనీ. దీన్ని జై ఓజా, అవినాష్ జైస్వాల్, మ్రుగ్నాయన్ ఖమ్తేకర్, మహర్షి ఉపాధ్యాయ ప్రారంభించారు.
ఎంతో మేధోమధనం తరువాత ఈ ఆలోచన వచ్చింది. ఆరోగ్యకరమైన, రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ విషయంలో తాము ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలని వ్యవస్థాపకులకు కూడా తెలుసు.
ఆలోచన, ఆచరణ
"ఇంటికి దూరంగా నివసించే సమయంలో బ్రేక్‌ఫాస్ట్ విషయంలో మనం కూడా అనేక సమస్యలు ఎదుర్కొని ఉంటాం" అంటారు మహర్షి. అప్పుడు వారికి ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ను డోర్ డెలివరీ ఇవ్వగలిగితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. "ఆ తరువాత ఈ విషయంలో తమకు సలహాలు ఇచ్చేందుకు ఓ న్యూట్రీషనిస్టును సంప్రదించి ప్రతిరోజు మెనూలో మార్పులు చేయించేందుకు ప్లాన్ సిద్ధం చేశాం" అని వెల్లడించారు.
ఆరోగ్యకరమైన, రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్‌ను ప్యాక్ చేసి డెలివరీ ఇచ్చే అంశంలో ది బ్రేక్ ఫాస్ట్ బాక్స్ పని చేస్తుంది. తొలి రోజుల్లో అప్పటి మార్కెట్లో ప్రజలు ఎలాంటి ఉత్పత్తులను కోరుకుంటున్నారనే విషయాన్ని గమనించి... అలాంటి వాటిని తయారు చేశారు.
ప్రారంభం, విస్తరణ
మొదటి నెలలో 300 బాక్సులతో తమ సర్వీస్ ప్రారంభించిన ఈ బృందం... నాలుగు నెలల తరువాత ప్రస్తుతం నెలకు 1,200 నుంచి 1,500 బాక్సులు డెలవరీ చేసే స్థాయికి చేరుకుంది. తమ వ్యాపారానికి మంచి స్పందన రావడంతో దీన్ని విస్తరించడంతో పాటు కార్యకలాపాలను పెంచాలని అనుకున్నామని మహర్షి వివరించారు.
"కొందరు ప్రైవేటు ఇన్వెస్టర్లు, స్థానిక వ్యాపారవేత్తలు తమతో కలిసి పనిచేయాలని మమ్మల్ని కోరారు. కానీ మమ్మల్ని టీమ్ ఆలోచనలను సరిగ్గా అర్థం చేసుకునే ఓ మెంటర్ కోసం వెతికాం. లాభాలు పెంచుకోవడం ఒక్కటే మా లక్ష్యం కాదు" అన్నారు మహర్షి.
సమస్యలు, సవాళ్లు
ఈ రంగానికి సరిపోయే సరైన వ్యక్తులను నియమించుకోవడం ఓ పెద్ద సవాలే. మొదట ఎలాంటి ఫుడ్ తయారు చేయాలో అవగాహన లేని ఓ వంటవాడిని ఈ పని కోసం తీసుకున్నారు. ఆ తరువాత వీటిని ఎలా తయారు చేయాలనే విషయాలను జై వారికి నేర్పించారని మహర్షి తెలిపారు.
మా ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో డెలివరీల కోసం కొంతమందిని పార్ట్-టైమ్ ఉద్యోగులకు తీసుకున్నాం. మా ఉత్పత్తుల డెలివరీ సమయం ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల మధ్యే ఉండటంతో అలా చేశాం. ఆ తరువాత ఓ చెఫ్‌ను తీసుకోవడంతో పాటు ఓ హెడ్ చెఫ్, ఇద్దరు హెల్పర్లను కంపెనీ నియమించుకుంది.
"ప్రస్తుతం మేం మా సొంత డబ్బులతోనే ఈ వ్యాపారాన్ని నడుపుతున్నాం. నాలుగు నెలల కాలంలోనే ఇందులో బ్రేక్ ఈవెన్ ను సాధించాం. మా వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్న కొందరు ఇన్వెస్టర్లు మమ్మల్ని సంప్రదించారు"అన్నారు మహర్షి.
రాబోయే నాలుగు నెలల్లో ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ను పూణెలోనూ డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ టీమ్... మరో రెండు మూడేళ్లల్లో తమ కార్యకలాపాలను ఎనిమిది నగరాలకు విస్తరించాలని భావిస్తోంది.
యువర్ స్టోరీ విశ్లేషణ
అనేక ఇతర కంపెనీలు ఉన్న ఈ రంగం మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.3,25,000 కోట్లు(50 బిలియన్లు) ఉంది. ఫుడ్‌పండా, టైనీఓల్ వంటి కంపెనీల వ్యాపారాన్ని పరిశీలించిన అనంతరం ఈ బిజినెస్ చాలా ఖర్చుతో కూడుకున్నదని, కొత్త స్టార్టప్‌లు నిలదొక్కుకోవడం కష్టమని అర్థమవుతోంది.
ఇక నిధుల సమీకరణ విషయంలో మాత్రం ఈ రంగం తిరోగమనంలోనూ పయనిస్తోందని చెప్పాలి. ఏప్రిల్ నెలలో ఏడు డీల్స్ ద్వారా 74 మిలియన్ డాలర్లను సమీకరిచగా... ఆగస్టులో ఆ సంఖ్య 19 మిలియన్ డాలర్లకు పడిపోయింది. సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి రెండు డీల్స్ కు పరిమితమై ఆ సంఖ్య మరింతగా తగ్గుముఖం పట్టింది.
ఎక్కువగా నిధుల సమీకరించడం వలన కొత్తగా ఏర్పడే స్టార్టప్ కంపెనీలు పెద్ద మొత్తంలో డిస్కౌంట్లతో పాటు కూపన్లను ఆఫర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. మరోవైపు ఈ రంగంలో కస్టమర్లను కనిపెట్టడం కూడా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఫుడ్ ఆర్డర్ ఫ్లాట్‌ఫామ్ రంగంలో ఉన్న ఫుడ్‌పండా వంటి కంపెనీలు... ఒక్కో కస్టమర్ ను సంపాదించడం కోసం రూ.400 నుంచి రూ.500 వరకు ఖర్చు చేస్తున్నాయి.