ఓటమే స్ఫూర్తి, ఓర్పే ఆస్తి ! బుక్ మై షో చీఫ్ ఆశిష్ సక్సెస్ మంత్ర

బుక్ మై షో విజయంలో ఎన్నో ఎత్తుపల్లాలుప్రతీ కష్టాన్నీ ఓర్పుతో జయించిన ఆశిష్ హేమ్ రజనిడాట్ కామ్ ఢాం అన్నప్పుడూ వెరవని వైనంఉద్యోగులూ కుటుంబ సభ్యులేఆడుతూ,పాడుతూ పనిచేసేందుకు సౌకర్యాలుకస్టమర్ సంతృప్తే సింగిల్ పాయింట్ అజెండారూ.1000 కోట్ల స్థాయికి బుక్ మై షోసంస్థను సక్సెస్ చేసిన చీఫ్ ఆశిష్ బిజినెస్ సూత్రాలు

7th Apr 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

ఇప్పటి తరానికి పెద్దగా అనుభవం లేదు కానీ.. ఓ పదేళ్ళ క్రితం.. కొత్త సినిమా రిలీజైతే.... టికెట్లు సంపాదించడం అంటే ఓ పెద్ద ప్రహసనం. నానా తంటాలు పడి క్యూలైన్లలో నిలుచుంటే.. టికెట్ దొరుకుతుందో లేదో.. మన వంతు వచ్చేలోగా బుకింగ్ కౌంటర్ ను ఎక్కడ మూసేస్తాడోనని చివరిదాకా ఒకటే టెన్షన్ ఉండేది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల అభిమానులకు సినిమా రిలీజైన రోజే టికెట్ సంపాదించడం ఓ సాహసమే. ఇలాంటి అనుభవాల నేపథ్యంలో రూపొందిందే “బుక్ మై షో.”

ఎన్నో పెద్ద పెద్ద సంస్థల పోటీని తట్టుకొని.. విపరీతమైన ప్రజాదరణను పొందింది బుక్ మై షో. వెయ్యి కోట్ల క్లబ్ లో చోటు సంపాదించుకున్న బుక్ మై షో సంస్థ.. ప్రయాణం ఎత్తుపల్లాలుగానే సాగింది. అయితే.. ఎప్పటికప్పుడు తమను తాము మార్చుకుంటూ.. ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా సాగిస్తున్న ప్రస్థానం.. లక్షలాది ప్రజల ఆదరాభిమానాలను అందించడమే కాదు.. సంస్థనూ అగ్రగామిగా నిలిపింది. బుక్ మై షో వ్యవస్థాపకుడు ఆశిశ్.. గడచిన పదహారేళ్ళ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. అయితే కిందపడ్డ ప్రతిసారీ, రెట్టించిన ఉత్సాహంతో.. లేచి భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగేవారు. అకుంఠిత దీక్షతో చేసిన ప్రయత్నం అతణ్ణి.. ఆయన స్థాపించిన సంస్థను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాయి. ఒక సంస్థను స్థాపించి, దాన్ని వృద్ధిలోకి తెచ్చి.. భవిష్యత్తులో మరింత మెరుగైన స్థితికి చేర్చేందుకు ఒక వ్యాపారవేత్త ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో.. సమస్యలను అధిగమించేందుకు ఎన్నెన్ని ఎత్తులు వేస్తారో.. ఆశిశ్ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. తేలిగ్గా అర్థమవుతుంది. మనకూ ఓ స్పష్టత వస్తుంది.


అశిష్ హేమ్ రజని,బుక్ మై చీఫ్ వ్యవస్థాపకుడు

అశిష్ హేమ్ రజని,బుక్ మై చీఫ్ వ్యవస్థాపకుడుపట్టుదల -

ఆశిశ్ లోని పట్టుదల, అతణ్ణి మిగిలిన వారికి భిన్నంగా నిలిపింది. గడచిన 16 సంవత్సరాల్లో ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురైనా ఎన్నడూ అతను నిరుత్సాహ పడలేదు. 

“పట్టుదలే మా బలం. వడ్రంగి పిట్ట (woodpecker).. ఏమాత్రం అలుపు లేకుండా.. చెట్టును ఎలా పొడుస్తూ ఉంటుందో, మేమూ..అలాగే.. లక్ష్య సాధన కోసం పట్టుదలగా పనిచేశాము. ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో ప్రతిరోజూ పనికి రావడం, మిగిలిన వారికి భిన్నంగా ఎలా ఉండగలము అని ఆలోచిస్తూ.. విభిన్నత కోసం అవిశ్రాంతంగా పనిచేశాము” అంటారు బుక్ మై షో అధినేత ఆశిశ్. 

ముఖ్యంగా డాట్ కామ్ సంక్షోభ సమయంలో ఆశిశ్ ఎంతో స్థిత ప్రజ్ఞతతో వ్యవహరించడం వల్లే.. ఆయన విభిన్నంగా ఉన్నారు. 2002లో డాట్ కామ్ వాడకం నిలిచిపోయిన తరుణంలో.. బుక్ మై షో సంస్థ దాదాపుగా రోడ్డుపై పడింది. అయితే.. చెక్కుచెదరని పట్టుదలే వారిని విపణి వినువీధుల్లో నేటికీ నిలిపింది. “ జిఈ, కోక్, మెక్ డొనాల్డ్స్, డంకిన్ డోనట్స్, బెర్క షైర్, హాథ్ వే, టాటా, బిర్లాలను చూడండి, అందరూ డాట్ కామ్ సమస్యను ఎదుర్కొన్నారు. ఆదశలో మేము కొత్తగా ఆలోచించలేక చేతులెత్తేసి తట్టాబుట్టా సర్దేసుకొని ఉంటే.. ఈ రోజు మీరు మా గురించి ఆలోచించే వారు కూడా కాదు. మా పట్టుదలే మమ్మల్ని ఇంకా నిలిపింది” అని గుర్తు చేసుకుంటారు ఆశిశ్.

అదో ఉమ్మడి కుటుంబం -

బుక్ మై షో సంస్థతో మమేకమైన వారిని పరిశీలిస్తే స్నేహానికి దక్కే విలువేంటో తెలుస్తుంది. అదే విధంగా, పనిచేసే వారంతా ఓ కుటుంబంలోని సభ్యుల్లా కలిసి మెలిసి సాగడమూ కనిపిస్తుంది. సంస్థలో కొనసాగుతున్న రాజేశ్, పరీక్షిత్ లు ఇరవై ఏళ్ళప్పటినుంచీ ఆశిశ్ కు స్నేహితులు. తాము చేసే పనిని, ప్రతిరోజూ కాలేజికి వచ్చి కొత్త పాఠాలు నేర్చుకుంటున్నట్లే భావించేవారు. సంస్థ మార్కెటింగ్ విభాగపు వైస్ ప్రెసిడెంట్ కూడా వీరి సహాధ్యాయే. అదే విధంగా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఆశిశ్ కు పదేళ్ళుగా స్నేహితుడు. ఇక ఉత్పత్తులు వ్యూహాల విభాగపు అధిపతి, వారి అత్యంత విలువైన పెట్టుబడిదారుడి ద్వారా పరిచయమయ్యారు. అప్పట్లో బయటికి వెళ్ళిపోయిన సేల్స్ విభాగపు చీఫ్, 2002లో డాట్ కామ్ సంక్షోభ సమయంలో... కోరిన వెంటనే మళ్ళీ వీరితో కలిశారు. అప్పటినుంచీ ఆమె ప్రస్థానం ఇక్కడే కొనసాగుతోంది. కస్టమర్ల విభాగపు హెడ్ కూడా గడచిన పదకొండేళ్ళుగా సంస్థలో కొనసాగుతున్నారు. 

సంస్థలో పనిచేసే వారందరినీ తన కుటుంబ సభ్యులుగానే భావిస్తారు ఆశిశ్. అందుకే.. మిగిలిన సంస్థలకన్నా తమ బుక్ మై షో విభిన్నమైదంటారాయన. సంస్థలో చిన్నా పెద్దా తేడా లేదు. ఎవరికీ ఈగో సమస్యలు లేవు. అందుకే ఎవరికీ పని విషయంలో ఒత్తిళ్ళు ఉండవు. ప్రతి ఒక్కరూ ఇది తమ సంస్థేనని భావిస్తారు. సంస్థలో పనిచేసే ఉద్యోగుల పిల్లల చదువులకు వడ్డీలేని రుణాలు ఇవ్వడం, ఆఫీస్ బాయ్స్ ని కాలేజీల్లో చేర్పించడం ద్వారా వారిని విద్యాధికుల్ని చేయడం వంటి వాటివల్ల సంస్థ విశిష్టతను చాటుకుంటోంది. 

ఈ మధ్యనే రూపేశ్ అనే ఆఫీస్ బాయ్ ని నైట్ కాలేజీలో చేర్పించారు. అతను సాయంత్రం ఐదున్నర గంటల వరకూ ఆఫీసులో పనిచేసి, రాత్రిళ్ళు కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ ఉంటాడు. “ మేమంతా సంక్షోభ సంద్రంలో మునిగి తేలిన వాళ్ళమే. 2008లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు, మాలోని ప్రతి ఒక్కరూ మా వేతనాల్లో 30 శాతం తగ్గించి తీసుకున్నాము. మేము నిర్వహించిన ఓటింగ్ లో 90 శాతం మంది ఉద్యోగులు.. ఆరు నెలల పాటు 30 శాతం మేర వేతనాలు తగ్గించి తీసుకుందామని నిర్ణయించారు. ఇదే మా బృందంలోని చిత్తశుద్ధి.. సంస్థ పట్ల వారి అంకిత భావాన్ని చాటుతుంది” అని సగర్వంగా చెబుతారు ఆశిశ్.


తన టీంతో ఆశిష్

తన టీంతో ఆశిష్లీడర్ -

ఆశిశ్ నిజంగానే అసలు సిసలు లీడర్ లా వ్యవహరిస్తారు. చేసే పనిని దైవంగా భావిస్తారు. సంస్థలోని మిగిలిన ఉద్యోగుల మాదిరిగానే తానూ రోజూ పనికివస్తాడు. చేస్తున్న పని పట్ల ఎన్నడూ సిగ్గు పడరు. సందర్భానుసారం, బయటి ఈవెంట్స్ లోనూ.. ఉద్యోగులతో కలిసి పనిచేస్తారు. అంతేకాదు.. తన ఉద్యోగులకు లేనిపోని ఆశలు రేకెత్తించరు. ఏ వాస్తవాన్నీ దాచరు. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోరు. మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని బట్టే ముందుకు సాగుతారు. శని, ఆదివారాల సెలవు తర్వాత సోమవారం ఉదయాన్నే, ఉద్యోగులు ఎంత ఫ్రెష్ గా డ్యూటీకి వస్తారో.. శుక్రవారం సాయంత్రం కూడా అంతే ఫ్రెష్ గా ఉంటారంటే.. వీరు వినియోగదారుణ్ణి సంతృప్తి పరిచే పనిలో ఎంత ఎంజాయ్ చేస్తున్నారో తేలిగ్గా అర్థమవుతుంది. తనతో కలిసి నడిచే ఇంతటి అద్భుతమైన బృందాన్ని కలిగివుండడం అదృష్టమేనంటారు ఆశిశ్. చిన్న వయసులోనే వ్యాపారంలో ప్రవేశించడంతో.. ఎన్నో ఒడిదుడుకులు చూశారు. వాటినుంచి పాఠాలు నేర్చుకుంటూ.. ఈ వ్యవస్థను రూపొందించారు. వినియోగదారుల సేవల్లో ఏదైనా చిన్న తప్పు దొర్లినా.. భవిష్యత్తులో అలా జరగకుండా మరింత ఒళ్ళు దగ్గరపెట్టుకొని పనిచేస్తారిక్కడి ఉద్యోగులు. “మాకివాళ ఎన్నో కార్యాలయాలు ఉండొచ్చు.. ఫ్యాన్సీ కాఫీ మెషీన్లు ఉండొచ్చు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, సలహాదారులు, మీడియా పబ్లిసిటీ ఎన్నో ఉండొచ్చు. అయితే.. అవన్నీ వినియోగదారుడి ఆనందం తర్వాతే. ఎందుకంటే.. మా ఉత్పాదన పట్ల వినియోగదారుడు సంతృప్తి చెందితేనే కదా.. మా ప్రయత్నం సఫలమైనట్లు” అంటారు ఆశిశ్. వీలైనన్ని పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానాన్ని సముపార్జించుకుంటారు. వినియోగదారులకు సంబంధించినంత వరకూ తాను చదివిన “నట్స్” పుస్తకం తన ఫేవరెట్ అంటారు ఆశిశ్. ఇది సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ సంబంధించిన ఇతివృత్తంతో ఉంటుంది. దీని తర్వాత ఆయన అమితంగా ఇష్టపడేది స్టీవ్ జాబ్స్ ఆత్మకథ. స్టీవ్ తనకు ఎంతో స్ఫూర్తినిస్తారని, తాను యాపిల్ ఉత్పత్తుల్లో ప్రతిదానికి వినియోగదారుడిగా ఉంటానని చెబతారు ఆశిశ్. జప్పూస్ సీఈఓ రాసిన డెలివరింగ్ హ్యాపీనెస్ పుస్తకమూ తనను ఆకట్టుకుందంటారు ఆశిశ్. హార్డ్ థింగ్ అబౌట్ హార్డ్ థింగ్స్ అనే పుస్తకమూ శ్రద్ధగా చదివానంటారాయన.


విజయ సూత్రం :

ఆశిశ్, తన జీవితంలో ఎత్తు పల్లాలెన్నో చూశాడు. అయితే వాటన్నింటినీ సమదృష్టితోనే చూశాడు. వీటినుంచి నేర్చుకున్న పాఠంతో.. తనకంటూ నిర్దిష్టమైన వ్యాపార సూత్రాన్ని రూపొందించుకున్నారు.“జీవితంలో ఉచితంగా వచ్చే దేనికీ విలువ ఉండదు. దేనీ ఉచితంగా ఇవ్వవద్దు. అందించిన సేవకు ఎంతో కొంత ఛార్జ్ చేయాలి. అది ఒక్క రూపాయే కావచ్చు.. దాన్ని వసూలు చేయాల్సిందే.” అన్నది ఆశిశ్ సూత్రం. అదే విధంగా, పోటీ సంస్థల గురించి ఉద్యోగుల్లో ఆందోళనలను పెంచాల్సిన పనిలేదంటారు. చాలా కూల్ గా పనిచేస్తూనే పోటీని తట్టుకొని మెరుగైన ఫలితాలు సాధించవచ్చంటాడు. “ఉద్యోగంలో ఒత్తిడి ఎదురైందా..? బుర్ర వేడెక్కుతోందా..? వెంటనే స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళండి.. చొక్కా విప్పేసి.. ఈతకొట్టేయండి..” అంటూ తన ఉద్యోగుల కోసం.. కార్యాలయంలోనే తగిన ఏర్పాట్లు చేశారు ఆశిశ్. ఒకవేళ వాతావరణం బాగా చల్లగా ఉందా..? వెళ్ళండి స్కాచ్ గానీ, వేడి వేడి కాఫీ కానీ కొట్టండి. అసలు వాతావరణమే మీ అదుపులో లేదంటారా..? సరే! మీరు ఏది చెయ్యాలనుకుంటే అదే చేసేయండి” అని ఉత్సాహ పరుస్తాడు ఆశిశ్. ప్రస్తుతం ఈ సంస్థలో 200 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 150 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరి సంఖ్యను మరో వందకు పెంచాలన్న ఆలోచనలో ఉన్నారు.


ఆడుతూ,పాడుతూ పనిచేయాలనే సూత్రం

ఆడుతూ,పాడుతూ పనిచేయాలనే సూత్రం


భవిష్యత్తు ప్రణాళికలు -

సాధించిన విజయంతో సంతృప్తి చెందే గుణం కాదు ఆశిశ్ ది. అందుకే.. తన సంస్థను మరింతగా విస్తరించాలని యోచిస్తున్నాడు. అందుకే.. కొత్తగా నిధుల సమీకరణలో పడ్డాడు. “మేమిప్పుడు SAIF భాగస్వాముల దృష్టిలో ఉన్నాము. పైగా మా సంస్థ లాభాల్లో ఉంది. నిరుటి నుంచి వ్యాపారం రెట్టింపైంది. గడచిన 18 నెలలతో పోలిస్తే.. మూడు రెట్ల టికెట్లను మేము విక్రయించగలుగుతున్నాము. ఇదే మా పురోభివృద్ధికి సూచికగా నిలుస్తుంది. నిజానికి మా సంస్థ ప్రస్తుత నిర్వహణ కోసం నిధుల అవసరమే లేదు. మేము చాలా మంచి స్థితిలోనే ఉన్నాము. అయితే, మాలాంటి మెరుగైన, పద్ధతైన సంస్థల్లో పెట్టుబడుల ద్వారా, వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని SAIF లాంటి సంస్థలు యోచిస్తున్నాయి. దాన్ని ఆసరాగా తీసుకొని, కొత్తగా వచ్చే నిధులను ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో మా కార్యకలాపాలను విస్తరించేందుకు వినియోగించుకోదలిచాము. నిరుడు మేము ఆవిష్కరించిన మొబైట్ యాప్ కు మంచి స్పందన లభించింది. చిన్న నగరాలకూ దాన్ని విస్తరించాలనుకుంటున్నాము.” అని భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు.. ఆశిశ్. బుక్ మై షో వినియోగదారుల్లో 45 నుంచి 50 శాతం వరకూ.. మొబైల్ ఫోన్ల ద్వారానే కార్యకలాపాలు సాగిస్తున్నారు. తొలి దశలో కేవలం మూడు నగరాల వినియోగదారులే బుక్ మై షో సేవలు వినియోగించే వారు. ప్రస్తుతం ఆ నగరాల సంఖ్య పదికి పెరిగింది. త్వరలో దాన్ని యాభై నగరాలకు విస్తరించాలని యోచిస్తున్నారు. iOS తమకు జీవితకాలపు అత్యంత విలువైన వినియోగదారుడని ఆశిశ్ అంటారు. “ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లను కేవలం మూడు నగరాల్లోనే కాదు.. అన్ని చోట్లా వినియోగిస్తున్నారు. మావరకు విండోస్ సాఫ్ట్ వేర్ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నోకియా ఫోన్ల లో విండోస్ మాకు ఆసక్తికరమైన ఫలితాలనిచ్చాయి. వాటి ఆధారంగా, నోకియా ఎక్స్ ఫోన్లు, లూమినా 520 సిరీస్ ఫోన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాము. “ అని ఆశిశ్ చెబుతారు. ప్రతి నెలా సుమారు 500 మిలియన్ల మంది వీరి వెబ్ పేజీని సందర్శిస్తున్నారు. వారిలో 35 నుంచి 40 మిలియన్ల వినియోగదారులు స్థిరంగా వీరి సేవలను వినియోగించుకుంటున్నారు 2007లో సంస్థను స్థాపించింది మొదలు.. ఇప్పటి దాకా సుమారు వంద మిలియన్ల టికెట్లను విక్రయించగలిగారు. 2017 నాటికి, ఒకే ఏడాదిలో వంద మిలియన్ల టికెట్లు అమ్మాలన్న తాజా లక్ష్యం నిర్దేశించుకుందీ సంస్థ. తద్వారా ఏడేళ్ళలో సాధించిన విజయాన్ని ఒకే సంవత్సరంలో సాధించాలన్నది బుక్ మై షో నిర్వాహకులు ఉద్దేశం.

విస్తరణ -

వివిధ వాణిజ్యాల్లో ప్రవేశించేందుకు భారతదేశంలో ఎన్నో అవకాశాలున్నాయని భావిస్తోన్న బుక్ మై షో సంస్థ నిర్వాహకులు, తమ కార్యకలాపాలను ఇతర రంగాలకూ విస్తరించే యోచనలో ఉన్నారు. ఐపిఓ గానీ మరేదైనా కొత్తగా ప్రారంభిస్తే.. అది ఉప ఉత్పత్తే అవుతుంది తప్ప.. అసలు ప్రాడక్ట్ మాత్రం “బుక్ మై షో”నే అంటారు ఆశిశ్.

సలహా :

“పెట్టుబడిదారుల మాదిరిగా ప్రవర్తించకండి. మీ కస్టమర్ ని నిత్యం సంతోష పెట్టేది, సంతృప్తినిచ్చేది అయిన గొప్ప ఉత్పత్తని అందించడమే వ్యాపార వేత్తగా మీ ధర్మం. అదే మీ ఏకైక లక్ష్యం కావాలి. మిగతావన్నీ దాన్ని అనుసరించే వస్తాయి. వీటికి భిన్నంగా వెళ్ళి అవస్థలు పడుతున్న చాలామంది వ్యాపారులను నేను చూస్తున్నాను. కస్టమర్ల గురించి మీరు శ్రద్ధ చూపితే చాలు.. అన్నీ మీరనుకున్నట్లే జరుగుతాయి” అని తన అనుభవ సారాన్ని సలహా రూపంలో అందిస్తారు.. ఆశిశ్.

స్ఫూర్తిమంతంగా నిలుస్తోన్న ఆశిశ్ కు ఆయన బుక్ మై షో బృందానికి యువర్ స్టోరీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలను తెలుపుతోంది.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close
Report an issue
Authors

Related Tags

Latest

Updates from around the world

Our Partner Events

Hustle across India